
టెస్లా, స్పేస్ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్(Elon Musk) చైనాకు చెందిన బైట్‌డ్యాన్స్ ఆధ్వర్యంలోని టిక్‌టాక్(TikTok) అమెరికా కార్యకలాపాల(US operations)ను కొనుగోలు చేయవచ్చనే వార్తలొస్తున్నాయి. అమెరికాలో జాతీయ భద్రత, డేటా గోప్యతపై పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో బైట్‌డ్యాన్స్ యూఎస్ కార్యకలాపాలు ప్రశ్నార్థకంగా మారాయి. ఈ నేపథ్యంలో టిక్‌టాక్‌ను స్థానికంగా నిషేధించనున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. దీనిపై ఇంకా తుది నిర్ణయం రాలేదు.
చైనాకు చెందిన బైట్‌డ్యాన్స్(ByteDance) ఆధ్వర్యంలోని టిక్‌టాక్‌ను 2025 జనవరి 19 నాటికి అమెరికాకు చెందిన ఓ కంపెనీకి విక్రయించాలనేలా గతంలో ఆంక్షలు విధించారు. లేదంటే ఈ యాప్‌పై నిషేధం విధించే అవకాశం ఉంది. ఈ నిషేధాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలనేలా టిక్‌టాక్ అమెరికా ఉన్నత న్యాయస్థానాన్ని ఇటీవల అభ్యర్థించింది. దాంతో 2025 జనవరి 10న కంపెనీ వాదనలు వినడానికి న్యాయస్థానం అంగీకరించింది. దీనిపై తుదితీర్పు రావాల్సి ఉంది.
అమెరికాలో జాతీయ భద్రతా ఆందోళనల కారణంగా ఈ యాప్‌పై చాలా విమర్శలొచ్చాయి. దాంతో అమెరికా ప్రభుత్వం ప్రాథమికంగా దర్యాప్తు జరిపింది. అమెరికా దేశ భద్రతకు భంగం వాటిల్లేలా స్థానికుల నుంచి సున్నితమైన సమాచారాన్ని సేకరించి దాన్ని చైనాలోని డేటా సెంటర్లలో స్టోర్ చేస్తున్నారని ప్రాథమికంగా నిర్ధారించింది.
డేటా భద్రత
లొకేషన్లు, ప్రైవేట్ సందేశాలతో సహా అమెరికన్ యూజర్ల నుంచి టిక్‌టాక్ పెద్దమొత్తంలో డేటా సేకరించి దేశ భద్రతకు భంగం కలిగించేలా డేటాను చైనా ప్రభుత్వం యాక్సెస్ చేస్తుందనే ఆందోళనలు వ్యక్తమయ్యాయి.
కంటెంట్ మానిప్యులేషన్
అమెరికన్లు చూసే కంటెంట్‌ను తారుమారు చేయడానికి, ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేయడానికి లేదా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి టిక్‌టాక్‌ను వినియోగిస్తున్నారనే భయాలు ఉన్నాయి.
ఇదీ చదవండి: మరింత క్షీణిస్తున్న రూపాయి!
ఈ నేపథ్యంలో బైట్‌డ్యాన్స్ 2025 జనవరి 19 లోగా టిక్‌టాక్‌ను అమెరికా కంపెనీకి విక్రయించాలని లేదా నిషేధాన్ని ఎదుర్కోక తప్పదని 2024 ఏప్రిల్‌లో ఒక చట్టం ఆమోదించారు. ద్వైపాక్షిక మద్దతుతో ఈ చట్టాన్ని రూపొందించి జో బైడెన్ దానిపై సంతకం చేశారు. దాంతో కంపెనీ అమెరికా ఉన్నత న్యాయస్థానం ముందు తన వాదనలు వినిపించింది. ఈ తరుణంలో ఎలాన్‌మస్క్ టిక్‌టాక్ అమెరికా కార్యకలాపాలను కొనుగోలు చేయబోతున్నట్లు కొన్ని మీడియా సంస్థలు వార్తాకథనాలు ప్రచురిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment