![Rahul Gandhi Alleges Voter Fraud In The Maharashtra Assembly Elections](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/8/070220251129-PTI02_07_2025_.jpg.webp?itok=oHQxNJg-)
ఓటరు జాబితాలో తీవ్ర అవకతవకలు
ఈసీ స్పందించకుంటే కోర్టుకెళతాం: రాహుల్ గాంధీ
రాత పూర్వకంగా బదులిస్తామన్న ఈసీ
న్యూఢిల్లీ: మహారాష్ట్ర ఎన్నికల్లో భారీ అవకతవకలు(irregularities)చోటుచేసుకున్నాయని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)ఆరోపించారు. రాష్ట్రంలోని వయోజనుల కంటే నమోదైన ఓటర్లే ఎక్కువమంది ఉన్నారన్నారు. అయిదేళ్ల క్రితం కంటే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల మధ్య ఐదు నెలల కాలంలో ఎక్కువ మంది పేర్లను జాబితాలో చేర్చారని చెప్పారు. 2024లో జరిగిన లోక్‌సభ ఎన్ని కలు, అసెంబ్లీ ఎన్నికలనాటి ఓటరు జాబి తాను ఇవ్వాలంటూ రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్‌లు, శివసేన(యూబీటీ), ఎన్‌సీపీ(ఎస్‌పీ)లు కోరినా ఈసీ ఇప్పటి వరకు స్పందించలేదని ఆయన తెలిపారు. దీనిపై తాము చట్ట ప్రకారం ముందుకెళతామని స్పష్టం చేశారు.
రాహుల్ గాంధీ శుక్రవారం ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో శివసేన(యూబీటీ) నేత సంజయ్ రౌత్, ఎన్‌సీపీ(ఎస్‌పీ)నేత సుప్రియా సూలేలతో కలిసి మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో చాలా మంది ఓటర్ల పేర్ల తొలగింపు లేక బదిలీ చేశారని, వీరిలో ఎక్కువ మంది దళితులు, గిరిజనులు, మైనారిటీ వర్గాల వారే ఉన్నారని రాహుల్ వివరించారు. కొత్తగా చేర్చిన ఓటర్ల కంటే తొలగింపునకు గురైన పేర్లే ఎక్కువగా ఉన్నాయని ప్రతిపక్ష పార్టీలు అనుమానిస్తున్నాయని ఆయన చెప్పారు.
5 నెలల్లోనే 39 లక్షల కొత్త ఓటర్లు
‘మహారాష్ట్ర ఎన్నికలకు(Maharashtra election)సంబంధించి ఈసీని పలు ప్రశ్నలు అడిగాం. 2019 విధాన సభ ఎన్నికలు, 2024 లోక్‌సభ ఎన్నికల మధ్యలో ఐదేళ్ల వ్యవధిలో మహారాష్ట్రలో 32 లక్షల ఓటర్ల పేర్లను చేర్చారు. అయితే, 2024 లోక్‌సభ ఎన్నికలు, 2024 అసెంబ్లీ ఎన్నికలకు గాను కేవలం ఐదు నెల్ల వ్యవధిలో ఏకంగా 39 లక్షల కొత్త ఓటర్ల పేర్లు చేరాయి’అని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత అంత స్వల్ప వ్యవధిలో అంత ఎక్కువ మంది ఓటర్లను కొత్తగా ఎలా చేర్చారు? ఈ 39 లక్షల మంది ఓటర్లు ఎవరు? 39 లక్షల మంది హిమాచల్ ప్రదేశ్ మొత్తం జనాభాతో సమానం. అయిదేళ్లలో కంటే కేవలం ఐదు నెలల్లో మహారాష్ట్రలో ఈసీ ఎక్కువ మంది ఓటర్లు ఎందుకు చేర్చింది?’అని ఆయన ప్రశ్నించారు.
కొత్త ఓట్లు బీజేపీ ఖాతాలోకే
మహారాష్ట్రలో వయోజనుల జనాభా 9.54 కోట్లు. అసెంబ్లీ ఎన్నికల నాటికి ఓటర్ల సంఖ్య 9.7 కోట్లు. మహారాష్ట్రలోని మొత్తం వయోజనుల కంటే నమోదైన ఓటర్లు ఎక్కువ మంది ఉండటం ఎలా సాధ్యమని ఆయన సందేహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్షాల ఓటు బ్యాంకు యథాతథంగా ఉండగా కొత్తగా చేరిన ఓటర్లలో ఎక్కువ మంది బీజేపీకే ఓటేశారన్నారు.
ఉదాహరణకు కంతీ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి సాధించిన మెజారిటీ కొత్తగా చేరిన ఓటర్ల సంఖ్యతో సమానంగా ఉందని ఆయన వివరించారు. అదేవిధంగా, లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో మూడు ప్రధాన ప్రతిపక్షాలకు పడిన ఓట్ల సంఖ్యలో ఎలాంటి తగ్గుదల నమోదు కాలేదని కూడా ఆయన చెప్పారు. తమ ప్రశ్నలకు ఈసీ ఎందుకు బదులివ్వడం లేదన్నారు. పారదర్శకంగా వ్యవహరించాల్సిన బాధ్యత ఈసీకుందన్నారు. లేకుంటే తమ తదుపరి చర్య న్యాయస్థానాలను ఆశ్రయించడమేనని స్పష్టం చేశారు.
అలాగైతే కేంద్రానికి బానిస అన్నట్లే..
శివసేన(యూబీటీ) నేత సంజయ్ రౌత్ మాట్లాడుతూ...‘ఈసీ సజీవంగా, సొంతంగా పనిచేయగలిగి ఉంటే రాహుల్ గాంధీ సంధించిన ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది. లేదంటే కేంద్ర ప్రభుత్వానికి అది బానిసగా మారినట్లే భావించాల్సి ఉంటుంది. ప్రభుత్వ సంకెళ్ల నుంచి ఈసీ బయటకు రావాలి’అని అన్నారు. ఎన్నికల్లో గెలిచాక కూడా తమ పార్టీకి చెందిన మల్షిరాస్ ఎమ్మెల్యే ఉత్తమ్ జన్‌కార్ మళ్లీ ఎన్నికలు జరపాలని, ఈసారి బ్యాలెట్‌ను వాడాలని డిమాండ్ చేయగా, ప్రభుత్వం అక్కడికి పోలీసులను పంపించిందని ఎన్‌సీపీ(ఎస్‌పీ)నేత సుప్రియా సూలే ఆరోపించారు.
అన్ని గణాంకాలను
వెల్లడిస్తాం: ఈసీమహారాష్ట్ర ఎన్నికల్లో అవకత వకలు జరిగాయంటూ కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ చేసిన పలు ఆరోపణలపై ఈసీ స్పందించింది. పూర్తి గణాంకాలతో లిఖిత పూర్వకంగా సమాధానమిస్తామని స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment