Harvest crops
-
వానలు కురవాలి
ఇది ఆషాఢ మాసం. వర్షారంభ కాలం. ఆషాఢమంటే ఆకాశంలో కనిపించే మబ్బులు. నేలమీద కురిసే తొలకరి చినుకులు వీచే మట్టి పరిమళాలు. ‘తొలకరి వాన మొలకల తల్లి’ అనే నానుడి ఉంది. ఆషాఢంతో ముడిపడిన అనేక సంప్రదాయాలు మన జనజీవనంలో ఉన్నాయి. ఆషాఢం నుంచి కార్తీకం మొదలయ్యే వరకు వానలు కురుస్తాయి. పూర్వం మనకు వానాకాలంతోనే ఏడాది మొదలయ్యేది. అందుకే, వానను వర్షం అని అంటారు. ఏడాదులను వర్షాలతో లెక్క కట్టడం కూడా మనకు వాడుకలో ఉన్న పద్ధతే! ప్రకృతిలోని జీవకళకు వానలే ఆధారం. వర్షసౌందర్యాన్ని వర్ణించని కవులు అరుదు. ‘సదా మనోజ్ఞం స్వనదుత్సవోత్సుకమ్/ వికీర్ణ విస్తీర్ణ కలాప శోభితమ్/ ససంభ్రమాలింగన చుంబనాకులం/ ప్రవృత్త నృత్యం కులమద్య బర్హిణామ్’ అని కాళిదాసు ‘ఋతుసంహారం’లో వర్షర్తు సౌందర్యాన్ని వర్ణించాడు. మబ్బులు కమ్మి ఉరుములు మెరుపులతో వాన కురుస్తున్నప్పుడు నెమళ్లన్నీ పింఛాలు విప్పి జంటలు జంటలుగా ఒకదానినొకటి ముద్దాడుతూ నర్తిస్తున్నాయట! తొలకరి జల్లులు కురిసే వేళల్లో ఇలాంటి చూడచక్కని దృశ్యాలు కనిపిస్తాయి. ‘ఎలగోలు జల్లు మున్ బెళబెళ నేటవా/ల్పడి గాలి నట్టిండ్ల దడిపి చనగ/... భూభిదాపాది దుర్భరాంభోభరంపు/... కడవ వంచి/నట్లు హోరని దారౌఘ మైక్యమొంది/ మిన్ను మన్ను నొకటిగా వృష్టి బలిసె’ అంటూ హోరైన గాలితో చిటపట చినుకులుగా మొదలైన వర్షం వేగాన్ని పుంజుకుని మింటినీ మంటినీ ఏకం చేసేంత కుంభవృష్టిగా పరిణమించిన వైనాన్ని శ్రీకృష్ణ దేవరాయలు ‘ఆముక్తమాల్యదలో’ కళ్లకు కట్టాడు. ఇలాంటి దృశ్యాన్నే శేషేంద్ర తన ‘ఋతు ఘోష’లో ‘విరిసెను మేఘపరంపర/ మెరసెను శాంపేయలతలు మిన్నులు మొరసెన్/ పరచెను ఝంఝానిలములు/ కురిసెను వర్షము కుంభగుంభిత రీతిన్’ అని వర్ణించారు. సకాలంలో సజావుగా కురిస్తే, వర్షం హర్షదాయకమే! వర్షం ఒక్కొక్కప్పుడు బీభత్సం సృష్టిస్తుంది. శేషేంద్ర తన కావ్యంలో వర్షబీభత్సాన్ని కూడా వర్ణించారు. ‘పసికందుల్ జడివానలో వడకగా పాకల్ ధరంగూలి తా/మసహాయస్థితి తల్లిదండ్రులును హాహాకారముల్ సేయగా... నిర్వేల హాలాహల శ్వసనంబుల్ ప్రసవించె దీనజనతా సంసారపూరంబులన్’ అంటూ జడివానకు పూరిపాకలు కూలి పోయినప్పుడు నిరుపేదల నిస్సహాయతను కళ్లకు కట్టారు. రుతువులలో వర్షర్తువంతటి అస్తవ్యస్తమైన రుతువు మరొకటి లేదు. వానాకాలానికి ఉండే సహజ లక్షణం అనిశ్చితి. ‘వాన రాకడ ప్రాణం పోకడ ఎవరికీ తెలీదు’ అని సామెత. వర్షాకాలంలో మోతాదుగా వానలు కురుస్తాయనే భరోసా ఎప్పుడూ లేదు. భూమ్మీద ఎక్కడో ఒకచోట అతివృష్టి లేదా అనావృష్టి దాదాపు సర్వసాధారణం. మనుషులు అతివృష్టినీ తట్టుకోలేరు, అనావృష్టినీ భరించలేరు. సకాలంలో వానలు కురవకుంటే వానల కోసం ఎదురు చూస్తారు. ఎదురుచూపులకు ఫలితం దక్కకుంటే కప్పలకు పెళ్లిళ్లు చేయడం, వరుణ హోమాలు చేయడం వంటి తతంగాలను యథాశక్తి సాగిస్తారు. ప్రార్థనల ఫలితంగానో, ప్రకృతి రుతుధర్మ ప్రకారమో జడివానలు మొదలైతే, చిత్తడితో నిండిన వీథుల్లోకి వెళ్లలేక వానలను తిట్టుకుంటారు. మనుషులు స్తుతించినా, నిందించినా వాటితో ఏమాత్రం నిమిత్తం లేకుండా వానలు వాటి మానాన అవి వచ్చిపోతుంటాయి. అతివృష్టి వరదబీభత్సం వంటి ఉపద్రవాలను తెచ్చిపెడితే, అనావృష్టి కరవు కాటకాలతో ఆకలిమంటలు రేపుతుంది. ‘ఆకాశంబున మేఘమాలికల రూపైనం గనన్ రాదు, శు/ష్కాకారంబుల బైరులెల్ల సుదుమై యల్లాడె తీవ్రంబుగా/... మాకీ కష్టము వెట్టె దైవమని యేలా మాటికిం జింతిలన్?’ అంటూ దువ్వూరి రామిరెడ్డి తన ‘కృషీవలుడు’ కావ్యంలో కళ్లకు కట్టారు. అనావృష్టి ప్రభావం రైతు లకే ఎక్కువగా ఉంటుంది. చినుకు కరవై బీడువారిన నేలను చూస్తే రైతు గుండె చెరువవుతుంది. ఆషాఢం అంటే తొలకరి చినుకులు మాత్రమే కాదు, అరచేతులను పండించే గోరింట కూడా! ఆషాఢమాసంలో గోరింటాకు పెట్టుకోవడం మన సంప్రదాయం. పురాతన నాగరికతల కాలం నుంచి గోరింటాకు వాడుకలో ఉంది. అయినా మన కావ్య ప్రబంధాలలో కాళిదాసాది పూర్వకవులు గోరింటాకుపై ఎందుకో శీతకన్నేశారు. గోరింట ప్రస్తావన ప్రాచీన ఆయుర్వేద గ్రంథాలలోనే కనిపి స్తుంది గాని, కావ్యాలలో కనిపించదు. జానపద గీతాల్లో గోరింట ప్రస్తావన కనిపిస్తుంది. ‘గోపాల కృష్ణమ్మ పెళ్లయ్యెనాడు/ గోరింట పూచింది కొమ్మ లేకుండా’ అనే జానపద గీతం ఉంది. ‘గోరింటాకు’ సినిమా పాట పల్లవిని కృష్ణశాస్త్రి బహుశా దీనినుంచే సంగ్రహించి ఉంటారు. ఆధునిక కవుల్లో కొద్దిమంది గోరింటపై దృష్టి సారించారు. సరోజినీ నాయుడు ‘గోరింటాకు’ కవిత రాశారు. ‘వధువు నెన్నుదుటికి కుంకుమం ఎరుపు/ మధురాధరాలకు తాంబూల మెరుపు/ లిల్లీల తలపించు కాళ్లకూ వేళ్లకూ/ లేత గోరింటాకు ఎరుపే ఎరుపు’ అంటూ గోరింటాకు ఎరుపును ఎంతో మురిపెంగా వర్ణించారు. ఆమె ఇంగ్లిష్‌లో రాసిన కవితను సినారె తెలుగులోకి అనువదించారు. ‘బొప్పి గట్టినగాని యే పురుషుడైన/ తెలివినొందడు లోకంబు తెలియబోడు/ రాళ్లదెబ్బల గోరింట రంగొసంగు/ మనుజు డగచాటులనె గాని మారడెపుడు’ అంటారు ఉమర్ అలీషా. అగ చాట్లలో నలిగితే తప్ప మనిషి మారడని చెప్పడానికి రాళ్లదెబ్బలతో నలిగితేనే గోరింట రంగునిస్తుందని పోల్చడం విశేషం. ఆషాఢంలోని తొలకరి జల్లులతో మొదలయ్యే వానాకాలంలో సజావుగా వానలు కురిస్తే పంటపొలాల్లో నవధాన్యాలు పండుతాయి. ఆషాఢంలో అతివలు అలంకరించుకునే గోరింటాకుతో అరచేతులు పండుతాయి. ప్రకృతి కరుణిస్తే బతుకులు పండుతాయి. మన పంట పండాలంటే వానలు కురవాలి. -
చిరుధాన్యాల బిస్కెట్లు నెలకు లక్ష యాభై వేలు సంపాదన
-
ఎక్కువ దిగుబడినిచ్చే నూతన కొబ్బరి రకాలు
-
పందిరి సాగుతో అధిక దిగుబడి ఎక్కువ రాబడి
-
TS: రైతన్న ఆశలు ఆవిరి
సాక్షి, హైదరాబాద్: అకాల వర్షంతో ఆరుగాలం కష్టపడి పండించిన పంట నీళ్ల పాలవడంతో రైతన్న గుండె చెదిరింది. భారీ వర్షం, వడగళ్లతో కోతకు వచ్చిన పంట పొలంలోనే కుప్పకూలి గింజ లేకుండా రాలిపోగా, కోసి ఆరబోసిన పంట కూడా వర్షార్పణమైంది. వేలాది ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. పంట మొత్తం నాశనమవడాన్ని చూసి తట్టుకోలేని సిరిసిల్ల జిల్లా కోనరావుపేటకు చెందిన పంబాల స్వామి (53) గుండెపోటుతో కుప్పకూలారు. ప్రధానంగా కరీంనగర్, వరంగల్, నల్లగొండ, నిజామాబాద్ జిల్లాల్లో వర్ష బీభత్సంతో వేలాది ఎకరాల పంటనష్టం జరిగింది. కొనుగోలు కేంద్రాలు, కల్లాల్లో ఆరబోసిన వేల టన్నుల ధాన్యం నీళ్లపాలైంది. 50వేల ఎకరాల్లోనే వరి పంట నష్టం జరిగినట్లు వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసినా, అది ఎన్నో రెట్లు ఎక్కువగా ఉన్నట్లు క్షేత్రస్థాయి పరిశీలనను బట్టి అర్థమవుతోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పంట నష్టం అత్యధికంగా ఉన్నట్లు వ్యవసాయ శాఖ, పౌరసరఫరాల శాఖ తేల్చాయి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 78,984 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు వ్యవసాయ శాఖ అధికారులు తేల్చారు. ఉమ్మడి నిజామాబాద్, నల్లగొండ జిల్లాల్లో 20 రోజుల క్రితం నుంచే రైతులు కోతలు కోసి ధాన్యాన్ని ఆరబెట్టగా, 10 రోజుల నుంచి కొనుగోళ్లు మొదలయ్యాయి. ఉమ్మడి కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో కోతలు మొదలైనా, కొనుగోలు కేంద్రాలు లేక రైతులు నానాకష్టాలు పడ్డారు. వరి కోతకు వచ్చినా, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదనే కారణంగా చాలామంది రైతులు పంటను కోయలేదు. అకాల వర్షం, వడగళ్లతో పొలాల్లోనే పంట నేలకొరిగింది. దీంతో ఎకరా పొలంలో బస్తా వడ్లు కూడా వచ్చే పరిస్థితి లేదని, వరిని కోస్తే కోత మిషన్‌కు పెట్టే ఖర్చు కూడా వేస్ట్ అని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. రాష్ట్రంలో ఈ యాసంగి సీజన్లో 7,031 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని పౌరసరఫరాల శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. కానీ ఇప్పటివరకు కేవలం 12 జిల్లాల్లో 2,161 కేంద్రాలను మాత్రమే ఏర్పాటు చేసి 2.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొన్నారు. కొనుగోళ్లకు ఆటంకం అకాల వర్షాలతో కొనుగోలు కేంద్రాల్లో కూడా ధాన్యం తడవగా, రెండు రోజులుగా కొనుగోళ్లు సాగడం లేదు. ఇంకా వర్షసూచన ఉండడంతో మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని భావిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో పలుచోట్ల సోమవారం మధ్యాహ్నం ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో కోత కోసి ఆరబెట్టిన ధాన్యం వర్షపు నీటిలో కొట్టుకుపోయింది. నువ్వులు, సజ్జ పంటలు నేలకొరిగాయి. ముప్కాల్, మోర్తాడ్, ఆర్మూర్, కమ్మర్ పల్లి, నాగంపేట్‌లలో వర్షం కురిసింది. జనగామ జిల్లాలో సోమవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వాన పడింది. బచ్చన్నపేట మండలంలోని బండనాగారం, కేసిరెడ్డిపల్లి, కొడవటూరు, లక్ష్మాపూర్ గ్రామాల్లో వడగళ్లు పడ్డాయి. జనగామ మండలం గానుగపాడు వెంకిర్యాల, వడ్లకొండ, మరిగడిలలో భారీ సైజులో వడగళ్లు పడ్డాయి. దీంతో మామిడి తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ప్రతీ గింజను కొంటాం అకాల వర్షంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పంట నష్టం జరిగింది. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో నష్టం తీవ్రత ఎక్కువగానే ఉంది. నేను స్వయంగా పరిశీలించి రైతులకు ధైర్యం చెప్పాను. పంట నష్టపోయిన రైతులను కేసీఆర్ ఆదుకుంటారు. అధికారులు పంట నష్టాన్ని అంచనా వేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టుకొనే ప్రక్రియ సాగుతుంది. అవసరమైన మేర టార్పాలిన్లు, తేమ మిషన్లను ఏర్పాటు చేశాం. తడిసిన ధాన్యం ఆరిన వెంటనే కొనుగోలు చేస్తాం. ప్రతీ గింజను కొంటాం. –మంత్రి గంగుల గుండెపోటుతో రైతు మృతి కోనరావుపేట (వేములవాడ): ఆరునెలలు శ్రమించి సాగుచేసిన పంట ఒక్కరోజులో నేలపాలు కావడంతో తట్టుకోలేని ఆ రైతు గుండె ఆగింది. రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేటకు చెందిన పంబాల స్వామి(53)కి మూడెకరాల భూమి ఉంది. అందులో వరి వేశాడు. రెండు రోజుల క్రితమే ఎకరం పొలాన్ని కోయించగా, ఇంకా రెండెకరాల్లో పంటను కోయించాల్సి ఉంది. ఆలోపే ఆదివారం సాయంత్రం వడగళ్ల వాన పడి పంట మొత్తం రాలిపోయింది. దీన్ని చూసి స్వామి దిగాలుగా ఇంటికొచ్చి గుండెలో నొప్పి వస్తోందంటూ పడిపోయాడు. కుటుంబసభ్యులు ఆయనను ఆస్పత్రికి తరలించేలోపే మృతిచెందాడు. స్వామికి ఇద్దరు కూతుళ్లు. భార్య ఉన్నారు. -
రైతు ప్రయోజనమే లక్ష్యంగా..
►మార్కెట్లో మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు ►త్వరలో యార్డులో అత్యాధునిక నాణ్యత పరీక్షా ల్యాబ్ ►సమష్టి కృషితోనే ఈ–నామ్‌కు జాతీయ అవార్డు నిజామాబాద్ : ఆరుగాలం శ్రమించి పండించిన పంట క్రయవిక్రయాల్లో రైతుల ప్రయోజనమే లక్ష్యంగా పనిచేస్తున్నామని కలెక్టర్ డాక్టర్ యోగితారాణా అన్నారు. రైతుల ఉత్పత్తుల కొనుగోళ్లను జాతీయస్థాయిలో విస్తృతం చేసేందుకు చర్యలు చేపట్టామని చెప్పారు. జిల్లా అధికార యంత్రాంగం సమష్టి కృషితోనే నిజామాబాద్ మార్కెట్ యార్డుకు ఈ–నామ్ అమలులో జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కిందని ఆమె పేర్కొన్నారు. ఈ అవార్డు తనపై బాధ్యతను పెంచిందని అన్నారు. సివిల్ సర్వీసెస్ డే పురస్కరించుకుని ప్రధానమంత్రి విశిష్టసేవ అవార్డును నరేంద్రమోడీ చేతులు మీదుగా అందుకున్న అనంతరం కలెక్టర్ యోగితారాణా సోమవారం జిల్లాకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వూ్యలో మాట్లాడారు. సాక్షి : జాతీయ స్థాయిలో అవార్డు అందుకున్నందుకు ఎలా ఫీలవుతున్నారు? కలెక్టర్ : జాతీయ స్థాయి అవార్డు రావడం ఎంతో సంతోషంగా ఉంది. ఇందులో జిల్లా అధికార యంత్రాంగం కృషి ఉంది. ఈ అవార్డు రావడానికి మార్కెటింగ్ శాఖ మంత్రి టి.హరీష్‌రావు, డైరెక్టర్ లక్ష్మిబాయిలు ఎంతో ప్రోత్సహించారు. సాక్షి : అవార్డు రావడానికి మీరు ప్రత్యేకంగా చేపట్టిన చర్యలేంటీ? కలెక్టర్ : ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లాం. ఈ–నామ్ విధానంపై వివిధ స్థాయిల్లో రైతులకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించాం. ఈ విధానంతో ఉండే ప్రయోజనాలను సహకార సంఘాల ద్వారా రైతులకు వివరించాం. ఇటు వ్యాపారులను కూడా ఆ దిశగా ప్రోత్సహించాం. సాక్షి : జిల్లాలోని పసుపు రైతులు ఇక్కడ సరైన ధర రావడం లేదని మహారాష్ట్రలోని సాంగ్లీకి వెళ్తున్నారు కదా? కలెక్టర్ : వాస్తవమే.. సాంగ్లీకి వెళ్లే రైతుల సంఖ్య సుమారు 20 శాతం వరకు తగ్గిందని భావిస్తున్నా. సాంగ్లీలో ఉన్న ధర ప్రకారం ఇక్కడే కొనుగోలు చేసేలా అక్కడి వ్యాపారులతో కూడా మాట్లాడుతాం. సాక్షి : డీపీసీ విధానం ద్వారా కమీషన్ ఏజెంట్లకు చెక్ పడిందని భావిస్తున్నారా? కలెక్టర్ : యార్డులో ప్రత్యేకంగా డైరెక్ట్ పర్చేస్ సెంటర్(డీపీసీ)ని ఏర్పాటు చేశాం. ఈ కేంద్రంలో రైతులు తమ ఉత్పత్తులను విక్రయిస్తే కమీషన్ ఏజెంట్లకు రెండు శాతం కమీషన్ ఇవ్వాల్సిన అవసరం లేకుండా, నేరుగా ఖరీదుదారులకు విక్రయించేలా చర్యలు చేపట్టాం. ఈ అంశంపై యార్డుకు వచ్చే రైతులకు అవగాహన కల్పించాం. చాలా వరకు రైతులకు ప్రయోజనం చేకూరుతోంది. సాక్షి : ఇప్పటికీ కొందరు ఖరీదుదారులు సిండికేట్‌గా మారి ధర దోపిడీకి పాల్పడుతున్నారు కదా? కలెక్టర్ : ప్రస్తుతానికి స్థానిక వ్యాపారులు మాత్రమే ఈ–బిడ్డింగ్‌లో ధర కోట్ చేస్తున్నారు. దీంతో సిండికేట్‌గా అయ్యేందుకు అవకాశం ఉంది కావచ్చు. వివిధ రాష్ట్రాలకు చెందిన ఖరీదుదారులు ఆన్లైన్ బిడ్డింగ్‌లో పాల్గొంటే ఈ సిండికేట్ వ్యవహారానికి పూర్తిగా చెక్ పడుతుంది. సాక్షి : ఆమ్చూర్ కొనుగోళ్లలో కమీషన్ ఏజెంట్లు క్యాష్ కటింగ్ పేరిట పది శాతం వరకు రైతులను దోపిడీ చేస్తున్నారు. కొందరు మార్కెట్ సిబ్బంది కొందరు ఏజెంట్లతో కుమ్మక్కయ్యారనే విమర్శలున్నాయి? కలెక్టర్ : వివిధ జిల్లాల నుంచి రైతులు ఆమ్‌చూర్‌ను విక్రయించేందుకు ఇక్కడికి వస్తున్నారు. కమీషన్ ఏజెం ట్లు రెండు శాతానికి మించి కమీషన్ వసూలు చేయరాదు. అంతకంటే ఎక్కువ వసూలు చేస్తే కఠిన చర్య లు తీసుకుంటాం. మార్కెటింగ్ శాఖ సిబ్బంది అక్రమాలకు పాల్పడితే విచారణ చేసి చర్యలు చేపడుతాం. సాక్షి : యార్డులో ఎలాంటి సౌకర్యాలు కల్పించారు? కలెక్టర్ : క్రయవిక్రయాల ప్రక్రియను పూర్తిగా కంప్యూటరైజ్డ్ చేశాము. ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో అనుసంధానించడంతో కమీషన్, హమాలీ, చాటా వంటి చార్జీల పేరుతో ఇష్టారాజ్యంగా రైతుల చెల్లింపుల్లో కోత వి«ధించడానికి చెక్ పడింది. రైతుల ఉత్పత్తులకు ఈ–లాట్, ఈ–బిడ్డింగ్ వంటి ఏర్పాట్లు చేయడంతో ధర నిర్ణయంలో పారదర్శక పెరిగింది. ఆయా ఉత్పత్తులకు వచ్చిన ధర సంబంధిత రైతులకు ఎస్ఎంఎస్ రూపంలో వచ్చేలా ఏర్పాట్లు చేశాం. సాక్షి : రానున్న రోజుల్లో ఈ విధానం పకడ్బందీగా అమలయ్యేందుకు తీసుకోబోయే చర్యలు? కలెక్టర్ : యార్డులో అత్యాధునికమైన ల్యాబ్‌ను ఏర్పాటు చేస్తాం. ఈ ల్యాబ్ రైతుల ఉత్పత్తుల నాణ్యతను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో ఉంచుతుంది. తద్వారా దేశంలో ఎక్కడి నుంచైనా కొనుగోలుదారులు ఈ సరుకుల నాణ్యతను పరిశీలించి ఆన్లైన్లో బిడ్డింగ్ చేసేలా ఏర్పాటు చేస్తాం. కోల్డ్ స్టోరేజ్‌ను నిర్మించి ధర రాని పక్షంలో రైతులు తమ ఉత్పత్తులను నిల్వ చేసుకునేలా చర్యలు తీసుకుంటాం. నిజామాబాద్ యార్డుకు ప్రస్తుతం వస్తున్న పంటలే గాక ఇతర పంటల క్రయవిక్రయాల వేదికగా మార్చేందుకు చర్యలు చేపడుతున్నాం. -
పంట కోత, నూర్పిడే కీలకం
జాగ్రత్తలు తప్పనిసరి అధిక తేమ, వర్షాల సమయంలో కోతలొద్దు గజ్వేల్ ఏడీఏ శ్రావణ్‌కుమార్ సలహాలు, సూచనలు గజ్వేల్ :మరో నెల రోజుల తర్వాత పంటలు కోతకు వచ్చే అవకాశముంది. ఇలాంటి తరుణంలో రైతులు జాగ్రత్తలు పాటించాలని గజ్వేల్ ఏడీఏ శ్రావణ్‌కుమార్(సెల్ : 7288894469)సూచిస్తున్నారు. కోత, నూర్పిడికి సంబంధించి ఆయన అందించిన సలహాలు, సూచనలివి... - వివిధ పంటల్లో పక్వ దశను గమనించి ఆలస్యం చేయకుండా సకాలంలో కోసుకోవాలి. - విత్తన పంటల్లో యంత్రాల ద్వారా పంటకోత, నూర్పిడి చేసినట్లయితే... ముందుగా కోసిన పంటల మిగిలిపోయిన విత్తనాలు లేకుండా శుభ్రపర్చుకోవాలి. దీని ద్వారా కల్తీని నివారించుకోవచ్చు. - ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో అంటే... అధిక తేమ, వర్షపాతం ఉన్నప్పుడు పంటలను కోయవద్దు. - నూర్పిడి తర్వాత గింజలు, విత్తనాన్ని శుభ్రపర్చుకునేటప్పుడు... వ్యర్థ పదార్థాలను పూర్తిగా తొలగించాలి. ఆరబెట్టేటప్పుడు నేరుగా తీవ్రమైన ఎండల్లో ఆరబెట్టకూడదు. - తీవ్రమైన ఉష్ణోగత్రల వల్ల గింజ విత్తన నాణ్యత దెబ్బతింటుంది. మొలకెత్తే శక్తి కూడా తగ్గిపోతుంది. ఆరబెట్టిన తర్వాత ధాన్యపు పంటల్లో అయితే 12-14శాతం, పప్పు దినుసుల్లో 8-10శాతం, నూనె గింజల పంటలలో 7-9శాతం గరిష్టంగా తేమ ఉండేట్లు చూసుకోవాలి. ఇంతకన్నా తేమశాతం ఎక్కువగా ఉంటే, నిల్వలో నాణ్యత దెబ్బతింటుంది. - నిల్వలో సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. నిల్వకు ఎళ్లప్పుడు గాలి, తేమ చొరబడని సంచుల్ని లేదా నిల్వ పాత్రల్ని మాత్రమే ఎంచుకోవాలి. పొడి, చల్లని వాతావరణంలో నిల్వ ఉంటే గింజ విత్తన నాణ్యత బాగా ఉంటుంది. - గిడ్డంగుల్లో ధాన్యాన్ని, విత్తనాలను నిల్వ చేసినప్పుడు పరిశుభ్రమైన కొత్త సంచులనే వాడాలి. - నిల్వ చేసే గదులు, గోదాములు శుభ్రం చేసుకుని... పగుళ్లు లేకుండా చూసుకుని సున్నం వేసుకోవాలి. ఎలుక కన్నాలు ఉంటే పూడ్చి వేయాలి. - పాత సంచులను వాడేటప్పుడు వాటిని డెల్టా మెత్రిన్ 1.5 మి,లీ లేదా 3.5మి.లీ డెసిస్ లేదా హిమామెక్టిన్, బెంజోయేట్ 2గ్రాములు లీటరు నీటికి కలిపి ద్రావణంలో ముంచి ఆరబెట్టి వాడుకోవాలి. - మంచి నాణ్యత కలిగిన పాలిథిన్ లైనింగ్ ఉన్న జూట్ సంచులు, సూపర్గ్రేన్ బ్యాగులు, పురుగు మందుల లేపనం ఉన్న బ్యాగులు, హెచ్డీపీఈ, ప్లాస్టిక్ సంచులు, మ్యాజిక్ బ్యాగులు విత్తన నిల్వకు వాడటం మంచిది. - బస్తాలను బ్లాక్ పద్దతిలో అనగా ఒకటి పొడవుగా, రెండోది అడ్డంగా ఉండేట్లు అమర్చుకోవాలి. బస్తాలను నేలకు, గోడలకు ఆనించకుండా ఎత్తైన చెక్క బల్లపై పెట్టుకోవాలి. - సోయా చిక్కుడు లాంటి విత్తన పంటల్లో విత్తనపొర పలుచగా ఉంటే యంత్రాల ద్వారా కోత, నూర్పిడి చేయరాదు. అలా చేస్తే మొలకశాతం దెబ్బతింటుంది. ఒకవేళ తప్పనిసరిగా చేయాల్సి వస్తే విత్తనానికి రాపిడి జరగకుండా యంత్రాల్లో సరైన మార్పులు చేసి ఉపయోగించుకోవాలి. - కొత్త ధాన్యాన్ని, పాత ధాన్యంతో కలపరాదు. కొత్త ధాన్యం నింపేముందు, గోడల పైకప్పుకు, గోనే సంచులపైన మలాథియాన్ 10మి.లీ లేదా డైక్లోర్వాస్ 7మి.లీ లేదా డెల్టామెత్రిన్ 1.5మి.లీలు లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.