ఇది ఆషాఢ మాసం. వర్షారంభ కాలం. ఆషాఢమంటే ఆకాశంలో కనిపించే మబ్బులు. నేలమీద కురిసే తొలకరి చినుకులు వీచే మట్టి పరిమళాలు. ‘తొలకరి వాన మొలకల తల్లి’ అనే నానుడి ఉంది. ఆషాఢంతో ముడిపడిన అనేక సంప్రదాయాలు మన జనజీవనంలో ఉన్నాయి. ఆషాఢం నుంచి కార్తీకం మొదలయ్యే వరకు వానలు కురుస్తాయి. పూర్వం మనకు వానాకాలంతోనే ఏడాది మొదలయ్యేది. అందుకే, వానను వర్షం అని అంటారు. ఏడాదులను వర్షాలతో లెక్క కట్టడం కూడా మనకు వాడుకలో ఉన్న పద్ధతే! ప్రకృతిలోని జీవకళకు వానలే ఆధారం.
వర్షసౌందర్యాన్ని వర్ణించని కవులు అరుదు. ‘సదా మనోజ్ఞం స్వనదుత్సవోత్సుకమ్/ వికీర్ణ విస్తీర్ణ కలాప శోభితమ్/ ససంభ్రమాలింగన చుంబనాకులం/ ప్రవృత్త నృత్యం కులమద్య బర్హిణామ్’ అని కాళిదాసు ‘ఋతుసంహారం’లో వర్షర్తు సౌందర్యాన్ని వర్ణించాడు. మబ్బులు కమ్మి ఉరుములు మెరుపులతో వాన కురుస్తున్నప్పుడు నెమళ్లన్నీ పింఛాలు విప్పి జంటలు జంటలుగా ఒకదానినొకటి ముద్దాడుతూ నర్తిస్తున్నాయట! తొలకరి జల్లులు కురిసే వేళల్లో ఇలాంటి చూడచక్కని దృశ్యాలు కనిపిస్తాయి.
‘ఎలగోలు జల్లు మున్ బెళబెళ నేటవా/ల్పడి గాలి నట్టిండ్ల దడిపి చనగ/... భూభిదాపాది దుర్భరాంభోభరంపు/... కడవ వంచి/నట్లు హోరని దారౌఘ మైక్యమొంది/ మిన్ను మన్ను నొకటిగా వృష్టి బలిసె’ అంటూ హోరైన గాలితో చిటపట చినుకులుగా మొదలైన వర్షం వేగాన్ని పుంజుకుని మింటినీ మంటినీ ఏకం చేసేంత కుంభవృష్టిగా పరిణమించిన వైనాన్ని శ్రీకృష్ణ దేవరాయలు ‘ఆముక్తమాల్యదలో’ కళ్లకు కట్టాడు. ఇలాంటి దృశ్యాన్నే శేషేంద్ర తన ‘ఋతు ఘోష’లో ‘విరిసెను మేఘపరంపర/ మెరసెను శాంపేయలతలు మిన్నులు మొరసెన్/ పరచెను ఝంఝానిలములు/ కురిసెను వర్షము కుంభగుంభిత రీతిన్’ అని వర్ణించారు.
సకాలంలో సజావుగా కురిస్తే, వర్షం హర్షదాయకమే! వర్షం ఒక్కొక్కప్పుడు బీభత్సం సృష్టిస్తుంది. శేషేంద్ర తన కావ్యంలో వర్షబీభత్సాన్ని కూడా వర్ణించారు. ‘పసికందుల్ జడివానలో వడకగా పాకల్ ధరంగూలి తా/మసహాయస్థితి తల్లిదండ్రులును హాహాకారముల్ సేయగా... నిర్వేల హాలాహల శ్వసనంబుల్ ప్రసవించె దీనజనతా సంసారపూరంబులన్’ అంటూ జడివానకు పూరిపాకలు కూలి పోయినప్పుడు నిరుపేదల నిస్సహాయతను కళ్లకు కట్టారు.
రుతువులలో వర్షర్తువంతటి అస్తవ్యస్తమైన రుతువు మరొకటి లేదు. వానాకాలానికి ఉండే సహజ లక్షణం అనిశ్చితి. ‘వాన రాకడ ప్రాణం పోకడ ఎవరికీ తెలీదు’ అని సామెత. వర్షాకాలంలో మోతాదుగా వానలు కురుస్తాయనే భరోసా ఎప్పుడూ లేదు. భూమ్మీద ఎక్కడో ఒకచోట అతివృష్టి లేదా అనావృష్టి దాదాపు సర్వసాధారణం. మనుషులు అతివృష్టినీ తట్టుకోలేరు, అనావృష్టినీ భరించలేరు. సకాలంలో వానలు కురవకుంటే వానల కోసం ఎదురు చూస్తారు. ఎదురుచూపులకు ఫలితం దక్కకుంటే కప్పలకు పెళ్లిళ్లు చేయడం, వరుణ హోమాలు చేయడం వంటి తతంగాలను యథాశక్తి సాగిస్తారు.
ప్రార్థనల ఫలితంగానో, ప్రకృతి రుతుధర్మ ప్రకారమో జడివానలు మొదలైతే, చిత్తడితో నిండిన వీథుల్లోకి వెళ్లలేక వానలను తిట్టుకుంటారు. మనుషులు స్తుతించినా, నిందించినా వాటితో ఏమాత్రం నిమిత్తం లేకుండా వానలు వాటి మానాన అవి వచ్చిపోతుంటాయి.
అతివృష్టి వరదబీభత్సం వంటి ఉపద్రవాలను తెచ్చిపెడితే, అనావృష్టి కరవు కాటకాలతో ఆకలిమంటలు రేపుతుంది. ‘ఆకాశంబున మేఘమాలికల రూపైనం గనన్ రాదు, శు/ష్కాకారంబుల బైరులెల్ల సుదుమై యల్లాడె తీవ్రంబుగా/... మాకీ కష్టము వెట్టె దైవమని యేలా మాటికిం జింతిలన్?’
అంటూ దువ్వూరి రామిరెడ్డి తన ‘కృషీవలుడు’ కావ్యంలో కళ్లకు కట్టారు. అనావృష్టి ప్రభావం రైతు లకే ఎక్కువగా ఉంటుంది. చినుకు కరవై బీడువారిన నేలను చూస్తే రైతు గుండె చెరువవుతుంది.
ఆషాఢం అంటే తొలకరి చినుకులు మాత్రమే కాదు, అరచేతులను పండించే గోరింట కూడా! ఆషాఢమాసంలో గోరింటాకు పెట్టుకోవడం మన సంప్రదాయం. పురాతన నాగరికతల కాలం నుంచి గోరింటాకు వాడుకలో ఉంది. అయినా మన కావ్య ప్రబంధాలలో కాళిదాసాది పూర్వకవులు గోరింటాకుపై ఎందుకో శీతకన్నేశారు.
గోరింట ప్రస్తావన ప్రాచీన ఆయుర్వేద గ్రంథాలలోనే కనిపి స్తుంది గాని, కావ్యాలలో కనిపించదు. జానపద గీతాల్లో గోరింట ప్రస్తావన కనిపిస్తుంది. ‘గోపాల కృష్ణమ్మ పెళ్లయ్యెనాడు/ గోరింట పూచింది కొమ్మ లేకుండా’ అనే జానపద గీతం ఉంది. ‘గోరింటాకు’ సినిమా పాట పల్లవిని కృష్ణశాస్త్రి బహుశా దీనినుంచే సంగ్రహించి ఉంటారు.
ఆధునిక కవుల్లో కొద్దిమంది గోరింటపై దృష్టి సారించారు. సరోజినీ నాయుడు ‘గోరింటాకు’ కవిత రాశారు. ‘వధువు నెన్నుదుటికి కుంకుమం ఎరుపు/ మధురాధరాలకు తాంబూల మెరుపు/ లిల్లీల తలపించు కాళ్లకూ వేళ్లకూ/ లేత గోరింటాకు ఎరుపే ఎరుపు’ అంటూ గోరింటాకు ఎరుపును ఎంతో మురిపెంగా వర్ణించారు. ఆమె ఇంగ్లిష్‌లో రాసిన కవితను సినారె తెలుగులోకి అనువదించారు. ‘బొప్పి గట్టినగాని యే పురుషుడైన/ తెలివినొందడు లోకంబు తెలియబోడు/ రాళ్లదెబ్బల గోరింట రంగొసంగు/ మనుజు డగచాటులనె గాని మారడెపుడు’ అంటారు ఉమర్ అలీషా.
అగ చాట్లలో నలిగితే తప్ప మనిషి మారడని చెప్పడానికి రాళ్లదెబ్బలతో నలిగితేనే గోరింట రంగునిస్తుందని పోల్చడం విశేషం. ఆషాఢంలోని తొలకరి జల్లులతో మొదలయ్యే వానాకాలంలో సజావుగా వానలు కురిస్తే పంటపొలాల్లో నవధాన్యాలు పండుతాయి. ఆషాఢంలో అతివలు అలంకరించుకునే గోరింటాకుతో అరచేతులు పండుతాయి. ప్రకృతి కరుణిస్తే బతుకులు పండుతాయి. మన పంట పండాలంటే వానలు కురవాలి.
వానలు కురవాలి
Published Mon, Jul 10 2023 12:02 AM | Last Updated on Mon, Jul 10 2023 3:36 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment