PM Narendra Modi Fires On Congress Party: ఎన్నిసార్లు ఓడినా... మీ అహం తగ్గట్లేదు - Sakshi
Sakshi News home page

ఎన్నిసార్లు ఓడినా... మీ అహం తగ్గట్లేదు: నరేంద్ర మోదీ

Published Tue, Feb 8 2022 4:55 AM | Last Updated on Tue, Feb 8 2022 8:51 AM

PM Narendra Modi Fires On Congress Party - Sakshi

న్యూఢిల్లీ: వరుసగా ఎన్ని ఎన్నికల్లో ఓడుతున్నా కాంగ్రెస్‌ పార్టీకి అహంకారం మాత్రం తగ్గడం లేదంటూ ప్రధాని నరేంద్ర మోదీ ఫైరయ్యారు. ‘‘ఇప్పటికీ తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉంది. చూస్తుంటే మరో వందేళ్ల దాకా అధికారంలోకి రావద్దని గట్టి పట్టుదలతో ఉన్నట్టుంది. గెలవాలన్న కాంక్షే వారిలో ఏ కోశానా కన్పించడం లేదు. అందుకే, తనకేదీ దక్కనప్పుడు అన్నింటినీ వీలైనంతగా పాడుచేద్దామనే స్థాయికి దిగజారింది’’ అంటూ ఎద్దేవా చేశారు.

ప్రతిదాన్నీ గుడ్డిగా వ్యతిరేకించడమే పనిగా పెట్టకుందని, వేర్పాటువాదాన్ని పెంచి పోషిస్తోందని మండిపడ్డారు. బ్రిటిష్‌వాళ్లు పోయినా వారి విభజించి పాలించే సూత్రాన్ని స్వభావంగా మార్చుకుందని విమర్శించారు. అందుకే టుక్డే టుక్డే గ్యాంగులకు లీడర్‌గా మారిందన్నారు. సోమవారం లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడిన ఆయన, కాంగ్రెస్‌ను గంటన్నరకు పైగా తూర్పారబట్టారు. కరోనా సంక్షోభ సమయంలో ఆ పార్టీ అన్ని హద్దులనూ దాటేసి చెప్పరానన్ని పాపాలకు పాల్పడిందని ఆరోపించారు.

‘‘కరోనా తొలి వేవ్‌ సమయంలో అంతా ఇళ్లకు పరిమితమై లాక్‌డౌన్‌ నిబంధనలను తు.చ. తప్పకుండా పాటిస్తూ ఉంటే కాంగ్రెస్‌ మాత్రం ముంబై రైల్వేస్టేషన్లో వీరంగం వేసింది. అమాయక కార్మికులకు ఉచితంగా టికెట్లు పంచి, భయపెట్టి సొంత రాష్ట్రాలకు పారిపోయేలా చేసింది. విభజించే మనస్తత్వం కాంగ్రెస్‌ డీఎన్‌ఏలోకి ఇంకిపోయింది. సమాజంలో వేర్పాటు బీజాలు నాటజూస్తోంది’’ అంటూ నిప్పులు చెరిగారు. గతవారం పార్లమెంటులో కాంగ్రెస్‌ మాట్లాడిన తీరు ప్రజలను రెచ్చగొట్టేదిగా ఉందంటూ ఆ పార్టీ నేత రాహుల్‌గాంధీ ప్రసంగంపై దుమ్మెత్తిపోశారు. ‘‘ఉదయం లేచింది మొదలు నిత్యం మోదీ నామ జపమే కాంగ్రెస్‌కు పనిగా మారింది. నా పేరు తలవకుండా బతకలేకపోతోంది’’ అంటూ ఎద్దేవా చేశారు.

గుడ్డి విమర్శలు
సద్విమర్శ ప్రజాస్వామ్యానికి ఆభరణమని, కానీ కాంగ్రెస్‌ చేసే గుడ్డి విమర్శలు మాత్రం ప్రజాస్వామ్యానికి అవమానం తప్ప మరోటి కాదని ప్రధాని అన్నారు. ‘‘బీజేపీ ఏదైనా ఎన్నికల్లో ఓడితే దానిపై నెలలపాటు లోతుగా విశ్లేషించుకుంటుంది. కాంగ్రెస్‌కు మాత్రం ఆ అలవాటూ లేదు, అహంకారమూ తగ్గదు. దాని మనోగతం, మాటతీరు, చేసే తప్పుడు పనులు చూస్తుంటే మరో వందేళ్ల దాకా అధికారంలోకి రావద్దని అనుకుంటోందేమోనని కొన్నిసార్లు నాకు అనిపిస్తుంది. వాళ్ల ఉద్దేశం అదే అయితే అందుకవసరమైన ఏర్పాట్లు చేసే ఉంచాను’’ అని చెణుకులు విసిరారు. ‘‘మేం దేశీయతకు పెద్దపీట వేస్తున్నాం. ఇది గాంధీ కలలను సాకారం చేయడం కాదా? దాన్నీ, మేం తెచ్చిన యోగా, ఫిట్‌ ఇండియా కార్యక్రమాలను కూడా కాంగ్రెస్‌ ఎద్దేవా చేస్తోంది. 1971 నుంచీ పేదరిక నిర్మూలన నినాదాలతోనే ఆ పార్టీ ఎన్నికలు నెగ్గుతూ వచ్చింది. పేదరికమైతే పోలేదు గానీ జనం కాంగ్రెస్‌నే సాగనంపారు. చాలా రాష్ట్రాల్లోనైతే దశాబ్దాలుగా అధికారానికి దూరంగా ఉంచారు. ఎన్నికలు ముఖ్యం కాదు. కావాల్సింది చిత్తశుద్ధి’’ అన్నారు.

కరోనాపై మన పోరు ఆదర్శం
కరోనా సంక్షోభాన్ని భారత్‌ ఎదుర్కొన్న తీరు ప్రపంచానికే ఆదర్శమని మోదీ అన్నారు. మున్ముందు ప్రపంచానికి మనం లీడర్‌గా ఎలా ఎదగాలో ఆలోచించుకోవడానికి ‘స్వాతంత్య్ర అమృతోత్సవాలు’ సరైన సందర్భమన్నారు. ‘‘కోవిడ్‌ అనంతరం ప్రపంచ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. ఈ అవకాశాన్ని భారత్‌ జారవిడుచుకోరాదు’’ అని సూచించారు. తర్వాత జనవరి 31న పార్లమెంటు ఉభయసభలనుద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చేసిన ప్రసంగానికి ధన్యవాద తీర్మానాన్ని లోక్‌సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది.  

మీకు అన్నిచోట్లా ఓటమే!
50 ఏళ్లు అధికారంలో ఉన్న పార్టీని దేశమంతటా ప్రజలు వరుసబెట్టి ఎందుకు తిరస్కరిస్తూ వస్తున్నారో ఆలోచించుకోవాలి. చాలా రాష్ట్రాల్లో మిమ్మల్ని దశాబ్దాలుగా ఓడిస్తూ వస్తున్నారు. తెలంగాణ ఇచ్చినా సరే, అక్కడా కాంగ్రెస్‌ను శాశ్వతంగా తుడిచిపెట్టేశారు’’ అన్నారు. తమిళనాడులో హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించిన చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌కు నివాళులు అర్పించేందుకు ఆ రాష్ట్ర ప్రజలంతా కదలివచ్చిన తీరు అభినందనీయమన్నారు. ఈ విషయంలో కూడా తమిళ సెంటిమెంట్లను గాయపరిచేలా ప్రవర్తించిన చరిత్ర కాంగ్రెస్‌దని విమర్శించారు. ‘‘లీడర్లు వస్తారు, పోతారు. దేశం మాత్రం శాశ్వతం. ఐక్యతా పునాదుల మీద నిలిచిన గొప్ప దేశం మనది. ఇకముందూ అలాగే నిలుస్తుంది’’ అని మోదీ హితవు చెప్పారు.

విభజించే మనస్తత్వం వాళ్ల డీఎన్‌ఏలోనే ఇంకిపోయింది. సమాజంలో వేర్పాటు బీజాలు నాటుతూ తప్పుల మీద తప్పులకు పాల్పడుతోంది నిత్యం మోదీ నామ జపం చేయనిదే కాంగ్రెస్‌  
బతకలేకపోతోంది. మరో వందేళ్ల దాకా అధికారం వద్దన్నదే వాళ్ల ఉద్దేశమైతే అందుకు తగ్గ ఏర్పాట్లు చేసే ఉంచా.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement