ఉత్తరాఖండ్‌లో కుంభవృష్టి
హిమాచల్‌ప్రదేశ్‌లోనూ భారీ వర్షాలు
దేశ రాజధానిని ముంచేసిన వాన
డెహ్రాడూన్/సిమ్లా/న్యూఢిల్లీ/జైపూర్: కేరళ కొండల్లో బురద, బండరాళ్లు సృష్టించిన విలయ విషాద ఘటన మరువకముందే ఉత్తరాదిపై వరుణుడు తన ప్రకోపం చూపించాడు. ఉత్తరాఖండ్ మొదలు రాజస్థాన్‌దాకా ఉత్తరభారత రాష్ట్రాల్లో ఎడతెగని వానలు పడ్డాయి. దీంతో ఏడు రాష్ట్రాల్లో కలిపి మొత్తంగా 36 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఉత్తరాఖండ్‌లో 12 మంది, హిమాచల్ ప్రదేశ్‌లో ఐదుగురు, ఢిల్లీలో ఆరుగురు, ఉత్తరప్రదేశ్‌లో ఇద్దరు, హరియాణాలో ముగ్గురు, రాజస్థాన్‌లో ముగ్గురు, బిహార్‌లో ఐదుగురు చనిపోయారు. చాలా మంది జాడ గల్లంతైంది. నదులు ఉప్పొంగి ప్రవహిస్తూ సమీప జనావాసాలను తమలో కలిపేసుకున్నాయి. కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో కొండప్రాంతాల్లోని ఇళ్లు నేలమట్టమయ్యాయి. పలుచోట్ల రోడ్లు తెగిపోయాయి. దీంతో రాకపోకలు స్తంభించాయి. ఎన్‌డీఆర్‌ఎఫ్, రాష్ట్ర విపత్తు స్పందన దళాలు, పోలీసులు, స్థానికులు ముమ్మర సహాయక చర్యల్లో మునిగిపోయారు.
ఉత్తరాఖండ్‌లో ఎక్కువ మరణాలు
ఉత్తరాఖండ్‌లో కుంభవృష్టి కారణంగా 12 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. నదులు ఉప్పొంగి ప్రవహిస్తూ సమీప ఇళ్లను నేలమట్టంచేశాయి. హరిద్వార్, తెహ్రీ, డెహ్రాడూన్, ఛమోలీ జిల్లాలో వర్షపాత ప్రభావం ఎక్కువగా ఉంది. హరిద్వార్‌లోని రోషనాబాద్‌లో 210 మిల్లీమీటర్లు, డెహ్రాడూన్‌లో 172 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
తెహ్రీ జిల్లా జఖన్‌యాలీ గ్రామంలో రోడ్డ పక్కన రెస్టారెంట్‌పై కొండచరియలు పడటంతో ఒకే కుటుంబంలో ముగ్గురు మట్టిపెళ్లల కింద సజీవసమాధి అయ్యారు. గౌరీకుండ్–కేదార్‌నాథ్ కొండమార్గంలో పాతిక మీటర్ల దారి వర్షాలకు కొట్టుకుపోవడంతో భీమ్‌బలీ చౌక్ వద్ద చిక్కుకుపోయిన 1,525 మందిలో 425 మందిని సురక్షితంగా తీసుకొచ్చామని సీఎం చెప్పారు. 1,100 మందిని సోనప్రయాగ్‌కు సురక్షితంగా తీసుకొచ్చామని విపత్తు కార్యదర్శి వినోద్ సుమన్ చెప్పారు. మిగతా వారిని హెలీకాప్టర్లలో తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
హిమాచల్‌లో 50 మంది జాడ గల్లంతు
హిమాచల్ ప్రదేశ్‌నూ వర్షాలు ముంచెత్తాయి. వర్ష సంబంధ ఘటనల్లో ఐదుగురు మరణించారు. వేర్వేరు జిల్లాల్లో మొత్తంగా 50 మంది జాడ గల్లంతైంది. పలు వంతెనలు, రోడ్లు, ఇళ్లు వరదనీటి ఉధృతికి కొట్టుకుపోయాయి. మండీ, రాంపూర్, సిమ్లా జిల్లాల్లో వర్షప్రభావం ఎక్కువగా ఉంది. మనాలీ–చండీగఢ్ జాతీయ రహదారిపై చాలాచోట్ల కొండచరియలు పడటంతో రాకపోకలు స్తంభించాయి. గల్లంతైన వారి జాడ కోసం ఇండో–టిబెటన్ బోర్డర్ పోలీసులు డ్రోన్ల సాయంతో గాలిస్తున్నారు. కూలూలోని మలానా డ్యామ్ పై నుంచి నీరు కిందకు ప్రవహిస్తోంది. దీంతో భారీఎత్తున నీరు దిగువ ప్రాంతాలను ముంచేసింది. దీంతో ఎగువ ప్రాంతాలకు తక్షణం వెళ్లిపోవాలని స్థానికులకు అధికారులు హెచ్చరికలు పంపారు.
ఢిల్లీలో 108 మిల్లీమీటర్ల వర్షపాతం
గురువారం ఢిల్లీలో వర్ష సంబంధ ఘటనల్లో ఆరుగురు చనిపోయారు. 24 గంటల వ్యవధిలో ఢిల్లీలో 108 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. గత 14 ఏళ్లలో ఢిల్లీలో జూలై నెలలో ఒక్కరోజులో ఇంతటి వర్షం పడటం ఇదే తొలిసారి. ముఖ్యంగా మయూర్‌విహార్ వద్ద 147 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డయింది.
Comments
Please login to add a commentAdd a comment