సాక్షి, హైదరాబాద్: అది పేరుకు దీపావళి పార్టీ.. కానీ అక్కడ జరిగింది మాత్రం పేకాట. ఓవైపు అంతటా టపాసుల మోత మోగుతుంటే.. ఆ అపార్ట్‌మెంట్ టెర్రస్‌పై మాత్రం పత్తాలాట జోరుగా సాగింది. ఆ పేకాట పార్టీలో ఉన్నది మామూలు వాళ్లు కాదు.. ఇద్దరు ఎమ్మెల్యేలు, ఓ ఎమ్మెల్సీ, కొందరు ఉన్నతాధికారులు కూడా హాజరైనట్టు విశ్వసనీయ సమాచారం. హైదరాబాద్ బేగంపేట సమీపంలోని మోతీలాల్ నెహ్రూనగర్‌లో ఉన్న మారుతి బసేరా అపార్ట్‌మెంట్ టెర్రస్‌పై జరిగిన ఈ తతంగం సంచలనంగా మారింది.
ఆ పార్టీకి ఓ మంత్రి కూడా హాజరయ్యారని, ఆ మంత్రి సహకారంతోనే సదరు ప్రజాప్రతినిధులు ఈ వ్యవహారం నుంచి బయటపడ్డారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పార్టీకి వీఐపీలు సహా అంత మంది హాజరైనా.. పోలీసులు కేవలం ఐదుగురు మాత్రమే పట్టుబడినట్టు చూపడం ఏమిటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
స్థానికుల ఫిర్యాదుతో..
దీపావళి రోజున బసేరా అపార్ట్‌మెంట్ టెర్రస్‌పై జరిగిన పార్టీలో.. పదుల సంఖ్యలో ఉన్నవారి అరుపులు, కేకలతో అపార్ట్‌మెంట్ వాసులతోపాటు పక్కనున్న ఇళ్లవారు గందరగోళానికి గురయ్యారు. కాలనీకి వచ్చే రోడ్డు బ్లాక్ అవడం, మొత్తం వీవీఐపీలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ స్టిక్కర్లతో ఉన్న వాహనాలు, ఉన్నతాధికారులు, వ్యాపారస్తుల హడావుడి కనిపించడంతో ఆశ్చర్యపోయారు. ఇదేమిటని ఆరా తీసి.. పార్టీ చాటున పేకాట హంగామా సాగుతోందని తెలుసుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు.
అంతా వీఐపీలే..
స్థానికులు ఫిర్యాదు చేయడంతో బేగంపేట పోలీసులు టాస్క్‌ఫోర్స్ సిబ్బందితో కలిసి బసేరా అపార్ట్‌మెంట్ వద్దకు వెళ్లారు. అసలేం జరుగుతోందని తేల్చేందుకు ఒకరిద్దరు మామూలుగా పైకి వెళ్లి చూశారు. అక్కడ ఓ మంత్రితోపాటు ముగ్గురు ప్రజాప్రతినిధులు ఉన్నట్టుగా గుర్తించినట్టు తెలిసింది. మంత్రిని అక్కడి నుంచి వెళ్లిపోవాల్సిందిగా సూచించి.. వెంటనే దాడి చేసినట్టు సమాచారం. అయితే పట్టుబడ్డ వారిలో ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ ఉండటంతో పోలీసులు ఆశ్చర్యపోయినట్టు తెలిసింది.
వారిలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే, హైదరాబాద్‌కు చెందిన మరో ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్సీతోపాటు పాలవ్యాపార నిర్వహణలో పేరు గడించిన ఓ ప్రముఖ వ్యక్తి, నిజామాబాద్‌కు చెందిన ఓ నేత, వికారాబాద్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే తమ్ముడు ఉన్నట్టు సమాచారం. ఇదే సమయంలో సదరు మంత్రి ఫోన్ చేసి ఒత్తిడి చేయడంతో ప్రజాప్రతినిధులు, ఇతర వీఐపీలను వదిలేశారని తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాడిలో 30 మందికిపైగా పట్టుబడినా కేవలం ఐదుగురిని చూపడం ఏమిటని మండిపడుతున్నారు.
దాడికి ముందే ఉన్నతాధికారులు!
అరవింద్ అగర్వాల్ అనే వ్యక్తి ఆహ్వానం మేరకు సదరు పార్టీకి వెళ్లిన ముగ్గురు సీనియర్ అధికారులు.. పోలీసుల దాడికి కొద్దినిమిషాల ముందే హడావుడిగా వెళ్లిపోవడం మరో రకమైన చర్చకు తావిస్తోంది. అందులో ఓ విభాగం ప్రిన్సిపల్ సెక్రెటరీ, మరో ఇద్దరు సెక్రటరీ హోదా అధికారులు, ముగ్గురు రిటైర్డ్ అధికారులు కూడా ఉన్నట్టు విశ్వసనీయంగా తెలిసింది.
ఆరితేరిన వాడే..
బసేరా అపార్ట్‌మెంట్‌పై పేకాట పార్టీ నిర్వాహకుడు, వ్యాపారవేత్తగా పేరు పొందిన అరవింద్ అగర్వాల్‌కు తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖులతో పరిచయాలున్నాయి. క్యాసినో, పోకర్, మూడు ముక్కలాట నిర్వహణలో చేయితిరిగిన వ్యక్తిగా పేరుంది. ఈయన కస్టమర్లలో ఎక్కువమంది ప్రజాప్రతినిధులేనని, అన్ని రాజకీయ పార్టీల కీలక నాయకులతోపాటు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులతో కూడా సంబంధాలు ఉన్నాయని పోలీస్ వర్గాలే చెప్తున్నాయి.
పేకాటలో పోలీసులకు చిక్కినా బాధ్యత తనదే అంటూ భరోసా కల్పించడం అతడి నైజమని పేర్కొంటున్నాయి. వీఐపీలను గోవా, సింగపూర్, శ్రీలంకలకు తీసుకెళ్లి కోట్ల రూపాయలు క్యాసినోలు ఆడిస్తున్నట్టు కూడా పోలీసులు అనుమానిస్తున్నారు.
అలాంటిదేమీ లేదు: బేగంపేట పోలీసులు
పేకాట వ్యవహారంపై బేగంపేట పోలీసులను వివరణ కోరగా.. తమకు వచ్చిన సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్ సిబ్బందితో కలిసి దాడులు చేశామని, పార్టీకి వచ్చిన 85 మందిలో అందరూ వెళ్లిపోయారని తెలిపారు. దాడి సమయంలో అక్కడున్న ఐదుగురు ఓ టేబుల్‌పై పోకర్ గేమ్ ఆడుతున్నారని, టేబుల్‌పై ఉన్న రూ.10 వేలను స్వాధీనం చేసుకొని.. వారిని తనిఖీ చేయగా రూ.12.56 లక్షలు దొరికాయని వెల్లడించారు.
53 ప్లేకార్డులను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అంతేతప్ప తమకు పట్టుబడ్డ వారిలో ప్రజాప్రతినిధులు గానీ, ఇతర ప్రముఖులు గానీ ఎవరూ లేరని పేర్కొన్నారు. అరెస్టయిన వారిలో అరవింద్ అగర్వాల్‌తోపాటు డబీర్‌పురాకు చెందిన జాఫర్ యూసఫ్, బేగంపేటకు చెందిన సిద్ధార్థ్ అగర్వాల్, మలక్‌పేటకు చెందిన భగేరియా సూర్యకాంత్, కరీమాబాద్‌కు చెందిన అబ్దుల్ అలీ జిలానీ ఉన్నట్టు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment