హెచ్‌1బీ వీసాల రక్షణ కోసం  యుద్ధానికైనా సిద్ధమే | Elon Musk says he will go to war over H-1B issue | Sakshi
Sakshi News home page

హెచ్‌1బీ వీసాల రక్షణ కోసం  యుద్ధానికైనా సిద్ధమే

Published Sun, Dec 29 2024 6:29 AM | Last Updated on Sun, Dec 29 2024 9:08 AM

Elon Musk says he will go to war over H-1B issue

తేల్చిచెప్పిన ఎలాన్‌ మస్క్‌  

వాషింగ్టన్‌:  టెస్లా, ఎక్స్, స్పేస్‌ఎక్స్‌ సంస్థల అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ హెచ్‌–1బీ వీసాలకు మద్దతుగా నిలిచారు. ఈ వీసాల పరిరక్షణ కోసం అవసరమైతే యుద్ధానికైనా సిద్ధమేనని తేల్చిచెప్పారు. హెచ్‌–1బీ వీసాల విషయంలో ఇటీవల విస్తృతంగా చర్చ జరుగుతోంది. కొందరు వ్యతిరేకిస్తుండగా, మరికొందరు మద్దతిస్తున్నారు. ఈ వ్యవహారంపై ఎలాన్‌ మస్క్‌ శనివారం స్పందించారు. నిపుణులైన ఉద్యోగులకు అమెరికాలో పనిచేసుకొనేందుకు అవకాశం కల్పించే హెచ్‌–1బీ వీసాల విషయంలో అభిప్రాయం మార్చుకోవాలని వాటి వ్యతిరేకులకు సూచించారు.

 ‘‘నాతోపాటు ఎంతోమంది అమెరికాకు రావడానికి, స్పేస్‌ఎక్స్, టెస్టా వంటి సంస్థలు స్థాపించడానికి కారణం హెచ్‌–1బీ వీసాలే. ఈ వీసాలతోనే మేము ఇక్కడికొచ్చి పనిచేశాం. అవకాశాలు అందుకున్నాం. హెచ్‌–1బీ వీసాలతోనే అమెరికా బలమైన దేశంగా మారింది. ఇలాంటి వీసాలను వ్యతిరేకించడం మూర్ఖుపు చర్య. దాన్ని నేను ఖండిస్తున్నా. ఈ వీసాలు ఉండాల్సిందే. ఈ విషయంలో అవసరమైతే యుద్ధానికైనా సిద్ధంగా ఉన్నా’’అని మస్క్‌ సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. వచ్చే ఏడాది జనవరి 20న అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణం చేయబోతున్నా డొనాల్డ్‌ ట్రంప్‌ విదేశాల నుంచి వలసలు తగ్గిస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. 

విదేశీయులకు వీసాలు ఇచ్చే విషయంలో కఠినంగా వ్యవహరించబోతున్నట్లు ఇప్పటికే ఆయన సంకేతాలిచ్చారు. ట్రంప్‌క అత్యంత సన్నిహితుడైన ఎలాన్‌ మస్క్‌ హెచ్‌–1బీ వీసాలకు మద్దతుగా గొంతు విప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది. కృత్రిమ మేధపై వైట్‌హౌస్‌ సీనియర్‌ పాలసీ సలహాదారుడిగా భారత అమెరికన్‌ వెంచర్‌క్యాలిటలిస్టు శ్రీరామ్‌ కృష్ణన్‌ను ట్రంప్‌ ఇటీవల నియమించారు. నిపుణులైన వలసదార్ల కోసం గ్రీన్‌కార్డులపై పరిమితి తొలగించాలని కృష్ణన్‌ డిమాండ్‌ చేస్తున్నారు. దీన్ని రిపబ్లికన్‌ నేతలు తప్పుపడుతున్నారు. ఈ నేపథ్యంలో హెచ్‌–1బీ వీసాలపై రగడ మొదలైంది.   
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement