‘వసంతం’ అన్న మాటే ఎంత మృదువుగా చెవిని తాకుతుంది! ఆ మాటలో ఒక్క పరుషాక్షరంకానీ, ద్విత్వాక్షరం కానీ, సంయుక్తాక్షరం కానీ లేవు. ఎందుకుంటాయి? వసంతమంటే, ప్రకృతి మోహపరవశయై రంగురంగుల పూలతో సిగను అలంకరించుకుని నూతన సృష్టికి సంసిద్ధమయ్యే కాలం కదా! స్త్రీపురుషుల ఎదలో తీపి ఊహలు రేపి లలితలలితం చేసే మధుమాసం కదా! వేదాలలో సామంగా, ఛందస్సులలో గాయత్రిగా, మాసాలలో మార్గశీర్షంగా తనను చెప్పుకున్న కృష్ణ పరమాత్మ; ఆరు ఋతువులలోనూ సర్వశ్రేష్ఠం కనుకనే కుసుమాకరమైన వసంతమూ తానేనన్నాడు.
సమృద్ధికి సంకేతమైన ఆమని, ఋతుపతి, కామవల్లభము, పికబాంధవము, పూలకారు అనిపించుకునే వసంతఋతువుకు రారాజు మన్మథుడైతే; అతని చెలికాడూ, సేనానీ వసంతుడట! అరవిందం, అశోకం, మామిళ్ళు, కొత్త మల్లెలు, నీలోత్పలాలనే అయిదూ మన్మథుని బాణాలట! అవి ప్రేయసీప్రియుల ఎడదను తాకి వలపు పులకలతో ఠారెత్తిస్తాయట!
ఆదికవి నుంచి ఆధునికుని వరకూ వసంత రుతుగానం చేయని కవికోకిల ఎవరుంటారు? సీతావియోగ దుఃఖంతో అడవుల వెంబడి పడిపోతున్న రాముణ్ణి వసంతశోభ ఆకర్షించడమే కాదు, మరింతగా దుఃఖవివశుణ్ణి చేసినట్టు వాల్మీకి వర్ణిస్తాడు. పంపాతీరానికి చేరేసరికి ఆ సరస్సు పద్మాలు, ఉత్పలాలు, చేపలతో కనువిందు చేసింది. అందులోని నీళ్ళు వైడూర్యంలా స్వచ్ఛంగా మెరిసిపోతున్నాయి. చుట్టుపక్కల అడవి అంతటా ఎత్తైన చెట్లు, పర్వతాలు పచ్చదనంతో ముచ్చట గొలుపుతున్నాయి.
పూర్తిగా పుష్పించి ఉన్న చెట్లను లతలు గాఢాలింగనం చేసుకుని ఉన్నాయి. రక రకాల చెట్ల మధ్యలో నీలి, పసుపురంగు గడ్డిభూములు రంగురంగుల పూలదుప్పటి కప్పుకున్నట్టున్నాయి. ఆహ్లాదకరమైన పిల్లగాలితో ఎల్లెడలా పూలు, పండ్ల పరిమళాన్ని గుప్పిస్తూ వసంతం ఎంతో కొత్తగానూ, స్వాతిశయంతోనూ భాసించింది. మేఘాల్లోంచి పడే వర్షంలా అదేపనిగా పూల వాన కురుస్తోంది. ఆదికవిది ఎంత సుసూక్ష్మ పరిశీలనంటే, కొన్ని పూలు అప్పటికే రాలిపోగా, కొన్ని రాలి పోతూపోతూ ఉన్నాయట.
ప్రతిచోటా గాలి పూలతో పరాచికాలు ఆడుతూనే ఉందట. కాళి దాసు ఋతుసంహార కావ్యాన్ని గ్రీష్మంతో ప్రారంభించి వసంతంతో ముగిస్తాడు. అప్పుడు చెట్లు పూల తోనూ, నీళ్ళు పద్మాలతోనూ, స్త్రీలు ప్రియసమాగమ కాంక్షతోనూ, గాలి పూలగంధంతోనూ, సాయంత్రాలు సుఖం గొలిపేలానూ, పగళ్ళు పరమరమ్యంగానూ ఉండి సమస్తమూ సుమనో హరంగా ఉందంటాడు. మగకోకిల బాగా చిగిర్చిన మామిడి చిగుళ్ళు మెక్కి మదించి తనకు ప్రియమైన ఆడకోకిలను ముద్దాడుతున్నట్టూ; తుమ్మెద కమలాల్లోని పూదేనె గ్రోలుతూ ఝంకారం చేస్తూ ఆడుతుమ్మెదను ఆకర్షించే నర్మవ్యాపారాలు చేస్తున్నట్టూ వర్ణిస్తాడు.
ప్రతిపద్య చమత్కృతికి పెట్టిన పేరైన చేమకూర వెంకటకవి తన ‘విజయవిలాస’ కావ్యంలో వసంతుడికీ, చంద్రుడికీ మధ్య స్పర్థను కల్పించి తన ఊహావైభవాన్ని అంచులు దాటిస్తాడు. వసంతుడు వస్తూనే మోడువారిన చెట్లను చిగురింపజేసి రసవంతమైన ఫలపుష్పాలతో నలువైపులా సుగంధాలను వ్యాపింపజేసినా, అవి వట్టి చెట్లే కదానని చెప్పి చంద్రుడు మెచ్చలేదట. ప్రసన్న, సుకుమారమైన తన వెన్నెలజల్లుతో ఏకంగా రాళ్ళనే కరిగింపజేశాడట.
చేమకూరకు మరింత చవిని జోడించే మరో పద్యం మన్మథుడి జైత్రయాత్రను చెబుతుంది. రాజు ఎక్కడికైనా వెడుతున్నప్పుడు సూర్యచంద్రుల బొమ్మలున్న పొడవాటి కర్రలను పట్టుకుని పరిచారకులు ముందునడవడం పరి పాటి కాగా; మన్మథుడు జగజ్జేత కనుక తూర్పు, పడమటి కొండలపై ప్రకాశించే సూర్యచంద్రులనే నేరుగా రాజలాంఛనం చేసుకుని దిగ్విజయానికి బయలుదేరాడట. వసంతాగమనాన్ని ఎలా పోల్చుకోవాలో విశ్వనాథవారు తన ‘ఋతుసంహార’ కృతిలో అందంగా ఏకరవుపెడతారు.
కౌగి లింత వేళ ఉద్రిక్త అయిన ప్రియురాలి ఎద చెమర్చినా, చన్నీటిస్నాన సౌఖ్యం వల్ల ముక్కుపుటాలలో చెమరింపు పుట్టినా, పేరంటానికి వెళ్ళే పిన్నబాలిక వాలుజడలో మల్లెమొగ్గ కనబడినా, వంగిన వేపకొమ్మకు కావి చిగురుపట్టి పక్క ఈనెకు పూతపట్టినా, హఠాత్తుగా ఓ రోజున పొద్దెక్కినవేళ దూరపు కోన నుంచి కోకిలస్వరం వినిపించినా వసంతం అడుగుపెట్టిందన్న మధురోహ కలుగు తుందంటారు. ఆపైన, కొత్తగా జతకట్టిన కోకిలమ్మ పెంటికై నూత్నయవ్వనోద్వేగంతో వేగిపోతూ వసంతవనాంత వీథిలో ముక్కున చిదమని మామిడి చిగురు లేదంటారు.
శేషేంద్ర ఏం తక్కువ! ‘ఎక్కడ చూసినా స్వచ్ఛకాంతులీనుతూ సంతోషంలో ముంచే జాజులు, మల్లెలు, తీగసంపెంగలు, కొదమ గులాబులతో విశ్వదిశాంతరాళాన్ని సుమసముద్రం చేస్తున్నది– ఇదేనా మధుమాసమంటే’ అని తన ‘ఋతుఘోష’లో ఆశ్చర్య, పారవశ్యాలను అక్షరీకస్తారు. ‘ఈ ఆకాశమూ, ఈ మహా సము ద్రాలూ, ఈ భూమండలమూ, ఈ తరుప్రపంచమూ ఈ విశ్వమంత అంతర్గత శోభతో ఉర్రూత లూగిస్తున్నాయి; ఊహావిహంగం ఉత్కంఠతో ఎగిరిపోవాలనుకుంటోం’దంటారు.
విశ్వమందిరంలో కన్నులపండువగా కొలువైన పురుషునికీ; పూవులతో, ఎర్రని చిగుళ్లతో సింగారించుకుని సొంపుగులికే ప్రకృతికీ మధ్య రాసక్రీడగా వసంతారంభ కాలాన్ని రూపుకడతారు. ఇంకోవైపు, జీవజాల మనే ఒడ్లను ఒరుసుకుంటూ ప్రవహించే ఈ వాసంతరస స్రవంతి వేళ, ప్రియురాలితో కలసి సరస్తీరాలకు, పూపొదల చాటుకు, తోటలకు వెళ్ళే అవకాశం లేకుండా మధ్యాహ్నకాలాల్లో చేలల్లో మగ్గి పోయే శ్రామికజనాలపై జాలితో కరిగినీరవుతారు.
వసంతం మామూలుగా కాదు, ఉత్సవంలా వచ్చి ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. జీవుల మనుగడను ఆహ్లాదపు ఊయెల ఎక్కించి ఊపి విడిచిపెడుతుంది. వసంతానుభవపు మత్తుకు, గమ్మత్తుకు చిత్తు కాని జీవి ప్రపంచంలోనే ఉండడు. మన్మథుడా మజాకానా! ఆయన జగత్తుకే రారాజు కదా!!
మల్లెల వేళ... వెన్నెల మాసం
Published Mon, Mar 11 2024 5:07 AM | Last Updated on Mon, Mar 11 2024 5:07 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment