అన్న భార్య తల్లితో సమానం అంటారు. అలాంటిది ఆ వదిన తప్పుడు దోవలో వెళ్తుంటే ఆ యువతి ఆపాలని చూసింది. కానీ, అదే ఆ యువతి పాలిట మృత్యువైంది. బేగంపేటలో బలవన్మరానికి పాల్పడిన యువతి సూసైడ్ కేసులో.. వదినతో పాటు ఆమె ప్రియుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు.
రసూల్‌పురా ఇందిరమ్మనగర్‌కు చెందిన విఠల్ కూతురు స్రవంతి(19) ఈ నెల 11వ తేదీన ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పొరుగున ఉండే ఓ యువకుడి వేధింపులతోనే కూతురు ఆత్మహత్య చేసుకుందని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు స్రవంతి సెల్‌ఫోన్‌లోని మెసేజ్‌ల ఆధారంగా.. యూసుఫ్‌గూడ రహమత్‌నగర్‌లో ఉంటున్న నవీన్‌కుమార్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు.
అయితే.. స్రవంతి వదిన శైలజకు నవీన్‌కుమార్‌తో పెళ్లికి ముందే సంబంధం ఉన్నట్లు గుర్తించారు. అతను ఇటీవల మళ్లీ శైలజను కలవడం ప్రారంభించాడు. ఈ విషయాన్ని స్రవంతి గుర్తించింది. అన్నను చెప్పనని, ఇప్పటికైనా తీరు మార్చుకోమని స్రవంతి, శైలజతో మంచిగా చెప్పింది. అయితే.. శైలజ తన తీరు మార్చుకోలేదు. ఈ విషయం ఎక్కడ బయటపడుతుందోనని భావించింది. ఈ క్రమంలో.. స్రవంతికి ఇంటి పక్కనే ఉండే ఓ యువకుడితో సంబంధం ఉందంటూ ప్రచారం చేస్తూ వేధింపులకు దిగింది. అతను తనకు సోదరుడి వంటివాడని చెప్పినా వినిపించుకోలేదు.
పైగా తనతో సంబంధం ఉన్న నవీన్‌కుమార్‌ను రంగంలోకి దించి అతనితో స్రవంతి ఫోన్‌కు సందేశాలు పంపిస్తుండేది. వదిన, నవీన్‌కుమార్‌లు పెట్టే వేధింపులు తట్టుకోలేక స్రవంతి ఆత్మహత్యకు పాల్పడింది. అయితే కోడలే తన కూతురు ఆత్మహత్యకు కారణమైనట్లు పోలీసుల విచారణలో బయటపడటంతో స్రవంతి తల్లిదండ్రులు షాక్‌కి గురయ్యారు. శైలజతో పాటు నవీన్‌కుమార్‌ను గురువారం పోలీసులు అరెస్టు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment