సాక్షి, హైదరాబాద్ : నగరంలో సంచలనం సృష్టించిన లిస్బన్ పబ్ నిర్వాహకుల వ్యవహారంపై దర్యాప్తు వేగవంతం చేశామని వెస్ట్‌జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ తెలిపారు. బాధితురాలు హరిణి ఆరోపణలపై లోతుగా విచారణ జరుపుతున్నామని వెల్లడించారు. అసాంఘిక కార్యకలాపాలకు నిరాకరించినందున నడిరోడ్డుపై తనను వివస్త్రను చేసి, దాడికిపాల్పడ్డారని హరిణి పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించిన వివరాలను డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ గురువారం వెల్లడించారు. హరిణి పబ్ డ్యాన్సర్ కాదని, రోజూ అక్కడకు వచ్చి వెళ్తుందని తెలిపారు. హరిణి ఫిర్యాదుతో వెంటనే స్పందించిన పోలీసులు.. నలుగురు యువతులు, పబ్ యజమానులను అరెస్టు చేశారని పేర్కొన్నారు. పబ్‌లో ఎలాంటి డాన్సులు జరగడం లేదని తెలిపారు. డీజేల అనుమతి తమ పరిధిలో లేదని, డీజే, ఫుడ్‌కు సంబంధించిన అనుమతులను జీహెచ్‌ఎంసీ చూసుకుంటుందన్నారు. వెస్ట్‌జోన్‌లో ప్రస్తుతం 40 పబ్‌లు ఉన్నాయని తెలిపారు. వీటి కారణంగా ట్రాఫిక్ అంతరాయం కలుగుతుండటంపై జీహెచ్‌ఎంసీకి ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు.
కాగా సినిమా చాన్స్‌ల కోసం హైదరాబాద్ వచ్చిన తను.. ఆర్థిక సమస్యల కారణంగా బేగంపేటలోని లెస్బెన్ పబ్‌లో డాన్సర్‌గా పని చేస్తున్నట్లు హరిణి పేర్కొన్న సంగతి తెలిసిందే. ఆ పబ్‌కొచ్చే కస్టమర్లు తాగిన మైకంలో తనతో అసభ్యంగా ప్రవర్తించేవారని, కోరిక తీర్చాలంటూ వేధించేవారని ఆరోపించింది. అయితే అవన్నీ పట్టించుకోకుండా తనపని తాను చేసుకుని వెళ్లిపోయేదాన్నని చెప్పింది. ఓ రాత్రి కస్టమర్‌తో గడిపితే రూ.10వేలు ఇస్తారని పబ్ నిర్వాహకులు ఒత్తిడి చేసేవారని ఆమె వాపోయింది. 'ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలకు అంగీకరించలేదు. దీంతో వారంతా నాపై కక్ష కట్టారు. తరచూ ఫోన్లు చేసి అసభ్యకరంగా మాట్లాడేవారు. పబ్‌లో బ్లేడ్‌లతో ఒళ్లంతా గాయాలు చేసే వారు. నిన్న క్లబ్ ముగిసిన తర్వాత ఒంటి గంటకు నలుగురు అమ్మాయిలు, మరోవ్యక్తితో కలిసి దాడి చేశారు. ఒంటిపై బట్టలు విప్పి అసభ్యకరంగా ప్రవర్తించారు. వాళ్లకు ప్రముఖ రాజకీయ నాయకులు తెలుసంటూ బెదిరించారు. సయ్యద్ అనే వ్యక్తి వీళ్లందరికి బాస్. పంజాగుట్ట పీఎస్‌లో వారిపై ఫిర్యాదు చేశాను. నాపై దాడి చేసిన వారు కూడా పంజాగుట్ట పీఎస్‌కు వచ్చి వెళ్ళిపోయారు. క్లబ్‌లో ఇంకా చాలా మంది బాధితులు ఉన్నారు’ అని ఆమె మీడియాకు వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment