నగరంలో చిన్నపాటి ఈదురుగాలికే తెగుతున్న తీగలు
చెట్ల కొమ్మలు విరిగిపడుతూ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లకు దెబ్బ
డ్రైనేజీలు, ఇతర తవ్వకాలతో దెబ్బతింటున్న అండర్‌గ్రౌండ్ కేబుళ్లు
ఇంటర్నెట్, టీవీ కేబుళ్లు, ఫ్లెక్సీలతోనూ ఇబ్బందులు
నిర్వహణ లోపాలు, నాసిరకం పరికరాలు, సిబ్బంది నిర్లక్ష్యంతో సమస్యలు
పలు ప్రాంతాల్లో గంటల కొద్దీ నిలిచిపోతున్న కరెంటు సరఫరా
తీవ్రంగా ఇబ్బందిపడుతున్న జనం
లైన్ల పునరుద్ధరణకు ఏటా రూ.వంద కోట్లకుపైగా ఖర్చు చేస్తున్నా ఫలితం అంతంతే
సాక్షి, హైదరాబాద్: వారం రోజుల క్రితం ఈదురుగాలితో కూడిన వర్షానికి చెట్ల కొమ్మలు విరిగి పడి తీగలు తెగిపోవడంతో.. బోడుప్పల్, నారపల్లి, చెంగిచెర్ల, పీర్జాదిగూడలో కరెంటు సరఫరా నిలిచిపోయింది. గంటల తరబడి సరఫరా పునరుద్ధరించకపోవడంతో స్థానికులు ఆగ్రహంతో సమీపంలోని సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు.
పదిరోజుల కింద వాటర్‌బోర్డు ఆధ్వర్య ంలో మంచినీటి పైపులైన్ కోసం రాత్రిపూట తవ్వకాలు చేపట్టగా.. మయూరినగర్ సబ్‌స్టేషన్‌కు విద్యుత్ సరఫరా చేసే 33/11 కేవీ అండర్‌గ్రౌండ్ కేబుల్ దెబ్బతింది. ఆ సబ్‌స్టేషన్ పరిధిలోని ప్రాంతాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
పదిహేను రోజుల క్రితం బాచుపల్లిలోని 33/11కేవీ అండర్‌గ్రౌండ్ కేబుల్‌లో అకస్మాత్తుగామంటలు చెలరేగాయి. పలు ఫీడర్ల పరిధిలోని కాలనీలకు పది గంటలకుపైగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీనితో స్థానికులు సబ్‌స్టేషన్ ముట్టడించి నిరసన వ్యక్తం చేశారు.
క్షేత్రస్థాయిపై అవగాహన లేక..
తెలంగాణ ఏర్పాటు తర్వాత హైదరాబాద్ నగరం శరవేగంగా విస్తరిస్తోంది. నెలకు కనీ సం 2,500 కొత్త కనెక్షన్లు వచ్చి చేరుతున్నాయి. పదేళ్ల క్రితం 1,800 నుంచి 2,200 మెగావాట్లు ఉన్న విద్యుత్ డిమాండ్.. ప్రస్తుతం 3,900 నుంచి 4,000 మెగావాట్లు దాటింది. డిమాండ్ మేరకు సరఫరా వ్యవస్థను మెరుగుపర్చేందుకు చర్యలు చేపట్టినా.. అంతరాయాలు మాత్రం ఆగడం లేదు. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న చాలా మంది ఇంజనీర్లకు లైన్లపై సరైన అవగాహన లేకపోవడంతో.. అత్యవసర పరిస్థితుల్లో తలెత్తిన సాంకేతిక లోపాలను గుర్తించలేకపోతున్నారనే విమర్శ ఉంది.
ఎవరైనా స్థానికులు ఫలానా చోట వైరు తెగిందనో? ట్రాన్స్‌ఫార్మర్ పేలిందనో? విద్యుత్ స్తంభం నేల కూలిందనో ఫోన్‌చేసి చెప్తేగానీ సమస్యను గుర్తించలేని పరిస్థితి. అంతేకాదు లైన్ల నిర్వహణ, పునరుద్ధరణ పనుల కోసం ఏటా రూ.వంద కోట్లకుపైగా ఖర్చు చేస్తున్నారు. అయినా ఇబ్బందులు తప్పడం లేదు.
సంస్కరణలు చేపట్టినా.. సద్దుమణగని సమస్యలు
పరిపాలనలో సౌలభ్యం, విద్యుత్ సమస్యల సత్వర పరిష్కారం కోసం డిస్కం వేర్వేరు (ఆపరేషన్స్, సీబీడీ లైన్స్ వింగ్, కన్‌స్ట్రక్షన్ అండ్ ప్రాజెక్ట్స్) విభాగాలను ఏర్పాటు చేసింది. ఆపరేషన్స్ ఏఈ బిల్లింగ్, రెవెన్యూ వసూళ్లకే పరిమితం అయ్యేవారు. ఏదైనా విపత్తు జరిగితే పరిష్కార బాధ్యతను సీబీడీ గ్యాంగ్ నిర్వర్తించేది. ఇక కొత్త సబ్‌స్టేషన్లు, లైన్ల విస్తరణ, భూగర్భ కేబుళ్ల ఏర్పాటు వంటి పనులను మాస్టర్ ప్లాన్ విభాగం చూసుకునేది.
ఇలా ఎవరి పరిధిలో వాళ్లు ఉండటంతో.. విపత్తుల సమయంలో బ్రేక్‌డౌన్స్, సరఫరా పునరుద్ధరణ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వచి్చంది. ముషారఫ్ ఫారూఖీ సీఎండీగా బాధ్యతలు స్వీకరించాక.. సంస్థలో పలు సంస్కరణలు తీసుకొచ్చారు. ఆపరేషన్స్ ఏఈలకు కూడా అంతరాయాలను పరిష్కరించే బాధ్యత అప్పగించారు. గతంలో లైన్ల పునరుద్ధరణకు లైన్ క్లియర్ (ఎల్‌సీ) పేరుతో గంటల తరబడి కరెంట్ సరఫరా నిలిపేసేవారు. ప్రస్తుతం ఆ విధానానికి స్వస్తి చెప్పారు. అయినా అంతరాయాల సమస్య తగ్గడం లేదు.
...గ్రేటర్ హైదరాబాద్ నగరంలో తరచూ జరుగుతున్న విద్యుత్ అంతరాయాలకు చిన్న ఉదాహరణలివి. చిన్న వాన పడినా చాలు.. నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోతోంది. కొన్నిచోట్ల గంటలకు గంటలు అంతరాయం కలుగుతోంది. విద్యుత్ వ్యవస్థలు సరిగా లేకపోవడానికి తోడు అధికారులు, సిబ్బంది విధుల నిర్వహణలో నిర్లక్ష్యం, నాసిరకం కేబుళ్లు, ఏబీ స్విచ్‌లు, ఇన్సులేటర్లు, కండక్టర్లు, లోపభూయిష్టమైన ఎర్తింగ్ సిస్టం, స్తంభాలకు వేలాడుతున్న టీవీ, ఇంటర్నెట్ కేబుళ్లు.. వెరసి విద్యుత్ సరఫరాలో సమస్యలకు కారణం అవుతున్నాయి. ఈ విషయంలో తగు చర్యలు తీసుకోవాలని నగరవాసులు కోరుతున్నారు.
చినుకు పడితే చీకటే..
రాజేంద్రనగర్ డివిజన్ బుద్వేల్‌లో తరచూ కరెంటు సమస్య వస్తోంది. చినుకుపడితే చాలు చీకటి అవుతోంది. అంతరాయాలు లేకుండా చూడాలని పలుమార్లు అధికారులకు విన్నవించినా సమస్య పరిష్కారం కాలేదు. కాలనీల్లో వీధిలైట్లు వెలగడం లేదు. ఇంట్లో కరెంట్ లేక ఉక్కపోత, దోమలతో కంటిమీద కునుకు లేకుండా పోతోంది. – సదానంద్, బుద్వేల్
Comments
Please login to add a commentAdd a comment