west zone dcp
-
డెక్కన్ మాల్‌కు పగుళ్లు.. ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ రాంగోపాల్‌పేట డెక్కన్ మాల్ అగ్నిప్రమాద ఘటనపై నిట్ అధికారులు రూపొందించిన నివేదిక పోలీసులకు చేరింది. డ్రోన్ కెమెరాతో శుక్రవారం ఉదయం నుంచి భవనం పరిస్థితిని అంచనా వేశారు అధికారులు. అయితే భవనం ఏ క్షణమైనా కుప్పకూలే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఈ వివరాలను సెంట్రల్‌జోన్ డీసీపీ మీడియాకు వెల్లడించారు. ‘‘బిల్డింగ్ ఏ క్షణమైనా కూలే ప్రమాదం ఉందని అధికారులు మాతో చెప్పారు. భవనం మొత్తం ఇప్పటికే పగుళ్లు వచ్చాయి. పైఅంతస్తు సీలింగ్ పూర్తిస్థాయిలో పగుళ్లు ఏర్పడ్డాయి. బిల్డింగ్ మొత్తం బూడిద, శిథిలాలతో నిండిపోయిందని వివరించారు. భవనం ముందు భాగంలో రాకపోకలను నిషేధించాం. బిల్డింగ్‌లోకి ఎవరినీ అనుమతించే ప్రసక్తే లేదు. ఇప్పటికే బిల్డింగ్‌లో రెండంతస్తుల స్లాబ్‌లు కూలిపోయాయి. భవనంలో కనిపించకుండా పోయిన ముగ్గురి ఆచూకీ తెలియదు. ముగ్గురికి సంబంధించి ఎలాంటి ఆధారాలు ఇంకా లభ్యం కాలేదు. భవనం పరిస్థితిపై యజమానికి పూర్తి సమాచారం ఇచ్చాం అని డీసీపీ వెల్లడించారు. ఇదిలా ఉంటే.. డ్రోన్ ద్వారా రెండు మృతదేహాలను గుర్తించినట్లు వార్తలు బయటకు వచ్చినప్పటికీ.. అధికారికంగా ధృవీకరణ కాకపోవడం గమనార్హం. -
అత్యాచార ఘటనతో హోంమంత్రి మనవడికి సంబంధం లేదు: వెస్ట్‌జోన్ డీసీపీ
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ అత్యాచార ఘటనలో రాష్ట్ర హోం మంత్రి మనవడు వున్నాడనేది పూర్తిగా అవాస్తవం అని వెస్ట్‌జోన్ డీసీపీ జోయల్ డేవిస్ సృష్టం చేశారు. సీసీ కెమెరాల్లో అతను ఎక్కడా కనిపించ లేదని, అన్నీ పరిశీలించాకే క్లీన్ చిట్ ఇచ్చినట్లు తెలిపారు. బాలిక అత్యాచార ఘటనపై శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పీఎస్‌లో కేసు నమోదు చేశామన్నారు. సెక్షన్ 354, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామని తెలిపారు. బాలిక చెప్పిన వివరాల ప్రకారం.. ఐదుగురు నిందితులను గుర్తించామని పేర్కొన్నారు. ఈ కేసులో ఇద్దరిని అరెస్టు చేశామని, మరో ముగ్గురు నిందితుల కోసం గాలిస్తున్నట్లు వివరించారు. నిందితుల్లో ఇద్దరు మేజర్లు, ముగ్గురు మైనర్లు ఉన్నారన్నారు. ఈ కేసులో ఓ ప్రముఖ వ్యక్తి కుమారుడి పాత్ర ఉన్నట్లు ఆధారాలు లభించాయని తెలిపారు. అయితే అతడు మైనర్ కావడంతో వివరాలు వెల్లడించలేకపోతున్నామన్నారు. ఈ కేసును ఏసీపీ స్థాయి అధికారి విచారణ చేస్తున్నారని, నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఎమ్మెల్యే కొడుకుకు సంబంధించిన ఆధారాలు కూడా లభించలేదని డీసీపీ పేర్కొన్నారు. చదవండి: బాలిక అత్యాచారం కేసు.. పోలీసుల అదుపులో వక్ఫ్ బోర్డు ఛైర్మన్ కుమారుడు -
బంజారాహిల్స్ పబ్ డ్రగ్స్ కేసు: కీలక విషయాలు వెలుగులోకి..
సాక్షి, హైదరాబాద్: బంజరాహిల్స్ పబ్ డ్రగ్స్ కేసులో నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పబ్ నిర్వాహకులు అభిషేక్, అనిల్, డీజే వంశీధర్‌రావు, కునాల్‌ను అరెస్ట్ చేశారు. మరో నిందితుడు అర్జున్ వీరమాచినేని పరారీలో ఉన్నాడు. చదవండి: డ్రగ్స్ కేసులో నాగబాబు కుమార్తెకు నోటీసులు వెస్ట్ జోన్ డీసీపీ జోయల్ డేవిస్ మీడియాతో మాట్లాడుతూ, అనిల్ వద్ద డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. ఫుడింగ్ మింక్ పబ్‌లో డ్రగ్స్ వినియోగించారన్నారు. పోలీసుల దాడులు చేసిన సమయంలో 148 మంది ఉన్నారని. తెల్లవారుజామున 4 గంటల వరకు పబ్ నడిచిందని తెలిపారు. ‘‘డ్రగ్స్ ఎక్కడ నుంచి వచ్చాయనే దానిపై ఆరా తీసున్నాం. కొకైన్‌ను డ్రింక్‌లో వేసుకుని తాగినట్లు గుర్తించాం. బార్ కౌంటర్లో కూడా డ్రగ్స్ సరఫరా చేశారు. పబ్‌లోకి వెళ్లడానికి కోడ్ లాంగ్వేజ్ వినియోగించారు. కోడ్ చెప్పిన వాళ్లనే పబ్‌లోకి అనుమతించారు. మేనేజర్ కునాల్ నుంచి పూర్తి వివరాలు రాబట్టాలి. గోవా లింక్‌లు ఇంకా బయటపడలేదని’’ డీసీపీ పేర్కొన్నారు. -
ఎంజే మార్కెట్: ప్రస్తుత పరిస్థితి ఇది
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగర వాసులు యథేచ్ఛగా లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని కొన్ని మీడియా చానళ్లలో వచ్చిన కథనాలపై పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. పాతబస్తీలోని ఎంజే మార్కెట్, జంబాగ్ ప్రాంతాల్లో ప్రజలు విచ్చలవిడిగా రోడ్డు మీదకు వస్తున్నారని కొన్ని వార్తా చానళ్లు ప్రసారం చేశాయి. అయితే ఈ ప్రచారంలో వాస్తవం లేదని ఈస్ట్ జోన్ డీసీపీ ఎం. రమేశ్ తెలిపారు. ‘లాన్‌డౌన్ ఉల్లంఘన గురించి భయాలు సృష్టిస్తూ ఎంజే మార్కెట్, జంబాగ్ ప్రాంతాలకు చెందిన పాత చిత్రాలు మీడియాలో ప్రసారం చేయబడ్డాయి. పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ప్రస్తుత చిత్రాలను చూడమని చెప్పండి. మిమ్మల్ని రక్షించడానికి మేము అక్కడ ఉన్నాము, ఎల్లప్పుడూ ఉంటాము. దయచేసి అబద్దపు ప్రచారాన్ని నమ్మకండి, వ్యాప్తి చేయకండి’ అంటూ ఈస్ట్ జోన్ డీసీపీ రమేశ్ ట్వీట్ చేశారు. అక్కడ ప్రస్తుత పరిస్థితులకు సంబంధించిన ఫొటోలను కూడా ఆయన ట్విటర్లో షేర్ చేశారు. (ఐదు రాష్ట్రాల్లో కరోనా లేదు: కేంద్రం) లాక్డౌన్ అమల్లో ఉన్న నేపథ్యంలో అనవసరంగా రోడ్ల మీదకు వస్తున్న వారి పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. విపత్తు నిర్వహణ చట్టం ఉల్లంఘన కింద కేసులు నమోదు చేయడంతో పాటు వాహనాలకు స్వాధీనం చేసుకుంటున్నారు. ఇప్పటివరకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భారీ సంఖ్యలో వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. కరోనా మహమ్మారి కట్టడికి ప్రజలందరూ సహకరించాలని, అనవసరంగా బయటకు రావొద్దని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. చదవండి: బయటకు రావాలంటే భయం -
‘ఆమె పబ్ డ్యాన్సర్ కాదు’
సాక్షి, హైదరాబాద్ : నగరంలో సంచలనం సృష్టించిన లిస్బన్ పబ్ నిర్వాహకుల వ్యవహారంపై దర్యాప్తు వేగవంతం చేశామని వెస్ట్‌జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ తెలిపారు. బాధితురాలు హరిణి ఆరోపణలపై లోతుగా విచారణ జరుపుతున్నామని వెల్లడించారు. అసాంఘిక కార్యకలాపాలకు నిరాకరించినందున నడిరోడ్డుపై తనను వివస్త్రను చేసి, దాడికిపాల్పడ్డారని హరిణి పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించిన వివరాలను డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ గురువారం వెల్లడించారు. హరిణి పబ్ డ్యాన్సర్ కాదని, రోజూ అక్కడకు వచ్చి వెళ్తుందని తెలిపారు. హరిణి ఫిర్యాదుతో వెంటనే స్పందించిన పోలీసులు.. నలుగురు యువతులు, పబ్ యజమానులను అరెస్టు చేశారని పేర్కొన్నారు. పబ్‌లో ఎలాంటి డాన్సులు జరగడం లేదని తెలిపారు. డీజేల అనుమతి తమ పరిధిలో లేదని, డీజే, ఫుడ్‌కు సంబంధించిన అనుమతులను జీహెచ్ఎంసీ చూసుకుంటుందన్నారు. వెస్ట్‌జోన్‌లో ప్రస్తుతం 40 పబ్‌లు ఉన్నాయని తెలిపారు. వీటి కారణంగా ట్రాఫిక్ అంతరాయం కలుగుతుండటంపై జీహెచ్ఎంసీకి ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు. కాగా సినిమా చాన్స్‌ల కోసం హైదరాబాద్ వచ్చిన తను.. ఆర్థిక సమస్యల కారణంగా బేగంపేటలోని లెస్బెన్ పబ్‌లో డాన్సర్‌గా పని చేస్తున్నట్లు హరిణి పేర్కొన్న సంగతి తెలిసిందే. ఆ పబ్‌కొచ్చే కస్టమర్లు తాగిన మైకంలో తనతో అసభ్యంగా ప్రవర్తించేవారని, కోరిక తీర్చాలంటూ వేధించేవారని ఆరోపించింది. అయితే అవన్నీ పట్టించుకోకుండా తనపని తాను చేసుకుని వెళ్లిపోయేదాన్నని చెప్పింది. ఓ రాత్రి కస్టమర్‌తో గడిపితే రూ.10వేలు ఇస్తారని పబ్ నిర్వాహకులు ఒత్తిడి చేసేవారని ఆమె వాపోయింది. 'ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలకు అంగీకరించలేదు. దీంతో వారంతా నాపై కక్ష కట్టారు. తరచూ ఫోన్లు చేసి అసభ్యకరంగా మాట్లాడేవారు. పబ్‌లో బ్లేడ్లతో ఒళ్లంతా గాయాలు చేసే వారు. నిన్న క్లబ్ ముగిసిన తర్వాత ఒంటి గంటకు నలుగురు అమ్మాయిలు, మరోవ్యక్తితో కలిసి దాడి చేశారు. ఒంటిపై బట్టలు విప్పి అసభ్యకరంగా ప్రవర్తించారు. వాళ్లకు ప్రముఖ రాజకీయ నాయకులు తెలుసంటూ బెదిరించారు. సయ్యద్ అనే వ్యక్తి వీళ్లందరికి బాస్. పంజాగుట్ట పీఎస్‌లో వారిపై ఫిర్యాదు చేశాను. నాపై దాడి చేసిన వారు కూడా పంజాగుట్ట పీఎస్‌కు వచ్చి వెళ్ళిపోయారు. క్లబ్లో ఇంకా చాలా మంది బాధితులు ఉన్నారు’ అని ఆమె మీడియాకు వెల్లడించింది. -
రాకేశ్‌రెడ్డికి బ్యాంక్ అకౌంట్ కూడా లేదు
సాక్షి, బంజారాహిల్స్: పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరామ్ హత్యకేసులో పలు విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడైన రాకేశ్ రెడ్డికి ఇప్పటివరకు సొంత బ్యాంక్ అకౌంట్ కూడా లేదని, ఇప్పటివరకు అన్ని క్యాష్ లావాదేవీలు మాత్రమే చేశాడని, అతను గతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశాడని వెస్ట్‌జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ సోమవారం విలేకరులకు తెలిపారు. గత నాలుగు రోజుల నుంచి చాలామందిని విచారించామని, పలువురి బ్యాంకు ఖాత్యాలు, ఇతర పత్రాలను పరిశీలించామని ఈ కేసులో రాకేశ్ రెడ్డి, శ్రీనివాస్‌తో పాటు రౌడీషీటర్ నగేష్, అతని అల్లుడు విశాల్ ప్రేమయం ఉందని విచారణలో తేలిందని తెలిపారు. పోలీస్ అధికారుల ప్రమేయంపైనా త్వరలోనే విచారణ జరుపుతామని వెల్లడించారు. రాకేశ్ రెడ్డి జయరామ్‌కు డబ్బులు ఇచ్చాడా? అనే విషయంపై స్పష్టత రాలేదని, ఇప్పటివరకు 50 మందికిపైగా విచారించామని తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన రాకేశ్ రెడ్డి గతంలో పోలీసులతో మంతనాలు జరిపిన విషయం వాస్తవమేనని ఏఆర్ శ్రీనివాస్ స్పష్టం చేశారు. హత్య జరిగిన తరువాత ఐదుగురు పోలీసులతో రాకేశ్ మాట్లాడాడని తెలిపారు. ఈ వ్యవహారంలో ఇబ్రహీపట్నం సీఐ, నల్లకుంట ఎస్సైలను విచారిస్తామని తెలిపారు. జయరామ్ భార్య పద్మశ్రీ ఫిర్యాదుపై కూడా విచారణ జరుగుతోందని, జయరాం, శిఖా చౌదరి మధ్య కొన్ని బ్యాంక్ లావాదేవీలు జరిగాయని తెలిపారు. కానీ ఆయన హత్యకు ఈ లావాదేవీలతో సంబంధం ఉన్నట్లు ఇప్పుడే చెప్పలేమన్నారు. ఈ కేసులో ఇంకెవరికైనా ప్రమేయముందా? అనేదానిపై కాల్‌డేటా ఆధారంగా విచారణ జరుపుతున్నామని తెలిపారు. -
ఖాకీల ‘స్పెషల్’ దందా
సాక్షి,సిటీబ్యూరో: బెదిరింపులతో పాటు వసూళ్ల దందాలకు కేరాఫ్ అడ్రస్‌లుగా మారుతున్న నేపథ్యంలో దాదాపు ఐదేళ్ల క్రితం డీసీపీల ఆధీనంలోని స్పెషల్ పార్టీలను రద్దు చేశారు. అయినా కొందరు అధికారులు అనధికారికంగా వీటిని కొనసాగిస్తున్నారు. దీనిని ఆసరాగా చేసుకున్న కొందరు స్పెషల్ పార్టీ కానిస్టేబుళ్ళు యథేచ్ఛగా దందాలు సాగిస్తున్నారు. నగరంలోని అత్యంత కీలకమైన పశ్చిమ మండల పరిధిలో ఈ వ్యవహారం చోటు చేసుకుంది. సాక్షాత్తు వెస్ట్ జోన్ డీసీపీకి క్యాంప్ క్లర్క్‌గా వ్యవహరిస్తున్న హెడ్–కానిస్టేబుల్ ఇందులో ప్రధాన భూమిక పోషించడం గమనార్హం. ఈ ముగ్గురికీ పోలీసు అధికారి కుమారుడు తోడయ్యాడు. కొన్నాళ్ళుగా యథేచ్ఛగా దందాలు సాగిస్తున్న వీరి ఆగడాలకు ఓ స్పా యజమాని ధైర్యం చేయడంతో చెక్ పడింది. నగర పోలీసు కమిషనర్ ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకున్న సీసీఎస్ పోలీసులు మంగళవారం హెడ్–కానిస్టేబుల్, కానిస్టేబుల్స్ సహా మొత్తం నలుగురు నిందితులను అరెస్టు చేశారు. ముగ్గురు ఖాకీలూ కొన్నాళ్ళ క్రితమే బదిలీ అయినప్పటికీ వెస్ట్‌జోన్‌లోనే విధులు నిర్వర్తిస్తుండటం గమనార్హం. నగరంలోనే సీనియర్ రైటర్‌గా పేరు పొందిన ఖతీబ్ అహ్మద్ (హెడ్సీ 2478) గత కొంతకాలంగా హెడ్–కానిస్టేబుల్ హోదాలో వెస్ట్‌జోన్ డీసీపీ వద్ద క్యాంప్ క్లర్క్‌గా (సీసీ) పని చేస్తున్నాడు. కానిస్టేబుళ్లు బి.వేణుగోపాల్ (పీసీ 3991), పి.విజయ్‌బాబు (పీసీ 5466) ఇదే డీసీపీ స్పెషల్ పార్టీలో విధులు నిర్వర్తిస్తున్నారు. రెండు నెలల క్రితం ఉన్నతాధికారులు సుదీర్ఘ కాలంగా ఒకే ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుళ్ళను బదిలీ చేశారు. ఈ బదిలీల నేపథ్యంలో అహ్మద్ బేగంపేట, వేణుగోపాల్ కుల్సుంపుర, విజయ్‌బాబు లంగర్‌హౌస్ ఠాణాలకు బదిలీ అయ్యారు. అయినప్పటికీ అటాచ్మెంట్ విధానంలో డీసీపీ కార్యాలయం కేంద్రంగా పాత విధులు నిర్వర్తిస్తున్నారు. క్యాంప్ క్లర్క్‌గా ఉన్న ఖతీబ్ అహ్మద్ అక్రమ వసూళ్లకు పథకం రూపొందించగా వేణుగోపాల్, విజయ్‌బాబులతో పాటు క్యాబ్ డ్రైవర్‌గా పని చేస్తున్న వేణుగోపాల్ స్నేహితుడు బి.శశికుమార్‌లతో కలిసి రంగంలోకి దిగాడు. ఈ నెల 8న జస్ట్ డయల్‌కు కాల్ చేసిన శశికుమార్ బంజారాహిల్స్ ప్రాంతంలో ఉన్న స్పా, మసాజ్ సెంటర్ల వివరాలు తెలుసుకున్నారు. వారి వివరాలు ఆధారంగా రోడ్ నెం.10లోని ‘లగ్జరీ ఫ్యామిలీ సెలూన్ అండ్ స్పా’ను టార్గెట్‌గా ఎంచుకున్నారు. అహ్మద్ సూచనల మేరకు మిగిలిన ముగ్గురూ ఆ స్పాపై దాడి చేసి, అందులో పని చేస్తున్న నలుగురు యువతులతో పాటు మేనేజర్ సూర్యను ఓ గదిలో బంధించారు. తాము టాస్క్‌ఫోర్స్ పోలీసులమని కేసు నమోదు చేయకుండా ఉండాలంటే తమకు రూ.3 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో స్పా యజమాని ఆర్.రాజు అక్కడకు చేరుకుని జీహెచ్ఎంసీ అనుమతితో నెల రోజుల క్రితమే స్పా ఏర్పాటు చేశామని, తమ సంస్థలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు తావు లేదని చెప్పినా వినకుండా డబ్బు ఇవ్వాలని బెదిరించారు. బేరసారాల తర్వాత నిందితులు రాజు నుంచి రూ.1.35 లక్షలు తీసుకున్నారు. తిరిగి వెళ్తూ తమ కదలికలకు సంబంధించి సాక్ష్యాధారాలు ఉండకూడదనే ఉద్దేశంతో స్పాలో ఉన్న డిజిటల్ వీడియో రికార్డర్‌ను (డీవీఆర్) సైతం ఎత్తుకెళ్లారు. ఈ నెల 10న బాధితుడు రాజు నగర పోలీసు కమిషనర్ వీవీ శ్రీనివాసరావును కలిసి ఫిర్యాదు చేశారు. ఆయన సూచనల మేరకు బాధితుడు సీసీఎస్ డీసీపీ అవినాష్ మహంతిని ఆశ్రయించారు. దీంతో ఈ నెల 12న కేసు నమోదు చేసుకున్న స్పెషల్ టీమ్–1 ఏసీపీ కె.నర్సింగ్‌రావు దర్యాప్తు చేపట్టి ఈ వ్యవహారంతో టాస్క్‌ఫోర్స్‌కు ఎలాంటి సంబంధం లేదని తేల్చారు. ఆపై నిందితులను పట్టుకునేందుకు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ స్పాలో పని చేస్తున్న టెలీకాలర్ రిజిస్టర్లో నమోదు చేసుకున్న ఫోన్ కాల్స్ వివరాలను ఆరా తీశారు. ఈ నేపథ్యంలోనే శశికుమార్‌కు చెందిన ఫోన్ నెంబర్ పోలీసులకు లభించడంతో అతడికి అదుపులోకి తీసుకుని విచారించగా... మిగిలిన ఇద్దరు కానిస్టేబుళ్ళు, హెడ్–కానిస్టేబుల్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఓపక్క ఈ దర్యాప్తు సాగుతుండగానే ముగ్గురు పోలీసులను వెస్ట్‌జోన్ నుంచి రిలీవ్ చేసి గతంలో బదిలీ అయిన స్థానాలకు పంపేశారు. కీలక ఆధారాలు లభించిన నేపథ్యంలో సీసీఎస్ పోలీసులు మంగళవారం ఖతీబ్ అహ్మద్, వేణుగోపాల్, విజయ్‌బాబులతో పాటు శశికుమార్‌ను అరెస్టు చేశారు. వీరి నుంచి డీవీఆర్, రూ.95 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను నాంపల్లి కోర్టులో హాజరుపరచగా జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో చంచల్‌గూడ జైలుకు తరలించారు. వీరు గతంలోనూ ఇలాంటి దందాలు చేసి ఉంటారనే అనుమానంతో లోతుగా విచారించాలని సీసీఎస్ పోలీసులు నిర్ణయించారు. దీనికోసం తమ కస్టడీకి అప్పగించాల్సిందిగా కోరుతూ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. నిందితుల్లో కానిస్టేబుల్ వేణుగోపాల్ తండ్రి సైతం అంబర్‌పేట సీపీఎల్‌లో ఆరŠడ్మ్ రిజర్వ్ విభాగం సబ్–ఇన్స్పెక్టర్గా పని చేస్తున్నారు. క్యాబ్ డ్రైవర్ శశికుమార్ తండ్రి వెల్దండ ఠాణాలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. వీరిని విచారిస్తే ఈ దందా వెనుక ఎవరైనా ఉన్నారా? అనేది స్పష్టమవుతుందని సీసీఎస్ పోలీసులు తెలిపారు. వీరిపై కుట్ర, బెదిరించడం తదితర ఆరోపణల కింద కేసు నమోదు చేశారు. -
'ఆ కారు మంత్రి రావెల కిషోర్ బాబుదే'
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు కుమారుడు సుశీల్‌పై వేధింపుల కేసు నమోదు చేసినట్లు వెస్ట్‌జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు వెల్లడించారు. ఆదివారం నగరంలోని వెస్ట్‌జోన్ డీసీపీ కార్యాలయంలో వెంకటేశ్వర్లు విలేకర్లతో మాట్లాడుతూ... బాధితురాలి ఫిర్యాదు మేరకే కేసు నమోదు చేసినట్లు ఆయన స్పష్టం చెప్పారు. సుశీల్, డ్రైవర్ అర్థరాత్రి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయారని తెలిపారు. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోందన్నారు. బాధితురాలిని వెంబడించిన కారు మంత్రి రావెల కిషోర్ బాబుదే అని డీసీపీ వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు.ఈ కేసులో అన్ని అంశాలను పరిశీలించాకే సుశీల్‌పై నిర్భయ కేసు నమోదు చేశామని డీసీసీ వెంకటేశ్వర్లు వెల్లడించారు.