Pride
-
మన విద్యార్థులు యూఎన్ఓకు వెళ్లడం రాష్ట్రనికే గర్వకారణం
సాక్షి, అమరావతి: పదో తరగతిలో అత్యుత్తమ ఫలి తాలతో టాపర్స్‌గా నిలిచిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులనే ఐక్యరాజ్య సమితికి పంపించామని, ఇది రాష్ట్రానికే గర్వకారణమని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. ఆయన శనివారం క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. కొన్ని పత్రికలు, మీడియా ఉద్దేశపూర్వకంగా వీరిపై తప్పుడు కథనాలు ఇస్తున్నాయని, విద్యార్థులను ప్రోత్సహించడం మానేసి నిరుత్సాహపరిస్తే వారితో పాటు తల్లిదండ్రుల మనోభావాలు కూడా దెబ్బతింటాయని హితవు పలికారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగంలో చేపట్టిన విప్లవాత్మక సంస్కరణలతో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపడ్డాయని, మన విద్యార్థులను ప్రపంచంతో పోటీ పడేలా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. అధునాతన వసతులు, డిజిటల్ విద్యా బోధనపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందన్నారు. డిసెంబర్ 21న 8వ తరగతి విద్యార్థులకు ఉచిత ట్యాబ్‌ల పంపిణీ చేస్తామని తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం 8, 9, 10 తరగతుల మేథమెటిక్స్, సైన్స్ పాఠ్యాంశాల మార్పుపై ఆలోచన చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో అవసరమైన మేరకు టీచర్ పోస్టులు భర్తీ చేస్తున్నామని, సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్‌కు అనుగుణంగా నియామకాలు చేపడతామని అన్నా రు. టీచర్ పోస్టుల భర్తీపై కూడా త్వరలోనే నిర్ణ యం తీసుకుంటామని చెప్పారు. సీపీఎస్ విధానంతో ప్రభుత్వంపై ఆర్థిక భారం పెరుగుతున్నందున కేంద్రం కూడా ఒప్పుకోవడంలేదని, అందుకే జీపీఎస్‌ను తీసుకొచ్చామని చెప్పారు. ఉద్యోగులు దీనిపై సహృదయంతో ప్రభుత్వానికి సహకరించాలని మంత్రి కోరారు. -
దూరం చేసే అహంకారం
అహంకారం... అయిన వాళ్ళనే కాదు, కానివాళ్లనూ దూరం చేస్తుంది. అందరితో వ్యతిరేకతను పెంచి, సమాజానికి దూరంగా బతికేలా చేస్తుంది. అహంకారం ఉన్న వ్యక్తులను ఏ సమాజమూ గుర్తించదు. ఏ మనిషీ గౌరవించడు. సరికదా, అవసరమయినపుడు ఆదుకునేవారు లేక అలాంటి వ్యక్తులు నానా ఇబ్బందులూ పడతారు. నిత్య జీవితంలో చాలామంది తమ గురించి, తమ ఆలోచనల గురించి గొప్పగా ఊహించుకుంటూ, తాము అందరికంటే ఉన్నతులమని, తమకంటే గొప్ప వారు మరొకరు లేరని భ్రమిస్తూంటారు. చేస్తున్న ప్రతిపనిలోనూ తమ గొప్పతనాన్ని చాటుకుంటూ, తాము ఇతరులకు భిన్నమని, ఇతరులకంటే తాము చాలా ఎక్కువమని భావిస్తూ వాస్తవానికి దూరంగా జీవిస్తారు. వారిలో ఏ విశేషమూ లేకపోయినా, ఎంతో విఖ్యాతులమని విర్రవీగుతారు. తమలోని వాపును కూడా మహాబలమని భ్రమిస్తారు. అణకువతో ఓ మెట్టు దిగుదామన్న విషయాన్ని అటుంచి దానిని అవమానంగా భావిస్తారు. ఇలా అంతర్యామికీ, అంతరాత్మకూ మధ్య ఉన్న ఆ అదృశ్య, అతి ప్రమాదకర అంతఃశత్రువే అహంకారం. దానినే మనం గర్వమని కూడా పిలుస్తుంటాం. వినమ్రతకు అహంకారం బద్ధ వ్యతిరేకం. గర్విష్టికి భగవంతుడు ఆమడదూరంలో ఉంటాడు. ముందు ‘నేను’ అనే మాయ నుంచి బయట పడితే, ఆ తరువాత తన దరికి చేర్చుకుంటానంటాడు. నిజానికి ఆధ్యాత్మిక సాధనల లక్ష్యం ఆత్మను పొందడం కాదు. అహంకారాన్ని పోగొట్టుకోవడమే. మనం తినే తిండిలో కారం ఎక్కువైతే శరీరంలోని రక్తం మలినమవుతుంది. అదే అహంకారం పాలు ఎక్కువైతే మానవత్వమే మంటకలసి పోతుంది. ఎవరిలో అహంకారం ప్రవేశిస్తుందో అలాంటి వారు అధోగతి పాలవుతారు. చెదపురుగు పట్టిన వస్తువు ఏ విధంగా పనికి రాకుండా పోతుందో, అదేవిధంగా అహంకారం అనే చెదపురుగు పడితే మానవవత్వం మృగ్యమైపోతుంది. మనిషికి బుర్ర నిండా వెర్రి ఆలోచనలు కలిగిస్తుంది. మానవత్వం నుంచి రాక్షసత్వంలోకి మనిషిని నెట్టేస్తుంది. గర్వం లేదా అహంకారం ఎవరిలో ప్రవేశిస్తుందో వారి గతి అధోగతే. మనిషిలో గర్వం, అహంకారం కొంచెం ఉన్నా అవి మనిషిని నిలువునా ముంచేస్తాయి. గర్వంతో కూడిన విజయం ఎల్లప్పుడూ శాశ్వతం కాదు. అలాంటి విజయం వలన తాత్కాలిక ఆనందం పొందినప్పటికీ, సమస్యలు వచ్చినప్పుడు మనకు తోడుగా ఎవరూ ఉండరని గుర్తుంచుకోవాలి. నాది, నేను అనే భావనలు మనిషిలో గర్వాన్ని, అహంకారాన్ని పెంచుతాయి. ఈ రెండు భావనలను మనసు నుంచి తుడిచేస్తే జీవితంలో ఎలాంటి విజయాన్నైనా సొంతం చేసుకోవచ్చు. దుర్యోధనుడి విపరీతమయిన అహంకారం వల్లే మహా భారత సంగ్రామం జరిగింది. గర్వితుడయిన దుర్యోధనుడి అహంకారం వల్ల పాండవులకు ధర్మంగా రావల్సిన రాజ్యం కూడా రాకుండా పోయింది. అంతేకాదు ద్రౌపది వస్త్రాపహరణానికి, కౌరవ సేనల అకృత్యాలకు, జూదంలో ధర్మరాజును మాయతో గెలిచిన తీరుకు... ఇలా అన్నింటికీ దుర్యోధరుని అహంకారమే కారణమయ్యింది. ఆ అహంకారం వల్లే సాక్షాత్తు శ్రీ కృష్ట భగవానుడు యుద్ధం వద్దని వారించడానికి వచ్చినా దుర్యోధనుడు వినలేదు.. కయ్యానికి కాలు దువ్వి , తాను నాశనమవడమే కాకుండా ఏకంగా కురు వంశం నాశనమవ్వడానికి కారణమయ్యాడు. ఇలా దుర్యోధనుడే కాదు మన పురాణాలలో అనేక మంది పురాణ పురుషులు అహంకారంతో తమ నాశనాన్ని తామే కోరి తెచ్చుకున్నారు. గర్వమనేది మనిషిని పూర్తిగా నిర్వీర్యుడ్ని చేసి, పతనానికి పునాది వేస్తుంది. కనుక ఎవరైనా ఒకరిపై గెలిచామనే గర్వంతో ఆనందిస్తున్నారంటే వారిలో మానసిక వైకల్యం ఉన్నట్టుగానే భావించాలి. గర్వం నాశనానికి తొలి మెట్టు. మనిషిలో గర్వం అనే అగ్నిని రాజేస్తే, ఆ తర్వాత అది దుఃఖానికి కారణమవుతుంది. మనషి బతికి ఉన్నప్పుడే నేను, నాది అనే భావనలు కలుగుతాయి. మరణించాక శ్మశానంలో రాజైనా,సేవకుడైనా,ధనికుడైనా, పేదవాడైనా ఒక్కటే. అందువల్ల ఈ భూమి మీద బతికున్నంత కాలం ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా జీవించడానికి కృషి చేయాలి. గర్వాన్ని ఎలాంటి పరిస్థితుల్లో దరి చేరనివ్వకుండా సచ్ఛీలతతో తమకున్నదానిలో ఇతరులకు సహాయం చేసేవాడే నిజమైన విజేత అవుతాడన్న వాస్తవాన్ని గుర్తెరగాలి. విధేయత, అణకువ లాంటి లక్షణాలు మనుషులను విజయతీరాలకు తీసుకువెళతాయి. అందువలన జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరినప్పటికీ గర్వం, తలకెక్కించు కోకుంటే అసలైన విజయం సొంతం అవుతుంది. గర్వం లేనివారు ఏ పని మొదలుపెట్టినా ఆ పనిలో తప్పక విజయం సాధిస్తారు. గర్వం లేనప్పుడు దురభిప్రాయం ఉండదు. ఎందుకంటే గర్వం, దురభిప్రాయం రెండూ వేరు వేరు కాదు. మనిషికి ఒకదాని పట్ల గర్వభావన ఉంటే వేరొక దాని పట్ల దురభిప్రాయం, అంటే చిన్న చూపు ఉన్నట్లే. కనుక గర్వం ఒక విధమైన దురభిప్రాయంలో నాటుకుపోయి ఉంటుంది. అహంకారం అనేది ఎక్కడో ఉండదు. అజ్ఞాతంగా మనలోనే ఉంటుంది. ఇది అనేక అనర్థాలకు మూలకారణమవుతుంది. ఉన్న పళంగా ఆకాశానికి ఎత్తేసి, ఆ ఆకాశం నుంచి ఒక్క ఉదుటన పాతాళంలోకి తోసేస్తుంది. అహంకారం ఉన్న వ్యక్తులెవరైనా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంటారు. – దాసరి దుర్గా ప్రసాద్ -
‘గే’ స్ హర్ట్ అవుతున్నారు.. ఎందుకు?
బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు): ఎస్... ఐ యామ్ గే. సిగ్గెందుకు.. చెప్పుకోడానికి?! నేను అబ్బాయిని. కానీ అమ్మాయిలకు ఎట్రాక్ట్ కాను. ఇందులో తప్పేముంది? నేను అమ్మాయిని. కానీ అబ్బాయిలు నన్ను ఎట్రాక్ట్ చెయ్యలేరు. ఇందులో ఒప్పుకానిది ఏముంది? ప్రకృతి ధర్మం ఒకటి ఉంటుంది కదా అంటుంది లోకం. ప్రకృతి ఒక్కటేనా ధర్మం? ప్రకృతి విరుద్ధ ధర్మాలు ఉండవా?! అబ్బాయిల దగ్గర మాత్రమే కంఫర్ట్ ఫీలయ్యే అబ్బాయిలు, అమ్మాయిల ఆలింగనాలలో మాత్రమే ఆలంబన పొందే అమ్మాయిలు అడుగుతున్న ఈ ప్రశ్నకు మన దగ్గర సమాధానం ఉందా? లేదు. సానుభూతి ఉందా? లేదు. సహానుభూతి ఉందా? అదెలాగూ ఉండదు. సాఫ్ట్ కార్నర్ ఉందా? ఎప్పటికైనా ఏర్పడుతుందేమో తెలీదు. మరేముంది? అభ్యంతరం ఉంది. అసహనం ఉంది. అవహేళన ఉంది. ‘ఎట్లానో చావండి. మీ ఒంట్లో ఏం జరుగుతోందో మా కంట్లో పడనివ్వకండి’ అని దూరంగా జరిగిపోయేంత ఈసడింపు ఉంది. ‘గే’ స్ హర్ట్ అవుతున్నారు. నేచురల్ బాధ అనేది సాధారణ జెండర్లకు ఉండి, ట్రాన్స్జెండర్లకు లేకుండా పోతుందా?! ఎవరైనా మనుషులే కదా. బాధ పడతారు. అయితే వారి బాధ.. వాళ్లని మనం గుర్తించడం లేదని కాదు. వాళ్లని మనం గౌరవించడం లేదని కాదు. మరి? వాళ్లేమిటో వాళ్లని చెప్పుకోనివ్వడం లేదని! మగదీరుడిగా నిన్ను నువ్వు ఎగ్జిబిట్ చేసుకుంటావు. కోమలాంగిగా నిన్ను నువ్వు రిప్రెజెంట్ చేసుకుంటావు. మరి గే గా నన్నెందుకు బయట పడనివ్వవు అని నేస్తం సంస్థ ప్రతినిధులు నిగ్గుదీసి నిలదీస్తున్నారు. ఇది నేను..నాలా‘గే’ ఉంటానని థర్డ్‌జెండర్స్ బీచ్ రోడ్డులో గర్వంగా ప్రైడ్వాక్ వాక్ చేశారు. స్వలింగ సంపర్కం నేరం కాదంటూ తీర్పునిచ్చింది అత్యున్నత న్యాయస్థానం. మేమూ సాధారణ వ్యక్తులమే..మాకూ హక్కులున్నాయి. మమ్మల్నీ గౌరవించండంటూ నేస్తం సంస్థ ఆధ్వర్యంలో వైజాగ్ క్వీర్ ఆత్మాభిమాన్ యాత్ర పేరుతో ప్రైడ్ వాక్ ను ఆదివారం నిర్వహించారు. వైఎస్సార్ విగ్రహం నుంచి ఆర్కేబీచ్ వరకు సాగిన ఈ వాక్‌ను జిల్లా హెచ్ఐవీ నియంత్రణ ప్రొగ్రాం మేనేజర్ శైలాజ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చట్టాలు ప్రతి ఒక్కరికి నచ్చినట్టు జీవించే హక్కును కల్పించాయన్నారు. ఎవరి హక్కులను మనం వ్యతిరేకించారదన్నారు. థర్డ్‌జెండర్, స్వలింగ సంపర్కులపై వివక్ష చూపించడం సరైంది కాదన్నారు. వారు కూడా మనలో ఒకరిగా మనం గుర్తించి వారికి మనోధైర్యం కల్పించాలన్నారు. ఈ వాక్కు పలు ఎన్జీవోలు, కాలేజీ విద్యార్థులు మద్దతిచ్చారు. రాష్ట్రంలో మొదటి ప్రైడ్ వాక్.. స్వలింగ సంపర్కులు, థర్డ్‌జెండర్ వారి హక్కుల కోసం రాష్ట్రంలో మొదటి సారిగా విశాఖలో ప్రైడ్ వాక్‌ను నిర్వహించినట్టు నిర్వహకులు తెలిపారు. ఈ వాక్‌లో తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా కొందరు పాల్గొన్నారు. తమపై వివక్ష పూర్తిగా పోయే వరకు ఇటువంటి వాక్‌లను దేశ వ్యాప్తంగా నిర్వహిస్తామన్నారు. ఇది తొలి మెట్టు.. ఇంత భారీ వర్షంలో కూడా అనేక మంది వచ్చిన ఈ ప్రైడ్ వాక్‌లో పాల్గొనడం తొలిమెట్టుగా భావిస్తున్నాం. స్వలింగ సంపర్కులు, థర్డ్‌జెండర్ హక్కుల కోసం రాష్ట్రంలో తొలి సరిగా నిర్వహించిన ఈ వాక్కు ఎన్జీవోలు, విద్యార్థుల నుంచి మంచి స్పందన లభించింది. స్వలింగ సంపర్కులు, థర్డ్జెండర్పై ప్రజలు చూపిస్తున్న వివక్ష పోయే వరకూ పోరాటం ఆగదు. – విశ్వతేజ్, రాష్ట్ర స్వలింగ సంపర్కుల హక్కుల కార్యకర్త సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి మా సంక్షేమం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాలి. ఇందుకు కోసం ఒక ప్రత్యేకమైన సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలి. ఆంధ్రప్రదేశ్‌లో మొదటి సరిగా మా ఆత్మ గౌవరం కోసం ఎంతో ధైర్యంతో ప్రైడ్ వాక్‌ను నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది. ఈ వాక్ ద్వారా ప్రజల్లో ప్రేరణ వస్తుందని ఆశిస్తున్నాను. అందరితో పాటు మాకు సమాన హక్కులున్నాయని ప్రజలు గుర్తించాలి. – కృష్ణమ్మ, హైదరాబాద్ హక్కుల కోసం ఒకే వేదికపై.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉన్న స్వలింగ సంపర్కులు, థర్డ్‌జెండర్స్ అంతా ఒకే వేదికపైకి వచ్చి హక్కుల కోసం మొదటి సరిగా ప్రైడ్ వాక్ నిర్వహించడం చాలా ధైర్యాన్ని ఇచ్చింది. మా హక్కులను హరించవద్దని కోరుతున్నా. మాపై వివక్ష చూపించకుండా అందరిలానే సమానంగా చూడాలని కోరుకుంటున్నా. – నందిత, ట్రాన్స్ మహిళ మేము మానసిక రోగులం కాదు ఒక అమ్మాయి ఇంకో అమ్మాయి నచ్చడం, అబ్బాయికి అబ్బాయి నచ్చడం మానసిక రోగం కాదు. సుప్రీం కోర్టు కూడా ఇంటువంటి ఆలోచనలు కలిగిన వారిని కాన్వర్జేషన్ థెరిపీ చేయటం నిషేధించింది. నేను ఈ వాక్ ద్వారా స్వలింగ సంపర్కులు, థర్డ్‌జెండర్ ఎదుర్కొంటున్న వివక్షకు గురవుతున్నవారి బాధలు తెలుసుకున్నా. – భావ్య, క్వీర్ పర్సన్ -
శతక నీతి – సుమతి: క్షణంలో పిడికెడు బూడిదగానే మిగిలిపోవచ్చు !!!
శంకర భగవత్పాదులు అంటారు..‘‘మా కురు ధనజన యౌవన గర్వం హరతి నిమేషాత్ కాలస్సర్వం, మాయామయమితి సర్వం హిత్వా బ్రహ్మ పదం త్వాం ప్రవిశ విదిత్వా’’. మా కురుధన... డబ్బు ఉంటుంది, లక్షాధికారులు భిక్షాధికారులయిన రోజులున్నాయి. ఎంతో ఐశ్వర్యవంతులు కటిక దరిద్రాన్ని అనుభవించిన వారున్నారు. జనం నా వెనుక ఇంతమంది ఉన్నారు అన్నవాడి వెనుక ఉండేవారులేక.. జారిపోయిన వారు ఎక్కువమంది ఉన్నారు. యవ్వన సర్వం... ఇంత బలవంతుణ్ణి–యవ్వనంలో ఉన్నానంటాడు. గిర్రున పాతికేళ్ళు తిరిగేసరికి పటుత్వం సడలి, సంధిబంధములు జారిపోయి వృద్ధాప్యం ఆవహిస్తుంటుంది. హరతి నిమేషాత్ కాలస్సర్వం – కాలం చాలా తినేస్తుంది. నాకు తిరుగులేదు అన్న ఆరడుగుల నిండు మనిషి చివరకు రుద్రభూమిలో పిడికెడు బూడిద కింద మారిపోతాడు. ఎందుకీ అతిశయం? వినయంగా ఉండడం నేర్చుకో.. నీలో ఎన్ని మంచి గుణాలున్నా, నిస్సహాయ స్థితిలో ఉండి నీ వల్ల బాధలకు గురయినవారందరూ ఒకనాడు నీ పని పడతారు. అపకీర్తి మూటగట్టుకుని వెళ్లిపోతావు. భారతంలో దుర్యోధనుడి సంగతే చూడండి... ‘ఆ పాండవులెంత, ఆ భీముడెంత, ఆ అర్జునుడెంత... చిటికెలో చంపేస్తా... నాదగ్గర భీష్ముడున్నాడు, కర్ణుడు, ద్రోణుడున్నాడు, నాకింతమంది సోదరులున్నారు. నాకిన్ని అక్షౌహిణుల సైన్యం ఉంది...’ అంటూ విర్రవీగేవాడు. ఆయనకు మంచి మాటలు చెప్పనివారెవరు, అందరూ చెప్పారు. కానీ వినలేదు. వినకపోగా చెప్పేవాళ్ళను అవమానించేలా ప్రవర్తించేవాడు. చివరికి రాయబారం చేయడానికి వచ్చిన కృష్ణుడిని కూడా బంధించబోయాడు. ఒకరోజు మైత్రేయ మహర్షి వచ్చాడు. ‘తప్పు దుర్యోధనా! పాండవులు ధర్మమార్గంలో ఉన్నవాళ్ళు. వాళ్ళతో నీకు గొడవలెందుకు, వాళ్లకివ్వాల్సిన రాజ్యభాగం ఇచ్చేయి.’’ అని నచ్చచెప్పబోయాడు. ప్రతిరోజూ ఎవడో ఒకడు రావడం ధర్మపన్నాలు వల్లించడం అలవాటయిపోయిందంటూ మహర్షి మాట్లాడుతున్నప్పుడు వెటకారంగా తొడల మీద తాళం వేస్తున్నట్లు చెయ్యి తిప్పుతున్నాడు. ఆయనకు ఎక్కడలేని కోపం వచ్చింది. ‘‘నేను వ్యయప్రయాసలకోర్చి నీ మంచి కోరి నీకు నాలుగు మంచిమాటలు చెప్పిపోదామని వస్తే శ్రద్ధతో వినకపోగా ఎగతాళి చేస్తూ, నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నావు. ఏ తొడలను తక్కువగా భావించి వాటిమీద వెకిలిచేష్టలు చేసావో ఆ తొడలే భీమసేనుడి చేతిలో చితికిపోయి యుద్ధభూమిలో పడిపోయెదవుగాక!’’ అని శపించాడు. హడిలిపోయి ధృతరాష్ట్రుడు వెళ్ళి మైత్రేయ మహర్షి కాళ్ళమీద పడ్డాడు, శాపాన్ని ఉపసంహరించుకోమని కోరుతూ. ‘‘పాండవులతో నీ కొడుకు సంధి చేసుకుంటే ఆ శాపం అన్వయం కాదు, చేసుకోకపోతే ... చెప్పిన మాట వినలేదు కాబట్టి జరగాల్సింది జరుగుతుంది’’ అన్నాడు మహర్షి. ఏమయింది... అదే జరిగింది. బలవంతుడ నాకేమని విర్రవీగినందుకు ఫలితం అది...తన బలం, బలగం అనుకొన్నవారిలో ఒక్కొక్కరు వెళ్ళిపోయారు. భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, శల్యుడు, సోదరులు అందరూ వెళ్ళిపోయారు.. ఓ నలుగురు తప్ప. యుద్ధభూమిలో భీముడి గదాఘాతానికి తొడలు విరిగిపోయి, నెత్తురు ఓడుస్తుండగా అప్పుడు ఏడ్చాడు. రుషులు చెబితే వినలేదు, విదురుడు చెప్పినా వినలేదు... చివరకు అందర్నీ చంపేసుకొన్నా...అంటూ తన దుస్థితిని తలుచుకుని విలపించాడు. ఎందుకంత పొగరుబోతుతనం... ధనం కానీ, అధికారం గానీ, ఇతరత్రా నైపుణ్యాలు, పాండిత్యం కానీ నీకు భగవంతుడేదో ఇచ్చి ఉండవచ్చు.. అది కాస్త ఎక్కువే ఇచ్చి ఉండవచ్చు. అవి ఇచ్చినందుకు భగవంతుడిపట్ల వినయ విధేయతలతో కృతజ్ఞుడిగా ఉండడానికి బదులు, నీ బలం చూసుకొని అహంకారంతో వదరి మాట్లాడడం అత్యంత ప్రమాదకరం. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
చీమలు కూడా తిరగబడతాయి.. తస్మాత్ జాగ్రత్త
ప్రతి జీవికీ తగినంత శారీరక బలం ఉంటుంది. తనను తాను రక్షించుకోవడానికీ, తన అవసరాలు తీర్చుకోవడానికీ అది చాలా అవసరం. కానీ అది గర్వంగా మారకూడదు. తనకంటే బలం తక్కువ ఉన్న వాటిపట్ల చులకన దృష్టి ఉండకూడదు. ఉంటే ? ‘బలవంతుడ నాకేమని పలువురితో నిగ్రహించి పలుకుట మేలా, బలవంతమైన సర్పము చలిచీమల చేతచిక్కి చావదే సుమతీ!– అని బద్దెన క్లుప్తంగానే అయినా బలవర్ధకమైన సందేశాన్ని ఇచ్చాడు. నల్లచీమల్లో చలిచీమలని ఉంటాయి. అవి ఎక్కువగా తేనెపట్టు పట్టినట్లు పట్టేస్తుంటాయి. అవి ఎక్కడున్నాయో అక్కడ ఒక రకమైన వాసన వస్తుంటుంది. అవి ఒంటిమీదకు చాలా త్వరగా ఎక్కేస్తాయి. సర్వసాధారణంగా కుట్టవు. లోకంలో చాలా బలహీనంగా పైకి కనపడే ప్రాణుల్లో అదొకటి. కానీ అది చాలా చిన్న ప్రాణే కదా అని దానికి పౌరుషం వచ్చేటట్లు ప్రవర్తించారనుకోండి... అవన్నీ కలిసి ఎంత బలమైన ప్రాణినయినా చంపేస్తాయి. పాముని చూసి భయపడని ప్రాణి ఏముంటుంది. అలాంటి పాముని కూడా మామూలుగా ఈ చలి చీమలు ఏమీ చేయవు. కానీ వాటి ప్రాణానికి పామునుంచి ప్రమాదం ఎదురయినప్పడు అవన్నీ కలిసి మూకుమ్మడిగా ప్రాణాలకు తెగించి దాని పనిపడతాయి. అంత ప్రమాదకరమైన పాముకూడా కొన్ని వేల చీమల చేతిలో చిక్కి ఎక్కడికక్కడ అవి కుడుతున్నప్పుడు వాటి చేతిలో దయనీయంగా చచ్చిపోక తప్పని పరిస్థితి. గడ్డి పరక కూడా వృక్షజాతుల్లో అల్పమైనది. అవి ఎక్కువ మొత్తంలో కలిస్తే బలిష్ఠమైన ఏనుగును కూడా కట్టిపడేస్తాయి. రావణాసురుడు గొప్ప తపస్సు చేసాడు. చతుర్మఖ బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు. నీకేం కావాలని అడిగారు. ‘నాకు గంధర్వల చేతిలో, దేవతల చేతిలో, నాగుల చేతిలో....’’ అంటూ పెద్ద జాబితా చదివి వీళ్ళెవరి చేతిలో నాకు మరణం ఉండకుండా వరం కావాలన్నాడు. ‘తృణ భూతాహితే ప్రాణినో మానుషోదయః’.. అనుకున్నాడు. మనుషులు గడ్డిపరకతో సమానం. వాళ్ల పేరెత్తి వాళ్ళ చేతిలో మరణించకూడదని వరం కూడా అడగనా... అనుకున్నాడు. మనిషిని అంత తక్కువగా జమకట్టాడు.. నరుల ఊసే ఎత్తనివాడు, వానరుల ఊసు అసలు ఎత్తలేదు. చివరకు ఏమయింది... పదహారణాల మానవుడు శ్రీరామచంద్రమూర్తి వానరులను కూడా వెంటపెట్టుకుని మరీ వచ్చాడు. తరువాత ఏమయిందో తెలిసిందే కదా... నిష్కారణంగా వదరి గర్వంతో మరొకరిని తక్కువ చేసి, చులకన చేసి ప్రవర్తించడంవల్ల వచ్చిన ఉపద్రవం అది. కాబట్టి నోటిని, మనసును అదుపులో పెట్టుకోవాలి. నువ్వెంత బలవంతుడవయినా, ఎంత విద్వాంసుడవయినా, ఎంత పెద్ద పదవిలో ఉన్నా... అదే పనిగా నా అంతవాడిని నేను అని భావిస్తూ అందరినీ నిందిస్తూ, నిరసిస్తూ వాడెంత, వీడెంత అని తక్కువ చేసి చూడడం అలవాటు చేసుకుంటే పరిణామాలు ఇలానే ఉంటాయి. వినయ విధేయతలతో ఉండు, నీకంటే పైవారినే కాదు, కింద వారినీ, తక్కువ స్థాయిలో ఉన్నవారినీ, బాధితులను.. అల్పులనే దష్టితో చూడకుండా అందరిపట్ల దయాదాక్షిణ్యాలతో, గౌరవ మర్యాదలతో ప్రవర్తించడం చిన్నప్పటినుంచే అలవాటు కావాలి. పెద్దలు కూడా ఇటువంటి నీతి శతకాలను పిల్లల చేత చదివిస్తూ సమాజంలో బాధ్యతాయుత పౌరులుగా మెలగడానికి అవసరమైన శిక్షణ ఇవ్వాలి. అప్పుడు బద్దెన వంటి పెద్దల తపనకు ప్రయోజనం లభించినట్లవుతుంది. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
మంచి మాట: మీ చిత్తం ఎలాంటిది?
కొంతమంది ఒకటి అనుకుంటే ఇంకొకటి జరుగుతుంది, కాని కొందరు ఏది అనుకొంటే అదే జరుగుతుంది. దీనికి మూలకారణం ఆలోచనలే. అవే సానుకూల ఆలోచనలు, ప్రతికూల ఆలోచనలు. ఈ రెండింటికి మూలం చిత్తం. జ్ఞానాన్ని భద్రపరిచే స్థానాన్నే చిత్తం అంటారు. చిత్తంలో ఉన్న చెడు ఆలోచనలు మంచి ఆలోచనలుగా మారాలి. అప్పుడే మనం అనుకున్నవి అనుకున్నట్లుగా జరుగుతాయి. కర్మ చే యించేది మనస్సు, మనస్సుని నియంత్రించేది బుద్ధి. అహంకారం అంటే ప్రకృతి సిద్ధమైన... తన చుట్టూ వున్న పరిస్థితులను తనకు అనుకూలంగా సృష్టించుకోవాలనుకోవటమే. దీనినే మన పెద్దలు ఏమైంది ఇతనికి నిన్నటివరకు బాగానే ఉన్నాడు కదా, ఉన్నట్టుండి ఎందుకు ఇలా మారాడు అనీ లేదా ఇంతలోనే ఇతనిలో ఇంత మంచి మార్పు ఎలా వచ్చింది అనే వారు. దీనికి కారణం చిత్తం నుండి కర్మ ఆ సమయానికి ఆలా పనిచేయడమే. జీవికి వచ్చిపోయే జబ్బులు కూడా కొన్ని చిత్తానికి సంబంధించినవే, మనసు అనియంత్రిత అవయవాలను నియంత్రిస్తుంది. ఇది కలుషితమైతే దీనికి సంబంధించిన గుండె, మూత్రపిండాలు, కాలేయం, పేగులు మొదలైన అవయవాల పై ప్రభావం ఉంటుంది. నియంత్రించే వ్యవస్థ మొత్తం మెదడులో ఉంటుంది. మెదడులో ఏ అవయవానికి సంబంధించిన వ్యవస్థ చెడితే ఆ అవయవం పనిచేయదు. మెదడులో వున్న ఈ వ్యవస్థ సరికావాలంటే మనస్సులో ప్రక్షాళన జరగాలి. అందుకే ఈ మధ్యన వైద్యులు ప్రతి జబ్బుకు మనసు ప్రశాంతంగా ఉంచుకోండి లేదా ధ్యానం చెయ్యండి అని విరివిగా చెబుతున్నారు. మరి అవయవాలకు వచ్చే జబ్బుకు మనస్సుకు సంబంధించిన ధ్యానాలు ఎందుకు అంటే అన్నిటికి మూలం మనసే కనుక. మనసనేది ఆలోచనల ప్రవాహం. కోరికలు, వాంఛలూ ఆలోచనలతో సంక్రమించేవే. అంత వరకూ అనుభవంలోకి రాని దాన్ని అనుభవించాలనుకోవడం కోరిక. అదే అనుభవాన్ని మళ్ళీ మళ్ళీ పొందాలనుకోవడం వాంఛ. మనసు అల్లకల్లోలమైనప్పుడు మనం ఊపిరి వేగంగా తీసుకుంటాం. శ్వాసప్రక్రియలోక్రమబద్ధత ఉండదు. మనసును శాంత పరచడానికి శ్వాసను క్రమబద్ధం చేయడం ఒక పద్ధతి. నిండుగా గాలిని పీల్చి వదలడాన్ని క్రమం తప్పకుండా అభ్యసిస్తే నిశ్చలమైన మానసిక స్థితిని పొందవచ్చు. ప్రాణశక్తి మీద పట్టు సాధించడం కోసం ఊపిరిని నియంత్రించడమే ప్రాణాయామం. కోరికలు, వాంఛల నుంచి మనసును అధిగమించి స్వతంత్రంగా, వ్యక్తిగా ఉండగలిగే వారే యోగి. మనసును అధిగమించడమంటే దాన్ని నొక్కిపెట్టి ఉంచడం, నియంత్రించడం కాదు. మన ప్రవర్తనలో మార్పు చేసుకోవాలి. ఎదుటి వారి విజయానికి అసూయ చెందకుండా, అపజయాన్ని హేళన చేయకుండా ఉండాలి. విజయం, అపజయం, ఒకటి ఒకరు పొందితే. ఇంకొకరు కోల్పోతున్నారు, ఇంకొకరు కోల్పోతే, అది ఇంకెవరికో దక్కుతుంది. సుఖం, దుఃఖం. డబ్బు, ఆస్తి, అంతస్తులు అన్నీ నేడు నాది నాది అనుకున్నవి నిన్న వేరొకరివి, రేపు ఇంకెవరివో. అంటే ఏది ఎవరికి శాశ్వతం కాదు. నాది, నాకు అనే సుడిగుండాలలో ఇరుక్కొని మనసు పాడుచేసుకోవడమే సకల జబ్బులకు మూలం. ఈ సూత్రం అర్థం చేసుకొంటేనే ప్రశాంతత. ఏ ఇద్దరి మనస్సు, జీవన విధానం ఒకలాగే ఉండదు. కాని అందుకు విరుద్ధంగా తనకు అనుకూలంగా ఉండాలనుకోవడమే అహంకారం. ఈ అహంకారాన్ని మార్చుకొంటే చిత్తంలో వున్న చెడు కర్మలు అన్నీ మంచి కర్మలుగా మారి మనిషి జీవన విధానం మొత్తం మారిపోతుంది. అందుకే వెయ్యిమందిని వెయ్యిసార్లు యుద్ధంలో ఓడించిన వాడికన్నా తన మనసును జయించిన వాడే పరాక్రమవంతుడు’ అంటాడు గౌతమ బుద్ధుడు. మనస్సు అంటే సంకల్ప, వికల్పాల కలయిక నీరు నిర్మలంగా ఉన్నప్పుడు అందులో మన ప్రతిబింబం కనిపిస్తుంది. అందులో వేరే ఏమి కలిపినా నీరు కలుషితం అవుతుంది. ప్రతిబింబం అగోచరమౌతుంది. అలానే మనస్సులో మొదట చెడు ఆలోచనలు తరిమేయడానికి మంచి ఆలోచనలు చేయాలి. క్రమంగా మంచి ఆలోచనలూ తగ్గించాలి. అలా తగ్గించగా మనసు నిర్మలం అవుతుంది. –భువనగిరి కిషన్ యోగి -
ఎన్నిసార్లు ఓడినా... మీ అహం తగ్గట్లేదు: నరేంద్ర మోదీ
న్యూఢిల్లీ: వరుసగా ఎన్ని ఎన్నికల్లో ఓడుతున్నా కాంగ్రెస్ పార్టీకి అహంకారం మాత్రం తగ్గడం లేదంటూ ప్రధాని నరేంద్ర మోదీ ఫైరయ్యారు. ‘‘ఇప్పటికీ తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉంది. చూస్తుంటే మరో వందేళ్ల దాకా అధికారంలోకి రావద్దని గట్టి పట్టుదలతో ఉన్నట్టుంది. గెలవాలన్న కాంక్షే వారిలో ఏ కోశానా కన్పించడం లేదు. అందుకే, తనకేదీ దక్కనప్పుడు అన్నింటినీ వీలైనంతగా పాడుచేద్దామనే స్థాయికి దిగజారింది’’ అంటూ ఎద్దేవా చేశారు. ప్రతిదాన్నీ గుడ్డిగా వ్యతిరేకించడమే పనిగా పెట్టకుందని, వేర్పాటువాదాన్ని పెంచి పోషిస్తోందని మండిపడ్డారు. బ్రిటిష్‌వాళ్లు పోయినా వారి విభజించి పాలించే సూత్రాన్ని స్వభావంగా మార్చుకుందని విమర్శించారు. అందుకే టుక్డే టుక్డే గ్యాంగులకు లీడర్‌గా మారిందన్నారు. సోమవారం లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడిన ఆయన, కాంగ్రెస్‌ను గంటన్నరకు పైగా తూర్పారబట్టారు. కరోనా సంక్షోభ సమయంలో ఆ పార్టీ అన్ని హద్దులనూ దాటేసి చెప్పరానన్ని పాపాలకు పాల్పడిందని ఆరోపించారు. ‘‘కరోనా తొలి వేవ్ సమయంలో అంతా ఇళ్లకు పరిమితమై లాక్డౌన్ నిబంధనలను తు.చ. తప్పకుండా పాటిస్తూ ఉంటే కాంగ్రెస్ మాత్రం ముంబై రైల్వేస్టేషన్లో వీరంగం వేసింది. అమాయక కార్మికులకు ఉచితంగా టికెట్లు పంచి, భయపెట్టి సొంత రాష్ట్రాలకు పారిపోయేలా చేసింది. విభజించే మనస్తత్వం కాంగ్రెస్ డీఎన్ఏలోకి ఇంకిపోయింది. సమాజంలో వేర్పాటు బీజాలు నాటజూస్తోంది’’ అంటూ నిప్పులు చెరిగారు. గతవారం పార్లమెంటులో కాంగ్రెస్ మాట్లాడిన తీరు ప్రజలను రెచ్చగొట్టేదిగా ఉందంటూ ఆ పార్టీ నేత రాహుల్‌గాంధీ ప్రసంగంపై దుమ్మెత్తిపోశారు. ‘‘ఉదయం లేచింది మొదలు నిత్యం మోదీ నామ జపమే కాంగ్రెస్‌కు పనిగా మారింది. నా పేరు తలవకుండా బతకలేకపోతోంది’’ అంటూ ఎద్దేవా చేశారు. గుడ్డి విమర్శలు సద్విమర్శ ప్రజాస్వామ్యానికి ఆభరణమని, కానీ కాంగ్రెస్ చేసే గుడ్డి విమర్శలు మాత్రం ప్రజాస్వామ్యానికి అవమానం తప్ప మరోటి కాదని ప్రధాని అన్నారు. ‘‘బీజేపీ ఏదైనా ఎన్నికల్లో ఓడితే దానిపై నెలలపాటు లోతుగా విశ్లేషించుకుంటుంది. కాంగ్రెస్‌కు మాత్రం ఆ అలవాటూ లేదు, అహంకారమూ తగ్గదు. దాని మనోగతం, మాటతీరు, చేసే తప్పుడు పనులు చూస్తుంటే మరో వందేళ్ల దాకా అధికారంలోకి రావద్దని అనుకుంటోందేమోనని కొన్నిసార్లు నాకు అనిపిస్తుంది. వాళ్ల ఉద్దేశం అదే అయితే అందుకవసరమైన ఏర్పాట్లు చేసే ఉంచాను’’ అని చెణుకులు విసిరారు. ‘‘మేం దేశీయతకు పెద్దపీట వేస్తున్నాం. ఇది గాంధీ కలలను సాకారం చేయడం కాదా? దాన్నీ, మేం తెచ్చిన యోగా, ఫిట్ ఇండియా కార్యక్రమాలను కూడా కాంగ్రెస్ ఎద్దేవా చేస్తోంది. 1971 నుంచీ పేదరిక నిర్మూలన నినాదాలతోనే ఆ పార్టీ ఎన్నికలు నెగ్గుతూ వచ్చింది. పేదరికమైతే పోలేదు గానీ జనం కాంగ్రెస్‌నే సాగనంపారు. చాలా రాష్ట్రాల్లోనైతే దశాబ్దాలుగా అధికారానికి దూరంగా ఉంచారు. ఎన్నికలు ముఖ్యం కాదు. కావాల్సింది చిత్తశుద్ధి’’ అన్నారు. కరోనాపై మన పోరు ఆదర్శం కరోనా సంక్షోభాన్ని భారత్ ఎదుర్కొన్న తీరు ప్రపంచానికే ఆదర్శమని మోదీ అన్నారు. మున్ముందు ప్రపంచానికి మనం లీడర్‌గా ఎలా ఎదగాలో ఆలోచించుకోవడానికి ‘స్వాతంత్య్ర అమృతోత్సవాలు’ సరైన సందర్భమన్నారు. ‘‘కోవిడ్ అనంతరం ప్రపంచ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. ఈ అవకాశాన్ని భారత్ జారవిడుచుకోరాదు’’ అని సూచించారు. తర్వాత జనవరి 31న పార్లమెంటు ఉభయసభలనుద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేసిన ప్రసంగానికి ధన్యవాద తీర్మానాన్ని లోక్‌సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. మీకు అన్నిచోట్లా ఓటమే! 50 ఏళ్లు అధికారంలో ఉన్న పార్టీని దేశమంతటా ప్రజలు వరుసబెట్టి ఎందుకు తిరస్కరిస్తూ వస్తున్నారో ఆలోచించుకోవాలి. చాలా రాష్ట్రాల్లో మిమ్మల్ని దశాబ్దాలుగా ఓడిస్తూ వస్తున్నారు. తెలంగాణ ఇచ్చినా సరే, అక్కడా కాంగ్రెస్‌ను శాశ్వతంగా తుడిచిపెట్టేశారు’’ అన్నారు. తమిళనాడులో హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్‌కు నివాళులు అర్పించేందుకు ఆ రాష్ట్ర ప్రజలంతా కదలివచ్చిన తీరు అభినందనీయమన్నారు. ఈ విషయంలో కూడా తమిళ సెంటిమెంట్లను గాయపరిచేలా ప్రవర్తించిన చరిత్ర కాంగ్రెస్‌దని విమర్శించారు. ‘‘లీడర్లు వస్తారు, పోతారు. దేశం మాత్రం శాశ్వతం. ఐక్యతా పునాదుల మీద నిలిచిన గొప్ప దేశం మనది. ఇకముందూ అలాగే నిలుస్తుంది’’ అని మోదీ హితవు చెప్పారు. విభజించే మనస్తత్వం వాళ్ల డీఎన్ఏలోనే ఇంకిపోయింది. సమాజంలో వేర్పాటు బీజాలు నాటుతూ తప్పుల మీద తప్పులకు పాల్పడుతోంది నిత్యం మోదీ నామ జపం చేయనిదే కాంగ్రెస్ బతకలేకపోతోంది. మరో వందేళ్ల దాకా అధికారం వద్దన్నదే వాళ్ల ఉద్దేశమైతే అందుకు తగ్గ ఏర్పాట్లు చేసే ఉంచా. -
ఒబామా మెచ్చిన తలపాగా
ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు జివాన్‌దీప్. శాన్ డియాగోకు చెందిన ఈయన ఎల్‌జీబీటీక్యూలు జరుపుకునే ప్రైడ్ మంత్ ఉత్సవాల్లో భాగంగా ధరించిన ఇంద్ర ధనుస్సు రంగుల తలపాగా అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామాను ముగ్ధుడిని చేసింది. ప్రైడ్ మంత్ ఉత్సవాలు ప్రారంభమైన జూన్ 1న జివాన్‌దీప్ ట్విట్టర్లో పెట్టిన ఈ ఫోటోకు లక్షకుపైగా లైకులు 15వేలకు పైగా రీట్వీట్లు వచ్చాయి. బైసెక్సువల్ అయిన జివాన్ ఈ ఫోటోకు ‘బై సెక్సువల్ బ్రెయిన్ సైంటిస్టయినందుకు గర్వంగా ఉంది. నా గుర్తింపునకు సంబంధించిన అన్ని అంశాలను(తలపాగా, గడ్డం) వ్యక్తీకరించగలగడం అదృష్టంగా భావిస్తున్నాను. ఇదే స్వేచ్ఛను ఇతరులు కూడా ప్రదర్శించేలా చూసేందుకు కృషి చేస్తాను’అని కేప్షన్ ఇచ్చారు. ఈ ఫోటోకు తాజాగా ఒబామా కూడా లైక్ కొట్టారు. ‘జివాన్‌దీప్ మీరు గర్వపడే పని చేశారు . ఈ దేశంలో గేలకు మరింత సమానత్వం కల్పించేందుకు మీరు చేసిన కృషికి ధన్యవాదాలు...అన్నట్టు.. మీ తలపాగా అద్భుతంగా ఉంది. అందరికీ ప్రైడ్ మంత్ శుభాకాంక్షలు.’అని ఒబామా ట్వీట్ చేశారు. జూన్ 4న ఒబామా చేసిన ఈ ట్వీట్‌కు 3 లక్షలకు పైగా లైక్‌లు వచ్చాయి. ఒబామా, కెనడా ప్రధాని ట్రూడో ఎల్జీబీటీక్యూలకు మద్దతునిస్తున్న సంగతి తెలిసిందే. 1969 నుంచి ప్రపంచ వ్యాప్తంగా ఎల్జీబీటీక్యూ లు ప్రైడ్ మంత్ జరుపుకుంటున్నారు. 50 ఏళ్ల క్రితం అమెరికాలోని గ్రీన్విచ్ గ్రామంలోని ఒక బారులో గేలు సంబరాలు చేసుకుంటుండగా పోలీసులు దాడి చేశారు. దాంతో దేశ వ్యాప్తంగా గేలు హక్కుల కోసం ఉద్యమించారు.ఫలితంగా ఇతరులతో పాటు సమానంగా హక్కులు సాధించారు. ఆ ఘటనకు గుర్తుగా ప్రతీ జూన్‌లో ఎల్‌జీబీటీక్యూలు ప్రైడ్ మంత్ నిర్వహిస్తారు. -
ఎల్జీబీటీ సంఘానికి జుకర్ బర్గ్ మద్దతు!
శాన్ ఫ్రాన్సిస్కోః ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్ బర్గ్ ఎల్జీబీటీ ప్రైడ్ పరేడ్ లో పాల్గొన్నారు. లెస్బియన్, గే, బై సెక్సువల్, ట్రాన్స్ జెండర్లు శాన్ ఫ్రాన్సిస్కోలో నిర్వహించిన పరేడ్ లో పాల్గొని, అనంతరం ఫేస్ బుక్ లో వారికి అందించే తోడ్పాటుతో కూడని విషయాలను వివరిస్తూ ఓ సుదీర్ఘ వ్యాసాన్ని పోస్టు చేశారు. మార్క్ జుకర్ బర్గ్ మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు. అమెరికా శాన్ ఫ్రాన్సిస్కోలో నిర్వహించిన ఎల్జీబీటీ ప్రైడ్ మార్చ్ లో పాల్గొన్న ఆయన.. ఆ సమాజ సభ్యులకు తన అండదండలు ఎప్పుడూ ఉంటాయన్నారు. ఇటీవల ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు ప్రైడ్ పరేడ్స్ లో పాల్తొంటున్నారని, ఎల్జీబీటీ సమాజ సభ్యులతో తాను పెరేడ్ లో కలసి నిలబడటమే కాదు.. ఫేస్ బుక్ వారికి సురక్షితమైన స్థలంగా మార్చేందుకు కట్టుబడి ఉన్నానని జుకర్ బర్గ్ తన ఫేస్ బుక్ పోస్ట్ లో తెలిపారు. తమకూ స్వేచ్ఛా, ఆనందం, జీవించే హక్కు కావాలని కోరుకుంటున్న వారిని గౌరవిస్తూ వారితో కలసి తాను ఎల్జీబీటీ నిర్వహించే నెలవారీ ప్రైడ్ సంబరాలు జరుపుకుంటున్నానని, సమానత్వంకోసం వారు చేసే పోరాటంలోనూ తాను పాల్గొన్నానని తెలిపారు. వారి సమస్యల పోరాటానికి ప్రత్యేకంగా పనిచేస్తానని తెలిపారు. ఎల్జీబీటీ ప్రైడ్ పరేడ్ కు మద్దతు పలికిన టెక్ సీఈవోల్లో ఫేస్ బుక్ సీఈవో జుకర్ బర్గ్ మాత్రమే కాక... యాపిల్ సీఈవో టిమ్ కుక్, వారి ఉద్యోగులు కూడ పాల్గొని ఎల్జీబీటీ హక్కుల పోరాటానికి మద్దతు పలికారు. -
అహంకారంతో మాట్లాడుతున్నారు
కేటీఆర్‌పై పొంగులేటి ఫైర్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మంత్రి కేటీఆర్ స్థాయిని మించి, అహంకారంతో మాట్లాడుతున్నారని కాంగ్రెస్ నేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి అన్నారు. శనివారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ను రాష్ట్రంలో లేకుండా చేస్తామని కేటీఆర్ అహంకారంతో మాట్లాడుతున్నారని, ఇది మంచిదికాదని హెచ్చరించారు. కరువు, ప్రజా సమస్యలు ఉన్నా పట్టించుకోకుండా ప్రభుత్వ యంత్రాంగం అంతా పాలేరు ఉప ఎన్నికపైనే దృష్టి కేంద్రీకరించిందన్నా రు. రాజకీయాలను మాత్రమే కాకుండా అధికారంలో ఉన్నామనే విషయాన్ని గుర్తుంచుకుని, కరువు నివారణ చర్యలపైనా దృష్టి పెట్టాలన్నారు. టీఆర్ఎస్ ఎన్ని జిమ్మిక్కులు చేసినా పాలేరులో కాంగ్రెసే గెలుస్తుందన్నారు. -
వినయం పురుష లక్షణం...
నేడు బీ హంబుల్ డే / Be humble day తనను తాను తగ్గించుకునెడివాడు హెచ్చించబడును. - బైబిల్. ‘గాడ్!’ ‘చెప్పు మానవా’.‘మేము నీకు ఈక్వల్ అయిపోయాం. నువ్వు సృష్టించేదంతా మేమూ సృష్టిస్తున్నాం. కావాలంటే ప్రాణం పోయగలం. తీయగలం. ఏమిటి నీ గొప్ప. ఇప్పటికప్పుడు ఒక మనిషిని సృష్టించి చూపించనా?’‘చూపించు నాయనా’. మట్టి అందుకుంటూ ఉండగా దేవుడు వారించాడు. ‘మానవా!’ ‘ఏమిటి గాడ్?’ ‘చిన్న షరతు. ఆ మట్టి కూడా నువ్వు సృష్టించిందే అయి ఉండాలి.’ మానవుడు లేడు. పారిపోయాడు. అహంకారానికి ఆమోదం లేదు. ప్రకృతిలో అహంకారం అనే మాట లేదు. ఒక చిన్నపాటి ఉలికిపాటు తెచ్చుకుంటే, కూచున్న చోటు నుంచి కొద్దిగా లేచి నిలబడితే, నా శక్తి చూపించనా అని మహా సముద్రాలు కాసింత జూలు విదిలిస్తే ఎవరూ మిగలరు. కాని అవి ఎప్పుడూ ఒడ్డు దగ్గర అలా అల్లిబిల్లి ఆడుతూ వినయంగా ఉంటాయి. ఎప్పుడైనా కాసింత జ్వరం వస్తే కలవరం పెట్టి తిరిగి స్వస్థత పొందుతాయి. సునామీ కేవలం కాలి కొనగోటు. సముద్రుడి నిజ విశ్వరూపం మనం చూడలేదు. చూశాక మిగిలే అవకాశం లేదు. ఇప్పుడు చూస్తున్నది కేవలం వినయం. వినమ్రత. ఒదిగి ఉండే సుగుణం. భూమికి అహంకారం లేదు. నేను మోస్తున్నాను గనక మీరు బతుకుతున్నారు... నా ప్రతాపం చూపించనా అని ఎప్పుడూ తాండవం ఆడలేదు. ఆడాక మనం ఉండే అవకాశం లేదు. భూకంపాలు, భూకదలికలు... కేవలం కాలిలో ముల్లు గుచ్చుకుంటే వచ్చే ‘ఇస్స్’ అనే మూలుగు. దానికే కకావికలం అయిపోయాం. పటాపంచలుగా చెదిరిపోయాం. భూదేవిది చాలా నిశ్శబ్దమైన వినయం. తిరిగే చప్పుడే మన దాకా రానివ్వదు. ప్రగల్భాలు పలికే ఓ మనిషీ... ఏం చూసుకొని నీ ప్రగల్భాలు. నింగి ఎంత వినయపూర్వకమైనదో చూడండి. అది ఏనాడూ విరిగి నెత్తిన పడలేదు. గ్రహశకలాలు రంకెలు వేయవు గమనించండి... ఒక్కటి కూడా వచ్చి మనల్ని తాకవు. సూర్యుడు ఒక గజం కిందకు దిగడు. చందమామ తన ఫిలమెంట్ సైజ్ పెంచుకోడు. సింహం జూలు రెండు జానలే. ఏనుగుకు రెండు దంతాలకు మించవు. అంత పెద్ద చెట్టూ చెద పడితే కూలాల్సిందే. ఎంతో పెద్ద తిమింగలం ఒడ్డున పడితే చావాల్సిందే. అహంకారానికి ప్రకృతిలో తావు లేదు. అది మనిషి పెంచుకున్న తోక. కత్తిరించుకున్నవాడే జ్ఞాని. ఈ సృష్టిని మోస్తున్న విష్ణువును నేనే మోస్తున్నాను కదా అని అహంకరించాడు గరుత్మంతుడు. ఏమైంది? మోస్తూనే ఉన్నాడు. మోయడం అనేది అతడికి చిక్కిన అపురూపమైన అవకాశం. విష్ణుమూర్తి దయదలుపు. ఉన్నది ఎలా వచ్చింది అని తెలుసుకుంటే వినయం. లేకుంటే అహంకారం. ముల్లోకాలు చుట్టిరావడమే కదా... ఎంతసేపు అనుకున్నాడు సుబ్రహ్మణ్యేశ్వరుడు. నెమలి ఎక్కి పరుగులిడితే చుట్టి రాగలిగిన పాటివా ముల్లోకాలు? యుగాలు గడిచిపోతాయి. ఆ సంగతి తెలిసినవాడే కనుక విఘ్నేశ్వరుడు వినయంగా తల్లిదండ్రుల ప్రదక్షణను ముమ్మార్లు పూర్తి చేశాడు. కారణాలు ఏవైనా కావచ్చు... పాత అనుభవాలు ఎలాగైనా ఉండొచ్చు... ఇంతిస్తాను అంతిస్తాను అనాలిగాని సూదిమొన మోపినంత స్థలం కూడా ఇవ్వను అని అనకూడదు. అది దుర్యోధనుడి అహంకారం. దానికి కురువంశ వినాశనమే జవాబైంది. ‘రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం’ అని అహంకరించాడు తెల్లవాడు. ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాలకు కాస్త అటు ఇటుగా ఉండేపాటి స్థలంలో పరిమితమయ్యాడు.రాజు దైవాంశ సంభూతుడు అనుకున్న ఏ రాజూ మిగల్లేదు. అంత పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించిన చెంగిజ్ ఖాన్ మరి కొన్నాళ్లు బతికే మార్గముందా అని ఎవరి కాళ్లు పట్టుకున్నా మృత్యువు కరుణించలేదు. అహంకారం శిథిలం అవుతూనే ఉంటుంది. వినయం పదే పదే మొలక వేస్తూ ఉంటుంది. ప్రకృతి దగ్గర ఒక చాకు ఉంటుంది.తల ఎగరేసినవాడి శిరోముండనం చేస్తుంటుంది. విర్రవీగడం దానికి నచ్చదు. ఉదాహరణలను చూపి నలుగురినీ హెచ్చరిస్తుంటుంది. అంతపెద్ద సంగీతకారుడు, సంగీత బ్రహ్మ ఏ సంగీతాన్నయితే తాను సృష్టించాడో ఆ సంగీతాన్ని వినే వీలు లేక ‘బితొవెన్’కు ప్రకృతి బ్రహ్మ చెవుడు ప్రసాదించింది. అతిలోక సౌందర్యవతి ఆంజలీనా జూలీ రెండు వక్షోజాలను తొలగించే పరిస్థితి అది ఎందుకు తెచ్చినట్టు? బంగారు ప్రాసాదంలో నిదురించినవాడు, సద్దాం హుసేన్, ఒక కలుగులో చిక్కాడు. సుమున్నతంగా నిలిచాయనుకుంటున్న రెండు అహంకార ప్రాకారాలను రెండు విమానాలు క్షణంలో బూడిద చేశాయి. వినయంతో ఉన్న వాళ్లు అడవుల్లో కందమూలాలైతేనేమి భుజించి సంతోషంగానే ఉన్నారు. అహంకారం కలిగిన వాళ్లు సైన్యాలు పెంచుకుంటూ స్థావరాలు పెంచుకుంటూ ఆయుధాలు పెంచుకుంటూ అణుపరీక్షలు చేసుకుంటూ అశాంతితో ఆగమవుతున్నారు. ఇది తల్లిదండ్రుల దయ. చదువు ఇచ్చిన గురుదేవుల దయ. ఇది పెద్దవారి ఆశీస్సుల దయ. ఇదంతా ఆ పైవాడి దయ అనుకుని అనుక్షణం వినమ్రంగా ఉన్నవారే విజేతలు అయ్యారు. విజయాన్ని నిలబెట్టుకున్నారు. కొనసాగించగలిగారు. లేనివాళ్లంతా పడ్డారు.పడ్డవాళ్లు చెడ్డవాళ్లు కాకపోవచ్చు.కాని- అహంకారం ఉన్నవాళ్లంతా పడ్డవాళ్లే. నాకు తెలియనిదంతా నా అజ్ఞానమే అని చెప్పుకున్నాడు సోక్రటీసు. అంతే తప్ప నాకు అంతా తెలుసు అనలేదు. అంత సృజన, పాండిత్యమూ ఉండి కూడా పోతన ‘పలికెడిది భాగవతంబట... పలికించెడువాడు రామభద్రుండట’ అని ఆ క్రెడిట్‌ని రాముడికే ఇచ్చేశాడు. ‘నా గొప్పతనం ఏమీ లేదు... నేను ఎంచుకున్న సత్యమార్గం గొప్పదనమే ఇదంతా’ అన్నాడు మహాత్ముడు. ఈ విజయం ప్రజలది అన్న నాయకుడు నిలిచాడు. నాది అన్నవాడు పోయాడు. పోతాడు. మరి అన్నివేళలా వినయమేనా? అహంకారం వద్దా? ఉండాలి. అసామాన్యమైన విజయం సాధించాలంటే అహంకారం ఉండాలి. ఓ ఎవరెస్ట్... నీ శిఖరాన్ని నా పాదంతో ముద్దాడుతాను ఉండు... అన్నచోట అహంకారం ఉండాలి. ఓ మహమ్మారి... నీ పీకకు నా టీకాను చుడతాను ఉండు... అన్నచోట అహంకారం ఉండాలి... ఓ పేదరికమా నిన్ను తరిమికొట్టడంలో నేను విశ్రమించను చూడు అన్నచోట అహంకారం ఉండాలి... ఓ హింసా భూతమా నిన్ను కూకటివేళ్లతో సహా పెకలిస్తాను అన్న చోట అహంకారం ఉండాలి. అంతే తప్ప స్నేహితుల వద్దా సాటి మనుషుల వద్దా అవసరానికి వచ్చినవాళ్ల వద్దా దీనుల వద్దా భిక్షకుల వద్దా అహంకారం చూపితే ప్రకృతి క్షమించదు.దాని కత్తెర మనవైపు దూసుకువస్తుంది. కచక్. - నెటిజన్ కిశోర్ నాకు తెలియనిదంతా నా అజ్ఞానమే అని చెప్పుకున్నాడు సోక్రటీసు. అంతే తప్ప నాకు అంతా తెలుసు అనలేదు. అంత సృజన, పాండిత్యమూ ఉండి కూడా పోతన ‘పలికెడిది భాగవతంబట... పలికించెడువాడు రామభద్రుండట’ అని ఆ క్రెడిట్‌ని రాముడికే ఇచ్చేశాడు.