ఒక్కొక్కటిగా ఓటింగ్ యంత్రాల అక్రమాలు వెలుగులోకి..
ముంబైలో గెలిచిన శివసేన(షిండే) అభ్యర్థి రవీంద్రపై దర్యాప్తు
ఆయన బంధువు మొబైల్‌తో ఈవీఎంను ఆపరేట్ చేసినట్లు ఆరోపణలు
ఈవీఎంల హ్యాకింగ్ అసాధ్యమేమీ కాదన్న టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్
ఏఐ ద్వారా ఈజీగా హ్యాక్ చేయొచ్చునంటూ ట్వీట్
ముంబై ఘటన నేపథ్యంలో ఈవీఎంలపై రాహుల్ గాంధీ అనుమానాలు
ఏపీలో ఓటింగ్ సరళిపై ఇప్పటికే పలువురు ప్రజలు, నేతల అనుమానాలు
మా ఓట్లు ఏమయ్యాయంటూ ఇప్పటికే ప్రశ్నిస్తున్న జనం
గెలిచిన అభ్యర్థులే ఆశ్చర్యపడేంత మెజారిటీలు రావటంపై సందేహాలు
20 లక్షల ఈవీఎంలు ఏమయ్యాయో చెప్పాలని ప్రశ్నించిన ఉండవల్లి
బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు పాట్లన్నీ ఆరోపణలకు బలం చేకూర్చేవే
ప్రజాస్వామ్య వ్యవస్థల్లో పారదర్శకత లేకుంటే భవిష్యత్తు లేదన్న రాహుల్
ఎన్ని ఆరోపణలొస్తున్నా నోరు విప్పని సీఈసీ.. కూటమి నేతలు
బహిరంగంగా పరీక్షిస్తే తప్ప రహస్యం వీడదంటున్న టెక్ నిపుణులు
ఇలాంటి సందేహాల వల్లే ఈవీఎంలకు స్వస్తి చెప్పిన ప్రపంచ దేశాలు
సాక్షి, అమరావతి: ఎల్రక్టానిక్ ఓటింగ్ మెషిన్ల (ఈవీఎంలు) పనితీరుపై ముసురుకుంటున్న అనుమానాలతో ప్రస్తుతం దేశవ్యాప్తంగానే కాకుండా అంతర్జాతీయంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈవీఎంల హ్యాకింగ్ అసాధ్యమేమీ కాదని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిజ్ఞానం సాయంతో వాటిని సులభంగా హ్యాక్ చేయవచ్చని టెక్ దిగ్గజం, టెస్లా కంపెనీ అధినేత ఎలాన్ మస్క్ తాజాగా ట్వీట్ చేయడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈవీఎంలను మనుషులు కూడా హ్యాక్ చేసేందుకు ఆస్కారం ఉందని, అసలు వీటిని రద్దు చేయాలని చాట్ జీపీటీ నిపుణుడైన ఆయన గట్టిగా డిమాండ్ చేయడం గమనార్హం.
మరోవైపు ముంబైలో గెలుపొందిన శివసేన (షిండే) అభ్యర్థి రవీంద్ర వైకర్ బంధువు ఒకరు మొబైల్ ద్వారా ఈవీఎంను హ్యాక్ చేసి ఆపరేట్ చేసినట్లు వెలుగులోకి రావడం ఎన్నికల నిర్వహణ ప్రక్రియను ప్రశ్నార్థకంగా మారుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ సైతం ఈవీఎంల పనితీరుపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థల్లో పారదర్శకత లేకుంటే భవిష్యత్తు లేదని హెచ్చరించారు. సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో ఓటింగ్ సరళిపై ఇప్పటికే పలువురు నిపుణులు, పరిశీలకులు అనుమానాలు వ్యక్తం చేస్తుండగా తమ ఓట్లన్నీ ఏమయ్యాయంటూ గ్రామాలకు గ్రామాలే నిలదీస్తుండటం గమనార్హం.
గెలుపొందిన అభ్యర్థులు సైతం ఊహించని స్థాయిలో మెజారిటీలు రావటంపై నీలి నీడలు అలుముకుంటున్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి ఈవీఎంల పనితీరుపై సర్వత్రా సందేహాలు తలెత్తుతున్నా... తాము వేసిన ఓట్లు ఏమయ్యాయని ఓటర్లు ప్రశ్నిస్తున్నా.. 20 లక్షల ఈవీఎంలు ఏమయ్యాయని యావత్ దేశం నిలదీస్తున్నా... ఇవిగో ఈవీఎం మోసాలంటూ ఆధారాలు చూపిస్తున్నా... కేంద్ర ఎన్నికల సంఘం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటం మరింత ఆందోళన రేకెత్తిస్తోంది. ‘తాంబూలాలు ఇచ్చేశాం... ఇక తన్నుకు చావండి’ అనే రీతిలో ఎన్నికల ప్రక్రియ ముగిశాక తమకు సంబంధం లేదనే రీతిలో బాధ్యతల నుంచి ఈసీ పలాయనం చిత్తగించడం ఈ సందేహాలకు మరింత బలం చేకూరుస్తోంది.
ఈవీఎంల ద్వారా ఎన్నికలు నిర్వహించిన అనంతరం అందులో లొసుగులు గుర్తించడంతో వాటిని నిషేధించిన దేశాల సంఖ్య పెరుగుతోంది. సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందిన దేశాలు సైతం ఇప్పటికీ బ్యాలెట్ పేపర్ విధానాన్నే అనుసరిస్తున్న నేపథ్యంలో మన దేశంలో ఈవీఎంలతో ఎన్నికల నిర్వహణ సరికాదని సాధారణ ఓటర్లతోపాటు నిపుణులు ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బహిరంగంగా పరీక్షిస్తే కానీ ఈ రహస్యం వీడదని టెక్ నిపుణులు వాŠయ్‌ఖ్యానిస్తున్నారు.
చిప్‌లోనే చిదంబర రహస్యం..!
ఈవీఎంలలో ఉపయోగిస్తున్న చిప్‌లపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిజ్ఞానంపై కేంద్ర ఎన్నికల కమిషన్ (ఈసీ) సూటిగా సమాధానం చెప్పకపోవడం సందేహాలకు బలం చేకూరుస్తోంది. ఈవీఎంలను హ్యాక్ చేయవచ్చని పలువురు సవాళ్లు విసురుతున్నా ఈసీ ఏమాత్రం పట్టించుకోవట్లేదు. దీనిపై కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా ఈసీ చేసిన ప్రకటన మరిన్ని సందేహాలకు తావిచ్చింది. ఈవీఎంలలలో బ్లూటూత్ టెక్నాలజీ లాంటిది ఉండదు కాబట్టి హ్యాక్ చేయడం సాధ్యం కాదని ఈసీ ఇటీవల వరకు వాదిస్తూ వచ్చింది. అయితే ఈవీఎంలలో ప్రోగ్రామబుల్ చిప్‌లు ఉపయోగిస్తున్నామని, ఫ్లాష్ మెమరీ వాడకం కూడా ఉంటుందని ఈసీ ఇటీవల తొలిసారిగా అంగీకరించింది. ప్రోగ్రామబుల్ చిప్‌లు, ఫ్లాష్ మెమరీని హ్యాక్ చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. మరి ఈవీఎంలు భద్రమేనా? అంటే ఈసీ సూటిగా సమాధానం చెప్పడం లేదు.
భద్రతా సందేహాస్పదమే
ఈవీఎంల భద్రత, నిర్వహణపైనా నీలి నీడలు అలుముకుంటున్నాయి. నిపుణులు వ్యక్తం చేస్తున్న సందేహాలకు ఈసీ సూటిగా సమాధానాలు చెప్పడం లేదు. ఈవీఎంల నిర్వహణ విషయంలో ఎన్నో భద్రత లోపాలు, ఇతర లొసుగులు ఉన్నట్లు ఇప్పటికే చాలా సందర్భాల్లో రుజువైంది. 2017 డిసెంబరు నాటికే ఈవీఎంల చోరీ, ధ్వంసం ఉదంతాలు దాదాపు 70 వరకూ చోటు చేసుకున్నట్లు ‘ద వైర్’ ప్రచురించిన కథనం స్పష్టం చేసింది. ఉత్తరాఖండ్‌కు చెందిన మాజీ మంత్రి సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ఈసీ ఈ విషయాన్ని వెల్లడించింది.
ఈవీఎంలను తయారు చేసే ఎల్రక్టానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ప్రకటన ప్రకారం.. ఈసీఐ కోరిన దాని కంటే 1,97,368 ఈవీఎంలు, 3,55,747 కంట్రోల్ యూనిట్లు ఎక్కువగా తయారయ్యాయి. 2024 ఎన్నికల సందర్భంగా కొన్ని ఉత్తరాది రాష్ట్రాల్లో ఈవీఎంలు ప్రైవేట్ వ్యక్తుల వద్ద లభించాయి. ఇక చోరీకి గురైన ఈవీఎంలపై ఈసీ స్పందన విడ్డూరంగా ఉంది. ప్రతి ఈవీఎంకు ప్రత్యేకమైన ఐడీ ఉంటుందని, యంత్రం చోరీకి గురైనా, కనిపించకుండా పోయినా ఆ ఐడీని బ్లాక్‌లిస్ట్‌లో పెడతామని పేర్కొంది. తద్వారా ఆ ఈవీఎంలలో నమోదైన ఓట్లు పోలైన ఓట్లలో కలవకుండా జాగ్రత్త పడుతున్నట్లు తెలిపింది.
మరి చోరీకి గురైన యంత్రాల్లో పరికరాలను మార్చినా, ఓటింగ్ నమోదు చేసేందుకు వాడిన సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేసి ఇతర ఈవీఎంలతో కలిపేస్తే ఏమవుతుంది? అనే ప్రశ్నలకు ఈసీ మౌనం దాల్చడం గమనార్హం. ఈవీఎంలను భద్రపరుస్తున్న ప్రదేశాలు సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉన్నాయా? సీసీ కెమెరాలు ఉంటే వాటి ఫుటేజీని అందరికీ ఎందుకు అందుబాటులోకి ఉంచడం లేదు? అందులో ఇబ్బంది ఏమిటి? అని నిపుణులు ప్రశ్నిస్తున్నారు.
పోలింగ్ ముగిసిన తరువాత ఓట్ల లెక్కింపు వరకు స్ట్రాంగ్ రూమ్‌లలో ఈవీఎంల భద్రత వ్యవస్థ ఎంతవరకు పటిష్టం? అనే సందేహాలున్నాయి. స్ట్రాంగ్ రూమ్‌ల సీసీ కెమెరాల ఫుటేజీలను అన్ని పార్టీలకూ అందుబాటులో ఉంచితే పారదర్శకంగా ఉంటుంది. ఈ డిమాండ్‌పై ఈసీ కనీసం స్పందించలేదు. ఒకవైపు ఈవీఎంలను హ్యాక్ చేయడం సాధ్యమేనని నిపుణులు బల్లగుద్ది చెబుతుండగా సందేహాలను నివృత్తి చేయాల్సిన ఈసీ దాగుడుమూతలు ఆడటం అనుమానాలను బలపరుస్తోంది.
20 లక్షల ఈవీఎంలు ఏమయ్యాయి?
దేశంలో ఏకంగా 20 లక్షల ఈవీఎంలు కనిపించకపోడం మొత్తం ఎన్నికల ప్రక్రియపైనే ప్రశ్నార్థకంగా మార్చేసింది. ఎన్నికల నిర్వహణ కోసం 60 లక్షల ఈవీఎంలను దిగుమతి చేసుకోగా వాటిలో 40 లక్షల ఈవీఎంలను ఎన్నికల ప్రక్రియకు కేటాయించినట్టు ఈసీ వెల్లడించింది. మరి మిగిలిన 20 లక్షల ఈవీఎంలు ఎక్కడున్నాయనే ప్రశ్నకు ఇటు ఈసీగానీ అటు కేంద్ర ప్రభుత్వంగానీ జవాబు చెప్పడం లేదు. ఆ 20 లక్షల ఈవీఎంలు ఏమయ్యాయో చెప్పాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ గట్టిగా డిమాండ్ చేశారు. దేశంలో ఎంపిక చేసిన రాష్ట్రాలు, నియోజకవర్గాల్లో గుట్టు చప్పుడు కాకుండా ఈవీఎంలను మార్చి అక్రమాలకు పాల్పడినట్లు కమ్యూనిస్టు పార్టీలు ఆరోపిస్తున్నాయి.
అందుకు తగ్గట్టుగానే ఆంధ్రప్రదేశ్, ఒడిశాలో ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా విభ్రాంతి వ్యక్తమవుతోంది. వైఎస్సార్ సీపీ, బిజూ జనతాదళ్ పార్టీలు తమకు అత్యంత బలమైన స్థానాల్లో కూడా ఓడిపోవడం విస్మయపరుస్తోంది. రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీకి ఏమాత్రం బలం లేని నియోజకవర్గాల్లో సైతం ఆ పార్టీల అభ్యర్థులకు అనూహ్య మెజార్టీలు వచ్చాయి. ఇక ఒడిశాలో బీజేపీ ఉనికి అంతంత మాత్రంగా ఉన్న నియోజకవర్గాల్లో కూడా ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించడం గమనార్హం. బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు పడ్డ పాట్లన్నీ ఆరోపణలకు బలం చేకూరుస్తున్నాయి.
బస్సులు, ప్రైవేట్ వాహనాల్లో..
కర్ణాటకలో ఓ బీజేపీ ఎంపీ అభ్యర్థి వాహనంలో ఈవీఎంలు తరలిస్తున్న విషయం ఎన్నికల ముందే బయటపడింది. పిఠాపురం నియోజకవర్గంలో ఈవీఎంలను బస్సులో తరలించారు. ఓ ప్రైవేట్ వాహనంలో సైతం ఈవీఎంలు తరలించినట్లు బయటపడ్డా ఈసీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. దేశవ్యాప్తంగా పలుచోట్ల ఇదే రీతిలో ఈవీఎంలను ప్రైవేట్ వ్యక్తుల పర్యవేక్షణలో తరలించినట్లు తెలుస్తోంది. అవన్నీ కనిపించకుండాపోయిన 20 లక్షల ఈవీఎంలలోనివేనని పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు.
అదృశ్యమైన 20 లక్షల ఈవీఎంలు ఎక్కడున్నాయో వెల్లడించాలని వామపక్షాలతోపాటు ఇతర పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 40 లక్షల ఈవీఎంతోనే ఎన్నికలు నిర్వహించామని, మిగిలిన 20 లక్షల ఈవీఎంల సంగతి తమకు తెలియదంటూ ఈసీ దాటవేత వైఖరి అనుసరిస్తోంది. ఈసీ, కేంద్ర ప్రభుత్వం కుమ్మక్కై ఈ అంశాన్ని కప్పిపుచ్చేందుకు యత్నిస్తున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఈవీఎంలను నిషేధించాలి: ప్యూర్టోరికోలో ఎన్నికల అక్రమాలపై ఎక్స్‌లో ఎలాన్ మస్క్
ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించాలంటే ఈవీఎంలను నిషేధించాలి. ఈవీఎంల ద్వారా ఎన్నికల నిర్వహణ సరికాదు. వాటిని సులభంగా హ్యాక్ చేయవచ్చు. ఈ భూమ్మీద హ్యాక్ చేయలేనిది ఏదీ లేదు.
ఈవీఎంలు బ్లాక్ బాక్స్‌లు: ఎక్స్‌లో రాహుల్‌గాందీ
ఈవీఎంలు బ్లాక్ బాక్సులు లాంటివి. వాటిని పరిశీలించేందుకు ఎవరికీ అనుమతి ఇవ్వరు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత లేకపోవడం తీవ్ర ఆందోళనకరం.
నిషేధిస్తూ విధాన నిర్ణయాలు
ప్రపంచంలో మెజార్టీ దేశాలు ఈవీఎంల ద్వారా ఎన్నికల నిర్వహణకు వ్యతిరేకంగా విధాన నిర్ణయం తీసుకున్నాయి. భారత్‌తోపాటు బ్రెజిల్, వెనిజులా తదితర దేశాల్లో మాత్రమే ఈవీఎంల ద్వారా ఎన్నికలు నిర్వహిస్తున్నారు. అత్యధిక దేశాల్లో ఈవీఎంలను పూర్తిగా నిషేధించగా మరికొన్ని దేశాల్లో ఇతర పద్ధతులను జోడించి ఓటింగ్ ప్రక్రియ నిర్వహిస్తున్నారు.
మొబైల్‌తో ఈవీఎం హ్యాకింగ్
ఈవీఎంలు ఎంత లోపభూయిష్టమో... వాటిని ఎంత సులువుగా హ్యాక్ చేయవచ్చో బహిర్గతమైంది. ముంబై నుంచి వెలువడే ప్రముఖ దినపత్రిక ‘మిడ్ డే’ కథనం ప్రకారం.. మహారాష్ట్రలోని వాయువ్య ముంబై నియోజకవర్గం నుంచి ఎంపీగా కేవలం 48 ఓట్లతో విజయం సాధించిన శివసేన (ఏక్‌నాథ్ షిండే) అభ్యర్థి రవీంద్ర వైకర్ సమీప బంధువు మంగేశ్ పండిల్కర్ తన మొబైల్ ఫోన్ ద్వారా ఈవీఎంను అన్‌లాక్ చేశారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియను ఈ నెల 4న ముంబైలోని నెస్కో సెంటర్‌లో నిర్వహించారు. ఎంపీ బంధువు మంగేశ్ పండిల్కర్ ఈ సందర్భంగా తన మొబైల్ ఫోన్ ద్వారా ఈవీఎంను అన్‌లాక్ చేశారు. ఓటీపీ జనరేట్ చేయడం ద్వారా ఈవీఎంను అన్‌లాక్ చేయడం గమనార్హం.
మొదట్లో శివసేన(ఉద్ధవ్ ఠాక్రే) అభ్యర్థి అమోల్ సంజన కీర్తికర్ కంటే వెనుకబడిన రవీంద్ర వైకర్ అనూహ్యంగా కేవలం 48 ఓట్లతో విజయం సాధించడం గమనార్హం. నిబంధనలకు విరుద్ధంగా కౌంటింగ్ కేంద్రంలోకి మొబైల్ ఫోన్ తీసుకువెళ్లడం, అదే ఫోన్ ద్వారా శివసేన (ఏక్‌నాథ్ షిండే) అభ్యర్థి పలువురితో మంతనాలు జరపడంపై ముంబై పోలీసులు ఈ నెల 14న కేసు నమోదు చేసి నిందితులకు నోటీసులు జారీ చేశారు. మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ పరీక్షకు పంపారు. అయితే మొబైల్ ద్వారా ఈవీఎంను హ్యాక్ చేశారన్న మిడ్ డే పత్రిక కథనాన్ని ఎన్నికల కమిషన్ ఖండించింది.
Comments
Please login to add a commentAdd a comment