విచారణకు హాజరైన ఇబ్రహీంపట్నంఏసీపీ మల్లారెడ్డి, రాయదుర్గం సీఐ రాంబాబు
హైదరాబాద్: ప్రవాస భారతీయుడు చిగురుపాటి జయరామ్ హత్య కేసు దర్యాప్తులో పోలీసులు రెండో అంకానికి తెరలేపారు. ఇప్పటి వరకు రాకేశ్‌రెడ్డి వ్యవహారం, హత్య జరిగిన తీరు, ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొన్న వారి వివరాలు ఆరా తీశారు. ఇక నుంచి రాకేశ్‌రెడ్డికి సహకరించినట్లు, అతడితో సంబంధాలు నెరపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఖాకీలు, ‘ఖద్దరు’పై దృష్టి పెట్టారు. ప్రాథమికంగా ఇబ్రహీంపట్నం ఏసీపీ మల్లారెడ్డి, నల్లకుంట, రాయదుర్గం ఇన్‌స్పెక్టర్లు శ్రీనివాసులు, రాంబాబుల్ని దర్యాప్తు అధికారి కె.శ్రీనివాసరావు బుధవారం విచారించారు. ఈ కేసుకు సంబంధించి మరో ఇద్దరు పోలీసు అధికారుల్నీ త్వరలో విచారించే అవకాశం ఉందని వెస్ట్‌జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ మీడియాకు వెల్లడించారు. రాకేశ్‌రెడ్డితో కొందరు తెలుగుదేశం పార్టీ నేతలు, మాజీ ఎమ్మెల్యేలకు సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలున్నాయి. దీన్ని పరిగణనలోకి తీసుకుని త్వరలో వారినీ విచారణకు పిలవాలని భావిస్తున్నారు. మల్లారెడ్డితో పాటు శ్రీనివాసులు, రాంబాబుల్ని పోలీసులు బుధవారం మధ్యాహ్నం నాలుగు గంటల పాటు విచారించారు. హత్య జరగక ముందు, జరిగిన తర్వాత రాకేశ్‌రెడ్డి చేసిన ఫోన్‌కాల్స్ ఆధారంగా విచారణ జరిగింది.
గొడవ విషయాన్నే చెప్పాడు...
మల్లారెడ్డి తన వాంగ్మూలంలో.. ‘రాకేశ్‌రెడ్డి ఫోన్ చేసినప్పుడు స్నేహితుల మధ్య గొడవ విషయాన్ని చెప్పాడు. అతడు ఫోన్ చేసినప్పుడు నేను లిఫ్ట్ చేయలేకపోయా. ఈ నేపథ్యంలో మిస్డ్‌కాల్ చూసుకుని నేనే చేశా’అని పేర్కొన్నారని తెలిసింది. హత్య చేసిన రోజు రాకేశ్ తన వద్దకు వచ్చాడని, అయితే తాను ఆ సమయంలో పోలీసుస్టేషన్‌లో లేనని శ్రీనివాసులు తెలిపారు. తాను ఓ కూల్చివేత వద్ద ఉంటే రాకేశ్ అక్కడకొచ్చి కలిశాడని, కారు దూరంగా ఆపడంతో అందులో శవం ఉందన్న విషయం తాను గుర్తించలేదని పేర్కొన్నట్లు తెలిసింది. రాంబాబు సైతం రాకేశ్ తనతో మాట్లాడిన విషయం వాస్తవమే అని అంగీకరించినప్పటికీ హత్య విషయం చెప్పలేదని స్పష్టం చేసినట్లు సమాచారం. వీరి వాంగ్మూలాల్లోని వాస్తవాలను దర్యాప్తు అధికారులు పరిశీలిస్తున్నారు. అవసరాన్ని బట్టి మరోసారి వీరిని పిలిచి విచారించాలని, వెలుగులోకి వచ్చిన అంశాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. రాకేశ్ నుంచి ఫోన్ అందుకున్న రాంబాబు మరో ఇన్‌స్పెక్టర్‌కు ఫోన్ చేశారని, ఆయన కూడా రాకేశ్‌కు కాల్ చేసి మాట్లాడారని తెలుస్తోంది. అయితే విషయాన్ని ధ్రువీకరించిన పోలీసులు మరో ఇద్దరు పోలీసుల్ని విచారించనున్నారని మాత్రం చెబుతున్నారు.
మాజీ ఎమ్మెల్యే, మరో నేత..
జయరామ్ భార్య పద్మశ్రీ ఇచ్చిన ఫిర్యాదులోని ప్రతి అంశాన్నీ పరిగణనలోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నామని వారు అంటున్నారు. రాకేశ్... జయరామ్‌ను హత్య చేసిన విషయం మీడియాలో వచ్చేంత వరకు తమకు తెలియదని విచారణ నేపథ్యంలో ముగ్గురు పోలీసు అధికారులు పేర్కొన్నట్లు డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ తెలిపారు. హత్య జరిగిన తర్వాత రాజకీయ నేతలతో రాకేశ్‌రెడ్డి మాట్లాడిన డాటాను కూడా సేకరించిన పోలీసులు ఆ వివరాలను ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ మాజీ ఎమ్మెల్యేని, మరో రాజకీయ నాయకుడిని ప్రశ్నించాలని యోచిస్తున్నారు. జయరామ్ హత్యలో సినీ నటుడు సూర్య ప్రసాద్ పాత్ర ఉన్నట్లు స్పష్టమైతే చర్యలు తప్పవని పేర్కొంటున్నారు. అతడు కేవలం జయరామ్‌ను మభ్యపెట్టి రాకేశ్ వద్దకు తీసుకొచ్చినట్లు తెలుస్తోందని, భవిష్యత్తులో వెలుగులోకి వచ్చే అంశాల ఆధారంగా చర్యలు ఉంటాయని అధికారులు చెప్తున్నారు. శిఖా చౌదరి, జయరామ్ బ్యాంకు స్టేట్‌మెంట్లను బట్టి వారి మధ్య రూ.లక్షల్లో లావాదేవీలు నడిచినట్లు గుర్తించారు. జయరామ్ తన అకౌంట్ నుంచి నేరుగా శిఖా చౌదరి అకౌంట్‌కు డబ్బులు పంపినట్లు తేల్చారు.
Comments
Please login to add a commentAdd a comment