
మేధ మనిషికి ఒక వరం; అది ఒక్కోసారి గంద్రగోళంతో నిండడం ఒక శాపం. మేధ సవ్యంగా, స్పష్టంగా పనిచేసిప్పుడు మనిషి ఎన్నో అద్భుతాలు సృష్టించగలడు; అది అయోమయపు డొంకలా, బంకలా మారి వెర్రితలలు వేసినప్పుడు వాటిని తనే కూలదోసుకుని, తనూ పడిపోగలడు. కృత్రిమ మేధగా మనం అనువదించుకునే ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’ మనిషి మేధ సృష్టించిన మహాద్భుతాలలో ఒకటి. ఆ కృత్రిమ మేధ తన సృష్టికి మూలమైన మనిషిలోని సహజ మేధను హరించి, తనే అసలు మేధగా మారబోతోందా!? ప్రస్తుతం మానవాళి ముఖాన వేలాడే ఓ ఆసక్తికరమైన ప్రశ్న ఇది.
‘కృత్రిమ మేధ’ ఈరోజున సర్వత్రా చర్చనీయమవుతున్న సాంకేతికాద్భుతం. ఆశాభావాన్ని మించి అది ఆందోళనను రేపడం చూస్తున్నాం. ఇంకోవైపు, అది ఆవిష్కరించే ఫలితాలకు ఆశ్చర్య చకితులమూ అవుతున్నాం. సృష్టికి ప్రతిసృష్టి అనే పౌరాణిక ఊహకు అత్యధునాతన ఉదాహరణ ఇదే. ఇది కృత్రిమమైన కాలో, చెయ్యో అమర్చుకోవడం కాదు, ఏకంగా కృత్రిమ మేధనే తెచ్చి అతికించుకోవడం. మనిషి తన మేధతో చేసే పనులన్నీ కృత్రిమ మేధతో చేయిస్తున్నాడు.
సాహిత్య రంగంలోనే చూడండి... ఓ నాలుగైదు వాక్యాల కవితనిచ్చి దానిని కథగా మార్చమని అడిగితే కృత్రిమ మేధ క్షణాలలో మార్చి చూపిస్తోంది. గహనమైన ఓ బృహద్గ్రంథం పేరు మాత్రం ఇచ్చి అందులోని సారాంశాన్ని నాలుగైదు పేరాలలో చెప్పమని అడిగితే చటుక్కున చెబుతోంది. అంతే అవలీలగా, అవ్యవధిగా ఒక భాష నుంచి ఇంకో భాషకు తర్జుమా చేసి అందిస్తోంది.
ఆకాశమే హద్దుగా ఏదైనా చేయగలుగుతోంది. అదింకా పూర్తిగా నిర్దుష్టతను, నిర్దిష్టతను తెచ్చుకుని ఉండకపోవచ్చు. కానీ, తెచ్చుకునే రోజూ ఎంతో దూరంలో లేదనిపిస్తోంది. అదే జరిగి, మనిషి కృత్రిమ మేధకు పూర్తిగా దాసోహమై క్రమంగా తన సహజ మేధను కోల్పోయే పరిస్థితి వస్తుందా; కృత్రిమ మేధే సహజ మేధగా మారుతుందా? ఆసక్తి కన్నా ఎక్కువగా భయాన్ని రేపుతున్న ప్రశ్నలివి.
కృత్రిమ మేధే సహజ మేధ కన్నా నాణ్యమైనదయ్యే అవకాశమూ లేకపోలేదు. ఎందుకంటే, సహజ మేధలో ఉండే గంద్రగోళం అందులో ఉండదు. అది ఎల్లవేళలా సూటిగా, స్పష్టంగానే కాదు; సహజ మేధకు సాధ్యం కానంత సత్వరంగా పనిచేస్తుంది. సహజ మేధలా అది అలసిపోవడం,మందగించడం లాంటివి ఉండవు.
మనిషి అటువంటి కృత్రిమ మేధపై మరీ ఎక్కువగా ఆధారపడితే ఏమవుతుంది? లక్షల సంవత్సరాల మానవ అస్తిత్వంలో నిరుపయోగాలుగా మిగిలిన అపెండిక్స్, తోకఎముక లాంటి తొమ్మిది శరీర భాగాల సరసనే అతని సహజ మేధ కూడా చేరుతుందా?! ఇది మరీ విపరీత ఊహ అనుకున్నా, సహజ మేధ పదును తగ్గే ప్రమాదం మాత్రం తప్పకుండా ఉంటుంది. వివిధ సాంకేతిక సాధనాల వినియోగం దరిమిలా ఇతర శరీరభాగాల విషయంలో ఇప్పటికే మనకది అనుభవంలోకి వచ్చింది కూడా!
ఇటీవలి మరో సాంకేతికాద్భుతమైన ఇంటర్నెట్ ఆధారిత సామాజిక మాధ్యమాలనే చూడండి; సహజ మేధకు పనీ, పదునూ తగ్గుతున్న ఆనవాళ్ళు వాటిలో ఇప్పటికే కనిపిస్తున్నాయి. నేటి శాస్త్రవిజ్ఞాన ఆవిష్కరణలన్నీ యూరప్ వేదికగా మతనిర్బంధాల నుంచి సహజ మేధ బయటపడి సాంçస్కృతిక పునరుజ్జీవన రూపంలో సంపూర్ణ వికాసం చెందుతూ వచ్చిన ఫలితాలేనని మనకు తెలుసు.
మన దగ్గర ఉపనిషత్తుల కాలం అలాంటి వికాసాన్ని చూసింది. ఏదైనా ఒక అంశాన్ని అన్ని కోణాల నుంచీ కూలంకషంగా, సవిమర్శకంగా పరిశీలించడం, చర్చించడం, వ్యక్తీకరించడం అనే క్రమశిక్షణ అలా పాదుకుంటూ వచ్చింది. శ్రద్ధతోపాటు, తీరికా అందుకు అవకాశమిచ్చింది. పత్రికల వంటి ఆధునిక మాధ్యమాలలో స్థలకాల పరిమితులు ఆ క్రమశిక్షణను కొంత పలుచన చేసినా,గ్రంథముద్రణ ఆ లోటును చాలావరకూ పూరించగలిగింది.
అదే సామాజిక మాధ్యమాలకు వస్తే, భావప్రకటన అనూహ్యమైన ప్రవాహవేగాన్ని తెచ్చుకోవడంతో ఆ క్రమశిక్షణ గణనీయంగా కొడి గట్టడం చూస్తున్నాం. వాటిలో అణువు నుంచి బ్రహ్మాండం వరకూ చర్చకు రాని అంశమే ఉండదు. కాకపోతే... లోతైన అధ్యయనమూ, అవగాహన, బహుముఖ పరిశీలనలకు బదులు రెండు, మూడు వాక్యాల అలవోక వ్యాఖ్యలకూ, పాక్షిక తీర్మానాలకూ, అపరిపక్వ నిర్ధారణలకూ అవి పరిమితమవు తున్నాయి. సహజ మేధలో తప్పిన ఆ క్రమశిక్షణను కృత్రిమమేధ అందిపుచ్చుకుంటున్నందుకు సంతోషించాలా, సహజ మేధ మొద్దుబారుతున్నందుకు విచారించాలా?!
సామాజిక మాధ్యమాలు భావప్రకటనను అందరికీ అందుబాటులోకి తేవడం గొప్పే మేలే కానీ; సహజ మేధకు అది చేస్తున్న కీడు సంగతేమిటి? ఎలక్ట్రానిక్ మీడియా సహా అధునాతన మాధ్యమాలు ప్రజాస్వామికమైన చర్చనూ, అధ్యయనాన్నీ పలుచన చేస్తున్న తీరును నీల్ పోస్ట్‌మన్ అనే అమెరికన్ రచయిత ఎప్పుడో నలభై ఏళ్ల క్రితమే ఎత్తిచూపాడు.
అబ్రహాం లింకన్ కాలం నుంచీ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అభ్యర్థుల మధ్య ప్రజల ప్రత్యక్ష భాగస్వామ్యంతో గంటల తరబడి ఎంత కూలంకషంగా వాగ్వాదాలు జరిగేవో; ఎలక్ట్రానిక్ మీడియా వచ్చాక వాటి సమయం ఎలా హరించుకుపోయిందో ‘ఎమ్యూజింగ్ అవర్ సెల్వ్స్ టు డెత్’ అనే పుస్తకంలో ఆయన వివరిస్తాడు.
ఆయన ప్రభావం మరెందరి మీదో పడి ప్రచార మాధ్యమాలు సహా అత్యాధునిక సాంకేతిక విజ్ఞాన దుష్ప్రభావాల వైపు చూపు మళ్లించింది. ఆ క్రమంలోనే క్రిస్ హెడ్జెస్ అనే అమెరికా రచయిత ‘ఎంపైర్ ఆఫ్ ఇల్యూజన్’ అనే పుస్తకం వెలువరించాడు. మనం కూడా ఆ దిశగా ఆలోచించాల్సిన అవసరం తోసుకువచ్చిందా?!
Comments
Please login to add a commentAdd a comment