అభిప్రాయం
2025 ఢిల్లీ శాసనసభ ఎన్నికలు అరవింద్ కేజ్రీవాల్‌కు సవాలుగా నిలుస్తున్నాయి. దశాబ్ద కాలంగా ఢిల్లీని ఏలుతున్న ఆమ్ ఆద్మీ పార్టీని ఈసారైనా గద్దె దింపాలని బీజేపీ పట్టుదలగా ఉంది. దానికితోడు ఆప్ దళిత వ్యతిరేక పార్టీ అంటూ ఇద్దరు నేతలు నిష్క్రమించడం, దాని మద్దతుదారుల్లో చీలికను సృష్టించింది. అలాగే, పొత్తుకు ఆప్ నిరాకరించడంతో ఎన్నికల్లో నిర్ణాయక శక్తిగా ఉండే ముస్లింల ఓట్లను ఆకర్షించడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తుంది. వివాదాల నీడ, అంతర్గత పార్టీ వ్యవహారాలు, సంకీర్ణ రాజకీయాల సంక్లిష్టత వంటివి కేజ్రీవాల్‌పై ఒత్తిడిని పెంచుతున్నాయి. అయితే, పడినా నిలబడ గలిగే కేజ్రీవాల్ సామర్థ్యం, సంక్షేమంపై ఆయన దృష్టికోణం, వాగ్దానాలను అమలు చేయడంలో పార్టీ ట్రాక్ రికార్డ్ ఆయనకు బలమైన పునాది కాగలవు.
2025 ఢిల్లీ శాసనసభ ఎన్నికలు అరవింద్ కేజ్రీవాల్‌కూ, ఆమ్ ఆద్మీ పార్టీకీ కీలకమైన ఘట్టంగా మారబోతున్నాయి. గత దశాబ్ద కాలంగా ఢిల్లీ రాజకీయాల్లో ఆధిపత్యం చలాయించిన కేజ్రీవాల్‌కు ఇప్పుడు సవాళ్లు పెరుగు తున్నాయి. తీవ్రమైన పోటీ మధ్య దేశ రాజధానిపై తన పట్టును నిలుపుకోవడానికి ప్రయత్నిస్తూ, చావో రేవో అనే పరిస్థితులను ఆయన ఎదుర్కొంటున్నారు.
అవినీతి వ్యతిరేక పోరాట యోధుడి స్థానం నుండి ఢిల్లీ ముఖ్యమంత్రి వరకు కేజ్రీవాల్ సాగించిన ప్రయాణం సాధారణ మైనదేమీ కాదు. 2015, 2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో ఆయన పార్టీ ఘనవిజయం సాధించింది. ఆయన నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) మొత్తం 70 సీట్లలో వరుసగా 67, 62 స్థానాలను గెలుచుకుని బలీయమైన రాజకీయ శక్తిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. అయితే, అప్పటి నుండి రాజకీయ చిత్రం గణనీయంగా మారిపోయింది. అందుకే ఇప్పుడు 2025 శాసనసభ ఎన్నికలు కొత్త సవాళ్లను విసురుతున్నాయి.
దూకుడు పెంచిన బీజేపీ
ఢిల్లీపై బీజేపీ రెట్టించిన బలంతో వ్యూహాత్మక దృష్టిని కేంద్రీకరించడం దీనికి అత్యంత ముఖ్యమైన కారకాల్లో ఒకటి. ఇప్పటివరకూ ఆప్ నుంచి ఢిల్లీని చేజిక్కించుకోలేక పోయిన బీజేపీ, కేజ్రీవాల్‌ను గద్దె దింపేందుకు ఏ అవకాశాన్నీ వదలడం లేదు. న్యూఢిల్లీ నియోజక వర్గం నుంచి ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి సాహిబ్ సింగ్ వర్మ కుమారుడు పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మను ఆ పార్టీ పోటీకి దింపింది. దీనితో పోటీ ఇక్కడ తీవ్రంగా మారింది. అదే సమయంలో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ తనయుడు సందీప్ దీక్షిత్‌ను కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దింపడంతో ఈ పోటీ మరింత రసవత్తరం కానుంది.
కేజ్రీవాల్ పదవీకాలం ఏమీ వివాదాలు లేకుండా సాగలేదు. ఎక్సైజ్ పాలసీ కేసులో కేజ్రీవాల్‌ను విచారించేందుకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్... ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు ఇటీవల ఆమోదం తెలపడంతో ఆయన ప్రచారంపై నీలినీడలు కమ్ముకున్నాయి. అవినీతి ఆరో పణలు, తదుపరి న్యాయ పోరాటాలు ప్రజల విశ్వాసాన్ని దెబ్బ తీస్తాయి. అంతేకాకుండా ఆయన రాజకీయ ప్రత్యర్థులకు మందు గుండు సామగ్రిని ఇవి అందించగలవు.
పైగా, ఆప్‌లోని అంతర్గత చోదక శక్తులు కూడా సవాళ్లను విసిరాయి. ఆప్ దళిత వ్యతిరేక పార్టీ అని ఆరోపించిన రాజేంద్ర పాల్ గౌతమ్, రాజ్‌కుమార్ ఆనంద్ వంటి కీలక నేతలు రాజీనామా చేయడం పార్టీ మద్దతుదారుల్లో చీలికకు కారణమైంది. వీళ్ల ఫిరాయింపులు... ఒకప్పుడు ప్రధాన బలాలుగా ఉన్న సామాజిక న్యాయం,అందరినీ కలుపుకొనిపోవడం లాంటి విషయాల్లో ఆప్ నిబద్ధతపైనే ప్రశ్నలను లేవనెత్తాయి.
సంక్షేమం కొనసాగింపు
ఈ సవాళ్లు ఉన్నప్పటికీ, కేజ్రీవాల్ ఓటర్లను గెలుచుకోవడానికి తన పాలనా రికార్డును, సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నారు. ఢిల్లీ జనాభాలోని వివిధ వర్గాల అవసరాలను తీర్చే లక్ష్యంతో ఆప్ అనేక కార్యక్రమాలను ప్రకటించింది. ఇళ్లకు ఉచిత విద్యుత్తు కొనసాగింపు, మహిళలకు ఆర్థిక సహాయం అందించే ‘ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజన’, సీనియర్ సిటిజన్లకు ఉచిత ఆరోగ్య సంరక్షణ అందించే ‘సంజీవని యోజన’, ఆటో రిక్షా డ్రైవర్లకు ప్రయోజనాలు వంటివి ఇందులో ఉన్నాయి. ఈ పథకాలు సంక్షేమం, అభివృద్ధిపై కొనసాగుతున్న ఆప్ దృష్టిని ప్రతిబింబిస్తాయి. ఇది దాని ఎన్నికల వ్యూహానికి మూలస్తంభం.
విద్య, ఆరోగ్య సంరక్షణపై కేజ్రీవాల్ దృష్టి సారించడం కూడా ఆయన రాజకీయ విజయానికి ముఖ్యమైన అంశమైంది. ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చడం, మొహల్లా క్లినిక్‌ల స్థాపన విస్తృతంగా ప్రశంసలు అందుకున్నాయి. ఆప్ తన వాగ్దానాలను నెరవేర్చే పార్టీగా కీర్తిని పెంచడంలో ఇవి ప్రధాన పాత్ర పోషించాయి. 2025 ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో, ప్రతికూల కథనాలను ఎదుర్కో వడానికీ, ఢిల్లీ పౌరుల సంక్షేమానికి కట్టుబడి ఉన్న నాయ కుడిగా తన ఇమేజ్‌ను బలోపేతం చేసుకోవడానికీ కేజ్రీవాల్ ఈ విజయాలను హైలైట్ చేసే అవకాశం ఉంది.
ప్రతిపక్ష పార్టీల కూటమి అయిన ‘ఇండియా’ బ్లాక్‌లోని గమనాత్మక శక్తులు కూడా రాబోయే ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తాయి. ఆప్, కాంగ్రెస్ జాతీయ స్థాయిలో ఇండియా కూటమిలో భాగస్వాములు అయినప్పటికీ, అవి ఢిల్లీలో మాత్రం ప్రత్యర్థులుగా ఉన్నాయి. ఆప్, కాంగ్రెస్ మధ్య ఎన్నికలకు ముందు పొత్తు లేక పోవడం వల్ల బీజేపీ వ్యతిరేక ఓట్లు చీలిపోయి బీజేపీకి ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్‌తో పొత్తు ఉండదని కేజ్రీవాల్ చేసిన ప్రకటన సంకీర్ణ రాజకీ యాల సంక్లిష్టతలనూ, ఇండియా కూటమిలో ఐక్యతను కొనసాగించడంలో ఉన్న సవాళ్లనూ నొక్కి చెబుతోంది.
బలమైన వర్గాలు కీలకం
సాంప్రదాయికంగా ఆమ్ ఆద్మీ పార్టీకి బలమైన మద్దతు పునాదిగా ఉన్న దళితుల ఓట్లు 2025 ఎన్నిక లలో కూడా కీలకమైన అంశం కానున్నాయి. కానీ కీలక దళిత నేతల ఫిరాయింపులు, దళిత వ్యతిరేక పార్టీ అనే ఆరోపణలు ఆప్‌కు అవగాహనా సమస్యను సృష్టించాయి. దళిత ఓటర్లను ప్రలోభపెట్టేందుకు బీజేపీ, కాంగ్రెస్‌లు ఈ అసంతృప్తిని పెట్టుబడిగా వాడుకునే అవకాశం ఉంది. కేజ్రీవాల్ ఈ ఆందోళనలను శీఘ్రంగా పరిష్కరించాలి. దళిత సంఘాలు ఆప్‌కు తమ మద్దతును కొనసాగించడానికి, చాలా ముఖ్యమైన సమస్యల పట్ల ఆప్ నిజమైన నిబద్ధతను ప్రదర్శించాలి.
అదేవిధంగా ఢిల్లీ జనాభాలో దాదాపు 15–18 శాతంగా ఉన్న ముస్లిం ఓట్లు కూడా అంతే కీలకం కానున్నాయి. చారిత్రకంగా,ఢిల్లీలో ఎన్నికల ఫలితాలను నిర్ణయించడంలో ముస్లిం సమాజం ముఖ్య పాత్ర పోషించింది. 2015 అసెంబ్లీ ఎన్నికలలో, ఆప్ ఈ విష యంలో గణనీయమైన పురోగతిని చవిచూసింది. 77 శాతం ముస్లిం ఓటర్లు అప్పుడు ఆ పార్టీకి మద్దతునిచ్చారని అంచనా.
అయితే, 2020 నాటికి, ఈ మద్దతు కొద్దిగా తగ్గింది. 69 శాతం మంది ముస్లింలు ఆప్‌కు మద్దతు ఇచ్చారు. అయితే, 2025 ఎన్ని కలలో కాంగ్రెస్‌తో పొత్తు లేకుండా పోటీ చేయాలని ఆప్ నిర్ణయించింది. కాబట్టి, ముస్లిం ఓటర్లలో పెరుగుతున్న పరాయీకరణ భావాన్ని కాంగ్రెస్ త్వరితగతిన ఉపయోగించుకునే వీలుంది. దీనివల్ల ఈ క్లిష్టమైన వర్గంపై ఆప్ ప్రభావం మరింతగా తగ్గుతుంది.
2025 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ, కేజ్రీవాల్ నాలుగు రోడ్ల కూడలిలో ఉన్నారు. ఆ యా పార్టీలు గతంలో కంటే ఎక్కువ పట్టుదలగా ఉన్నాయి. పైగా సవాళ్లు పెరిగాయి. బీజేపీ దూకుడు ప్రచారం, వివాదాల నీడ, అంతర్గత పార్టీ వ్యవహారాలు, సంకీర్ణ రాజకీయాల సంక్లిష్టత వంటివి కేజ్రీవాల్‌పై ఒత్తిడిని పెంచు తున్నాయి.
అయినప్పటికీ, పడినా నిలబడగలిగే సామర్థ్యం, ఓటర్లతో అనుసంధానం కాగలిగే నైపుణ్యం కేజ్రీవాల్ బలాలు. పాలనపై, సంక్షే మంపై ఆయన దృష్టికోణం, వాగ్దానాలను అమలు చేయడంలో తన ట్రాక్ రికార్డ్ వంటివి ఆయన ప్రచారానికి బలమైన పునాదిని అంది స్తాయి. రాబోయే ఎన్నికలు కేజ్రీవాల్ నాయకత్వ పటిమనూ, కల్లోల రాజకీయాల్లో ఎదురీదే ఆయన సామర్థ్యాన్నీ పరీక్షించనున్నాయి.
సాయంతన్ ఘోష్
వ్యాసకర్త కాలమిస్ట్, రీసెర్చ్ స్కాలర్
(‘ద ఫ్రీ ప్రెస్ జర్నల్’ సౌజన్యంతో)
Comments
Please login to add a commentAdd a comment