పంట కోత, నూర్పిడే కీలకం
జాగ్రత్తలు తప్పనిసరి
అధిక తేమ, వర్షాల సమయంలో కోతలొద్దు
గజ్వేల్ ఏడీఏ శ్రావణ్‌కుమార్ సలహాలు, సూచనలు
గజ్వేల్ :మరో నెల రోజుల తర్వాత పంటలు కోతకు వచ్చే అవకాశముంది. ఇలాంటి తరుణంలో రైతులు జాగ్రత్తలు పాటించాలని గజ్వేల్ ఏడీఏ శ్రావణ్‌కుమార్(సెల్ : 7288894469)సూచిస్తున్నారు. కోత, నూర్పిడికి సంబంధించి ఆయన అందించిన సలహాలు, సూచనలివి...
- వివిధ పంటల్లో పక్వ దశను గమనించి ఆలస్యం చేయకుండా సకాలంలో కోసుకోవాలి.
- విత్తన పంటల్లో యంత్రాల ద్వారా పంటకోత, నూర్పిడి చేసినట్లయితే... ముందుగా కోసిన పంటల మిగిలిపోయిన విత్తనాలు లేకుండా శుభ్రపర్చుకోవాలి. దీని ద్వారా కల్తీని నివారించుకోవచ్చు.
- ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో అంటే... అధిక తేమ, వర్షపాతం ఉన్నప్పుడు పంటలను కోయవద్దు.
- నూర్పిడి తర్వాత గింజలు, విత్తనాన్ని శుభ్రపర్చుకునేటప్పుడు... వ్యర్థ పదార్థాలను పూర్తిగా తొలగించాలి. ఆరబెట్టేటప్పుడు నేరుగా తీవ్రమైన ఎండల్లో ఆరబెట్టకూడదు.
- తీవ్రమైన ఉష్ణోగత్రల వల్ల గింజ విత్తన నాణ్యత దెబ్బతింటుంది. మొలకెత్తే శక్తి కూడా తగ్గిపోతుంది. ఆరబెట్టిన తర్వాత ధాన్యపు పంటల్లో అయితే 12-14శాతం, పప్పు దినుసుల్లో 8-10శాతం, నూనె గింజల పంటలలో 7-9శాతం గరిష్టంగా తేమ ఉండేట్లు చూసుకోవాలి. ఇంతకన్నా తేమశాతం ఎక్కువగా ఉంటే, నిల్వలో నాణ్యత దెబ్బతింటుంది.
- నిల్వలో సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. నిల్వకు ఎళ్లప్పుడు గాలి, తేమ చొరబడని సంచుల్ని లేదా నిల్వ పాత్రల్ని మాత్రమే ఎంచుకోవాలి. పొడి, చల్లని వాతావరణంలో నిల్వ ఉంటే గింజ విత్తన నాణ్యత బాగా ఉంటుంది.
- గిడ్డంగుల్లో ధాన్యాన్ని, విత్తనాలను నిల్వ చేసినప్పుడు పరిశుభ్రమైన కొత్త సంచులనే వాడాలి.
- నిల్వ చేసే గదులు, గోదాములు శుభ్రం చేసుకుని... పగుళ్లు లేకుండా చూసుకుని సున్నం వేసుకోవాలి. ఎలుక కన్నాలు ఉంటే పూడ్చి వేయాలి.
- పాత సంచులను వాడేటప్పుడు వాటిని డెల్టా మెత్రిన్ 1.5 మి,లీ లేదా 3.5మి.లీ డెసిస్ లేదా హిమామెక్టిన్, బెంజోయేట్ 2గ్రాములు లీటరు నీటికి కలిపి ద్రావణంలో ముంచి ఆరబెట్టి వాడుకోవాలి.
- మంచి నాణ్యత కలిగిన పాలిథిన్ లైనింగ్ ఉన్న జూట్ సంచులు, సూపర్గ్రేన్ బ్యాగులు, పురుగు మందుల లేపనం ఉన్న బ్యాగులు, హెచ్డీపీఈ, ప్లాస్టిక్ సంచులు, మ్యాజిక్ బ్యాగులు విత్తన నిల్వకు వాడటం మంచిది.
- బస్తాలను బ్లాక్ పద్దతిలో అనగా ఒకటి పొడవుగా, రెండోది అడ్డంగా ఉండేట్లు అమర్చుకోవాలి. బస్తాలను నేలకు, గోడలకు ఆనించకుండా ఎత్తైన చెక్క బల్లపై పెట్టుకోవాలి.
- సోయా చిక్కుడు లాంటి విత్తన పంటల్లో విత్తనపొర పలుచగా ఉంటే యంత్రాల ద్వారా కోత, నూర్పిడి చేయరాదు. అలా చేస్తే మొలకశాతం దెబ్బతింటుంది. ఒకవేళ తప్పనిసరిగా చేయాల్సి వస్తే విత్తనానికి రాపిడి జరగకుండా యంత్రాల్లో సరైన మార్పులు చేసి ఉపయోగించుకోవాలి.
- కొత్త ధాన్యాన్ని, పాత ధాన్యంతో కలపరాదు. కొత్త ధాన్యం నింపేముందు, గోడల పైకప్పుకు, గోనే సంచులపైన మలాథియాన్ 10మి.లీ లేదా డైక్లోర్వాస్ 7మి.లీ లేదా డెల్టామెత్రిన్ 1.5మి.లీలు లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.