ఒంగోలు సబర్బన్: రవాణాశాఖలో పని చేస్తున్న సిబ్బంది బదిలీలు నిబంధనలకు విరుద్ధంగా అర్ధరాత్రి చేపట్టారు. రాష్ట్రంలోని రవాణా శాఖ మూడో జోన్ పరిధిలో సీనియర్ అసిస్టెంట్లకు హెడ్‌కానిస్టేబుళ్లకు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం బదిలీలు చేపట్టేందుకు అధికారులు సన్నద్ధమయ్యారు. మూడో జోన్ పరిధిలోని ప్రకాశం, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో రవాణా శాఖ కార్యాలయాల్లో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్లకు, హెడ్‌కానిస్టేబుళ్లకు 186 జీవో ప్రకారం బదిలీల ప్రక్రియ చేపట్టడానికి మూడు జిల్లాల అధికారులు సమాయత్తమయ్యారు.
అయితే కార్యాలయ పనివేళల్లో కాకుండా అర్థరాత్రి బదిలీలు చేపట్టడం వెనుక ఆ శాఖలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అది కూడా రవాణా శాఖ కార్యాలయంలో కాకుండా ఒంగోలులోని ఆర్‌అండ్‌బి గెస్ట్‌హౌస్‌లో బదిలీల కౌన్సెలింగ్ నిర్వహించటంతో రవాణా శాఖ అధికారులపై విమర్శలు గుప్పుమంటున్నాయి. ప్రకాశం, గుంటూరు, నెల్లూరు జిల్లాల రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్లు కృష్ణమోహన్, ఎన్. శివరామప్రసాద్, ప్రభురాజ్‌కుమార్‌లు సిబ్బంది బదిలీల కౌన్సెలింగ్ నిర్వహించేందుకు ఒంగోలులోని ఆర్‌అండ్‌బి గెస్ట్‌హౌస్‌కు చేరుకున్నారు. మూడు జిల్లాల్లో పని చేస్తున్న 26 మంది సీనియర్ అసిస్టెంట్లు, నలుగురు హెడ్‌కానిస్టేబుళ్ళకు సిబ్బంది నుంచి కౌన్సెలింగ్‌కు సంబంధించిన దరఖాస్తులను తీసుకున్నారు. సిబ్బంది సీనియారిటీ ప్రకారం, ఖాళీలకు అనుగుణంగా అధికారులు బదిలీ ప్రక్రియను చేపట్టాల్సి ఉంది. మూడు సంవత్సరాలు పైబడి ఒకేచోట విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగిని కౌన్సెలింగ్‌లో బదిలీ అవకాశాలు కల్పించారు.
మొత్తం ఈ కౌన్సెలింగ్‌కు 23 మంది సిబ్బంది హాజరయ్యారు. 186 జీవో ప్రకారం కార్యాలయాల సిబ్బందిలో 20 శాతం మందిని బదిలీ చేయాల్సి ఉంది. అందులో భాగంగా 11 మందికి ప్రస్తుత కౌన్సెలింగ్‌లో స్థానచలనం కల్పించేందుకు అధికారులు కసరత్తు చేపట్టారు. అయితే ఈ అర్థరాత్రి కౌన్సెలింగ్ చేపట్టడం వెనుకే మతలబు దాగి ఉందన్న విమర్శలు గుప్పుమంటున్నాయి. అధికారులు సిఫార్సుల మేరకు అర్థరాత్రి కౌన్సెలింగ్ అయితే గుట్టుచప్పుడు కాకుండా చేసుకోవచ్చునన్న ఆలోచనతోనే ఈ కౌన్సెలింగ్ చేపడుతున్నట్లు తెలుస్తోంది.
ఈ విషయమై ముగ్గురు అధికారులను ‘సాక్షి’ ప్రశ్నించగా సాయంత్రం 4 గంటలకు కౌన్సెలింగ్ చేపట్టాల్సి ఉందని, అయితే నెల్లూరు, గుంటూరు నుంచి తాము రావటం ఆలస్యమైనందున ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో చేయాల్సి వచ్చిందని సమాధానమిచ్చారు. అర్థరాత్రి నిబంధనలకు విరుద్ధంగా బదిలీల కౌన్సెలింగ్ ఎందుకు చేస్తున్నానరని ప్రశ్నించగా ఎలాంటి అపోహలకు తావు లేకుండా బదిలీల కౌన్సెలింగ్ చేస్తున్నామని సమాధానమిచ్చారు.
రవాణాశాఖలో బది‘లీల’లు
Published Sat, Nov 15 2014 12:43 AM | Last Updated on Thu, May 24 2018 1:57 PM
Advertisement
Advertisement