హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో భారీ వర్షం బీభత్సం సృష్టించింది. చార్ ధామ్ హైవేతో సహా వందలాది రోడ్లపై వాహనాలను కొండచరియలు నిరోధించాయి. అనేక పెద్ద జలవిద్యుత్ డ్యామ్‌లు వరదల ముప్పు కారణంగా ప్రణాళిక లేకుండా నీటిని విడుదల చేశాయి. పర్వత ప్రాంతాల్లో ప్రాజెక్ట్‌లను ఎలా మెరుగ్గా నిర్వహించాలి, తీసుకునే నిర్ణయాల్లో ప్రజలను ఎలా భాగస్వాములను చెయ్యాలి అనే విషయాలపై ఇవి కీలకమైన పాఠాలను అందిస్తున్నాయి. పర్యావరణం, జీవితం, ఆస్తి వంటి విషయాల్లో మెరుగైన భద్రత కావాలంటే, సమర్థమైన నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. హిమాలయ అడవులను నాశనం చేస్తూనే విపత్తులను నివారించగలమా? ఇలాంటి ప్రశ్నలకు జవాబులు కూడా వెతకాల్సి ఉంటుంది.
పర్వత ప్రాంత రాష్ట్రాలైన హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ ఒకదాని తర్వాత మరొకటి జూలై నెలలో వరదలతో అతలాకుతలమయ్యాయి. ఈ వరదలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టులకు సంబంధించిన ప్రాథమిక సమస్యలను ఎత్తి చూపుతున్నాయి. ఈ వరదల్లో అత్యధికంగా దెబ్బ తిన్న రాష్ట్రం హిమాచల్‌ప్రదేశ్. జూలై మొదటి 11 రోజులలో కులు, బిలాస్‌పూర్, మండి, సిమ్లా, సోలన్‌లలో 77 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతంతో పోలిస్తే, సగటున రోజూ 250 మి.మీ. నమోదైంది. ఉత్తరాఖండ్‌లో జూలై మొదటి 10 రోజులలో సాధారణం నుండిసంచిత వర్షపాతం హిమాచల్ కంటే కొంచెం ఎక్కువగా ఉంది.
కుండపోత వర్షం భారీ నష్టాన్ని మిగిల్చింది. జూలై 14 వరకు హిమాచల్‌ప్రదేశ్‌లో 108 మరణాలు నమోదు కాగా, జూలై 15 వరకు 26 మంది చనిపోయినట్లు ఉత్తరాఖండ్ నివేదించింది. ఉత్తరాఖండ్‌లో ప్రతిష్ఠాత్మకమైన, అన్ని వాతావరణాల్లో పనిచేసే చార్ ధామ్ హైవేతో సహా వందలాది రోడ్లపై వాహనాలను దాదాపు ప్రతిరోజూ కొండ చరియలు నిరోధించాయి. దీనివల్ల నివాసితులకు, పర్యాటకులకు కష్టాలు, ఆర్థిక నష్టాలు ఎదురయ్యాయి. గిర్థీ నదిపై వంతెన కూలి పోవడంతో చమోలి జిల్లాలో ఇండో–టిబెట్ సరిహద్దు వరకు రక్షణ బలగాల రాకపోకలు దెబ్బతిన్నాయి.
విద్యుత్, నీటి సరఫరాలకు అంతరాయం ఏర్పడి రెండు రాష్ట్రాల్లోనూ పాఠశాలలు చాలా రోజులు మూతపడ్డాయి. వంతెనలు మునిగిపోయాయి లేదా కూలిపోయాయి. కొండచరియలు విరిగిపడటమే కాకుండా హిమపాతం పట్టణాలను ముంచెత్తింది. హైవేలు విచ్ఛిన్నమైపోయాయి. అనేక భవనాలు, వాహ నాలు కొట్టుకుపోయాయి. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్‌లో వినాశనం మరింత స్పష్టంగా కనిపించింది.
ఈ విపత్తు సమయంలో, బియాస్ అత్యంత విధ్వంసకరంగా మారింది. సహజ కారణాల వల్ల మాత్రమే కాదు... బియాస్ నది పరివాహక ప్రదేశంలోని అనేక పెద్ద జలవిద్యుత్ డ్యామ్‌లు, తమ ప్రాంతాలలో వరదల ముప్పు కారణంగా అకస్మాత్తుగా ప్రణాళిక లేకుండా నీటిని విడుదల చేశాయి. ఇప్పటికే పొంగి పరవళ్లు తొక్కు తున్న నదిలోకి ఈ అదనపు ఉప్పెనలు వెల్లువెత్తి దిగువ ప్రాంతాల్లో నష్టాలను అధికం చేశాయి.
ఉత్తరాఖండ్‌లోనూ ఇలాంటి సమస్యలే కనిపించాయి. జూలై 11న, ఉత్తరాఖండ్ జల్ విద్యుత్ నిగమ్ లిమిటెడ్ తాను నిర్వహిస్తున్న 19 ప్లాంట్‌లలో పదిహేడింటిని మూసివేసింది. నదీ పర్యావరణ వేత్తలు, యాక్టివిస్టులు పదేపదే చెబుతూ వచ్చిన ట్లుగా... జలశక్తి లేదా పర్యావరణం, అడవులు, వాతావరణ మార్పు లకు సంబంధించిన కేంద్ర మంత్రిత్వ శాఖలు, శాస్త్రీయంగా పర్యావ రణ ప్రవాహాలను ఏర్పాటు చేసి, డ్యామ్ ఆపరేటర్లు వాటిని అనుసరించేలా చూసినట్లయితే, ఆనకట్ట సంబంధిత సమస్యలను గణనీయంగా తగ్గించవచ్చు.
మౌలిక సదుపాయాల సైట్ల చుట్టూ కూడా కనీవినీ ఎరుగని విధ్వంసం సంభవించింది. నిటారుగా ఉన్న లోయలతో కూడిన చిన్న పర్వత ప్రవాహాలు, పరిమితమైన వరదను భరించే సామర్థ్యాన్ని మాత్రమే కలిగి ఉంటాయి. ప్రాజెక్టుల నుండి నిర్మాణ శిథిలాలు అటువంటి ప్రవాహాలలోకి డంప్ అవుతున్నాయి. వరదను భరించే వాటి సామర్థ్యాన్ని అవి మరింతగా తగ్గిస్తున్నాయి.
స్థానిక నివాసితులు రికార్డ్ చేసిన ఒక వీడియో క్లిప్‌ని చూస్తే... క్రూరంగా విరుచుకుపడే, బురదతో కూడిన వరద ప్రవాహం థునాగ్ పట్టణంలోని మార్కెట్ లేన్ లోకి దూసుకెళ్లి విధ్వంసం సృష్టించింది. మాజీ ముఖ్యమంత్రి జై రామ్ ఠాకూర్ స్వస్థలమైన తాండి గ్రామంలోని ఒక రహదారి నిర్మాణ ప్రాజెక్ట్ శిథిలాలను, అక్రమంగా నరికివేసిన చెట్ల మొదళ్లను నదీ ప్రవాహ మార్గంలో పడేశారు. ఇటువంటి ప్రాజెక్టులను తరచుగా పేలవమైన ప్రణాళికలతో, నిర్మాణ గడువులను వేగంగా చేరుకునే లక్ష్యంతో నాసిరకంగా నిర్మిస్తారు.
నాలుగు లేన్లతో ఉన్న మండి–మనాలి జాతీయ రహదారిలో 100 మీటర్లకు పైగా అతి పెద్ద నిర్మాణ ఉల్లంఘనలు జరిగినట్లు ఒక డ్రోన్ వీడియో చూపించింది. వీటి కారణంగానే మనాలిలో సుమారు 7,000 వాహనాలు నిలిచిపోయాయి. కొన్ని చోట్ల, హైవేను వాస్తవానికి నది ఒడ్డున నిర్మించారు. ఇక్కడ రహదారిని మెత్తటి నిక్షేపాలపై నిర్మించి ఉండవచ్చు. దీంతో బియాస్ ప్రాంతంలోని నేల కోత మరిన్ని ఇబ్బందులకు కారణమైంది.
ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్ హైవేపై 2013 లోనూ ఇలాంటి వైఫల్యాలే చోటుచేసుకున్నాయి. అయితే హైవే డెవల పర్లు, ఇంజినీర్లు ఆనాడు జరిగిన పెను విపత్తు నుండి ఏ పాఠాలూ నేర్చుకోలేదు. ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్ హైవేకి చెందిన ఒక భాగం కూలిపోవడం కూడా, అటువంటి నిర్మాణంలో కొండచరియలు విరిగి పడే అవకాశం ఉందని రుజువు చేసింది.
నదీ తీరాలకు కనీసం 100 మీటర్ల దూరంలో భవనాలు ఉండాలనే హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు నిబంధనను కూడా ఉల్లంఘించడంతో మనాలిలోని మూడంతస్తుల హోటల్ బియాస్ నదిలోకి కూలి పోయింది. నిజానికి, మనాలి నది ఒడ్డున హోటళ్లు, గృహ సముదా యాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తూనే ఉన్నాయి. హరిద్వార్, రిషికేశ్, ఇతర ఉత్తరాఖండ్ నదీతీర పట్టణాలలోనూ ఇదే విధమైన ఉల్లంఘ నలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
పెరుగుతున్న వాతావరణ కార్బన్ డై ఆక్సైడ్ స్థాయులు, భూతాపం, అధిక సముద్ర ఉష్ణోగ్రతలు ఎక్కువ తేమతో కూడిన మేఘాలను ఉత్పత్తి చేస్తాయి. అయితే స్థానిక పరిస్థితులు అత్యధిక వర్షపాత సంఘటనలను నిర్ణయిస్తాయి. భారతదేశంలో, ప్రపంచ వ్యాప్తంగా కూడా వర్షపాత తీవ్రత, తరచుదనం పెరుగుతున్నట్లు కనిపిస్తున్నాయి. ఇవి అధిక జనాభా ఉన్న లేదా ఆర్థికంగా అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో సంభవించినప్పుడు, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం భారీగా ఉంటుంది.
పర్యావరణం, జీవితం, ఆస్తి వంటి విషయాల్లో మెరుగైన భద్రత కావాలంటే, సమర్థవంతమైన నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. నిర్మాణ సమయంలోనూ ఆ తర్వాత కూడా నిజా యితీగా, క్రమబద్ధమైన పర్యవేక్షణను చేపట్టాలి. ఇవన్నీ సాధ్యపడా లంటే మంచి పాలన అవసరం ఉంటుంది. అధిక వర్షపాతాన్ని, వరద తీవ్రతలను తట్టుకునే నిర్మాణ భద్రతాంశాలు మెరుగ్గా ఉండి, మంచి ఇంజినీరింగ్ పద్ధతులకు కట్టుబడి ఉంటే మరణాల సంఖ్య, విధ్వంసం తగ్గుతాయి.
ప్రేరేపిత విపత్తులు సంభవించినప్పుడు ప్రజల జీవితాలు ప్రమాదంలో పడతాయి కాబట్టి, మౌలిక ప్రాజెక్టుల ప్రణాళిక,మంజూరు, పర్యవేక్షణలో ప్రజలు సమర్థమైన స్వరాన్ని కలిగి ఉండాలి. నిజాయితీగా సిద్ధం చేసిన పర్యావరణ ప్రభావ అంచనాలు, పబ్లిక్ హియరింగ్‌లు వంటివి ప్రకృతి, జీవితాలు, ఆస్తికి చెందిన భద్రతలను పెంచడంలో సహాయపడతాయి.
నియంత్రణ వ్యవస్థలు, పర్యావరణ ప్రభావిత అంచనాలకు సంబంధించిన ఫ్రేమ్‌వర్క్ క్రమానుగతంగా బలహీనపడటం అనేది ప్రజలకు, ప్రకృతికి వ్యతిరేక మైనది. సమర్థవంతమైన ఆర్థిక వృద్ధి పేరుతో పాలనా యంత్రాంగం ఎన్ని వాదనలు చేసినప్పటికీ వాటన్నింటినీ ఖండించాలి.
చివరగా, మరిన్ని పెద్ద ప్రశ్నలు వేసుకుందాం. సున్నితమైన హిమాలయ ప్రాంతానికి ఉన్న మోసే సామర్థ్యం ఎంత? స్థిరమైన ఆర్థిక వృద్ధికి పరిమితులు ఏమిటి? మనం హిమాలయ అడవులను ఇంకా నాశనం చేస్తూనే విపత్తులను నివారించగలమా? పర్యావరణ సున్నితమైన హిమాలయ నదీ లోయల గుండా తమ వాహనాలను నడపడానికి మరింత మంది పర్యాటకులను ప్రోత్సహిస్తూనే ఉందామా? ఇప్పుడు వీటన్నింటికీ సమాధానాలు వెతకాల్సిన బాధ్యత ప్రజలపై ఉంది.
రవి చోప్రా
వ్యాసకర్త ప్రముఖ పర్యావరణవేత్త
(‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో)
Comments
Please login to add a commentAdd a comment