ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా జిల్లాకు చెందిన న్యూస్ యాంకర్ సల్మా సుల్తానా అక్టోబర్ 2018లో ఉన్నట్టుండి కనిపించకుండా పోయింది. ఈ కేసులో సల్మా ప్రియుడు మధుర్ సాహు ఆమెను హత్య చేసి, అతని స్నేహితులతో కలిసి మృతదేహాన్ని పూడ్చిపెట్టినట్లు పోలీసుల దర్యాప్తులో ఇన్నాళ్లకు వెల్లడైంది. 2023, ఆగస్టు 22న సల్మా అస్థిపంజరాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
సల్మా సుల్తానా మాయమయ్యాక..
కోర్బా జిల్లాలోని కుస్ముండా నివాసి అయిన 18 ఏళ్ల సల్మా సుల్తానా ఒక కేబుల్ ఛానెల్‌లో యాంకర్‌గా పనిచేసేది. 10వ తరగతి పాసయ్యాక యాంకరింగ్ చేయడం మొదలుపెట్టింది. 2018, అక్టోబర్ 21న సల్మా సుల్తానా ఇంటి నుండి బయటకు వెళ్లింది. తరువాత మరి ఇంటికి తిరిగి రాలేదు. దీంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు, బంధువులు ఆమె కోసం వెదకడం ప్రారంభించారు. ఎన్నాళ్లు వెదికినా సల్మా గురించిన ఎలాంటి సమాచారం వారికి దొరకలేదు.
సల్మా తండ్రి మరణించాక..
సల్మా తండ్రి 2019, జనవరి 20న మరణించారు. తండ్రి అంత్యక్రియల కోసమైనా సల్మా ఇంటికి తప్పకుండా వస్తుందని కుటుంబసభ్యులు ఆశించారు. కానీ అది జరగలేదు. అయితే ఆమె అదృశ్యంపై కుటుంబ సభ్యులు 2019 జనవరిలోనే స్థానిక కుస్ముండా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దానిలో జిమ్ నిర్వాహకుడు, సల్మా ప్రియుడు మధుర్ సాహుపై బంధువులు అనుమానాలు వ్యక్తం చేశారు.
కోర్బా సిటీ ఎస్పీ రాబిన్సన్ చొరవతో..
సల్మా కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు మధుర్ సాహుతో సహా సల్మా పరిచయస్తులను విచారించారు. విచారణలో మధుర్ సాహు పోలీసులను తప్పుదోవ పట్టిస్తూ వచ్చాడు. సల్మా కేసుకు సంబంధించిన ఎటువంటి సమాచారం లభ్యం కాకపోవడంతో కేసు మూలన పడింది. అయితే 2023 మార్చిలో కోర్బా సిటీ ఎస్పీ రాబిన్సన్ గుడియా సల్మా కేసుకు సంబంధించిన ఫైల్‌ను తనిఖీ చేశారు. ఉన్నతాధికారులతో సంప్రదించిన అనంతరం తిరిగి విచారణకు ఆదేశించారు. ఈ కేసును సీరియస్‌గా దర్యాప్తు చేపట్టిన పోలీసులు పలు వివరాల రాబట్టడంలో సఫలమయ్యారు.
ఒకరోజు తాగిన మత్తులో..
మీడియాకు అందిన వివరాల ప్రకారం ఈ కేసు కోల్డ్ స్టోరేజీకి చేరుకోవడంతో మధుర్ సాహు తాను ఇకపై పోలీసుల చేతికి చిక్కే అవకాశం ఉండదని భావించాడు. ఒకరోజు తాగిన మత్తులో మధుర్ తన స్నేహితుని ముందు సల్మా హత్య గురించి వెల్లడించాడు. ఏదో లావాదేవీ విషయంలో మాధుర్‌కు అతని స్నేహితునికి మధ్య వివాదం జరిగింది. దీంతో మాధుర్ స్నేహితుడు.. సల్మా హత్య గురించి పోలీసులకు సమాచారం అందించాడు.
ఇది కూడా చదవండి: అది ప్రపంచంలోనే అత్యంత విషపూరిత ప్రాంతం.. ఏ జీవికైనా తక్షణం మరణం తధ్యం!
సల్మా సుల్తానా రుణం చెల్లిస్తూ..
కాగా యూనియన్ బ్యాంక్ నుంచి సల్మా సుల్తానా రుణం తీసుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. పోలీసులు బ్యాంకును సంప్రదించగా సల్మా రుణానికి సంబంధించిన ఈఎంఐని గంగాశ్రీ జిమ్ యజమాని మధుర్ సాహు చెల్లిస్తున్నట్లు తెలిసింది. సల్మా కనిపించకుండా పోయిన తర్వాత ఆమె ఈఎంఐని మధుర్ సాహు చెల్లిస్తుండటంతో పోలీసులకు అనుమానం వచ్చింది. ఇంతలో మధుర్ సాహు పరారయ్యాడు.
పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించగా..
సల్మా స్నేహితులు, సన్నిహితుల వాంగ్మూలాలను పోలీసులు మరోసారి నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఇద్దరు మహిళలు, ముగ్గురు పురుషుల వాంగ్మూలాలు వేర్వేరుగా ఉండటంతో వారిని పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించగా వారు నిజాన్ని బయటపెట్టారు. 2018, అక్టోబరు 21న సల్మా సుల్తానాను మధుర్ సాహు, అతని సహచరుడు కౌశల్ శ్రీవాస్ హత్య చేశారని వారు పోలీసులకు తెలిపారు. తరువాత సల్మా మృతదేహాన్ని కోర్బాలోని కొహాడియా వంతెన సమీపంలో ఖననం చేశారని వెల్లడించారు.
అస్థిపంజరం కోసం తవ్వకాలు
నిందితుడిని గుర్తించిన పోలీసులు కోర్టు అనుమతితో సల్మాను ఖననం చేసిన రోడ్డు ప్రాంతంలో తవ్వకాలు జరిపారు. 2 రోజుల పాటు ఈ తవ్వకాలు సాగాయి. చివరికి 2023 ఆగస్టు 22న పోలీసులు ఒక షీట్‌లో చుట్టివుంచిన అస్థిపంజరాన్ని కనుగొన్నారు. ఈ అస్థిపంజరం ఎవరిదనేది నిర్ధారించేందుకు దానిని డీఎస్‌ఏ పరీక్షలకు పంపారు. న్యూస్ యాంకర్ సల్మా సుల్తానా మృతదేహాన్ని నిందితులు ఖననం చేసిన ప్రదేశంలో గతంలో హైవేను నిర్మించారు. ఈ కేసులో ప్రధాన నిందితులైన మధుర్ సాహు, కౌశల్ శ్రీవాస్, అతుల్ శర్మలను పోలీసులు అరెస్ట్ చేసి, విచారిస్తున్నారు.
ఇది కూడా చదవండి: పిజ్జా యాప్ సాయంతో ప్రియుడి అరెస్ట్.. ఇలా కూడా చేయచ్చా? అంటున్న యూజర్లు!
Comments
Please login to add a commentAdd a comment