Head constables
-
లాడ్జిలో రిమాండ్ ఖైదీ సరసాలు
హుబ్లీ: పేరుమోసిన నేరగాడు, విచారణ ఖైదీ లాడ్జిలో ప్రేయసితో ఉండగా పోలీసులు దాడి చేశారు. వివరాలు... బచ్చా ఖాన్ అనే వ్యక్తిపై అనేక కేసులు ఉన్నాయి. ఇటీవల ఓ కేసులో బళ్లారి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ధార్వాడలో మరో కేసు విచారణ కోసం శనివారం తీసుకెళ్లారు. అదే అదనుగా అతడు రాత్రికి ప్రియురాలిని ఓ లాడ్జికి పిలిపించి, తానూ అక్కడే మకాం వేశాడు. ఇందుకు ఎస్కార్టుగా వచ్చిన బళ్లారి పోలీసులు తమవంతు సహకారం అందించారు. దీన్ని పసిగట్టిన ధార్వాడ పోలీసులు తక్షణమే సదరు లాడ్జిపై దాడి చేసి బచ్చాఖాన్‌ను ధార్వాడ విద్యానగర్ స్టేషన్‌కు పట్టుకెళ్లారు. నిందితునితో చేయి కలిపారనే ఆరోపణలు వెల్లువెత్తడంతో బళ్లారి ఏఆర్ హెడ్‌కానిస్టేబుల్ యోగీష్ ఆచారి, పోలీస్ కానిస్టేబుళ్లు శివకుమార్, రవికుమార్, సంగమేశ కాళగిలను బళ్లారి జిల్లా ఎస్పీ సస్పెండ్ చేశారు. లాడ్జి పై దాడి సమయంలో బచ్చా ఖాన్ తప్పించుకోవడానికి ప్రయతి్నంచాడని తెలిసింది. (చదవండి: ఏడాదిలో రూ.60,414 కోట్ల సైబర్ మోసాలు) -
త్వరలో 3,200 మందికి హెడ్‌కానిస్టేబుల్ పదోన్నతులు
సాక్షి, హైదరాబాద్: హైకోర్టు ఆదేశాల ప్రకారం 3,200 మంది కానిస్టేబుళ్లకు హెడ్‌కానిస్టేబుళ్లుగా పదోన్నతి కల్పించేందుకు డీజీపీ మహేందర్‌రెడ్డి హామీ ఇచ్చారని రాష్ట్ర పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు గోపిరెడ్డి తెలిపారు. అలాగే ఈ అంశంపై పోలీస్ శాఖ సిబ్బంది విభాగం అదనపు డీజీపీ శివధర్‌రెడ్డిని సైతం కలిశామని, పదోన్నతులతోపాటు నోషనల్ సీనియారిటీ సమస్యను సైతం పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారని గురువారం గోపిరెడ్డి ఒక ప్రకటనలో వెల్లడించారు. పెండింగ్‌లో ఉన్న టీఏ మంజూరు చేయించినందుకు డీజీపీకి పోలీస్ సిబ్బంది తరుఫున కృతజ్ఞతలు తెలిపామని, అదే విధంగా పెండింగ్‌లో ఉన్న సరెండర్ లీవుల వ్యవహారాన్ని త్వరగా పరిష్కరించాలని కోరామన్నారు. -
ఖాకీల ‘స్పెషల్’ దందా
సాక్షి,సిటీబ్యూరో: బెదిరింపులతో పాటు వసూళ్ల దందాలకు కేరాఫ్ అడ్రస్‌లుగా మారుతున్న నేపథ్యంలో దాదాపు ఐదేళ్ల క్రితం డీసీపీల ఆధీనంలోని స్పెషల్ పార్టీలను రద్దు చేశారు. అయినా కొందరు అధికారులు అనధికారికంగా వీటిని కొనసాగిస్తున్నారు. దీనిని ఆసరాగా చేసుకున్న కొందరు స్పెషల్ పార్టీ కానిస్టేబుళ్ళు యథేచ్ఛగా దందాలు సాగిస్తున్నారు. నగరంలోని అత్యంత కీలకమైన పశ్చిమ మండల పరిధిలో ఈ వ్యవహారం చోటు చేసుకుంది. సాక్షాత్తు వెస్ట్ జోన్ డీసీపీకి క్యాంప్ క్లర్క్‌గా వ్యవహరిస్తున్న హెడ్–కానిస్టేబుల్ ఇందులో ప్రధాన భూమిక పోషించడం గమనార్హం. ఈ ముగ్గురికీ పోలీసు అధికారి కుమారుడు తోడయ్యాడు. కొన్నాళ్ళుగా యథేచ్ఛగా దందాలు సాగిస్తున్న వీరి ఆగడాలకు ఓ స్పా యజమాని ధైర్యం చేయడంతో చెక్ పడింది. నగర పోలీసు కమిషనర్ ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకున్న సీసీఎస్ పోలీసులు మంగళవారం హెడ్–కానిస్టేబుల్, కానిస్టేబుల్స్ సహా మొత్తం నలుగురు నిందితులను అరెస్టు చేశారు. ముగ్గురు ఖాకీలూ కొన్నాళ్ళ క్రితమే బదిలీ అయినప్పటికీ వెస్ట్‌జోన్‌లోనే విధులు నిర్వర్తిస్తుండటం గమనార్హం. నగరంలోనే సీనియర్ రైటర్‌గా పేరు పొందిన ఖతీబ్ అహ్మద్ (హెడ్సీ 2478) గత కొంతకాలంగా హెడ్–కానిస్టేబుల్ హోదాలో వెస్ట్‌జోన్ డీసీపీ వద్ద క్యాంప్ క్లర్క్‌గా (సీసీ) పని చేస్తున్నాడు. కానిస్టేబుళ్లు బి.వేణుగోపాల్ (పీసీ 3991), పి.విజయ్‌బాబు (పీసీ 5466) ఇదే డీసీపీ స్పెషల్ పార్టీలో విధులు నిర్వర్తిస్తున్నారు. రెండు నెలల క్రితం ఉన్నతాధికారులు సుదీర్ఘ కాలంగా ఒకే ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుళ్ళను బదిలీ చేశారు. ఈ బదిలీల నేపథ్యంలో అహ్మద్ బేగంపేట, వేణుగోపాల్ కుల్సుంపుర, విజయ్‌బాబు లంగర్‌హౌస్ ఠాణాలకు బదిలీ అయ్యారు. అయినప్పటికీ అటాచ్మెంట్ విధానంలో డీసీపీ కార్యాలయం కేంద్రంగా పాత విధులు నిర్వర్తిస్తున్నారు. క్యాంప్ క్లర్క్‌గా ఉన్న ఖతీబ్ అహ్మద్ అక్రమ వసూళ్లకు పథకం రూపొందించగా వేణుగోపాల్, విజయ్‌బాబులతో పాటు క్యాబ్ డ్రైవర్‌గా పని చేస్తున్న వేణుగోపాల్ స్నేహితుడు బి.శశికుమార్‌లతో కలిసి రంగంలోకి దిగాడు. ఈ నెల 8న జస్ట్ డయల్‌కు కాల్ చేసిన శశికుమార్ బంజారాహిల్స్ ప్రాంతంలో ఉన్న స్పా, మసాజ్ సెంటర్ల వివరాలు తెలుసుకున్నారు. వారి వివరాలు ఆధారంగా రోడ్ నెం.10లోని ‘లగ్జరీ ఫ్యామిలీ సెలూన్ అండ్ స్పా’ను టార్గెట్‌గా ఎంచుకున్నారు. అహ్మద్ సూచనల మేరకు మిగిలిన ముగ్గురూ ఆ స్పాపై దాడి చేసి, అందులో పని చేస్తున్న నలుగురు యువతులతో పాటు మేనేజర్ సూర్యను ఓ గదిలో బంధించారు. తాము టాస్క్‌ఫోర్స్ పోలీసులమని కేసు నమోదు చేయకుండా ఉండాలంటే తమకు రూ.3 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో స్పా యజమాని ఆర్.రాజు అక్కడకు చేరుకుని జీహెచ్ఎంసీ అనుమతితో నెల రోజుల క్రితమే స్పా ఏర్పాటు చేశామని, తమ సంస్థలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు తావు లేదని చెప్పినా వినకుండా డబ్బు ఇవ్వాలని బెదిరించారు. బేరసారాల తర్వాత నిందితులు రాజు నుంచి రూ.1.35 లక్షలు తీసుకున్నారు. తిరిగి వెళ్తూ తమ కదలికలకు సంబంధించి సాక్ష్యాధారాలు ఉండకూడదనే ఉద్దేశంతో స్పాలో ఉన్న డిజిటల్ వీడియో రికార్డర్‌ను (డీవీఆర్) సైతం ఎత్తుకెళ్లారు. ఈ నెల 10న బాధితుడు రాజు నగర పోలీసు కమిషనర్ వీవీ శ్రీనివాసరావును కలిసి ఫిర్యాదు చేశారు. ఆయన సూచనల మేరకు బాధితుడు సీసీఎస్ డీసీపీ అవినాష్ మహంతిని ఆశ్రయించారు. దీంతో ఈ నెల 12న కేసు నమోదు చేసుకున్న స్పెషల్ టీమ్–1 ఏసీపీ కె.నర్సింగ్‌రావు దర్యాప్తు చేపట్టి ఈ వ్యవహారంతో టాస్క్‌ఫోర్స్‌కు ఎలాంటి సంబంధం లేదని తేల్చారు. ఆపై నిందితులను పట్టుకునేందుకు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ స్పాలో పని చేస్తున్న టెలీకాలర్ రిజిస్టర్లో నమోదు చేసుకున్న ఫోన్ కాల్స్ వివరాలను ఆరా తీశారు. ఈ నేపథ్యంలోనే శశికుమార్‌కు చెందిన ఫోన్ నెంబర్ పోలీసులకు లభించడంతో అతడికి అదుపులోకి తీసుకుని విచారించగా... మిగిలిన ఇద్దరు కానిస్టేబుళ్ళు, హెడ్–కానిస్టేబుల్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఓపక్క ఈ దర్యాప్తు సాగుతుండగానే ముగ్గురు పోలీసులను వెస్ట్‌జోన్ నుంచి రిలీవ్ చేసి గతంలో బదిలీ అయిన స్థానాలకు పంపేశారు. కీలక ఆధారాలు లభించిన నేపథ్యంలో సీసీఎస్ పోలీసులు మంగళవారం ఖతీబ్ అహ్మద్, వేణుగోపాల్, విజయ్‌బాబులతో పాటు శశికుమార్‌ను అరెస్టు చేశారు. వీరి నుంచి డీవీఆర్, రూ.95 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను నాంపల్లి కోర్టులో హాజరుపరచగా జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో చంచల్‌గూడ జైలుకు తరలించారు. వీరు గతంలోనూ ఇలాంటి దందాలు చేసి ఉంటారనే అనుమానంతో లోతుగా విచారించాలని సీసీఎస్ పోలీసులు నిర్ణయించారు. దీనికోసం తమ కస్టడీకి అప్పగించాల్సిందిగా కోరుతూ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. నిందితుల్లో కానిస్టేబుల్ వేణుగోపాల్ తండ్రి సైతం అంబర్‌పేట సీపీఎల్‌లో ఆరŠడ్మ్ రిజర్వ్ విభాగం సబ్–ఇన్స్పెక్టర్గా పని చేస్తున్నారు. క్యాబ్ డ్రైవర్ శశికుమార్ తండ్రి వెల్దండ ఠాణాలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. వీరిని విచారిస్తే ఈ దందా వెనుక ఎవరైనా ఉన్నారా? అనేది స్పష్టమవుతుందని సీసీఎస్ పోలీసులు తెలిపారు. వీరిపై కుట్ర, బెదిరించడం తదితర ఆరోపణల కింద కేసు నమోదు చేశారు. -
43 మందికి ఏఎస్ఐలుగా పదోన్నతి
గుంటూరు : గుంటూరు రూరల్, అర్బన్ జిల్లా పరిధిలో పనిచేస్తున్న 43 మంది హెడ్‌కానిస్టేబుళ్ళకు ఏఎస్ఐగా పదోన్నతి కల్పిస్తూ రేంజ్ ఐజి ఎన్ సంజయ్ ఉత్తర్వులు జారీ చేశారు. రూరల్, అర్బన్ జిల్లాల పరిధిలో హెడ్‌కానిస్టేబుళ్లుగా పనిచేస్తున్న ఎం.బ్రహ్మయ్య, జి. సుబ్బారావు, పి. కోటేశ్వరరావు, బీఆర్ కోటేశ్వరరావు, ఏ. వెంకటేశ్వర్లు, షేక్ సుభాని, టీఎస్ బెనర్జీ, ఎండీ మస్తాన్‌రావు, జె. భాస్కరరావు, ఎండీ సుభాని, పీడీ ప్రసాద్, సయ్యద్ ఇబ్రహీం, జి. మీరావలి, టి నరేంద్రకుమార్, షేక్ బాబావలి, షేక్ బురాన్షరీఫ్, కె. విజయ్‌కుమార్, ఎం. వెంకటేశ్వరరావు, డి. శ్రీరాములు, వై. సుబ్బరాజు, టీఏ శ్రీనివాస్, సీహెచ్ రామకృష్ణ, ఎండీ ఉస్మాన్, జి. శివరామారావు, సీహెచ్ రామ్మోహనరావు, షేక్ ఉమర్, హెచ్ రెహమాన్, వీవీ రమణరావు, జె.వెంకటేశ్వర్లు, ఎండీ గౌస్, టీవీ నరసింహారావు, కె.మోహన్‌రావు, కె. శ్రీహరిరావు, ఎన్.పోల్సు, కేవీ సత్యనారాయణ, పి.ప్రసాద్, జీవీ కుమార్, వీఎన్ మల్లేశ్వరరావు, బి గోవర్దన్‌రెడ్డి, సాంబశివరావు, పోలేరయ్య, కే సుభాషిణిలకు పదోన్నతి లభించింది. ఈ మేరకు పోలీసు రూరల్ అసోసియేషన్ నేతలు ఐజీ సంజయ్‌కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు. -
ఖైదీ పరారైన ఘటనలో పోలీసుల సస్పెన్షన్
వరంగల్: జీవిత ఖైదు అనుభవిస్తున్న ఓ నేరస్థుడు పోలీసుల కళ్లు గప్పి పరారైన సంఘటనలో ముగ్గురు హెడ్ కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ వేటు పడింది. ఇటీవల ఉప్పల సూరి అనే ఖైదీ పరారైన సమయంలో విధినిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న కారణంతో ఏఆర్ హెడ్‌కానిస్టేబుళ్లు ఇ. లింగారెడ్డి, ఎన్. మల్లారెడ్డి, డి. అంజయ్య లను సస్పెండ్ చేస్తూ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు బుధవారం ఉత్తర్వులు జారీచేశారు వరంగల్ సెంట్రల్ జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఉప్పల సూరిని నాంపల్లి కోర్టులో హాజరుపరిచి భూపాలపల్లి డిపో బస్సులో వరంగల్‌కు తీసుకెళ్తుండగా, యశ్వంతాపూర్ సమీపంలోకి వెళ్లగానే మూత్రానికని చెప్పి, బస్సును ఆపించి పరారైన విషయం తెలిసిందే. -
అవసరమైనవారికే భద్రత..!
సాక్షి, ముంబై: రాష్ట్రంలో పలువురు రాజకీయ నాయకులకు, వారి కుటుంబసభ్యులకు కల్పించిన భద్రతను కుదించినట్లు హోం శాఖ సహాయ మంత్రి రామ్ షిండే వెల్లడించారు. హోం శాఖ అనవసరమని భావించిన దాదాపు 230 మంది భద్రత సిబ్బందిని తొలగించింది. అందులో 24 మంది పోలీసు సబ్ ఇన్స్పెక్టర్లు, 28 మంది హెడ్ కానిస్టేబుళ్లు, 160 మంది కానిస్టేబుళ్లు, 28 మంది పీసీడీ ర్యాంక్ సిబ్బంది ఉన్నారు. వీరికి శాంతి, భద్రతలను కాపాడే బాధ్యతలు అప్పగించనున్నారు. కాగా, పోలీసు భద్రత కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన ఒక కమిటీ నియమించారు. ఎవరికైనా పోలీసు భద్రత అవసరమైతే వారికి భద్రత ఎంతమేర అవసరం, ఇవ్వాలా...? వద్దా..? ఒకవేళ భద్రత ఇవ్వాల్సి వస్తే ఎంతమంది సిబ్బందిని నియమించాలి..? తదితర నిర్ణయాలు ఈ కమిటీ తీసుకుంటుందని వెల్లడించారు. ఇందులో ప్రభుత్వం జోక్యం చేసుకోబోదని ఆయన వివరించారు. ఇదిలా ఉండగా, కొందరు రాజకీయ నాయకులకు, వారి కుటుంబం సభ్యులకు ఎలాంటి ప్రాణ హానీ లేదు. అయినప్పటికీ వారు పోలీసు శాఖ నుంచి భద్రత పొందుతున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. తమకు బెదిరింపు ఫోన్లు వచ్చాయని కొందరు, తమకు శత్రువులతో ముప్పు పొంచి ఉందని మరికొందరు పోలీసు శాఖ నుంచి భద్రత పొందారు. కొందరైతే ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేకున్నప్పటికీ సమాజంలో తమ ప్రతిష్ట పెంచుకునేందుకు పోలీసు శాఖ నుంచి భద్రత పొందుతున్నారు. ఇలాంటి వారందరిని గుర్తించి ఏకంగా 230 మంది భద్రత సిబ్బందిని తొలగించినట్లు ఆయన తెలిపారు. త్వరలో మాజీ మంత్రులు అజిత్ పవార్, ఛగన్ భుజబల్, నారాయణ్ రాణే, ఆర్.ఆర్.పాటిల్‌తోపాటు మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ తదితర కీలక నాయకుల భద్రతలో కూడా కోత విధించనున్నట్లు ఆయన వివరించారు. -
రవాణాశాఖలో బది‘లీల’లు
ఒంగోలు సబర్బన్: రవాణాశాఖలో పని చేస్తున్న సిబ్బంది బదిలీలు నిబంధనలకు విరుద్ధంగా అర్ధరాత్రి చేపట్టారు. రాష్ట్రంలోని రవాణా శాఖ మూడో జోన్ పరిధిలో సీనియర్ అసిస్టెంట్లకు హెడ్‌కానిస్టేబుళ్లకు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం బదిలీలు చేపట్టేందుకు అధికారులు సన్నద్ధమయ్యారు. మూడో జోన్ పరిధిలోని ప్రకాశం, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో రవాణా శాఖ కార్యాలయాల్లో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్లకు, హెడ్‌కానిస్టేబుళ్లకు 186 జీవో ప్రకారం బదిలీల ప్రక్రియ చేపట్టడానికి మూడు జిల్లాల అధికారులు సమాయత్తమయ్యారు. అయితే కార్యాలయ పనివేళల్లో కాకుండా అర్థరాత్రి బదిలీలు చేపట్టడం వెనుక ఆ శాఖలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అది కూడా రవాణా శాఖ కార్యాలయంలో కాకుండా ఒంగోలులోని ఆర్అండ్బి గెస్ట్‌హౌస్‌లో బదిలీల కౌన్సెలింగ్ నిర్వహించటంతో రవాణా శాఖ అధికారులపై విమర్శలు గుప్పుమంటున్నాయి. ప్రకాశం, గుంటూరు, నెల్లూరు జిల్లాల రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్లు కృష్ణమోహన్, ఎన్. శివరామప్రసాద్, ప్రభురాజ్‌కుమార్‌లు సిబ్బంది బదిలీల కౌన్సెలింగ్ నిర్వహించేందుకు ఒంగోలులోని ఆర్అండ్బి గెస్ట్‌హౌస్‌కు చేరుకున్నారు. మూడు జిల్లాల్లో పని చేస్తున్న 26 మంది సీనియర్ అసిస్టెంట్లు, నలుగురు హెడ్‌కానిస్టేబుళ్ళకు సిబ్బంది నుంచి కౌన్సెలింగ్‌కు సంబంధించిన దరఖాస్తులను తీసుకున్నారు. సిబ్బంది సీనియారిటీ ప్రకారం, ఖాళీలకు అనుగుణంగా అధికారులు బదిలీ ప్రక్రియను చేపట్టాల్సి ఉంది. మూడు సంవత్సరాలు పైబడి ఒకేచోట విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగిని కౌన్సెలింగ్‌లో బదిలీ అవకాశాలు కల్పించారు. మొత్తం ఈ కౌన్సెలింగ్‌కు 23 మంది సిబ్బంది హాజరయ్యారు. 186 జీవో ప్రకారం కార్యాలయాల సిబ్బందిలో 20 శాతం మందిని బదిలీ చేయాల్సి ఉంది. అందులో భాగంగా 11 మందికి ప్రస్తుత కౌన్సెలింగ్‌లో స్థానచలనం కల్పించేందుకు అధికారులు కసరత్తు చేపట్టారు. అయితే ఈ అర్థరాత్రి కౌన్సెలింగ్ చేపట్టడం వెనుకే మతలబు దాగి ఉందన్న విమర్శలు గుప్పుమంటున్నాయి. అధికారులు సిఫార్సుల మేరకు అర్థరాత్రి కౌన్సెలింగ్ అయితే గుట్టుచప్పుడు కాకుండా చేసుకోవచ్చునన్న ఆలోచనతోనే ఈ కౌన్సెలింగ్ చేపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై ముగ్గురు అధికారులను ‘సాక్షి’ ప్రశ్నించగా సాయంత్రం 4 గంటలకు కౌన్సెలింగ్ చేపట్టాల్సి ఉందని, అయితే నెల్లూరు, గుంటూరు నుంచి తాము రావటం ఆలస్యమైనందున ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్‌లో చేయాల్సి వచ్చిందని సమాధానమిచ్చారు. అర్థరాత్రి నిబంధనలకు విరుద్ధంగా బదిలీల కౌన్సెలింగ్ ఎందుకు చేస్తున్నానరని ప్రశ్నించగా ఎలాంటి అపోహలకు తావు లేకుండా బదిలీల కౌన్సెలింగ్ చేస్తున్నామని సమాధానమిచ్చారు.