
ప్రపంచమంతటా సృష్టిగాథలు ఒక్కలానే ఉంటాయి. ఆదిలో అంతా జలమయమే. ఎందుకనీ? వర్షాలు... క్షణం తెరిపివ్వని వర్షాలు... బ్రహ్మాండమంత కుండతో ఎత్తిపోసినట్టు నిరంతర ధారాపాతాలు... ఆ తర్వాత ఎప్పుడో సూర్యుడూ, చంద్రుడూ, నక్షత్రాలూ పుట్టాయి. భూమి పైకి తేలింది. జీవి పుట్టింది. మనిషితో సహా రకరకాల రూపాల్లోకి పరిణామం చెందింది. వర్షం పడుతూనే ఉంది కానీ, నిర్విరామం నుంచి విరామానికి మారింది. చెప్పొచ్చేదేమిటంటే, వర్షం సృష్టి అంత ప్రాచీనం; ప్రకృతి అంత పురాతనం.
మనిషి పుట్టిన చోటనే ఎప్పుడూ లేడు కనుక భ్రమణజీవి; అంతకన్నా ఎక్కువగా భ్రమలజీవి. తను ప్రకృతిలో భాగమన్న సంగతి మరచి; తన జీవితానికి, తన నిర్ణయాలకు తనే కర్తనన్న భ్రమ వాటిలో ఒకటి. శీతోష్ణాలను మించి ఆ భ్రమను పటాపంచలు చేయగలిగింది వర్షాలే. మనం బయటికి వెళ్లడానికి సిద్ధమవుతాం. ఆకాశం మబ్బు పట్టి ఉన్నా వర్షం రాదులే అన్న భ్రమతో గడప దాటుతాం. చినుకుతో మొదలై చూస్తుండగానే ఆకాశానికి చిల్లిపడిందా అన్నంత ఉధృతితో వర్షం ముంచెత్తుతుంది.
చెట్టు కిందికో, చూరు కిందికో, మరో కప్పు కిందికో పరుగుతీస్తాం. వర్షనిర్బంధం నుంచి బయటపడడానికి నిలువుకాళ్ళ తపస్సు చేస్తాం. మనలానే, మనపక్కకి ఎవరెవరో అపరిచితులు వచ్చి చేరతారు. మాటలు కలుస్తాయి, ముచ్చట్లుగా మారతాయి, స్నేహాలను అల్లుకుంటాయి, ప్రేమలు మొలకెత్తుతాయి, అవి పెళ్లిళ్లకూ దారితీయవచ్చు. ఒక్కోసారి ఒకే ఒక్క వర్షం ఊహించని సన్నివేశాలను కల్పించి జీవితాలను పెద్దమలుపు తిప్పచ్చు.
ప్రపంచ సాహిత్యంలో వర్షానుభవాన్ని చిత్రించని కథా, కావ్యం, నవలా దాదాపు ఉండవు. మనిషి బుద్ధిని బంకలా పట్టుకున్న మృగత్వం, కులమతాల భేదాలు, ధనిక, నిర్ధనిక తారతమ్యాలు, చదువు, అధికారంతో పుట్టే దుర్గర్వాలు సహా అన్ని రకాల మురికినీ, మకిలినీ కడిగి శుభ్రం చేసి మళ్ళీ మనిషిని చేయగల మంత్రజలం వర్షం. సమాజం గురించి మనుషుల గురించి నిశ్చితాభిప్రాయాల ఇరుకులో కరకుదేరిన అడ్వొకేట్ రావునూ, అతను చీదరించుకున్న బిచ్చగత్తెనూ ఒకచోటికి చేర్చిన పాలగుమ్మి పద్మరాజు కథ ‘గాలివాన’నే చూడండి.
ఆ క్షణంలో అతనికి అవసరమైన ఆ బిచ్చగత్తె ఆలింగనపు వెచ్చదనం అందించి అతనిలోని అరవయ్యేళ్ళ అజ్ఞానాహంకారాల జడలమర్రిని ఒక్క గాలివాన కూకటివేళ్ళతో కుప్పకూల్చింది. అతని బతుకు పలకను స్వచ్ఛజలాలతో పూర్తిగా ప్రక్షాళించి మానవత్వపు కొత్త ఓనమాలు దిద్దించింది. దాశరథి రంగాచార్య కథ ‘తామరపూలు’లో చిట్టిపంతులికి తామరలే లోకం. ఋతుభ్రమణం గురించిన జ్ఞానం లేని ఆ అబ్బాయి ఎండాకాలంలో అవి కనిపించకపోయేటప్పటికి కలవరపడిపోయాడు. వానలు పడి తిరిగి కనిపించేవరకూ వాటికోసం ఒక జీవితకాలపు నిరీక్షణ. అలా ప్రకృతిపాఠాల బోధనలో వాన జ్ఞానకళిక అయింది.
సొగసుతోపాటు ప్రకృతిలోని లయను, సమవర్తనను, ఒక్కోసారి అవి కలిగించే విషాదం గురించిన ఎరుకను తట్టిలేపే కథ మహేంద్ర రచించిన ‘హొగినేకల్’. ఓ కుటుంబం ఆ కావేరి జలపాతాన్ని చూడడానికి చిన్న పాపను తీసుకుని వానను వెంటబెట్టుకుని వెళ్లింది. కావేరికి వరదెత్తి ఆ వరదలో పాప కొట్టుకుపోయింది. జీర్ణించుకోవడం కష్టమే కానీ; ‘ఇదే ప్రకృతి. ఇదే ప్రకృతిధర్మం. అది మంచిదీ కాదు, చెడ్డదీ కాదు; దాని దృష్టిలో అన్నీ సమానం. సృష్టిని అంగీకరించే మనిషి, లయను కూడా అంగీకరిస్తే పెనుగులాట ఉండ’దంటుందీ కథ.
వాన మన వ్యక్తిత్వాలకు, ఆలోచనలకు ఒక స్పష్టతనివ్వడానికి కూడా ఎలా నేపథ్యమవుతుందో కుప్పిలి పద్మ కథ ‘గోడ’ చెబుతుంది. ‘వాన. తూర్పు సముద్రపు కెరటాల నురగల మీద వాన. యారాడ కొండల గరిక మీద వాన. రుషికొండ ఎగుడుదిగుడుల మీద వాన...’ అని మొదలయ్యే ఈ కథలో స్వతంత్రభావాలు కలిగిన ఒక అమ్మాయి తనతో చదువుకున్న ఒక అబ్బాయి గదిలో ఆ వర్షపురాత్రిని గడపాల్సివస్తుంది. అతనిలో మగాడు నిద్రలేచి హద్దుమీరబోతే ఆ అమ్మాయి వారించి గట్టిగా బుద్ధి చెబుతుంది. మహమ్మద్ ఖదీర్ బాబు అద్భుతంగా పునఃకథనం చేసి సవ్యాఖ్యానంగా సంకలనం చేసిన ‘నూరేళ్ళ తెలుగు కథ’లో ఈ నాలుగు కథలూ చేరాయి.
సహస్ర బాహువులతో జలఖడ్గాలు దూసి, ఉరుముల పెనుగర్జనలతో, మెరుపుల మిరుమిట్లతో వర్షం ఊరూవాడా ఆక్రమించుకుని జనాన్ని గృహనిర్బంధంలో ఉంచినప్పుడు ఇంకెన్ని చిత్రవిచిత్ర సన్నివేశాలు ఏర్పడగలవో తిలక్ కథ ‘ఊరి చివరి ఇల్లు’ చెబుతుంది. అలాంటి ఓ వర్షపురాత్రి ఒక ఆగంతక యువకుని రాక దుఃఖపూరితమైన ఒక యువతి జీవితంలో కొత్త ఆశా, ఉత్సాహాల జడివానగా మారి తెల్లవారేసరికి వానతోపాటే అదీ వెలసి అయ్యో అని పిస్తుంది.
వర్షం కలిగించే అలజడి సరే, అంతకన్నా ఎక్కువగా వర్షాభావం సృష్టించే కన్నీటి జలపాతాల సంగతేమిటి? తల్లావజ్‌ఝల పతంజలి శాస్త్రి గారి ‘ఆమె దనంతపురం’, ‘పిచ్చి లచ్చమ్మ’, ‘కదిరమ్మ పేరంటాలు’ కథలు ఆ విషాద పార్శా్వన్ని అనితరసాధ్యంగా అక్షరబద్ధం చేస్తాయి.
మరిన్నికొత్త అనుభవాలను మబ్బులతో మూటగట్టి మళ్ళీ వర్షరుతువు వస్తోంది. అవి తీపినే నింపాలని కోరుకుంటూ హర్షోల్లాసాలతో పునఃస్వాగతం చెబుదాం.