నాలుగు రోజుల్లో రూ. 829 కోట్ల వసూళ్లు
పుష్పరాజ్ అస్సలు తగ్గడం లేదు. వసూళ్ల విషయంలో అస్సలు తగ్గేదే లే అంటూ సరికొత్త రికార్డులు నెలకొల్పారు. నాలుగు రోజుల్లోనే ‘పుష్ప 2: ది రూల్’ ప్రపంచవ్యాప్తంగా రూ. 829 కోట్ల వసూళ్లు సాధించి, సరికొత్త రికార్డు సృష్టించినట్లు మేకర్స్ ప్రకటించారు. అల్లు అర్జున్, రష్మికా మందన్నా జంటగా నటించిన చిత్రం ‘పుష్ప 2: ది రూల్’. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీలీల ఓ పాటలో అలరించారు.
సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి మైత్రీ మూవీ మేకర్స్‌పై యలమంచిలి రవిశంకర్, నవీన్ ఎర్నేని నిర్మించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 6 భాషల్లో ఈ నెల 5న విడుదలైంది. ‘‘బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో రికార్డుల మోత మోగిస్తున్నాడు పుష్పరాజ్. ఈ చిత్రం ప్రీమియర్స్ నుంచే సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ టాక్ అందుకుంది. అల్లు అర్జున్ నట విశ్వరూపం, సుకుమార్ వరల్డ్ క్లాస్ టేకింగ్‌కి ప్రపంచ సినీ ప్రేమికులు ఫిదా అయిపోయారు.
ఇక విడుదలైన నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 829 కోట్లు వసూలు చేసిన తొలి భారతీయ చిత్రంగా సరికొత్త అధ్యాయాన్ని, భారతీయ చిత్ర పరిశ్రమ చరిత్రలో ఆల్‌టైమ్ రికార్డు సృష్టించింది’’ అని మేకర్స్ తెలిపారు. ‘‘పుష్ప 2’ బాలీవుడ్‌లో జైత్రయాత్రను కొనసాగిస్తోంది. నాలుగో రోజైన ఆదివారం రూ. 86 కోట్లు వసూలు చేసి సరికొత్త సంచలనానికి తెరలేపింది. ఇప్పటివరకు ఏ హిందీ చిత్రం కూడా ఒక్క రోజులో 86 కోట్ల నెట్‌ను సాధించలేదు.
హిందీలో నాలుగు రోజులకుగానూ రూ. 291 కోట్లు కలెక్ట్ చేసిన తొలి చిత్రంగా నిలిచింది. ఒక రికార్డు ప్రకటించేలోపే మరో కొత్త రికార్డును ‘పుష్ప 2’ సాధిస్తుండటం యావత్ భారతీయ సినీ పరిశ్రమను సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తోంది. రష్మికా మందన్నా నటన, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, కూబా ఫొటోగ్రఫీ మా సినిమాకు అదనపు ఆకర్షణలు. ఈ చిత్రం సాధించిన, సాధిస్తున్న వసూళ్లతో అల్లు అర్జున్ ఇండియా నంబర్ వన్ హీరోగా అందరూ కొనియాడుతున్నారు. సుకుమార్ కూడా భారతదేశం గర్వించదగ్గ దర్శకుడిగా టాప్ పొజిషన్‌లో ఉన్నారు’’ అని కూడా చిత్రయూనిట్ పేర్కొంది.
అల్లు అర్జున్‌కు అమితాబ్ ప్రశంస
‘పుష్ప–2’లో అద్భుతమైన నటన కనబరచిన అల్లు అర్జున్‌ని పలువురు బాలీవుడ్ ప్రముఖులు సైతం అభినందిస్తున్నారు. అలాగే ‘పుష్ప 2’ సాధిస్తున్న విజయంపైనా స్పందిస్తున్నారు. తాజాగా బిగ్ బి అమితాబ్ బచ్చన్ ట్విట్టర్ వేదికగా అల్లు అర్జున్‌పై ప్రశంసలు కురిపించారు. ఇటీవల ‘పుష్ప 2’ ప్రమోషన్స్‌లో పాల్గొన్న అల్లు అర్జున్‌కి ‘మిమ్మల్ని ఎక్కువగా ఇన్‌స్పైర్ చేసిన నటుడు ఎవరు? అనే ప్రశ్న యాంకర్ నుంచి ఎదురైంది. ఇందుకు అల్లు అర్జున్ స్పందిస్తూ– ‘‘అమితాబ్ బచ్చన్‌గారు. ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. అందుకే ఆయనంటే ఎంతో ఇష్టం’’ అని చెప్పారు.
వైరల్‌గా మారిన ఈ వీడియోపై ట్విట్టర్ వేదికగా స్పందించారు అమితాబ్ బచ్చన్. ‘‘అల్లు అర్జున్... మీ మాటలు నా హృదయానికి చేరాయి. మీరు నా అర్హతకు మించిన కితాబులు ఇచ్చారు. మేమందరం మీ నటన, ప్రతిభకి అభిమానులం. మీరు మమ్మల్ని ఇంకా ఇన్‌స్పైర్ చేయాలి. ఇలానే విజయాలు సాధిస్తుండాలని ఆ దేవుణ్ని కోరుకుంటున్నాను’’ అంటూ పోస్ట్ చేశారు. అమితాబ్ బచ్చన్ పోస్ట్‌కి అల్లు అర్జున్ స్పందిస్తూ–‘‘అమితాబ్‌గారూ... మీరు సూపర్ హీరో. మీరు నా గురించి ఇలా మాట్లాడటం ఆనందంగా ఉంది. మీ హృదయం నుండి వచ్చిన ఈ ప్రశంసలను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను. మీ మంచి మనసుకు నా కృతజ్ఞతలు’’ అంటూ పోస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment