రాష్ట్రానికి నామమాత్రంగా వరద సాయం నిధులు విడుదల చేసిన కేంద్రం
బీజేపీపాలిత రాష్ట్రాలకు భారీ సాయం.. విపక్షాలపాలిత రాష్ట్రాలకు రిక్తహస్తం
మొత్తంగా రూ. 5,858.6 కోట్ల ఎన్డీఆర్‌ఎఫ్ నిధులు విడుదల చేసిన కేంద్ర హోంశాఖ
సాక్షి, హైదరాబాద్/సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో ఇటీవలి భారీ వర్షాలు, వరదల వల్ల రూ. 10,320.72 కోట్ల భారీ నష్టం జరగ్గా కేంద్రం మాత్రం జాతీయ విపత్తుల సహాయ నిధి (ఎన్డీఆర్‌ఎఫ్) నుంచి కేవలం రూ. 416.8 కోట్ల అత్తెసరు నిధులనే విడుదల చేసింది. కేంద్రం కేటాయించిన నిధులు ఏమాత్రం సరిపోవని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. రాష్ట్ర చరిత్రలో ఈ స్థాయిలో భీకర వరదలు ఎన్నడూ రాలేదని, తగిన రీతిలో నిధులు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరగా కేంద్రం నామమాత్రంగా నిధుల కేటాయింపులు జరిపిందని విమర్శిస్తున్నాయి.
ఇటీవల వరదల బారిన పడిన 14 రాష్ట్రాలకు సంబంధించిన రాష్ట్ర విపత్తుల సహాయ నిధి (ఎస్డీఆర్‌ఎఫ్)లో కేంద్రం వాటా కింద మొత్తం రూ. 5,858.6 కోట్లను ఎన్డీఆర్‌ఎఫ్ నుంచి కేంద్ర హోంశాఖ మంగళవారం విడుదల చేసింది. బీజేపీ, ఎన్డీయేపాలిత రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఏపీ, అస్సాం, బిహార్, గుజరాత్‌కు అధిక నిధులు అందించింది. విపక్షాల పాలనలో ఉన్న తెలంగాణ, కేరళ, హిమాచల్ ప్రదేశ్ తదితర రాష్ట్రాలకు కేంద్రం మొండిచేయి చూపిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment