పంట కోత, నూర్పిడే కీలకం | Harvesting , threshing crucial | Sakshi
Sakshi News home page

పంట కోత, నూర్పిడే కీలకం

Published Fri, Sep 2 2016 8:37 PM | Last Updated on Mon, Sep 4 2017 12:01 PM

పంట కోత, నూర్పిడే కీలకం

పంట కోత, నూర్పిడే కీలకం

  • జాగ్రత్తలు తప్పనిసరి
  • అధిక తేమ, వర్షాల సమయంలో కోతలొద్దు
  • గజ్వేల్‌ ఏడీఏ శ్రావణ్‌కుమార్‌ సలహాలు, సూచనలు

  • గజ్వేల్‌ :మరో నెల రోజుల తర్వాత పంటలు కోతకు వచ్చే అవకాశముంది. ఇలాంటి తరుణంలో రైతులు జాగ్రత్తలు పాటించాలని గజ్వేల్‌ ఏడీఏ శ్రావణ్‌కుమార్‌(సెల్‌ : 7288894469)సూచిస్తున్నారు. కోత, నూర్పిడికి సంబంధించి ఆయన అందించిన సలహాలు, సూచనలివి...
    - వివిధ పంటల్లో పక్వ దశను గమనించి ఆలస్యం చేయకుండా సకాలంలో కోసుకోవాలి.
    - విత్తన పంటల్లో యంత్రాల ద్వారా పంటకోత, నూర్పిడి చేసినట్లయితే... ముందుగా కోసిన పంటల మిగిలిపోయిన విత్తనాలు లేకుండా శుభ్రపర్చుకోవాలి. దీని ద్వారా కల్తీని నివారించుకోవచ్చు.
    - ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో అంటే... అధిక తేమ, వర్షపాతం ఉన్నప్పుడు పంటలను కోయవద్దు.
    - నూర్పిడి తర్వాత గింజలు, విత్తనాన్ని శుభ్రపర్చుకునేటప్పుడు... వ్యర్థ పదార్థాలను పూర్తిగా తొలగించాలి. ఆరబెట్టేటప్పుడు నేరుగా తీవ్రమైన ఎండల్లో ఆరబెట్టకూడదు.
    - తీవ్రమైన ఉష్ణోగత్రల వల్ల గింజ విత్తన నాణ్యత దెబ్బతింటుంది. మొలకెత్తే శక్తి కూడా తగ్గిపోతుంది. ఆరబెట్టిన తర్వాత ధాన్యపు పంటల్లో అయితే 12-14శాతం, పప్పు దినుసుల్లో 8-10శాతం, నూనె గింజల పంటలలో 7-9శాతం గరిష్టంగా తేమ ఉండేట్లు చూసుకోవాలి. ఇంతకన్నా తేమశాతం ఎక్కువగా ఉంటే, నిల్వలో నాణ్యత దెబ్బతింటుంది.
    - నిల్వలో సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. నిల్వకు ఎళ్లప్పుడు గాలి, తేమ చొరబడని సంచుల్ని లేదా నిల్వ పాత్రల్ని మాత్రమే ఎంచుకోవాలి. పొడి, చల్లని వాతావరణంలో నిల్వ ఉంటే గింజ విత్తన నాణ్యత బాగా ఉంటుంది.
    - గిడ్డంగుల్లో ధాన్యాన్ని, విత్తనాలను నిల్వ చేసినప్పుడు పరిశుభ్రమైన కొత్త సంచులనే వాడాలి.
    - నిల్వ చేసే గదులు, గోదాములు శుభ్రం చేసుకుని... పగుళ్లు లేకుండా చూసుకుని సున్నం వేసుకోవాలి. ఎలుక కన్నాలు ఉంటే పూడ్చి వేయాలి.
    - పాత సంచులను వాడేటప్పుడు వాటిని డెల్టా మెత్రిన్‌ 1.5 మి,లీ లేదా 3.5మి.లీ డెసిస్‌ లేదా హిమామెక్టిన్‌, బెంజోయేట్‌ 2గ్రాములు లీటరు నీటికి కలిపి ద్రావణంలో ముంచి ఆరబెట్టి వాడుకోవాలి.
    - మంచి నాణ్యత కలిగిన పాలిథిన్‌ లైనింగ్‌ ఉన్న జూట్‌ సంచులు, సూపర్‌గ్రేన్‌ బ్యాగులు, పురుగు మందుల లేపనం ఉన్న బ్యాగులు, హెచ్‌డీపీఈ, ప్లాస్టిక్‌ సంచులు, మ్యాజిక్‌ బ్యాగులు విత్తన నిల్వకు వాడటం మంచిది.
    - బస్తాలను బ్లాక్‌ పద్దతిలో అనగా ఒకటి పొడవుగా, రెండోది అడ్డంగా ఉండేట్లు అమర్చుకోవాలి. బస్తాలను నేలకు, గోడలకు ఆనించకుండా ఎత్తైన చెక్క బల్లపై పెట్టుకోవాలి.
    - సోయా చిక్కుడు లాంటి విత్తన పంటల్లో విత్తనపొర పలుచగా ఉంటే యంత్రాల ద్వారా కోత, నూర్పిడి చేయరాదు. అలా చేస్తే మొలకశాతం దెబ్బతింటుంది. ఒకవేళ తప్పనిసరిగా చేయాల్సి వస్తే విత్తనానికి రాపిడి జరగకుండా యంత్రాల్లో సరైన మార్పులు చేసి ఉపయోగించుకోవాలి.
    - కొత్త ధాన్యాన్ని, పాత ధాన్యంతో కలపరాదు. కొత్త ధాన్యం నింపేముందు, గోడల పైకప్పుకు, గోనే సంచులపైన మలాథియాన్‌ 10మి.లీ లేదా డైక్లోర్వాస్‌ 7మి.లీ లేదా డెల్టామెత్రిన్‌ 1.5మి.లీలు లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement