న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనునన్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అధికార ఆమ్ ఆద్మీ పార్టీ దూకుడు కొనసాగిస్తోంది. ఎన్నికల షెడ్యూల్, తేదీలు ప్రకటించకముందే.. ప్రజాక్షేత్ర సమరానికి సిద్ధమవుతోంది. ఈ మేరకు ఆప్ తమ అభ్యర్థులను ప్రకటిస్తోంది. ఇప్పటికే తొలి జాబితాను విడుదల చేసిన ఆప్.. తాజాగా సోమవారం 20 అభ్యర్థులతో కూడిన రెండో జాబితాను ప్రకటించింది.
ఈ జాబితా ప్రకారం ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జంగ్‌పురా నుంచి పోటీ చేయనున్నారు. ప్రస్తుతం సిసోడియా తూర్పు ఢిల్లీలోని పట్పర్‌గంజ్ నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తుండగా.. ఆయన్ను జంగ్‌పురాకు మార్చారు. పట్పర్‌గంజ్ నుంచి ఇటీవల పార్టీలో చేరిన సివిల్ సర్వీసెస్ ఉపాధ్యాయుడు అవధ్ ఓజాను ఆప్ బరిలోకి దించుతోంది.
2013లో ఢిల్లీ అసెంబ్లీ మాజీ స్పీకర్ మణీందర్ సింగ్ ధీర్ గెలిచినప్పటి నుంచి జంగ్‌పురా సీటు ఆప్‌లో ఉంది. అనంతరం మణీందర్ సింగ్ బీజేపీలోకి వెళ్లడంతో 2015, 2020 ఎన్నికలలో ఆప్ ప్రవీణ్ కుమార్‌ను పోటీకి నిలిపింది. ఆయనే రెండు ఎన్నికల్లోనూ విజయం సాధించారు. అయితే ఈసారి జంగ్‌పురా నుంచి ఆప్ సిసోడియాను ఎంపిక చేసింది. ప్రస్తుత జంగ్‌పురా ఎమ్మెల్యే ప్రవీణ్‌కుమార్‌కు జనక్‌పురి సీటు కల్పించింది.
కాగా సిసోడియా 2013లో పట్పర్‌గంజ్ నుంచి తన ప్రత్యర్ధి బీజేపీ అభ్యర్థి నకుల్ భరద్వాజ్‌పై విజయం సాధించి తొలిసారి ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఫిబ్రవరి 2015 ఎన్నికలలో బిజెపికి చెందిన వినోద్ కుమార్ బిన్నీపై, గత 2020 ఎన్నికలలో రవీందర్ సింగ్ నేగిపై విజయం సాధించారు.
ఇదిలా ఉండగా గత నెలలో విడుదల చేసిన తొలి జాబితాలో 11 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించగా.. నేటిజాబితాలో 20 అభ్యర్థులను వెల్లడించింది. ఇక 39 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment