సాక్షి, బంజారాహిల్స్: పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరామ్ హత్యకేసులో పలు విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడైన రాకేశ్ రెడ్డికి ఇప్పటివరకు సొంత బ్యాంక్ అకౌంట్ కూడా లేదని, ఇప్పటివరకు అన్ని క్యాష్ లావాదేవీలు మాత్రమే చేశాడని, అతను గతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశాడని వెస్ట్‌జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ సోమవారం విలేకరులకు తెలిపారు. గత నాలుగు రోజుల నుంచి చాలామందిని విచారించామని, పలువురి బ్యాంకు ఖాత్యాలు, ఇతర పత్రాలను పరిశీలించామని ఈ కేసులో రాకేశ్ రెడ్డి, శ్రీనివాస్‌తో పాటు రౌడీషీటర్ నగేష్, అతని అల్లుడు విశాల్ ప్రేమయం ఉందని విచారణలో తేలిందని తెలిపారు.
పోలీస్ అధికారుల ప్రమేయంపైనా త్వరలోనే విచారణ జరుపుతామని వెల్లడించారు. రాకేశ్ రెడ్డి జయరామ్‌కు డబ్బులు ఇచ్చాడా? అనే విషయంపై స్పష్టత రాలేదని, ఇప్పటివరకు 50 మందికిపైగా విచారించామని తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన రాకేశ్ రెడ్డి గతంలో పోలీసులతో మంతనాలు జరిపిన విషయం వాస్తవమేనని ఏఆర్ శ్రీనివాస్ స్పష్టం చేశారు. హత్య జరిగిన తరువాత ఐదుగురు పోలీసులతో రాకేశ్ మాట్లాడాడని తెలిపారు. ఈ వ్యవహారంలో ఇబ్రహీపట్నం సీఐ, నల్లకుంట ఎస్సైలను విచారిస్తామని తెలిపారు. జయరామ్ భార్య పద్మశ్రీ ఫిర్యాదుపై కూడా విచారణ జరుగుతోందని, జయరాం, శిఖా చౌదరి మధ్య కొన్ని బ్యాంక్ లావాదేవీలు జరిగాయని తెలిపారు. కానీ ఆయన హత్యకు ఈ లావాదేవీలతో సంబంధం ఉన్నట్లు ఇప్పుడే చెప్పలేమన్నారు. ఈ కేసులో ఇంకెవరికైనా ప్రమేయముందా? అనేదానిపై కాల్‌డేటా ఆధారంగా విచారణ జరుపుతున్నామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment