సాక్షి, హైదరాబాద్: అకాల వర్షంతో ఆరుగాలం కష్టపడి పండించిన పంట నీళ్ల పాలవడంతో రైతన్న గుండె చెదిరింది. భారీ వర్షం, వడగళ్లతో కోతకు వచ్చిన పంట పొలంలోనే కుప్పకూలి గింజ లేకుండా రాలిపోగా, కోసి ఆరబోసిన పంట కూడా వర్షార్పణమైంది. వేలాది ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. పంట మొత్తం నాశనమవడాన్ని చూసి తట్టుకోలేని సిరిసిల్ల జిల్లా కోనరావుపేటకు చెందిన పంబాల స్వామి (53) గుండెపోటుతో కుప్పకూలారు. ప్రధానంగా కరీంనగర్, వరంగల్, నల్లగొండ, నిజామాబాద్ జిల్లాల్లో వర్ష బీభత్సంతో వేలాది ఎకరాల పంటనష్టం జరిగింది. కొనుగోలు కేంద్రాలు, కల్లాల్లో ఆరబోసిన వేల టన్నుల ధాన్యం నీళ్లపాలైంది.
50వేల ఎకరాల్లోనే వరి పంట నష్టం జరిగినట్లు వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసినా, అది ఎన్నో రెట్లు ఎక్కువగా ఉన్నట్లు క్షేత్రస్థాయి పరిశీలనను బట్టి అర్థమవుతోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పంట నష్టం అత్యధికంగా ఉన్నట్లు వ్యవసాయ శాఖ, పౌరసరఫరాల శాఖ తేల్చాయి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 78,984 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు వ్యవసాయ శాఖ అధికారులు తేల్చారు.
ఉమ్మడి నిజామాబాద్, నల్లగొండ జిల్లాల్లో 20 రోజుల క్రితం నుంచే రైతులు కోతలు కోసి ధాన్యాన్ని ఆరబెట్టగా, 10 రోజుల నుంచి కొనుగోళ్లు మొదలయ్యాయి. ఉమ్మడి కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో కోతలు మొదలైనా, కొనుగోలు కేంద్రాలు లేక రైతులు నానాకష్టాలు పడ్డారు. వరి కోతకు వచ్చినా, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదనే కారణంగా చాలామంది రైతులు పంటను కోయలేదు. అకాల వర్షం, వడగళ్లతో పొలాల్లోనే పంట నేలకొరిగింది. దీంతో ఎకరా పొలంలో బస్తా వడ్లు కూడా వచ్చే పరిస్థితి లేదని, వరిని కోస్తే కోత మిషన్‌కు పెట్టే ఖర్చు కూడా వేస్ట్ అని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. రాష్ట్రంలో ఈ యాసంగి సీజన్‌లో 7,031 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని పౌరసరఫరాల శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. కానీ ఇప్పటివరకు కేవలం 12 జిల్లాల్లో 2,161 కేంద్రాలను మాత్రమే ఏర్పాటు చేసి 2.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొన్నారు.
కొనుగోళ్లకు ఆటంకం
అకాల వర్షాలతో కొనుగోలు కేంద్రాల్లో కూడా ధాన్యం తడవగా, రెండు రోజులుగా కొనుగోళ్లు సాగడం లేదు. ఇంకా వర్షసూచన ఉండడంతో మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని భావిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో పలుచోట్ల సోమవారం మధ్యాహ్నం ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో కోత కోసి ఆరబెట్టిన ధాన్యం వర్షపు నీటిలో కొట్టుకుపోయింది. నువ్వులు, సజ్జ పంటలు నేలకొరిగాయి. ముప్కాల్, మోర్తాడ్, ఆర్మూర్, కమ్మర్ పల్లి, నాగంపేట్‌లలో వర్షం కురిసింది. జనగామ జిల్లాలో సోమవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వాన పడింది. బచ్చన్నపేట మండలంలోని బండనాగారం, కేసిరెడ్డిపల్లి, కొడవటూరు, లక్ష్మాపూర్ గ్రామాల్లో వడగళ్లు పడ్డాయి. జనగామ మండలం గానుగపాడు వెంకిర్యాల, వడ్లకొండ, మరిగడిలలో భారీ సైజులో వడగళ్లు పడ్డాయి. దీంతో మామిడి తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది.
ప్రతీ గింజను కొంటాం
అకాల వర్షంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పంట నష్టం జరిగింది. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో నష్టం తీవ్రత ఎక్కువగానే ఉంది. నేను స్వయంగా పరిశీలించి రైతులకు ధైర్యం చెప్పాను. పంట నష్టపోయిన రైతులను కేసీఆర్ ఆదుకుంటారు. అధికారులు పంట నష్టాన్ని అంచనా వేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టుకొనే ప్రక్రియ సాగుతుంది. అవసరమైన మేర టార్పాలిన్లు, తేమ మిషన్లను ఏర్పాటు చేశాం. తడిసిన ధాన్యం ఆరిన వెంటనే కొనుగోలు చేస్తాం. ప్రతీ గింజను కొంటాం.
–మంత్రి గంగుల
గుండెపోటుతో రైతు మృతి
కోనరావుపేట (వేములవాడ): ఆరునెలలు శ్రమించి సాగుచేసిన పంట ఒక్కరోజులో నేలపాలు కావడంతో తట్టుకోలేని ఆ రైతు గుండె ఆగింది. రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేటకు చెందిన పంబాల స్వామి(53)కి మూడెకరాల భూమి ఉంది. అందులో వరి వేశాడు. రెండు రోజుల క్రితమే ఎకరం పొలాన్ని కోయించగా, ఇంకా రెండెకరాల్లో పంటను కోయించాల్సి ఉంది. ఆలోపే ఆదివారం సాయంత్రం వడగళ్ల వాన పడి పంట మొత్తం రాలిపోయింది. దీన్ని చూసి స్వామి దిగాలుగా ఇంటికొచ్చి గుండెలో నొప్పి వస్తోందంటూ పడిపోయాడు. కుటుంబసభ్యులు ఆయనను ఆస్పత్రికి తరలించేలోపే మృతిచెందాడు. స్వామికి ఇద్దరు కూతుళ్లు. భార్య ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment