అప్పుల బాధతో ఒకరు, తనను
బ్లాక్ మెయిల్ చేస్తున్నారని మరొకరు
ఉమ్మడి మెదక్ జిల్లాలో కలకలం
సిద్దిపేటకమాన్/ కొల్చారం (నర్సాపూర్): ఉమ్మడి మెదక్ జిల్లాలో ఆదివారం ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. సిద్దిపేట పట్టణంలో అప్పుల బాధ భరించలేక ఒకరు, మెదక్ జిల్లా కొల్చారం మండలంలో తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని మనస్తాపానికి గురై మరొకరు ఉరేసుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేటకు చెందిన బండారి బాలకృష్ణ (34).. భార్య మానస, ఇద్దరు కుమారులతో కలసి సిద్దిపేట పట్టణం కాళ్లకుంట కాలనీలో నివాసం ఉంటున్నారు.
బాలకృష్ణ రాజన్న సిరిసిల్ల జిల్లా 17వ బెటాలియన్‌లో హెడ్ కానిస్టేబుల్ ఆర్మర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ప్రతి రోజూ సిద్దిపేట నుంచి విధులకు వెళ్లి వస్తుంటారు. కాగా, బాలకృష్ణ ఫోనిక్స్ అనే ఓప్రైవేటు కంపెనీలో ఫోన్ పే, గూగుల్ పే, నెఫ్ట్ ద్వారా పలు విడతలుగా సుమారు రూ.25 లక్షలు పెట్టుబడిగా పెట్టారు. ఈ క్రమంలో చాలా అప్పులు చేశారు. అయితే పెట్టుబడులపై ఆశించిన ఆదాయం రాకపోవడంతో అప్పులు తీర్చే మార్గం లేక ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు.
ఇదే విషయాన్ని భార్యతో చెప్పి శనివారం రాత్రి ఎలుకల మందు కలిపిన టీని ఇద్దరు పిల్లలకు తాగించి, భార్యాభర్తలు కూడా తాగారు. ఆదివారం తెల్లవారుజామున మేలుకున్న బాలకృష్ణ లేచి చూడగా అందరూ స్పృహలోనే ఉన్నారు. ఇది గుర్తించి అతడు పక్క గదిలోకి వెళ్లి ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు బాలకృష్ణ భార్య మానస, ఇద్దరు కుమారులను సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
తర్వాత మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. మృతుడు రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వన్ టౌన్ సీఐ వాసుదేవరావు తెలిపారు.
బ్లాక్ మెయిల్ చేస్తున్నారని..
మరో ఘటనలో మెదక్ జిల్లా కొల్చారం పోలీస్‌స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న కాటూరి సాయికుమార్ (55) బలవన్మరణానికి పాల్పడ్డారు. ఎస్‌ఐ మహమ్మద్ గౌస్ కథనం ప్రకారం.. హెడ్ కానిస్టేబుల్ సాయికుమార్ భార్య శైలజ, ఇద్దరు కుమార్తెలతో కలసి నర్సాపూర్‌లో ఉంటున్నారు. రోజూ అక్కడి నుంచే డ్యూటీకి వచ్చి వెళ్తుంటారు. శనివారం మధ్యాహ్నం కొల్చారం స్టేషన్‌కు డ్యూటీకి వచ్చారు.
రాత్రి క్వార్టర్ రూమ్‌లో ఉన్నారు. ఆదివారం ఉదయం భార్య శైలజకు ఫోన్ చేసి, ‘నేను చనిపోతున్నాను. నన్ను కొందరు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు’అని చెప్పి స్టేషన్ ఆవరణలోని చెట్టుకు ఉరేసుకొన్నారు. విషయం తెలుసుకున్న మెదక్ రూరల్ సీఐ రాజశేఖర్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మెదక్ ఏరియా ఆసుపత్రికి తరలించారు
తీవ్రంగా వేధించారు: మృతుడి భార్య శైలజ
కొంతకాలంగా నర్సాపూర్‌లోని ఓ మహిళతో సాయికుమార్ తరచూ ఫోన్‌లో మాట్లాడేవారని ఆయన భార్య శైలజ తెలిపారు. ఇది తెలిసిన ఆ మహిళ భర్త.. వివాహేతర సంబంధం అంటగట్టడంతోపాటు కేసు పెడతానంటూ వేధించేవాడని పేర్కొన్నారు. అంతటితో ఆగకుండా అతడి అల్లుడితో కలసి చంపుతామంటూ తరచూ బెదిరించేవారని పేర్కొంది. తన భర్త మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment