ఎన్నికల్లో ఈవీఎంలను ఉపయోగించొద్దు
స్పేస్ ఎక్స్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ సలహా
ఇండియాలో ఈవీఎంలు సురక్షితమే
కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పష్టీకరణ
ఈవీఎంలు బ్లాక్‌బాక్సుల్లాంటివే: రాహుల్ గాంధీ
ఎన్నికలను బ్యాలెట్ పేపర్లతోనే నిర్వహించాలి: అఖిలేష్
న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎం) పనితీరు, పారదర్శకతపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఈవీఎంలలో నమోదైన ఫలితాలను సులభంగా తారుమారు చేయొచ్చని, ఎన్నికల్లో వీటిని ఉపయోగించకపోవడమే మంచిదని పలువురు నిపుణులు సూచిస్తున్నారు. స్పేస్ ఎక్స్, టెస్లా కంపెనీల యజమాని, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సైతం ఈవీఎంలపై స్పందించారు.
ఈ మేరకు తాజాగా ‘ఎక్స్’లో తన అభిప్రాయం వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో వినియోగిస్తున్న ఈవీఎంల పనితీరుపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ యంత్రాలను హ్యాక్ చేసేందుకు ఆస్కారం ఉందన్నారు. మస్క్ అభిప్రాయాన్ని కేంద్ర ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖ మాజీ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఖండించారు. భారత్‌లో ఉపయోగిస్తున్న ఈవీంఎలు పూర్తిగా సురక్షితమేనని తేల్చిచెప్పారు. దీనిపై మస్క్ ఘాటుగా స్పందించారు.
ఏదైనా హ్యాక్ చేయొచ్చని పేర్కొన్నారు. ఎల్రక్టానిక్ ఓటింగ్ యంత్రాలపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాందీ, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్‌లు కూడా ఆదివారం స్పందించారు. ఈవీఎంలు ఎవరూ తనిఖీ చేయలేని బ్లాక్‌బాక్సుల్లాంటివేనని రాహుల్ గాంధీ స్పష్టంచేశారు. ‘ఎక్స్’లో ఎలాన్ మస్క్ చేసిన పోస్టును తన ‘ఎక్స్’ ఖాతాల్లో రాహుల్ షేర్ చేశారు. ఈవీఎంల విశ్వసనీయతను అఖిలేష్ యాదవ్ ప్రశ్నించారు.
రిస్క్ చిన్నదైనా పరిణామం పెద్దదే
మనుషులు లేదా కృత్రిమ మేధ(ఏఐ)తో ఈవీఎంలను హ్యాక్ చేసేందుకు ఆస్కారం ఉంది. ఎన్నికల ప్రక్రియలో ఈవీఎంలను వాడొద్దు. ఎన్నికల నుంచి ఈ యంత్రాలను దూరంగా ఉంచాలి. ఈవీఎంలను హ్యాక్ చేసే రిస్క్ తక్కువగా ఉన్నప్పటికీ అది ముమ్మాటికీ హ్యాకింగే అవుతుంది. రిస్క్ చిన్నదైనా అది పెద్ద పరిణామానికి దారితీస్తుంది.
– ఎలాన్ మస్క్, స్పేస్ ఎక్స్, టెస్లా కంపెనీల అధినేత
ఎన్నికల ప్రక్రియపై అనుమానాలున్నాయి
భారత్‌లో ఉపయోగిస్తున్న ఈవీఎంలు బ్లాక్‌బాక్సుల్లాంటివే. వాటిని తనిఖీ చేయడానికి ఎవరినీ అనుమతించరు. మన దేశంలో అమల్లో ఉన్న ఎన్నికల ప్రక్రియపై తీవ్ర ఆందోళనలు, అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వ్యవస్థల్లో జవాబుదారీతనం, పారదర్శకత లోపించినప్పుడు ప్రజాస్వామ్యం ఓ బూటకంగానే మిగిలిపోతుంది
– ‘ఎక్స్’లో రాహుల్ గాంధీ
ఈవీఎంలు పూర్తి సురక్షితం
పూర్తిగా సురక్షితమైన ఎల్రక్టానిక్ పరికరాలను, డిజిటల్ హార్డ్‌వేర్‌ను ఎవరూ తయారు చేయలేరన్న సాధారణ అభిప్రాయం ప్రజల్లో ఉంది. అలా అను కోవడం పొరపాటు. ఈవీఎంలపై ఎలాన్ మస్క్ వ్యక్తం చేసిన భయాందోళలు సమంజసం కాదు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను హ్యాక్ చేయడం అమెరికాతోపాటు ఇతర దేశాల్లో సాధ్యమవుతుందేమో గానీ ఇండియాలో ఎంతమాత్రం వీలుపడదు. ఇతర దేశాల్లో ఇంటర్నెట్‌తో అనుసంధానించిన ఓటింగ్ యంత్రాలను వాడుతుంటారు.
ఇండియాలో అలాంటి పరిస్థితి లేదు. ఇంటర్నెట్‌తో కనెక్ట్ చేసినప్పుడు అవకతవకలు జరిగే అవకాశం ఉండొచ్చు. ఇండియాలో ఈవీఎంలకు ఇంటర్నెట్‌తో గానీ, బ్లూటూత్‌తో గానీ, వై–ఫైతోగానీ ఎలాంటి అనుసంధానం ఉండదు. ఇవి పూర్తిగా సురక్షితమైనవి. ఫ్యాక్టరీలో పోగ్రామ్ చేసిన ఈవీఎం కంట్రోలర్లను బయట రీప్రోగ్రామింగ్ చేయడం సాధ్యం కాదు. ఇండియాలో ఉపయోగిస్తున్న ఈవీఎంలు, వాటి భద్రత గురించి ఎలాన్ మస్‌్కకు ట్యూషన్ చెప్పడానికి నేను సిద్ధమే
– రాజీవ్ చంద్రశేఖర్, కేంద్ర ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖ మాజీ సహాయ మంత్రి
‘‘ఏదైనా(ఏ ఎల్రక్టానిక్ పరికరమైనా) హ్యాక్ చేయొచ్చు’’
– రాజీవ్ చంద్రశేఖర్ వ్యాఖ్యలపై ఎలాన్ మస్క్ ప్రతిస్పందన
ఈవీఎంలకు స్వస్తి పలకాలి
టెక్నాలజీ అనేది సమస్యలను పరిష్కరించేలా ఉండాలి. అదే టెక్నాలజీ ఒక సమస్యగా మారినప్పుడు దాన్ని పక్కనపెట్టమే మంచిది. ఈవీఎంలను హ్యాక్ చేయొచ్చని నిపుణులు ఇప్పటికే నిరూపించారు. ప్రపంచవ్యాప్తంగా ఈవీఎంలపై ఆందోళనలు వ్యక్తమవుతున్నా యి. ఓటింగ్ యంత్రాలను హ్యాక్ చేస్తున్నట్లు సందేహాలున్నాయి.
ఈవీఎం ట్యాంపరింగ్‌పై ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ నిపుణులు సైతం బహిరంగంగా ప్రకటనలు చేశారు. అలాంటప్పుడు మన దేశంలో ఈవీఎంలను బలవంతంగా ఉపయోగించాల్సిన అవసరం ఏమిటి? దీనిపై అధికార బీజేపీ సమాధానం ఇవ్వాలి. ఈవీఎంలకు స్వస్తి పలకాలి. భవిష్యత్తులో జరిగే ఎన్నికలను బ్యాలెట్ పేపర్లతోనే నిర్వహించాలి.
– ‘ఎక్స్’లో అఖిలేష్ యాదవ్
దమ్ముంటే హ్యాక్ చేసి చూపించండి
ఎలాన్ మస్క్ గానీ, ఇంకెవరైనా గానీ ఈవీఎంలను హ్యాక్ చేయవచ్చని చెబుతున్న వ్యక్తులు భారత ఎన్నికల సంఘాన్ని సంప్రదించాలి. అక్కడ ఈవీఎంను తీసుకొని హ్యాక్ చేసి చూపించాలి. ఇదే మా చాలెంజ్. భారతదేశ ప్రజాస్వామ్యం గురించి రాహుల్ గాంధీ ఎందుకు ఎలాన్ మస్‌్కకు ఫిర్యాదు చేస్తున్నారు? మస్క్ ఏం చేయగలరు? ప్రపంచం ముందు కన్నీళ్లు పెట్టుకోవడం, భారతదేశ ప్రతిష్టను దిగజార్చడం కాంగ్రెస్ డీఎన్‌ఏలో ఒక భాగమా? వారసత్వ రాజకీయాలను ప్రజలు వరుసగా మూడోసారి తిరస్కరించారు. అయినా ఆ విషయం కాంగ్రెస్‌కు అర్థం కావడం లేదు?
– అమిత్ మాలవీయ, బీజేపీ ఐటీ విభాగం ఇన్‌చార్జి
Comments
Please login to add a commentAdd a comment