గంటలోనే ఎకరం పొలం కోసేస్తున్న హార్వెస్టర్
ఆపై ధాన్యం ఆరబెట్టేందుకు అందుబాటులో లేని యంత్రాలు
రాష్ట్రంలో ఏటా పెరుగుతున్న వరిసాగు విస్తీర్ణం
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఎకరం వరి పొలాన్ని ఒకే రోజులో కోయాలంటే గతంలో పన్నెండు మంది కూలీలు అవసరమయ్యేవారు. ఇలా కోసిన పంటను కుప్ప వేసి తూర్పారబట్టడం వరకు కనీసం రెండు వారాల సమయం పట్టేది. కానీ ఇప్పుడు హార్వెస్టర్ ఎకరం పొలాన్ని గంటలోనే కోసి ధాన్యం, గడ్డిని వేరు చేసి ఇస్తోంది.
దీంతో రెండు వారాల్లో చేయాల్సిన పని ఒక గంటలోనే పూర్తవుతోంది. ఇదంతా పైకి బాగున్నట్టే కనిపిస్తున్నా ధాన్యం ఆరబెట్టేందుకు అవస్థలు తప్పడం లేదు. రాష్ట్రంలో నానాటికీ వరి సాగు పెరుగుతున్న నేపథ్యంలో ఆరబోత అనేది ఇప్పుడు పెద్ద సమస్యగా మారుతోంది.
తేమ చిక్కులు
వరి కోసినప్పుడు సాధారణంగా 35 శాతం నుంచి 40 శాతం మధ్య ధాన్యంలో తేమ ఉంటుంది. ఈ తేమ 17 శాతం ఉంటేనే ప్రభుత్వ కేంద్రాల్లో కొనుగోలు చేస్తారు. గతంలో కొడవళ్లతో కోసి, తూర్పారబట్టే వరకు ధాన్యం పంట పొలాల్లోనే ఎండి సాధారణ స్థాయికి తేమ చేరేది.
అయితే హార్వెస్టర్ కోత కావడంతో ధాన్యంలో తేమశాతం ఎక్కువగా ఉంటోంది. దీనిని తగ్గించేందుకు రైతులు ఖాళీ స్థలాలు, రోడ్ల వెంట, కొనుగోలు కేంద్రాల వద్ద ఆరబెడుతున్నారు. కూలీలను పెట్టి ప్రతీ అరగంటకు ఓసారి నెరుపుతున్నారు. దీంతో రైతులకు ఖర్చు పెరుగుతోంది.
ధాన్యం ఆరబోత యంత్రాలు
ధాన్యాన్ని ఆరబెట్టే మొబైల్ ప్యాడీ డ్రయర్ మిషన్లు మార్కెట్లలో అందుబాటులో ఉన్నాయి. మోడళ్ల ఆధారంగా వీటిæ ధర రూ.8 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు ఉంది. గంట వ్యవధిలో ఒక ఎకరం పొలంలో పండిన ధాన్యాన్ని ఆరబెట్టడమే కాక తాలును వేరు చేస్తుంది. కోతల సమయాన హార్వెస్టర్ మాదిరే ఈ యంత్రాలతోనూ ప్రయోజనాలు ఉన్నాయి.
మొబైల్ ప్యాడీ డ్రయర్ మిషన్లకు రాష్ట్ర రైతు సంక్షేమ శాఖ పరిధిలోని యాంత్రీకరణ– సాంకేతిక విభాగం 2023 జనవరి 23న ఆమోదించింది. ఎస్సీ, ఎస్టీ, చిన్న, సన్నకారు, మహిళా రైతులకు 60 శాతం సబ్సిడీ, ఇతరులకు 50 శాతం సబ్సిడీ అందించవచ్చని పేర్కొంది. ఈ నిర్ణయం వెలువడి దాదా రెండేళ్లు కావొస్తున్నా యంత్రాలు విరివిగా అందుబాటులోకి తీసుకురావడంలో ప్రభుత్వం విఫలమైంది.
పది రోజులుగా ఇక్కడే...
కల్లాల్లో ధాన్యం ఆరబోసి ఎప్పుడు అమ్ముడవుతుందా అని చూడాల్సి వస్తోంది. పది రోజులుగా కల్లాల దగ్గరే రాత్రీపగలు కాపలా ఉంటున్నాం. తేమ శాతం 17కు ఎప్పుడు చేరుతుందా అని ఎదురుచూస్తున్న. ఈ సమయంలో మబ్బులు పడితే భయం పుడుతోంది. – తడికల నర్సింగరావు, కుదునూరు, చర్ల మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
ఈ ఫొటోలో కనిపిస్తున్నది శ్మశానం.ఇల్లెందు మండలం కొమురారం గ్రామానికి చెందిన రైతులు రెండు, మూడు వారాల పాటు రేయింబవళ్లు ఇక్కడే ఉంటున్నారు. ఇదేమీ గ్రామ ఆచారం కాదు. ధాన్యం ఆరబెట్టేందుకు ఖాళీ స్థలం లేక శ్మశానమే వేదికగా మారింది.
ఈ ఫొటోలో కనిపిస్తున్నది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం కుదురునూరులో కొనుగోలు కేంద్రం. మబ్బులు పట్టి చినుకులు కురుస్తుండడంతో అప్రమత్తమైన రైతులు కల్లాల్లో ఆరబోసిన ధాన్యాన్ని కుప్పలుగా పేరుస్తూ కవర్లుకప్పేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment