
విపరీతమైన వానలు, దాంతో వరదలు, విలయం. బీభత్సం ముగిసిందని అనుకొనే లోగానే నెల రోజుల్లో రెండోసారి హిమాచల్‌ప్రదేశ్‌పై ప్రకృతి పంజా విసిరింది. ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నదులు, విరిగిపడుతున్న కొండచరియలు, పేకముక్కల్లా కూలుతున్న భవనాలు, నేలవాలుతున్న భారీ వృక్షాలు, కోసుకుపోయిన రోడ్లు, వంతెనలు, శిథిలాల్లో చిక్కుకున్న ప్రాణాలతో పర్వత ప్రాంత రాష్ట్రం అతలాకుతలమైంది.
పెరుగుతున్న గంగమ్మ వరదలో ఉత్తరాఖండ్ ఉసూరుమంటోంది. ప్రమాదకర స్థాయిలో సాగుతున్న యమున మళ్ళీ ఢిల్లీ సహా పలు ప్రాంతాల్ని భయపెడుతోంది. జూన్ ద్వితీ యార్ధం నుంచి జూలై చివరి వరకు వానలు, వరదలు ఒక్క హిమాచల్‌లోనే 150 మందిని బలిగొని, రూ. 10 వేల కోట్ల పైగా నష్టం కలిగిస్తే, తాజా విలయం ఇప్పటికే 60 మందిని పొట్టబెట్టుకొంది.
హిమాలయాలు, దేశ కోస్తా ప్రాంతాలపై వాతావరణ పర్యవసానాలు గట్టి దెబ్బ కొట్టనున్నాయని ‘ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ ఛేంజ్’ (ఐపీసీసీ) 6వ నివేదిక పేర్కొంది. హిమాలయాల్లో సగటు ఉష్ణోగ్రత మిగతా దేశంతో పోలిస్తే వేగంగా పెరుగుతోంది. ఈ వర్షాకాలం అసాధారణ రీతిలో కురుస్తున్న వర్షాలు అందుకు తగ్గట్టే ఉన్నాయి.
స్వల్పవ్యవధిలో భారీ వర్షం కురిపించే మేఘపతనం, ఆకస్మిక వరదలకు వాతావరణ మార్పులు కొంత కారణమే. అయితే, మనసును కుది పేసే ఈ బీభత్సానికి మతి లేని అతి అభివృద్ధికి దిగిన మానవ తప్పిదాలే ప్రధాన హేతువు. పుడమి తల్లిని పట్టించుకోకుండా కొండల్ని తొలిచి, శిథిలావశేషాల్ని నదుల్లో పడేసి, ఇష్టారాజ్యంగా సాగిన అక్రమ గనుల తవ్వకాలు, సహజమైన నదీ ప్రవాహాల్ని నిరోధించిన నిర్మాణాలు, అశాస్త్రీయంగా చేపట్టిన భారీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్‌లు కలిసి హిమాచల్ మెడకు ఉరితాళ్ళయ్యాయి.
హిమాలయాల్లో వరదలు, విరిగిపడే కొండచరియలు కొత్త కాదు. అందులోనూ హిమాచల్‌లోని మొత్తం 12 జిల్లాల్లో కొండచరియల పతనం తరచూ తప్పదని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఎప్పుడో తేల్చింది. అంత సున్నితమైన ఈ హిమాలయ పర్వతశ్రేణుల్లో ప్రగతి పేరుతో పాలకులు చేతులారా ప్రకృతి విధ్వంసం చేశారు. ఫలితంగా కొన్నేళ్ళుగా ఏటవాలు ప్రాంతాలు మరింత అస్థిర మయ్యాయి. కేవలం 2020 నుంచి 2022 మధ్య కొండచరియల పతనాల సంఖ్య ఆరు రెట్లు పెరిగిందని డేటా. ఈ పర్వతసానువుల్లో గత పదేళ్ళలో ఇష్టారాజ్యంగా రోడ్లు విస్తరించారు.
ఏకంగా 69 నేషనల్ హైవే ప్రాజెక్ట్‌లకు ఆమోదం తెలిపారు. నాలుగు లేన్ల హైవేలు వాటిలో అయిదున్నాయి. హిమా లయాల్లో ఇప్పటికే 168 జల విద్యుత్కేంద్రాలుంటే, 2030 నాటికి 1088 కేంద్రాలు రానుండడం శోచనీయం. పర్యావరణాన్ని పట్టించుకోని ఈ అంధ ఆర్థికాభివృద్ధి మంత్రం ఇక్కడికి తెచ్చింది. పద్ధతీ పాడూ లేకుండా కొండల తవ్వకాలు, మతి లేకుండా రోడ్ల నిర్మాణం, నిర్మాణ వ్యర్థాలను ఏమి చెయ్యాలనే ఆలోచనైనా లేకపోవడంపై హిమాచల్ హైకోర్ట్ నిరుడు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
గమనిస్తే – దాదాపు ప్రతి వర్షాకాలం ఉత్తరాదిలో అస్సామ్, ఒడిశా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరా ఖండ్ లాంటి రాష్ట్రాలు వానలు, వరదలతో అతలాకుతలమవుతున్నాయి. గతంతో పోలిస్తే వరదల సంఖ్య, ఆస్తి, ప్రాణనష్టాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. వరదల నివారణకు సమర్థమైన ప్రణాళిక లోపిస్తోంది. ఈ తప్పు కూడా పాలకులదే తప్ప ప్రకృతిది కాదు. మన దేశంలో 4 కోట్ల హెక్టార్లకు పైగా ప్రాంతం, అంటే దేశ భూభాగంలో దాదాపు 12 శాతానికి వరదల ముప్పుందని లెక్క.
భూకంపాల లాంటి ప్రకృతి వైపరీత్యాలతో పోలిస్తే వరదల్ని ముందే అంచనా వేయడం, అడ్డుకోవడం చేయదగిన పనే. కానీ ప్రభుత్వాలు ఆ పనీ చేయట్లేదు. అనేక రాష్ట్రాల్లో వరద ముంపు నకు ఇష్టారాజ్యంగా అడవుల నరికివేత, నదీ పరివాహక ప్రాంతాల్లోని వృక్షచ్ఛాయల విధ్వంసం, పేరుకున్న పూడికలతో నదికి నీటిని నిల్వచేసే సామర్థ్యం తగ్గిపోవడం... ఇలా అనేక కారణాలు. దానికి తోడు నదీ తలాలు, నదీ మైదానాల ఆక్రమణలు యథేచ్ఛగా సాగుతున్నాయి. డ్యామ్‌ల వరద గేట్ల నిర్వహణలో సమన్వయ లోపాలు సరేసరి. ఈ స్వయంకృతాలన్నీ శాపాలవుతున్నాయి.
విచిత్రం ఏమిటంటే – వరద పరిస్థితుల్లో సత్వర చర్యలు పర్యవేక్షించేందుకు దేశంలో ఒకే విభాగమంటూ ఏదీ లేకపోవడం! ఆ మాటకొస్తే, వరదల నిర్వహణకు మన రాజ్యాంగంలో నిర్ణీత ఏర్పాటేదీ లేదు. వాతావరణ శాఖ వర్షసూచనలు చెబితే, వరద ముప్పు సూచనలు చెప్పే బాధ్యత కేంద్ర జల సంఘానిది. వరద ముంపునకు గురయ్యాక సహాయ, పునరావాస చర్యలు చేపట్టేందుకు కేంద్ర, రాష్ట్ర స్థాయుల్లో ప్రకృతి వైపరీత్యాల సహాయ సంస్థలున్నాయి.
బాధితుల పునరావాసం, దెబ్బతిన్న ప్రాథమిక వసతుల పునరుద్ధరణ బాధ్యత స్థానిక సంస్థలది. అందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహాయం కీలకం. ఇంకా విడ్డూరం – నీరు, సాగునీటి పారుదల, తదితర అంశాలన్నీ రాష్ట్ర జాబితాలోవే కానీ, వరదల్లో సహాయ బాధ్యతల నిర్వహణ మాత్రం కేంద్ర, రాష్ట్ర, ఉమ్మడి జాబితాలు వేటిలోనూ లేకపోవడం!
పదే పదే వరదల ముప్పు తలెత్తుతున్న వేళ ఈ కీలక అంశాలపై కేంద్ర పెద్దలు తక్షణం సమగ్రంగా దృష్టి పెట్టాలి. 1970లలో నెలకొల్పిన ‘వరదలపై జాతీయ కమిషన్’ తరహాలో వరదల సమస్యలపై ఆచరణాత్మక వ్యూహాన్ని సూచించేలా ఉన్నత స్థాయి నిపుణుల సంఘాన్ని ఏర్పాటు చేయాలి.
ఇకనైనా వరదలపై అన్ని విభాగాలనూ సమన్వయ పరిచే సమగ్ర విధానం అత్యవసరం. అదే సమయంలో సున్నితమైన పర్యావరణాన్ని గౌరవించాలి. లేకపోతే తలెత్తే దుష్పరిణామాలకు హిమాలయ బీభత్సం ప్రతీక. మరి, ఈ మాటైనా హిమాలయాల మాట చెవికెక్కించుకుంటారా?