Sultana
-
హైదరాబాదీ వెటరన్ స్పిన్నర్ రీ ఎంట్రీ.. 10 ఏళ్ల తర్వాత
అంతర్జాతీయ మ్యాచ్ ఆడి దశాబ్ద కాలం గడిచిన తర్వాత ఒక ప్లేయర్‌ను క్రీడా ప్రపంచం, అభిమానులు గుర్తుంచుకోవడం దాదాపు అసాధ్యం... ఇక మహిళా క్రికెటర్లకు మన వద్ద దక్కే గుర్తింపును బట్టి చూస్తే ఇంకా కష్టం... స్వయంగా ఆ ప్లేయరే ఆటను మరచిపోయి ఇక తన పని ముగిసినట్లే భావించి అజ్ఞాతంలోకి వెళ్లిపోతారు... కానీ 10 సంవత్సరాల విరామం తర్వాత కూడా ఒక పెద్ద టోర్నీలో మళ్లీ తెరపైకి రావచ్చని ఒక ప్లేయర్ నిరూపించింది. ఆమె పేరే గౌహర్ సుల్తానా. హైదరాబాద్‌కు చెందిన లెఫ్టార్మ్ స్పిన్నర్. 2014లో భారత్‌కు ఆఖరిసారిగా ప్రాతినిధ్యం వహించిన గౌహర్ ఇప్పుడు 2024 డబ్ల్యూపీఎల్‌లో మళ్లీ కనిపించబోతోంది. వేలంలో యూపీ వారియర్స్ జట్టు సొంతం చేసుకున్న గౌహర్ 36 ఏళ్ల వయసులో తనలో ఇంకా క్రికెట్ మిగిలి ఉందని నిరూపించేందుకు సిద్ధమైంది. మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) తాజా సీజన్లో ఆడుతున్న వారిలో 2010కు ముందు అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన ప్లేయర్లు ఇద్దరే ఉన్నారు. 2009లో హర్మన్‌ప్రీత్ కౌర్ తన తొలి మ్యాచ్ ఆడితే అంతకుముందు ఏడాదే 2008లో గౌహర్ సుల్తానా భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించింది. 2008 నుంచి 2014 మధ్యలో గౌహర్ భారత్ తరఫున 50 వన్డేలు, 37 టి20లు ఆడి మొత్తం 95 వికెట్లు పడగొట్టింది. చక్కటి బౌలింగ్ ప్రదర్శనతో ఆ సమయంలో అంతర్జాతీయ క్రికెట్లో అత్యుత్తమ స్పిన్నర్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకుంది. ఆ ఆరేళ్ల కాలంలో వన్డేల్లో భారత బెస్ట్ బౌలర్‌గా (66 వికెట్లు) కొనసాగింది. రెండు వన్డే ప్రపంచకప్‌లలో ఆడింది కూడా. తన చివరి 2 వన్డేల్లో నాలుగేసి వికెట్లు చొప్పున తీసినా అనూహ్యంగా ఆమెపై సెలక్టర్లు వేటు వేశారు. అప్పుడు గౌహర్ వయసు 26 ఏళ్లు. కారణాలేమిటో తెలియకపోయినా మళ్లీ భార త జట్టు కోసం ఆమె పేరును పరిశీలించనేలేదు. సైకాలజిస్ట్ సహాయంతో... ‘సాధారణంగా భారత్‌లో మహిళా ప్లేయర్లకు 26–27 ఏళ్లు వస్తే వారిని ఇక వారి వయసు అయిపోయిందని, ఆటకు పనికి రారని భావిస్తారు. ఇక 30 తర్వాత అయితే బరువు పెరుగుతుంది. ఎవరూ పట్టించుకోరు. కానీ నా ఫిట్నెస్ విషయంలో రాజీ పడరాదని భావించాను. అందుకే చాలా కష్టపడ్డాను’ అని గౌహర్ చెప్పింది. జాతీయ జట్టుకు దూరమైన తర్వాత ఆమె ఆగిపోలేదు. గత పదేళ్లలో దేశవాళీ క్రికెట్లో హైదరాబాద్, పుదుచ్చేరి, బెంగాల్, రైల్వేస్ జట్లకు ఆడుతూ వచ్చింది. అయితే కొత్త అమ్మాయిలతో పోలిస్తే తాను బాగా ఆడలేక వెనుకబడిపోతున్నానని భావించి తనపై తనకే అనుమానం వేసింది. ఇది మానసికంగా ఆమె ఆరోగ్యంపై ప్రభావం చూపించింది. ఇలాంటి స్థితిలో మాజీ క్రికెటర్, భారత అండర్–19 జట్టు కోచ్ నూషీన్ అల్ ఖదీర్ తగిన రీతిలో అండగా నిలిచింది. భారత జట్టులో గౌహర్తో కలిసి ఆడిన నూషీన్... సైకాలజిస్ట్ వద్దకు తీసుకెళ్లి చికిత్స చేయించడంతో పరిస్థితి మెరుగైంది. పట్టుదలగా నిలిచి... గౌహర్ తన ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన రోజులతో పోలిస్తే మహిళా క్రికెట్ ఎంతో మారింది. వేగంలో, వ్యూహాల్లో, ఆదరణలో అంతా మారిపోయింది. అయితే చికిత్స తర్వాత దేశవాళీ క్రికెట్లో నిలకడగా బౌలింగ్ చేస్తుండటంతో గౌహర్లో ఆత్మవిశ్వాసం పెరిగింది. గత రెండేళ్లలో వరుసగా వికెట్లు పడగొట్టడంలో కూడా సఫలమైంది. దాంతో 2023 డబ్ల్యూపీఎల్ వేలం కోసం తన పేరును నమోదు చేసుకుంది. కానీ సహజంగానే ఈతరం అమ్మాయిల గురించి ఆలోచించే ఫ్రాంచైజీలు ఆమెను పట్టించుకోలేదు. ఈసారి కూడా సందేహంగానే అనిపించింది. కానీ ఎట్టకేలకు ఆ అవకాశం వచ్చింది. 36 ఏళ్ల వయసులో తాను పోటీ క్రికెట్ ఆడగలనని నమ్మకం వల్లే ఈ పునరాగమనం సాధ్యమైంది. 30 ఏళ్లు దాటిన తర్వాత ఒక సీనియర్ ప్లేయర్ ఎన్నో ప్రతికూలతలను దాటి దేశవాళీ క్రికెట్‌ను నమ్ముకొని ముందుకు సాగడం అసాధారణం. గత పదేళ్లు ఆమెను ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు గౌహర్ వేసే ప్రతీ బంతిపై అందరి దృష్టీ ఉంటుంది. ఈ ఇన్నింగ్స్‌లో ఆమె అదృష్టం ఎలా ఉంటుందనేది ఆసక్తికరం. - సాక్షి క్రీడా విభాగం -
యాంకర్ సల్మా సుల్తానా హంతకుడెవరు? మూలన పడిన కేసు ఎలా బయటకు వచ్చింది?
ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా జిల్లాకు చెందిన న్యూస్ యాంకర్ సల్మా సుల్తానా అక్టోబర్ 2018లో ఉన్నట్టుండి కనిపించకుండా పోయింది. ఈ కేసులో సల్మా ప్రియుడు మధుర్ సాహు ఆమెను హత్య చేసి, అతని స్నేహితులతో కలిసి మృతదేహాన్ని పూడ్చిపెట్టినట్లు పోలీసుల దర్యాప్తులో ఇన్నాళ్లకు వెల్లడైంది. 2023, ఆగస్టు 22న సల్మా అస్థిపంజరాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. సల్మా సుల్తానా మాయమయ్యాక.. కోర్బా జిల్లాలోని కుస్ముండా నివాసి అయిన 18 ఏళ్ల సల్మా సుల్తానా ఒక కేబుల్ ఛానెల్లో యాంకర్‌గా పనిచేసేది. 10వ తరగతి పాసయ్యాక యాంకరింగ్ చేయడం మొదలుపెట్టింది. 2018, అక్టోబర్ 21న సల్మా సుల్తానా ఇంటి నుండి బయటకు వెళ్లింది. తరువాత మరి ఇంటికి తిరిగి రాలేదు. దీంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు, బంధువులు ఆమె కోసం వెదకడం ప్రారంభించారు. ఎన్నాళ్లు వెదికినా సల్మా గురించిన ఎలాంటి సమాచారం వారికి దొరకలేదు. సల్మా తండ్రి మరణించాక.. సల్మా తండ్రి 2019, జనవరి 20న మరణించారు. తండ్రి అంత్యక్రియల కోసమైనా సల్మా ఇంటికి తప్పకుండా వస్తుందని కుటుంబసభ్యులు ఆశించారు. కానీ అది జరగలేదు. అయితే ఆమె అదృశ్యంపై కుటుంబ సభ్యులు 2019 జనవరిలోనే స్థానిక కుస్ముండా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దానిలో జిమ్ నిర్వాహకుడు, సల్మా ప్రియుడు మధుర్ సాహుపై బంధువులు అనుమానాలు వ్యక్తం చేశారు. కోర్బా సిటీ ఎస్పీ రాబిన్సన్ చొరవతో.. సల్మా కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు మధుర్ సాహుతో సహా సల్మా పరిచయస్తులను విచారించారు. విచారణలో మధుర్ సాహు పోలీసులను తప్పుదోవ పట్టిస్తూ వచ్చాడు. సల్మా కేసుకు సంబంధించిన ఎటువంటి సమాచారం లభ్యం కాకపోవడంతో కేసు మూలన పడింది. అయితే 2023 మార్చిలో కోర్బా సిటీ ఎస్పీ రాబిన్సన్ గుడియా సల్మా కేసుకు సంబంధించిన ఫైల్‌ను తనిఖీ చేశారు. ఉన్నతాధికారులతో సంప్రదించిన అనంతరం తిరిగి విచారణకు ఆదేశించారు. ఈ కేసును సీరియస్‌గా దర్యాప్తు చేపట్టిన పోలీసులు పలు వివరాల రాబట్టడంలో సఫలమయ్యారు. ఒకరోజు తాగిన మత్తులో.. మీడియాకు అందిన వివరాల ప్రకారం ఈ కేసు కోల్డ్ స్టోరేజీకి చేరుకోవడంతో మధుర్ సాహు తాను ఇకపై పోలీసుల చేతికి చిక్కే అవకాశం ఉండదని భావించాడు. ఒకరోజు తాగిన మత్తులో మధుర్ తన స్నేహితుని ముందు సల్మా హత్య గురించి వెల్లడించాడు. ఏదో లావాదేవీ విషయంలో మాధుర్‌కు అతని స్నేహితునికి మధ్య వివాదం జరిగింది. దీంతో మాధుర్ స్నేహితుడు.. సల్మా హత్య గురించి పోలీసులకు సమాచారం అందించాడు. ఇది కూడా చదవండి: అది ప్రపంచంలోనే అత్యంత విషపూరిత ప్రాంతం.. ఏ జీవికైనా తక్షణం మరణం తధ్యం! సల్మా సుల్తానా రుణం చెల్లిస్తూ.. కాగా యూనియన్ బ్యాంక్ నుంచి సల్మా సుల్తానా రుణం తీసుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. పోలీసులు బ్యాంకును సంప్రదించగా సల్మా రుణానికి సంబంధించిన ఈఎంఐని గంగాశ్రీ జిమ్ యజమాని మధుర్ సాహు చెల్లిస్తున్నట్లు తెలిసింది. సల్మా కనిపించకుండా పోయిన తర్వాత ఆమె ఈఎంఐని మధుర్ సాహు చెల్లిస్తుండటంతో పోలీసులకు అనుమానం వచ్చింది. ఇంతలో మధుర్ సాహు పరారయ్యాడు. పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించగా.. సల్మా స్నేహితులు, సన్నిహితుల వాంగ్మూలాలను పోలీసులు మరోసారి నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఇద్దరు మహిళలు, ముగ్గురు పురుషుల వాంగ్మూలాలు వేర్వేరుగా ఉండటంతో వారిని పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించగా వారు నిజాన్ని బయటపెట్టారు. 2018, అక్టోబరు 21న సల్మా సుల్తానాను మధుర్ సాహు, అతని సహచరుడు కౌశల్ శ్రీవాస్ హత్య చేశారని వారు పోలీసులకు తెలిపారు. తరువాత సల్మా మృతదేహాన్ని కోర్బాలోని కొహాడియా వంతెన సమీపంలో ఖననం చేశారని వెల్లడించారు. అస్థిపంజరం కోసం తవ్వకాలు నిందితుడిని గుర్తించిన పోలీసులు కోర్టు అనుమతితో సల్మాను ఖననం చేసిన రోడ్డు ప్రాంతంలో తవ్వకాలు జరిపారు. 2 రోజుల పాటు ఈ తవ్వకాలు సాగాయి. చివరికి 2023 ఆగస్టు 22న పోలీసులు ఒక షీట్లో చుట్టివుంచిన అస్థిపంజరాన్ని కనుగొన్నారు. ఈ అస్థిపంజరం ఎవరిదనేది నిర్ధారించేందుకు దానిని డీఎస్ఏ పరీక్షలకు పంపారు. న్యూస్ యాంకర్ సల్మా సుల్తానా మృతదేహాన్ని నిందితులు ఖననం చేసిన ప్రదేశంలో గతంలో హైవేను నిర్మించారు. ఈ కేసులో ప్రధాన నిందితులైన మధుర్ సాహు, కౌశల్ శ్రీవాస్, అతుల్ శర్మలను పోలీసులు అరెస్ట్ చేసి, విచారిస్తున్నారు. ఇది కూడా చదవండి: పిజ్జా యాప్ సాయంతో ప్రియుడి అరెస్ట్.. ఇలా కూడా చేయచ్చా? అంటున్న యూజర్లు! -
Anganwadi teacher: చిరుద్యోగి పెద్ద మనసు
సేవ చేయడానికి ధనవంతులే కానక్కర్లేదు. నలుగురికి సేవ చేసే భాగ్యం లభించడం కూడా అదృష్టమే! ఇదే విషయాన్ని తన చేతల ద్వారా నిరూపిస్తోంది తెలంగాణలోని సిద్ధిపేట జిల్లా దౌల్తాబాద్ మండలంలో పదేళ్ల నుంచి అంగన్వాడీ టీచర్‌గా పనిచే స్తున్న ఉమర్ సుల్తానా. తన సంపాదనలో సగ భాగం సేవా కార్యక్రమాలకే ఉపయోగిస్తూ చుట్టూ ఉన్నవారికి ఆదర్శంగా నిలుస్తున్న సుల్తానా గురించి.. మహ్మద్ ఉమర్ సుల్తానా ఓ సాధారణ అంగన్వాడి టీచర్. పదేళ్లుగా విధులను నిర్వర్తిస్తోంది. ఉన్న ఊళ్లోనే కాదు, మండలంలోని మిగతా ఊళ్లలోనూ సుల్తానాకు మంచి పేరుంది. మా మనసున్న టీచరమ్మ అంటుంటారు స్థానికులు. ఏ ఆధారం లేనివారికి ఓ దారి చూపడమే కాదు ఏ ఆసరా లేదని కుంగిపోయేవారికి ధైర్యం చెబుతూ, అండగా నిలబడుతోంది. ‘మన మాట మంచిదయితే చాలు అందరూ మనవాళ్లే’ అంటుంది ఉమర్ సుల్తానా. దౌల్తాబాద్ మండల పరిధిలోని ఇందూప్రియాల్ గ్రామంలో సుల్తానా అంగన్వాడీ టీచర్‌గా విధులను నిర్వర్తిస్తుంటే ఆమె భర్త మహ్మద్ ఉమర్ గజ్వేల్‌లో ఓ మెకానిక్ షాపు నడిపిస్తున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు. వీరేమీ ధనవంతులు కాదు, కానీ ఎవరైనా ఆపదలో ఉన్నారని తెలిస్తే చాలు తమకు చేతనైన సాయం అందించడమే కర్తవ్యంగా భావిస్తారు. గ్రామం నుంచి మొదలు... దౌల్తాబాద్, రాయపోల్, మిరుదొడ్డి, దుబ్బాక, గజ్వేల్ మండలాలలో వందకు పైన బాధిత కుటుంబాలకు సాయం అందించింది సుల్తానా. కరోనా సమయంలో గ్రామంలోని నిరుపేదలకు నిత్యవసర సరుకులు అందజేసింది. జిల్లా వ్యాప్తంగా 108 సిబ్బంది అందిస్తున్న సేవలకు గాను వారికి సన్మానం చేసింది. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అత్యవసరమైన వస్తువులను అందజేస్తుంది. వివిధ రకాల కారణాలతో చదువు మధ్యలోనే ఆపేసిన బాలికలకు నచ్చజెప్పి, వారి తల్లిదండ్రులను ఒప్పించి తిరిగి వారు బడిలో చేరేలా ప్రోత్సహిస్తుంది. బాలికలకు అవసరమైన పుస్తకాలు, యూనిఫారమ్ కొనిస్తుంది. రక్తదానం... అత్యవసర సమయంలో తన కుటుంబంలోని వారు రక్తదానం కూడా చేస్తుంటారు. లేదంటే, తెలిసిన మిత్రుల నుండి బాధితులకు సహాయం అందేలా చేస్తుంటారు. తాము సంపాదిస్తున్న కొద్ది మొత్తంలోనే సగ భాగాన్ని సమాజ సేవకు వినియోగిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు ఈ దంపతులు. సంపాదన కన్నా ఎప్పటికీ నిలిచి ఉండేది నలుగురికి ఉపయోగపడే పనే. పెద్ద మొత్తంలో డబ్బు సాయం చేయలేకున్నా, పిడికెడు ధైర్యం ఇవ్వగలిగితే చాలు అదే కొండంత అండ అనుకుంటాను. నా ఆలోచనలకు తగినట్టు నా భర్త కూడా సహకారం అందిస్తున్నారు. ఎంత సంపాదించినా రాని తృప్తి, నలుగురి కష్టాలను పంచుకోవడంలోనే ఉంటుంది. ఆ ఆలోచనతోనే మా జీవన ప్రయాణం కొనసాగిస్తున్నాము. – సుల్తానా, అంగన్వాడి టీచర్ ఆమె సాయం మరువలేనిది అనారోగ్య కారణంతో నా భర్త మరణించాడు. తట్టుకోలేక మా అత్తమ్మ తనువు చాలించింది. ముగ్గురు పిల్లలతో దిక్కుతోచని స్థితిలో ఉన్న మాకు మొదటగా సాయం అందించింది సుల్తానా. ఆమె ముందుకు రావడంతో మరికొంతమంది మేమూ ఉన్నామని సాయంగా వచ్చారు. మాకు ఆమె ఇచ్చిన భరోసా కొండంత బలాన్ని ఇచ్చింది. కష్టకాలంలో మా కుటుంబానికి తోడుగా నిలిచింది. –షేక్ జానీ బి, సయ్యద్ నగర్ అమ్మలా తోడైంది అమ్మా నాన్నలను కోల్పోయి అనాథగా మిగిలిన నాకు ఒక అమ్మలా తోడైంది. నాలో బాధ పోయేవరకు రోజూ పలకరించింది. ఆమె అందించిన భరోసాతోనే ఇప్పుడు నా జీవితాన్ని నిలబెట్టుకోగలిగాను. – బండారు రేణుక, మంథూర్, రాయపోల్ మండలం – గజవెల్లి షణ్ముఖ రాజు, సాక్షి, సిద్దిపేట -
Aisha Sultana: అయిషాపై దేశద్రోహం కేసు.. అదిరిపోయే ట్విస్ట్
లక్షద్వీప్ ఫిల్మ్ మేకర్ అయిషా సుల్తానాపై దేశ ద్రోహం కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యవహారంలో అదిరిపోయే ట్విస్ట్ చోటు చేసుకుంది. బీజేపీ అధ్యక్షుడి తీరును ఎండగడుతూ.. ఆమెకు మద్ధతుగా బీజేపీ నేతలు మూకుమ్మడి రాజీనామాలు చేశారు. న్యూఢిల్లీ: లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ ఖోడా పటేల్‌తో పాటు కేంద్ర ప్రభుత్వంపై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసిందన్న ఆరోపణలపై కేరళ ఫిల్మ్ మేకర్. నటి అయిషా సుల్తానాపై దేశ ద్రోహం కేసు నమోదైంది. లక్షద్వీప్ బీజేపీ యూనిట్ అధ్యక్షుడు అబ్దుల్ ఖాదర్ హాజీ ఫిర్యాదుతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. అయితే ఈ వ్యవహారంలో ఇప్పుడు ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆమెకు మద్దతుగా బీజేపీ నేతలు మూకుమ్మడి రాజీనామా చేశారు. అయిషాకు మద్దతుగా లక్షద్వీప్ బీజేపీ ప్రధాన కార్యదర్శితో పాటు కీలక నేతలు, కార్యకర్తలు మొత్తం 15 మంది రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖల్ని అబ్దుల్ ఖాదర్ హాజీకి పంపించారు. ‘‘లక్షద్వీప్‌లో ప్రజలకు వ్యతిరేకంగా, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ పటేల్ చేపడుతున్న చర్యలు బీజేపీకి కూడా తెలుసు. ఆయన విధానాల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ప్రఫుల్ వ్యవహారంపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కలిసి ఫిర్యాదు చేసిన వాళ్లలో మీరూ(హాజీ) కూడా ఉన్నారు. ప్రఫుల్, జిల్లా కలెక్టర్ తప్పులను ఎండగట్టిన బీజేపీ నేతలు చాలామందే ఉన్నారు. ఇదే తరహాలో చెట్లాట్ నివాసి అయిన అయిషా.. తన అభిప్రాయాన్ని మీడియాతో పంచుకుంద’ని ఆ నేతలంతా అయిషాకు మద్దతుగా లేఖలో వ్యాఖ్యలు చేశారు. ఆమెపై(అయిషా) ఫిర్యాదు చేయడం తప్పు. ఒక సోదరి భవిష్యత్తును, ఆమె కుటుంబాన్ని నాశనం చేయాలని మీరు ప్రయత్నిస్తున్నారు.ఈ తీరును మేం తట్టుకోలేకపోతున్నాం. అందుకే ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాం అని బీజేపీ కార్యదర్శి అబ్దుల్ హమీద్ తదితరులు ఆ లేఖలపై సంతకాలు చేశారు. కాగా, ఓ మలయాళ టీవీ చర్చాకార్యక్రమంలో పాల్గొన్న ఆయిషా.. లక్షద్వీప్ ప్రజలపై కేంద్ర ప్రభుత్వం కోవిడ్ -19ను ఒక జీవాయుధంగా ప్రయోగించిందని, ఇందుకోసం అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ ఖోడా పటేల్‌ను వాడిందని పేర్కొంది. ప్రఫుల్ పటేల్ రాకముందు లక్షద్వీప్‌లో కరోనా కేసులు లేవని, ఆయన నిర్లక్క్ష్యం వల్లే కేసులు పుట్టుకొచ్చాయని ఆమె ఆ డిబెట్లో మాట్లాడింది. అయితే ఇవి కేంద్ర ప్రభుత్వంపై విద్వేషపూరిత వ్యాఖ్యలంటూ లక్షద్వీప్ బీజేపీ యూనిట్ అధ్యక్షుడు అబ్దుల్ ఖాదర్ హాజీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అయిషాపై దేశద్రోహం కేసు నమోదు చేశారు. చదవండి: నీటి అడుగున నిరసన చదవండి: హీరో పృథ్వీకి భారీ మద్ధతు -
14 మందిని తన వలలో వేసుకుని..
గన్‌ఫౌండ్రీ: పెళ్లికాని యువకులే ఆమె టార్గెట్. మాయమాటలతో బురిడీ కొట్టిస్తూ అందినకాడికి దోచుకుంటున్న మాయలేడిని శుక్రవారం అబిడ్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఐ రవికుమార్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మలక్‌పేట్ ప్రాంతానికి చెందిన షాదాన్ సుల్తానా ఎల్ఎల్బీ పూర్తిచేసి న్యాయవాదిగా పని చేస్తోంది. ఆమెకు అబిడ్స్‌లోని మైనారిటీ సంక్షేమ శాఖలో పని చేస్తున్న కాంట్రాక్ట్ రికార్డు అసిస్టెంట్ రహీంతో 2015లో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి ఇద్దరూ తరచూ ఫోన్లో మాట్లాకునేవారు, పలు మార్లు అతడితో కలిసి తిరిగింది. అప్పుడప్పుడు అతడి నుంచి డబ్బులు తీసుకుంది. రహీంను పూర్తిగా తన ఆధీనంలోకి తెచ్చుకున్న ఆమె తమ మధ్య సన్నిహిత్యాన్ని బయటపెడతానని బెదిరిస్తూ అతడి నుంచి డబ్బులు డిమాండ్ చేసేది. ఆరు నెలల కింద అతని నుంచి రూ.3 లక్షలు తన ఖాతాలోకి ట్రాన్స్ఫర్ చేయించుకుంది. మరో రూ.5 లక్షలు ఇవ్వాలని లేని పక్షంలో తనను వేధిస్తున్నావని పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించింది. దీంతో మనస్తాపానికిలోనైన రహీం గత నెల 19న అబిడ్స్‌లోని తన కార్యాలయం సమీపంలో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు నిందితురాలు షాదాన్ సుల్తానాను అరెస్ట్‌చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. 2014 నుంచి ప్రేమ నాటకం.... షాదాన్ సుల్తానా నిజామియా 2014 నుంచే ప్రేమ నాటకాలు మొదలు పెట్టింది. అదే సంవత్పరం ప్రేమ పేరుతో ఇద్దరిని మోసం చేసింది. 2018లో ఏకంగా 14 మందిని తన వలలో వేసుకుని మోసం చేసింది. 2019లో ముగ్గురిని మోసం చేసింది. నిందితురాలిపై సైఫాబాద్ పీఎస్‌లో 3, చాదర్‌ఘాట్‌లో 5, ఎల్బీనగర్లో 3, అంబర్పేట్ 2, అబిడ్స్‌లో 2, మీర్ చౌక్‌లో 4, నారాయణగూడ, మలక్‌పేట్, నల్లకుంట, ఉప్పల్ పోలీస్స్టేషన్లలో ఒక్కో కేసు నమోదయ్యాయి. కాగా ఈమె బాధితుల్లో ఓ యువ లాయర్ కూడా ఉండడం గమనార్హం. -
సౌత్‌జోన్ కెప్టెన్‌గా గౌహర్ సుల్తానా
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ జోనల్ అండర్–23 మహిళల వన్డే టోర్నమెంట్లో సత్తాచాటిన ముగ్గురు హైదరాబాద్ ప్లేయర్లు సౌత్ జోన్‌కు ఎంపికయ్యారు. కేరళలో ఈ నెల 18 నుంచి ప్రారంభమయ్యే ఈ మూడు రోజుల టోర్నమెంట్లో పాల్గొనే సౌత్ జోన్ జట్టుకు హైదరాబాద్‌కు చెందిన గౌహర్ సుల్తానా కెప్టెన్‌గా వ్యవహరించనుంది. ఆమెతో పాటు స్రవంతి నాయుడు, అనన్య ఉపేంద్రన్ జట్టులో చోటు దక్కించుకున్నారు. ఇదే జట్టులో స్టాండ్ బైగా హిమని యాదవ్, కావ్య కూడా ఉన్నారు. మరోవైపు బరోడాలో ఈ నెల 9 నుంచి 13 వరకు జరుగనున్న ఇంటర్ జోనల్ మ్యాచ్‌లకు డి. రమ్య, రచన ఎస్ కుమార్ ఎంపికయ్యారు. ఇదే జట్టులో స్టాండ్‌బైగా లక్ష్మీ ప్రసన్న కొనసాగుతుంది. మహిళల అండర్–23 క్రికెట్ ప్రాబబుల్స్‌కు ఎంపికైన వారి జాబితాను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ప్రకటించింది. 20 మందితో కూడిన ఈ బృందంలో రచన, శ్రావణి, ప్రణతి రెడ్డి, రమ్య, స్నేహ మోరే త్రిష, ప్రసన్న, అనురాధ నాయక్ (వికెట్ కీపర్), చరిష్మ, శ్రావ్య (వికెట్ కీపర్), కె. అనిత, వర్ష, శ్రావీణ, భవ్య, మమత (వికెట్ కీపర్), భావన, ప్రణతి, వినయ శ్రీ, చిత్రా మహేశ్వరి, క్రాంతిలకు చోటు దక్కింది. -
మిర్యాలగూడ కోర్టుకు నయీం కేసు నిందితులు
గ్యాంగ్‌స్టర్ నయీం కేసులో నిందితులను మంగళవారం మిర్యాలగూడ కోర్టులో పోలీసులు హాజరు పరిచారు. హజరైన వారిలో నయీం అత్త సుల్తానా, బావమరిది సాధిక్, అతడి భార్య ఫర్జానా ఉన్నారు. వీరికి న్యాయమూర్తి ఈ నెల 6 వరకు రిమాండ్ విధించారు.