రూపాయి విలువ రోజురోజుకూ తెగ్గోసుకుపోతోంది. డాలర్ మారకంలో సోమవారం ఏకంగా 66 పైసలు బలహీనపడి జీవితకాల కనిష్ట స్థాయి 86.70 వద్ద స్థిరపడింది. అమెరికా కరెన్సీ బలపడంతో పాటు చమురు ధరలు భగ్గుమనడంతో దేశీయ కరెన్సీ భారీ కోతకు గురైంది. ఫారెక్స్(Forex) మార్కెట్లో రోజంతా తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనైంది రూపాయి... ఏ దశలోనూ కోలుకోలేక చివరికి ఇంట్రాడే కనిష్టం (86.70) వద్ద ముగిసింది. దాదాపు రెండేళ్ల తర్వాత (2023 ఫిబ్రవరి 6న 68 పైసలు) దేశీయ కరెన్సీకి ఇదే అతిపెద్ద పతనం.
గతేడాది డిసెంబర్ 30 ముగింపు 85.52 నుంచి రూపాయి ఏకంగా 118 పైసలు పడింది. ‘ఫారెక్స్ నిల్వలు 634 బిలియన్ డాలర్లకు దిగిరావడం, వర్ధమాన దేశాల కరెన్సీలూ క్షీణిస్తున్న తరుణంలో రూపాయి పతనంపై ఆర్‌బీఐ జోక్యాన్ని తగ్గించుకుంది. మరోవైపు బ్రెంట్ క్రూడాయిల్ ధర 3 నెలల గరిష్టానికి ఎగసింది. డాలర్ ఇండెక్స్ రెండేళ్ల గరిష్టం 109.91 స్థాయికి చేరింది. దీంతో రూపాయి భారీగా క్షీణించింది’ అని ఫిన్‌రెక్స్ ట్రెజరీ అడ్వైజర్స్ ఎండీ అనిల్ కుమార్ బన్సాలీ తెలిపారు.
బలహీనతకు కారణాలు..
బలపడుతున్న డాలర్
అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల తగ్గింపు అంచనాల కారణంగా అమెరికా డాలర్ బలపడుతోంది. ఈ నిర్ణయం వల్ల డాలర్‌కు డిమాండ్ అధికమవుతుంది. రూపాయి(Rupee)తో సహా ఇతర కరెన్సీలతో పోలిస్తే ఇది మరింత ఖరీదైనదిగా మారింది.
ఎఫ్‌పీఐల విక్రయాలు
రెండు-మూడు నెలల కొందట ఇండియన్ మార్కెట్ జీవితకాల గరిష్టాలను తాకింది. దాంతో దాదాపు అన్ని స్టాక్‌ల వాల్యుయేషన్ పెరిగింది. అప్పటికే ఇన్వెస్ట్ చేసిన విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు ప్రాఫిట్ బుక్ చేస్తున్నారు. దాంతోపాటు సురక్షితమైన అమెరికా ట్రెజరీలకు ప్రాధాన్యం ఇవ్వడంతో విదేశీ ఇన్వెస్టర్లు భారత ఈక్విటీ మార్కెట్ల(Equity Market) నుంచి నిధులను ఉపసంహరించుకుంటున్నారు. ఇది గణనీయమైన మూలధన ప్రవాహానికి దారితీసింది. దాంతో రూపాయిపై ఒత్తిడి పెరిగింది.
పెరుగుతున్న ముడిచమురు ధరలు
భారతదేశం ముడి చమురు ప్రధాన దిగుమతిదారు. పెరుగుతున్న అంతర్జాతీయ చమురు ధరలు దిగుమతుల ఖర్చును పెంచాయి. ఈ దిగుమతులకు డాలర్లలో చెల్లించాల్సి ఉంటుంది. దాంతో రూపాయి విలువ మరింత తగ్గుతుంది.
వాణిజ్య లోటు
భారతదేశ వాణిజ్య లోటు పెరుగుతోంది. అంటే దేశం చేసే ఎగుమతుల కంటే దిగుమతులు పెరుగుతున్నాయి. ఈ అసమతుల్యత వల్ల దిగుమతులకు చెల్లించడానికి ఎక్కువ డాలర్లు అవసరం అవుతుంది.
ఇదీ చదవండి: మహా కుంభమేళాకు సైబర్ భద్రత
దేశీయ ఆర్థిక కారకాలు
వృద్ధి మందగించడం, లిక్విడిటీ లోటు వంటి సవాళ్లను భారత ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటోంది. ఫారెక్స్(Forex) మార్కెట్లో దూకుడుగా జోక్యం చేసుకునే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) సామర్థ్యానికి ఇవి అడ్డంకిగా మారాయి.
ఆర్‌బీఐ జోక్యం
ఫారెక్స్ మార్కెట్లో అధిక అస్థిరతను అరికట్టడానికి, రూపాయికి మద్దతు ఇవ్వడానికి ఆర్‌బీఐ జోక్యం చేసుకుంటోంది. అయితే రూపాయి స్థిరమైన పడిపోతున్న తరుణంలో ఆర్‌బీఐ మరింత చాకచక్యంగా వ్యహహరించాల్సి ఉందని నిపుణులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment