‘తాము ఏ కులమో తెలియని వాళ్లు...’
రాహుల్‌పై ఠాకూర్ వ్యాఖ్యలు
తీవ్రంగా ఆక్షేపించిన విపక్షాలు
రికార్డుల్లోంచి తొలగించిన స్పీకర్
నాకిది ఘోరమైన అవమానం: రాహుల్
కులగణన చేయించి తీరతానని శపథం
న్యూఢిల్లీ: మోదీ సర్కారుపై విపక్షనేత రాహుల్‌గాంధీ చేసిన ‘చక్రవ్యూహం’ వ్యాఖ్యల తాలూకు వేడి లోక్‌సభలో మంగళవారం కూడా కొనసాగింది. ప్రభుత్వం తరఫున మాట్లాడిన బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ వాటిని తీవ్రంగా ఖండించారు. రాహుల్ తన ప్రసంగం పొడవునా ఆరితేరిన వక్తనని నిరూపించుకునేందుకు పాకులాడారని ఎద్దేవా చేశారు. ‘‘అందుకోసం అంకుల్ శామ్ (కాంగ్రెస్ నేత శామ్ పిట్రోడా) నుంచి తెచ్చుకున్న అరువు జ్ఞానాన్ని ప్రదర్శించారు.
రాహుల్ రియల్ పొలిటీషీయన్ కాదు. కేవలం వీడియోల కోసమే ప్రసంగాలిచ్చే రీల్ పొలిటీషియన్. బహుశా విపక్ష నేత (ఎల్‌ఓపీ) అంటే దు్రష్పచార సారథి (లీడర్ ఆఫ్ ప్రాపగాండా) అని అపార్థం చేసుకున్నట్టున్నారు’’ అంటూ దుయ్యబట్టారు. ‘‘కొందరు పేరుకు మాత్రమే హిందువులు. మహాభారతంపై వారికున్నది కూడా మిడిమిడి జ్ఞానమే’’ అంటూ రాహుల్‌ను ఠాకూర్ ఎద్దేవా చేశారు.
ఆ క్రమంలో ‘తమది ఏ కులమో కూడా తెలియని వారు కులగణన కోరుతున్నారు’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై సభలో తీవ్ర దుమారం రేగింది. అవి రాహుల్‌ను ఉద్దేశించినవేనంటూ విపక్ష సభ్యులంతా మండిపడ్డారు. ఒక వ్యక్తి కులం గురించి ఎలా మాట్లతాడతారంటూ సమాజ్‌వాదీ నేత అఖిలేశ్ యాదవ్ మండిపడ్డారు.
ఠాకూర్ వ్యాఖ్యలను తీవ్రంగా నిరసిస్తూ కాంగ్రెస్ సభ్యులంతా వెల్‌లోకి దూసుకెళ్లారు. దాంతో ఆ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. తర్వాత రాహుల్ మాట్లాడు తూ ఠాకూర్ వ్యాఖ్యలు తనకు ఘోర అవమానమన్నారు.
‘‘దళితులు, వెనకబడ్డ వర్గాల హక్కుల కోసం ఎవరు పోరాడినా ఇలాంటి అవమానాలు భరించాల్సిందే. అందుకే నన్నెంత తిట్టినా, అవమానించినా పట్టించుకోను. క్షమాపణలూ కోరబోను. అర్జునుడు పక్షి కన్నుపైనే దృష్టి పెట్టినట్టు నా దృష్టినంతా కులగణనపైనే కేంద్రీకరించాను. పోరు ఆపబోను. విపక్ష ఇండియా కూటమి ఎట్టి పరిస్థితుల్లోనూ దేశవ్యాప్తంగా కులగణన చేయించి తీరుతుంది’’ అని ప్రకటించారు.
మీకో వైఖరే లేదు
దళితులు, ఓబీసీల వెనకబాటుకు 1947 నుంచి దశాబ్దాల పాటు దేశాన్ని పాలించిన కాంగ్రెసే కారణమని ఠాకూర్ ఆరోపించారు. ఎన్ (నెహ్రూ), ఐజీ (ఇందిరాగాంధీ), ఆర్‌జీ1 (రాజీవ్‌గాం«దీ) అంటూ గాంధీ కుటుంబానికి చెందిన మాజీ ప్రధానులందరిపైనా విమర్శలు చేశారు. కాంగ్రెస్ దృష్టిలో ఓబీసీలు అంటే ఓన్లీ బ్రదర్–ఇన్–లా కమీషన్ అంటూ రాహుల్ బావ రాబర్ట్ వద్రాను ఉద్దేశించి ఆరోపణలు గుప్పించారు.
‘‘కులగణనపై కాంగ్రెస్‌కు ఓ వైఖరంటూ ఉందా? రాహుల్ కులగణన కావాలంటున్నారు. ఆయన తండ్రి రాజీవ్ గాంధీ మాత్రం ఓబీసీలకు రిజర్వేషన్లను వ్యతిరేకించారు. బోఫోర్స్ మొదలుకుని కామన్వెల్త్ క్రీడలు, 2జీ, గడ్డి, యూరి యా, బొగ్గు, నేషనల్ హెరాల్డ్... ఇలా కాంగ్రెస్ హయాంలో జరిగిన కుంభకోణాలకు అంతే లేదు’’ అంటూ దుయ్యబట్టారు.
Comments
Please login to add a commentAdd a comment