
న్యూఢిల్లీ: దేశంలోని అన్ని జాతీయ రహదారులపై ఉన్న టోల్ ప్లాజాల(Toll plazas) నుంచి ప్రభుత్వం గడచిన ఐదేళ్లలో ఎంత టోల్ వసూలు చేసిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. అక్షరాలా రూ.1.93 లక్షల కోట్లు ప్రభుత్వానికి టోల్ ట్యాక్స్ రూపంలో అందింది. దీనికి సంబంధించిన వివరాలను రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) లోక్‌సభలో వెల్లడించింది.
ప్రభుత్వం అందించిన డేటా ప్రకారం దేశంలోనే అత్యధిక టోల్ ట్యాక్స్‌ను గుజరాత్‌లోని ఎన్‌హెచ్-48లోని వడోదర-భరూచ్ సెక్షన్(Vadodara-Bharuch section)లో ఉన్న టోల్ ప్లాజా వసూలు చేసింది. గడచిన ఐదు ఆర్థిక సంవత్సరాల్లో (2019-20 నుండి 2023-24 వరకు) రూ.2,043.81 కోట్ల టోల్ వసూలు చేసింది. టోల్ ఆదాయాల జాబితాలో రాజస్థాన్‌లోని షాజహాన్‌పూర్ టోల్ ప్లాజా రెండవ స్థానంలో నిలిచింది. ఇది ఎన్‌హెచ్-48లోని గుర్గావ్-కోట్‌పుట్లి-జైపూర్ విభాగంలో ఉంది. గత ఐదేళ్లలోఈ ప్లాజాలో రూ.1,884.46 కోట్ల విలువైన టోల్ వసూలు చేసినట్లు రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ డేటా వెల్లడించింది.
మూడవ స్థానంలో పశ్చిమ బెంగాల్‌లోని జల్ధులగోరి టోల్ ప్లాజా ఉంది. 2019-20 నుండి 2023-24 వరకు ఐదు సంవత్సరాలలో ఇది రూ.1,538.91 కోట్ల టోల్ వసూలు చేసింది. ఉత్తరప్రదేశ్‌లోని బారజోధ టోల్ ప్లాజా గత ఐదు సంవత్సరాలలో రూ.1,480.75 కోట్ల టోల్ వసూలు చేసి జాబితాలో 4వ స్థానంలో ఉంది. టాప్ 10 ఆదాయాన్ని ఆర్జించే టోల్ ప్లాజాల జాబితాలో రెండు ప్లాజాలు గుజరాత్‌లో, రెండు రాజస్థాన్‌లో రెండు ఉత్తరప్రదేశ్‌లో ఉన్నాయి. హర్యానా, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, బీహార్‌లలో ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి. గత ఐదేళ్లలో అత్యధిక ఆదాయాన్ని ఆర్జించే 10 టోల్ ప్లాజాలు రూ.13,988.51 కోట్ల విలువైన టోల్ వసూలు చేశాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మొత్తం 1,063 టోల్ ప్లాజాలు ఉన్నాయి. వీటిలో 457 టోల్ ప్లాజాలను గత ఐదేళ్లలో ఏర్పాటు చేశారు.
ఇది కూడా చదవండి: ఐపీఎస్ అధికారి మహంతికి హైకోర్టులో ఊరట
Comments
Please login to add a commentAdd a comment