
లోక్‌సభలో విపక్షాల ఆందోళన
ఓటర్ల జాబితాల్లో అవకతవకలు
నకిలీ కార్డులు, అడ్డగోలు తొలగింపులు
ఎన్నికల ప్రక్రియపైనే నీలినీడలు: రాహుల్
దేశవ్యాప్తంగా అనుమానాలున్నట్టు వెల్లడి
సభలో పూర్తిస్థాయి చర్చకు డిమాండ్
తప్పిదాలను ఈసీయే ఒప్పుకుంది: ఖర్గే
ఎన్నికల ప్రక్రియను ప్రహసనంగా మార్చారు
దుయ్యబట్టిన ఆప్, ఆర్జేడీ, ఎస్పీ, బీజేడీ
ఈసీపై కఠిన చర్యలు తీసుకోవాలి: టీఎంసీ
సాక్షి, న్యూఢిల్లీ: ఓటర్ల జాబితా అవకతవకలు, నకిలీ ఓటర్ కార్డులు, ఓటర్ల సంఖ్యలో అనూహ్య పెరుగుదల, ఇష్టారాజ్యంగా ఓటర్ల తొలగింపు తదితర అంశాలను కాంగ్రెస్‌తో పాటు విపక్ష పార్టీలన్నీ సోమవారం లోక్‌సభలో లేవనెత్తాయి. వీటిపై సందేహాలు, నానాటికీ దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న ఆరోపణలు మొత్తం ఎన్నికల ప్రక్రియ సమగ్రతనే ప్రశ్నార్థకంగా మార్చాయంటూ ఆందోళన వెలిబుచ్చాయి.
పైగా వీటిపై కేంద్ర ఎన్నికల సంఘం అరకొర స్పందన మరిన్ని అనుమానాలకు తావిస్తోందన్నాయి. కనుక ఈ మొత్తం అంశంపై లోక్‌సభలో పూర్తిస్థాయి చర్చ జరగాల్సిందేనని డిమాండ్ చేశాయి. ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ జీరో అవర్లో ఈ అంశాన్ని లేవనెత్తారు. ఇది ప్రతిపక్షాలన్నీ ముక్త కంఠంతో చేస్తున్న డిమాండని ఆయన స్పష్టం చేశారు. స్పీకర్ ఓం బిర్లా స్పందిస్తూ ఓటర్ల జాబితాను కేంద్ర ప్రభుత్వం సిద్ధం చేస్తుందా అని ప్రశ్నించారు.
‘‘కేంద్రం తయారు చేయదన్నది నిజమే. కానీ ఇవన్నీ మొత్తం ఎన్నికల ప్రక్రియపైనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. అందుకే ఈ అంశంపై సవివరమైన చర్చకు మేం డిమాండ్ చేస్తున్నాం’’ అని రాహుల్ బదులిచ్చారు. ‘‘ఓటర్ల జాబితాల విశ్వసనీయతను దేశవ్యాప్తంగా విపక్ష పార్టీలన్నీ ప్రశ్నిస్తున్నాయి. మహారాష్ట్రతో సహా ప్రతి రాష్ట్రంలోనూ ప్రతిపక్షాలు దీనిపై అనుమానాలు లేవనెత్తాయి’’ అని గుర్తు చేశారు.
ఇది చాలా తీవ్రమైన అంశమంటూ సమాజ్‌వాదీ, ఆర్జేడీ, బిజూ జనతాదళ్, ఆప్ కూడా గొంతు కలిపాయి. దీన్ని పార్లమెంటు చర్చకు స్వీకరించాల్సిందేనని పట్టుబట్టాయి. తృణముల్ కాంగ్రెస్ ఎంపీ సౌగతారాయ్ ఓటర్ల జాబితా అంశాన్ని జీరో అవర్‌లో లేవనెత్తారు. ‘‘ఓటర్ల ఫొటో గుర్తింపు కార్డు నంబర్లలో నకిలీల సమస్య దశాబ్దాలుగా ఉంది. కానీ పశి్చమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆందోళన అనంతరమే కేంద్ర ఎన్నికల సంఘం దీనిపై స్పందించింది.
సమస్యను మూడు నెలల్లో పరిష్కరిస్తామని ప్రకటించింది’’ అంటూ దృష్టికి తెచ్చారు. అంటే ఇంతకాలంగా తప్పిదాలు జరుగుతూ వస్తున్నట్టే కదా అని ఆయన ప్రశ్నించారు. ‘‘బెంగాల్, హరియాణాల్లో నకిలీ ఓటరు కార్డులు దొరికాయి. ఇటీవలి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఓటర్ల సంఖ్య అనూహ్యంగా పెరిగిపోయింది. దానిపై అందరూ ప్రశ్నలు లేవనెత్తారు. హరియాణా అసెంబ్లీ ఎన్నికలప్పుడూ ఇలాగే జరిగింది. ఇవన్నీ తీవ్రమైన లోటుపాట్లే.
వచ్చే ఏడాది బెంగాల్, అసోం అసెంబ్లీ ఎన్నికలున్నందున ఆలోపే ఓటర్ల జాబితాలను పూర్తిగా సవరించాలి’’ అని డిమాండ్ చేశారు. ఈ తప్పిదాలపై దేశ ప్రజలకు ఈసీ బదులివ్వాల్సిందేనన్నారు. ఈ అంశంపై సమగ్ర చర్చకు డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష సభ్యులు నిరసనలతో హోరెత్తించారు. ఎన్నికల నిర్వహణలో ఈసీ పక్షపాతరహితంగా వ్యవహరించాలని సమాజ్‌వాదీ సభ్యుడు ధర్మేంద్రయాదవ్ అన్నారు. ‘‘మహారాష్ట్రలో నెలల వ్యవధిలోనే కొత్తగా లక్షలాది ఓటర్లు ఎలా పుట్టుకొచ్చారు? ఢిల్లీలోనూ అదే జరిగింది. 2022లో యూపీలోనూ ఇదే చేశారు’’ అని ఆరోపించారు.
రాజ్యసభలోనూ... రాజ్యసభలో కూడా జీరో అవర్లో ఈ అంశాన్ని లేవనెత్తేందుకు విపక్ష నేత మల్లికార్జున ఖర్గే ప్రయత్నించారు. డిప్యూటీ చైర్మన్ హరివంశ్ అందుకు అనుమతివ్వలేదు. దీనితో పాటు డజనుకు పైగా అంశాలపై 267వ నిబంధన కింద చర్చకు డిమాండ్ చేస్తూ విపక్షాలు ఇచి్చన నోటీసులన్నింటినీ తిరస్కరిస్తున్నట్టు ప్రకటించారు. దీన్ని నిరసిస్తూ కాంగ్రెస్‌తో పాటు విపక్షాలన్నీ వాకౌట్ చేశాయి.
‘‘మహారాష్ట్రలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల మధ్య ఆర్నెల్లలోనే ఓటర్ల సంఖ్య భారీగా పెరిగిపోయింది. ఇదెలా సాధ్యం? దీనిపై కాంగ్రెస్‌తో పాటు విపక్షాలు లేవనెత్తిన ప్రశ్నలకు ఈసీ వద్ద సమాధానమే లేదు. ఓటింగ్ ప్రక్రియ కోసం ఉపయోగించిన ఫొటో ఓటర్ల జాబితాను ఎక్సెల్ ఫార్మాట్‌లో మాకు అందజేయాలని డిమాండ్ చేస్తే ఈసీ నేటికీ స్పందించనే లేదు.
దేశవ్యాప్తంగా ఓటర్ల పేర్లను ఇష్టారాజ్యంగా తొలగించడం, డూప్లికేట్ ఈపీఐసీ నంబర్ల వంటి తీవ్ర తప్పిదాలు, లోటుపాట్లు ఇష్టారాజ్యాంగా చోటుచేసుకుంటున్నాయి. ఇవన్నీ ఎన్నికల ప్రక్రియ తాలూకు సమగ్రతనే సవాలు చేస్తున్నాయి. పైగా ఈ తప్పిదాలను స్వయంగా ఈసీయే అంగీకరించింది. కనుక వీటన్నింటిపై పార్లమెంటులో చర్చ జరగాల్సిందే. అందుకు మోదీ సర్కారు అంగీకరించాల్సిందే’’ అంటూ అనంతరం ఖర్గే ఎక్స్‌లో పోస్ట్ చేశారు. తద్వారా ప్రజాస్వామ్యంపై, రాజ్యాంగంపై ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాలన్నారు.
దేశంలో ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించడంలో కేంద్ర ఎన్నికల సంఘం కొన్నేళ్లుగా ఘోరంగా విఫలమవుతోందని అంతకుముందు టీఎంసీ సభ్యుడు కల్యాణ్ బెనర్జీ సభలో దుయ్యబట్టారు. ఇందుకు ఈసీపై తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ‘‘డూప్లికేట్ ఓటర్ కార్డుల అంశాన్ని సీఎం మమతే తొలిసారి లేవనెత్తారు. దీనిపై ఈసీ ఇచ్చిన వివరణ ఎన్నికల నిర్వహణ నిబంధనలకే విరుద్ధంగా ఉంది’’ అని ఆరోపించారు.
అనుమానాలన్నింటినీ నివృత్తి చేయాల్సిన బాధ్యత కేంద్రం, ఈసీపై ఉందని ఆప్ సభ్యుడు సంజయ్‌సింగ్ అన్నారు. ఇటీవలి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో హరియాణా పౌరులకు విచ్చలవిడిగా ఓటరు కార్డులిచ్చారని ఆరోపించారు. తద్వారా ఎన్నికల ప్రక్రియనే ప్రహసనంగా ఈసీ మార్చేసిందని దుయ్యబట్టారు. తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ఈసీ ప్రయత్నిస్తోందని ఆర్జేడీ సభ్యుడు మనోజ్ ఝా ఆరోపించారు. ‘‘ఎన్నికల ప్రక్రియే పార్లమెంటు ఉనికికి ప్రాణం. ఎన్నికల అవకతవకలపై ఇక్కడ చర్చించేందుకు అవకాశమివ్వకపోతే ప్రజాస్వామ్యానికి అర్థమే లేదు’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment