వేణు గోపాల్, ఖతీబ్ అహ్మద్, విజయ్‌బాబు
సాక్షి,సిటీబ్యూరో: బెదిరింపులతో పాటు వసూళ్ల దందాలకు కేరాఫ్ అడ్రస్‌లుగా మారుతున్న నేపథ్యంలో దాదాపు ఐదేళ్ల క్రితం డీసీపీల ఆధీనంలోని స్పెషల్ పార్టీలను రద్దు చేశారు. అయినా కొందరు అధికారులు అనధికారికంగా వీటిని కొనసాగిస్తున్నారు. దీనిని ఆసరాగా చేసుకున్న కొందరు స్పెషల్ పార్టీ కానిస్టేబుళ్ళు యథేచ్ఛగా దందాలు సాగిస్తున్నారు. నగరంలోని అత్యంత కీలకమైన పశ్చిమ మండల పరిధిలో ఈ వ్యవహారం చోటు చేసుకుంది. సాక్షాత్తు వెస్ట్ జోన్ డీసీపీకి క్యాంప్ క్లర్క్‌గా వ్యవహరిస్తున్న హెడ్–కానిస్టేబుల్ ఇందులో ప్రధాన భూమిక పోషించడం గమనార్హం. ఈ ముగ్గురికీ పోలీసు అధికారి కుమారుడు తోడయ్యాడు. కొన్నాళ్ళుగా యథేచ్ఛగా దందాలు సాగిస్తున్న వీరి ఆగడాలకు ఓ స్పా యజమాని ధైర్యం చేయడంతో చెక్ పడింది. నగర పోలీసు కమిషనర్ ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకున్న సీసీఎస్ పోలీసులు మంగళవారం హెడ్–కానిస్టేబుల్, కానిస్టేబుల్స్ సహా మొత్తం నలుగురు నిందితులను అరెస్టు చేశారు. ముగ్గురు ఖాకీలూ కొన్నాళ్ళ క్రితమే బదిలీ అయినప్పటికీ వెస్ట్‌జోన్‌లోనే విధులు నిర్వర్తిస్తుండటం గమనార్హం. నగరంలోనే సీనియర్ రైటర్‌గా పేరు పొందిన ఖతీబ్ అహ్మద్ (హెడ్‌సీ 2478) గత కొంతకాలంగా హెడ్–కానిస్టేబుల్ హోదాలో వెస్ట్‌జోన్ డీసీపీ వద్ద క్యాంప్ క్లర్క్‌గా (సీసీ) పని చేస్తున్నాడు. కానిస్టేబుళ్లు బి.వేణుగోపాల్ (పీసీ 3991), పి.విజయ్‌బాబు (పీసీ 5466) ఇదే డీసీపీ స్పెషల్ పార్టీలో విధులు నిర్వర్తిస్తున్నారు.
రెండు నెలల క్రితం ఉన్నతాధికారులు సుదీర్ఘ కాలంగా ఒకే ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుళ్ళను బదిలీ చేశారు. ఈ బదిలీల నేపథ్యంలో అహ్మద్ బేగంపేట, వేణుగోపాల్ కుల్సుంపుర, విజయ్‌బాబు లంగర్‌హౌస్ ఠాణాలకు బదిలీ అయ్యారు. అయినప్పటికీ అటాచ్‌మెంట్ విధానంలో డీసీపీ కార్యాలయం కేంద్రంగా పాత విధులు నిర్వర్తిస్తున్నారు. క్యాంప్ క్లర్క్‌గా ఉన్న ఖతీబ్ అహ్మద్ అక్రమ వసూళ్లకు పథకం రూపొందించగా వేణుగోపాల్, విజయ్‌బాబులతో పాటు క్యాబ్ డ్రైవర్‌గా పని చేస్తున్న వేణుగోపాల్ స్నేహితుడు బి.శశికుమార్‌లతో కలిసి రంగంలోకి దిగాడు. ఈ నెల 8న జస్ట్ డయల్‌కు కాల్ చేసిన శశికుమార్ బంజారాహిల్స్ ప్రాంతంలో ఉన్న స్పా, మసాజ్ సెంటర్ల వివరాలు తెలుసుకున్నారు. వారి వివరాలు ఆధారంగా రోడ్ నెం.10లోని ‘లగ్జరీ ఫ్యామిలీ సెలూన్ అండ్ స్పా’ను టార్గెట్‌గా ఎంచుకున్నారు. అహ్మద్ సూచనల మేరకు మిగిలిన ముగ్గురూ ఆ స్పాపై దాడి చేసి, అందులో పని చేస్తున్న నలుగురు యువతులతో పాటు మేనేజర్ సూర్యను ఓ గదిలో బంధించారు. తాము టాస్క్‌ఫోర్స్ పోలీసులమని కేసు నమోదు చేయకుండా ఉండాలంటే తమకు రూ.3 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో స్పా యజమాని ఆర్.రాజు అక్కడకు చేరుకుని జీహెచ్‌ఎంసీ అనుమతితో నెల రోజుల క్రితమే స్పా ఏర్పాటు చేశామని, తమ సంస్థలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు తావు లేదని చెప్పినా వినకుండా డబ్బు ఇవ్వాలని బెదిరించారు.
బేరసారాల తర్వాత నిందితులు రాజు నుంచి రూ.1.35 లక్షలు తీసుకున్నారు. తిరిగి వెళ్తూ తమ కదలికలకు సంబంధించి సాక్ష్యాధారాలు ఉండకూడదనే ఉద్దేశంతో స్పాలో ఉన్న డిజిటల్ వీడియో రికార్డర్‌ను (డీవీఆర్) సైతం ఎత్తుకెళ్లారు. ఈ నెల 10న బాధితుడు రాజు నగర పోలీసు కమిషనర్ వీవీ శ్రీనివాసరావును కలిసి ఫిర్యాదు చేశారు. ఆయన సూచనల మేరకు బాధితుడు సీసీఎస్ డీసీపీ అవినాష్ మహంతిని ఆశ్రయించారు. దీంతో ఈ నెల 12న కేసు నమోదు చేసుకున్న స్పెషల్ టీమ్–1 ఏసీపీ కె.నర్సింగ్‌రావు దర్యాప్తు చేపట్టి ఈ వ్యవహారంతో టాస్క్‌ఫోర్స్‌కు ఎలాంటి సంబంధం లేదని తేల్చారు. ఆపై నిందితులను పట్టుకునేందుకు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ స్పాలో పని చేస్తున్న టెలీకాలర్ రిజిస్టర్‌లో నమోదు చేసుకున్న ఫోన్ కాల్స్ వివరాలను ఆరా తీశారు. ఈ నేపథ్యంలోనే శశికుమార్‌కు చెందిన ఫోన్ నెంబర్ పోలీసులకు లభించడంతో అతడికి అదుపులోకి తీసుకుని విచారించగా... మిగిలిన ఇద్దరు కానిస్టేబుళ్ళు, హెడ్–కానిస్టేబుల్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
ఓపక్క ఈ దర్యాప్తు సాగుతుండగానే ముగ్గురు పోలీసులను వెస్ట్‌జోన్ నుంచి రిలీవ్ చేసి గతంలో బదిలీ అయిన స్థానాలకు పంపేశారు. కీలక ఆధారాలు లభించిన నేపథ్యంలో సీసీఎస్ పోలీసులు మంగళవారం ఖతీబ్ అహ్మద్, వేణుగోపాల్, విజయ్‌బాబులతో పాటు శశికుమార్‌ను అరెస్టు చేశారు. వీరి నుంచి డీవీఆర్, రూ.95 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను నాంపల్లి కోర్టులో హాజరుపరచగా జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో చంచల్‌గూడ జైలుకు తరలించారు. వీరు గతంలోనూ ఇలాంటి దందాలు చేసి ఉంటారనే అనుమానంతో లోతుగా విచారించాలని సీసీఎస్ పోలీసులు నిర్ణయించారు. దీనికోసం తమ కస్టడీకి అప్పగించాల్సిందిగా కోరుతూ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. నిందితుల్లో కానిస్టేబుల్ వేణుగోపాల్ తండ్రి సైతం అంబర్‌పేట సీపీఎల్‌లో ఆరŠడ్మ్ రిజర్వ్ విభాగం సబ్–ఇన్‌స్పెక్టర్‌గా పని చేస్తున్నారు. క్యాబ్ డ్రైవర్ శశికుమార్ తండ్రి వెల్దండ ఠాణాలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. వీరిని విచారిస్తే ఈ దందా వెనుక ఎవరైనా ఉన్నారా? అనేది స్పష్టమవుతుందని సీసీఎస్ పోలీసులు తెలిపారు. వీరిపై కుట్ర, బెదిరించడం తదితర ఆరోపణల కింద కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment