కొను‘గోడు’ పట్టదా? | Farmers plight due to lack of accommodation at grain purchasing centers | Sakshi
Sakshi News home page

కొను‘గోడు’ పట్టదా?

Published Sun, Apr 27 2025 5:14 AM | Last Updated on Sun, Apr 27 2025 5:14 AM

Farmers plight due to lack of accommodation at grain purchasing centers

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వసతుల్లేక రైతుల అవస్థలు    

రోజుల తరబడి కేంద్రాల్లోనే ఉన్నా కాంటా వేయని నిర్వాహకులు

క్వింటాల్‌కు 5 కేజీలు తరుగు తీస్తామంటున్న మిల్లర్లు 

ధాన్యం తరలించేందుకు లారీల కొరతతో ఇక్కట్లు 

మారుతున్న వాతావరణ పరిస్థితులతో అన్నదాతల్లో ఆందోళన  

సాక్షి ప్రతినిధి, ఖమ్మం/సాక్షి నెట్‌వర్క్‌ : ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అన్నదాతలు పడుతున్న అవస్థలు అన్నీఇన్నీ కావు. ఓవైపు కొనుగోళ్లు జరగక, మరోవైపు వాన భయం, ఇంకోవైపు అసౌకర్యాలు వెరసి రైతులకు కొనుగోలు కేంద్రాల వద్ద కంటిమీద కును కు లేకుండా పోయింది. అయినా వీరి గోడు ఎవరూ పట్టించుకోవడం లేదు. ఖమ్మం జిల్లాలో యాసంగిలో పండించిన సన్న ధాన్యాన్ని కొనుగోలు కేంద్రా ల్లో అమ్ముకోవడానికి వచ్చిన రైతులకు షాక్‌ తగులు తోంది. 

ధాన్యం తీసుకొచ్చి రోజులు గడుస్తున్నా నిర్వాహకులు కాంటాలు పెట్టడానికి ముందుకు రావడం లేదు. దీంతో రైతులకు పడిగాపులు తప్ప డం లేదు. క్వింటాకు 5 కేజీల వరకు తరుగు తీస్తేనే దిగుమతి చేసుకుంటామని మిల్లర్లు తెగేసి చెబుతున్నారు. రైతులు ఈ షరతుకు ఒప్పుకోకపోవడంతో కేంద్రాల నిర్వాహకులు కాంటాలు వేయడం లేదు. ధాన్యం అమ్ముకునేందుకు వీల్లేక, అకాల వర్షాలకు తడుస్తుండటంతో రైతుల్లో ఆవేదన వ్యక్తమవుతోంది. 

ఏడు చేపల కథ.. 
చేపా..చేపా ఎందుకు ఎండలేదంటే.. గడ్డి మోపు అడ్డమొచ్చిందన్న చందంగా ఉంది కొనుగోలు కేంద్రాల తీరు. కొనుగోలు కేంద్రాల్లో నిర్వాహకులు ధాన్యం కాంటా వేయడం లేదు. ఎందుకు వేయడం లేదంటే లారీలు వస్తేనే కాంటా వేస్తామంటున్నారు. లారీలు ఎందుకు సరఫరా చేయడం లేదని సప్లయర్స్‌ను అడిగితే లోడింగ్, అన్‌లోడింగ్‌ వెంటనే చేస్తేనే లారీలు పెడతామంటున్నారు. అన్‌లోడింగ్‌ వెంటనే చేయమని మిల్లర్లను అడిగితే క్వింటాకు 5 కేజీల తరుగు తీస్తేనే దిగుమతి చేసుకుంటామంటున్నారు. ఇలా ఒకదానికి ఒకటి లింక్‌ పెట్టి రైతులతో ఆడుకుంటున్నారు.  

ప్రైవేట్‌ వ్యాపారుల వైపే.. 
కొనుగోలు కేంద్రాల్లో ఎదుర్కొంటున్న సమస్యలతో రైతులు ప్రైవేట్‌ వ్యాపారులకు ధాన్యం విక్రయించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రైవేట్‌ వ్యాపారులు క్వింటా రూ.2,100 కు కొనుగోలు చేస్తుండగా, ఆ మొత్తానికే విక్రయిస్తున్నారు. తద్వారా అటు మద్దతు ధర, ఇటు బోనస్‌ కోల్పోతున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో వేచి ఉండే ఓపిక లేక అమ్ముకుంటున్నారు. 

అసౌకర్యాల నడుమ.. 
ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలంలో ఐకేపీ ఆధ్వర్యంలో పది ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. అయితే ఏ కేంద్రంలోనూ రైతులకు సౌకర్యాలు లేవు. 
»  ఓ టెంట్‌ ఏర్పాటు చేశారు. ఈ టెంట్‌ కింద ధాన్యం కొనుగోలు చేసే వీఓ గ్రూప్‌ సభ్యులు, ఐకేపీ సీసీలు రెండు మూడు కుర్చీలు వేసుకొని కూర్చుంటున్నారు.  
»   ధాన్యం అమ్ముకోవడానికి వచ్చిన రైతులకు ఎలాంటి సౌకర్యాలు లేవు. ధాన్యం మీద కప్పుకోవడానికి రైతులే రూ.10 వేలు విలువ చేసే పట్టాలు కొనుగోలు చేస్తున్నారు. ఐకేపీ నుంచి ఎలాంటి టార్పాలిన్లు ఇవ్వడం లేదు.  
»  రైతులకు కనీసం తాగునీటి సౌకర్యం కూడా ఏర్పాటు చేయకపోవడంతో వారే క్యాన్లు వెంట తెచ్చుకుంటున్నారు.  
»  ధాన్యం తూర్పార పట్టడానికి మాత్రం ఓ ఫ్యాన్‌ ఏర్పాటు చేస్తున్నారు. దానిని నడిపించడానికి ట్రాక్టర్‌ను రైతులే తెచ్చుకోవాలి.  
»   కొనుగోలు చేసిన తర్వాత లారీలోకి ఎక్కించి మిల్లుకు తరలించడానికి వారం పట్టినా, పది రోజులైనా ధాన్యం జాగ్రత్త బాధ్యతలు రైతులవే. ఒకవేళ వాన పడితే ఇబ్బందే.  
»    కొణిజర్ల మండల రైతులు సాగు చేసిన యాసంగి పంటను ముదిగొండ మండలంలోని ఓ రైస్‌ మిల్లు కు, సత్తుపల్లి శివారులోని మరో రైస్‌ మిల్లుకు కేటాయించారు. సత్తుపల్లి మిల్లర్‌ తమ వద్ద బాయిలర్‌ రిపేర్‌కు వచి్చందని కొనుగోలు నిలిపేశాడు.  
» ముదిగొండ సమీపంలోని రైస్‌ మిల్లు యజమాని నేరుగా రైతులతో మాట్లాడుకొని ప్రభుత్వ మద్దతు ధర కంటే తక్కువగా ఇస్తానంటే లారీ దిగుమతి చేసుకుంటున్నాడు. లేదంటే అంతే. ప్రస్తుతం నాలుగు రోజులుగా మల్లుపల్లికి చెందిన ఓ లారీ ఆ మిల్లు వద్దే ఉంది. 
»   నిజామాబాద్‌ జిల్లా ఎడపల్లి మండలంలోని జానకంపేటలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో గ్రామ శివారులో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 30 వేల బస్తాల ధాన్యం తూకం వేసి రైస్‌మిల్లులకు తరలించారు. మరో 10 వేల బస్తాలు తూకం వేయాల్సి ఉంది. నాలుగైదు రోజుల క్రితం తూకం వేసిన 1,800 బస్తాలు వరకు కొనుగోలు కేంద్రంలో ఉన్నాయి. లారీల కొరత వల్ల ధాన్యం తరలింపులో జాప్యం జరుగుతోంది.  
»  సిద్దిపేట అర్బన్‌ మండలం బక్రిచెప్యాల గ్రామంలోని కొనుగోలు కేంద్రంలో మూడు రోజులుగా ధాన్యం కాంటా నిలిచిపోయినట్టు రైతులు పేర్కొన్నారు.  
» యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం కక్కిరేణిలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు 
కేంద్రంలో సేదతీరడానికి నీడ లేక పోవడంతో ఇబ్బంది పడుతున్నారు. కేంద్రం నిర్వాహకులు టార్పాలిన్‌ కవర్లతో వేసిన గుడిసె.. మంచినీటి డ్రమ్ములు 
పెట్టడానికి రికార్డులు రాసుకోవడానికి మాత్రమే సరిపోతుంది. రైతులు, కూలీలు సమీపంలో 
కంపచెట్ల కింద చాలీచాలని నీడన అలసట తీర్చుకుంటున్నారు.  

ఎండలోనే మగ్గుతున్నాం.. 
వారం రోజుల క్రితం మార్కెట్‌లో వడ్లు పోశాను. టెంట్‌ లేకపోవడం, దగ్గరలో చెట్లు లేకపోవడం వల్ల మాతోపాటు కూలీలు ఎండలోనే మగ్గుతున్నారు. గాలి దుమారానికి గుడిసె దెబ్బతిన్నది. ప్రభుత్వం రైతుల సౌలభ్యం కోసం టెంట్‌ ఏర్పాటు చేయాలి.   – నడిగోటి భిక్షం, రైతు కక్కిరేణి, రామన్నపేట మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా 

తాగునీటికి ఇబ్బందులు పడుతున్నాం...  
నల్లగొండ జిల్లా మాడ్గులపల్లి మండలంలోని చెరుపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులు తాగునీటికి ఇబ్బందులకు గురవుతున్నారు. కేంద్రంలో నీటిని డ్రమ్ముల్లో పోస్తుండడంతో ఎండకు వేడెక్కుతున్నాయి.  – లొడంగి చంద్రయ్య, రైతు,దాచారం, నల్లగొండ జిల్లా 

తరుగు తీస్తామంటున్నారు.. 
నాలుగెకరాల్లో వరిసాగు చేస్తే 250 బస్తాల దిగుబడి వచ్చింది. 12 రోజుల క్రితం కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకొచ్చా. ఇప్పటి వరకు కాంటాలు వేయలేదు. క్వింటాకు 3 నుంచి 5 కిలోల తరుగు అడుగుతుంటే ఒప్పుకోలేదు. తరుగు ఇవ్వడం కన్నా..ప్రైవేట్‌ వ్యాపారులకు అమ్ముకోవడం మంచిది. కొనుగోలు కేంద్రాల వద్ద ఎండ, ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్నాం.  – నాగండ్ల ఉపేందర్, జల్లేపల్లి, తిరుమలాయపాలెం మండలం, ఖమ్మంజిల్లా 

కనీస సౌకర్యాలు కరువు 
కొనుగోలు కేంద్రంలో రైతుల కోసం చిన్న టెంటు ఏర్పాటు చేశారు. అది కూలిపోయింది. ఎండ సమయంలో ఇబ్బంది పడుతున్నాం. చెట్ల నీడన సేదతీరుతున్నాం. ఇక్కడ కనీసం తాగునీటి సౌకర్యం కూడా లేదు. – శంకర్‌ పుప్పాల, రైతు, జానకంపేట, ఎడపల్లి మండలం, నిజామాబాద్‌ జిల్లా 

ఎండకు ఎండుతున్నాం.. వానకు తడుస్తున్నాం.. 
ధాన్యం తీసుకొచ్చి 5 రోజు లు అవుతోంది. కొద్దిపాటి వ ర్షానికి ధాన్యం తడి సింది. ధా న్యాన్ని ఆరబెట్టుకోవడం కో సం రోజంతా ఇక్కడే ఉండా ల్సి వస్తోంది. దీంతో ఇక్కడ నీడ సౌకర్యం లేక తాగు నీరు లేక ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ ధాన్యాన్ని ఆరబెట్టుకుంటున్నా. గన్నీ సంచులు లేక ధాన్యం ఆగిపోయింది.  – ఖాతా మాధవరెడ్డి, రైతు, బక్రిచెప్యాల 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement