శతక నీతి – సుమతి: క్షణంలో పిడికెడు బూడిదగానే మిగిలిపోవచ్చు !!! | Dangerous to speak arrogantly with strength in mind | Sakshi
Sakshi News home page

శతక నీతి – సుమతి: క్షణంలో పిడికెడు బూడిదగానే మిగిలిపోవచ్చు !!!

Published Mon, Jun 13 2022 12:34 AM | Last Updated on Mon, Jun 13 2022 12:34 AM

Dangerous to speak arrogantly with strength in mind - Sakshi

శంకర భగవత్పాదులు అంటారు..‘‘మా కురు ధనజన యౌవన గర్వం  హరతి నిమేషాత్‌ కాలస్సర్వం, మాయామయమితి సర్వం హిత్వా బ్రహ్మ పదం త్వాం ప్రవిశ విదిత్వా’’. మా కురుధన... డబ్బు ఉంటుంది, లక్షాధికారులు భిక్షాధికారులయిన రోజులున్నాయి. ఎంతో ఐశ్వర్యవంతులు కటిక దరిద్రాన్ని అనుభవించిన వారున్నారు. జనం నా వెనుక ఇంతమంది ఉన్నారు అన్నవాడి వెనుక ఉండేవారులేక.. జారిపోయిన వారు ఎక్కువమంది ఉన్నారు. యవ్వన సర్వం... ఇంత బలవంతుణ్ణి–యవ్వనంలో ఉన్నానంటాడు.

గిర్రున పాతికేళ్ళు తిరిగేసరికి పటుత్వం సడలి, సంధిబంధములు జారిపోయి వృద్ధాప్యం ఆవహిస్తుంటుంది. హరతి నిమేషాత్‌ కాలస్సర్వం – కాలం చాలా తినేస్తుంది. నాకు తిరుగులేదు అన్న ఆరడుగుల నిండు మనిషి చివరకు రుద్రభూమిలో పిడికెడు బూడిద కింద మారిపోతాడు. ఎందుకీ అతిశయం? వినయంగా ఉండడం నేర్చుకో.. నీలో ఎన్ని మంచి గుణాలున్నా, నిస్సహాయ స్థితిలో ఉండి నీ వల్ల బాధలకు గురయినవారందరూ ఒకనాడు నీ పని పడతారు. అపకీర్తి మూటగట్టుకుని వెళ్లిపోతావు.

భారతంలో దుర్యోధనుడి సంగతే చూడండి... ‘ఆ పాండవులెంత, ఆ భీముడెంత, ఆ అర్జునుడెంత... చిటికెలో చంపేస్తా... నాదగ్గర భీష్ముడున్నాడు, కర్ణుడు, ద్రోణుడున్నాడు, నాకింతమంది సోదరులున్నారు. నాకిన్ని అక్షౌహిణుల సైన్యం ఉంది...’ అంటూ విర్రవీగేవాడు. ఆయనకు మంచి మాటలు చెప్పనివారెవరు, అందరూ చెప్పారు. కానీ వినలేదు. వినకపోగా చెప్పేవాళ్ళను అవమానించేలా ప్రవర్తించేవాడు. చివరికి రాయబారం చేయడానికి వచ్చిన కృష్ణుడిని కూడా బంధించబోయాడు. ఒకరోజు మైత్రేయ మహర్షి వచ్చాడు.

‘తప్పు దుర్యోధనా! పాండవులు ధర్మమార్గంలో ఉన్నవాళ్ళు. వాళ్ళతో నీకు గొడవలెందుకు, వాళ్లకివ్వాల్సిన రాజ్యభాగం ఇచ్చేయి.’’ అని నచ్చచెప్పబోయాడు. ప్రతిరోజూ ఎవడో ఒకడు రావడం ధర్మపన్నాలు వల్లించడం అలవాటయిపోయిందంటూ మహర్షి మాట్లాడుతున్నప్పుడు వెటకారంగా తొడల మీద తాళం వేస్తున్నట్లు చెయ్యి తిప్పుతున్నాడు. ఆయనకు ఎక్కడలేని కోపం వచ్చింది. ‘‘నేను వ్యయప్రయాసలకోర్చి నీ మంచి కోరి నీకు నాలుగు మంచిమాటలు చెప్పిపోదామని వస్తే శ్రద్ధతో వినకపోగా ఎగతాళి చేస్తూ, నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నావు. ఏ తొడలను తక్కువగా భావించి వాటిమీద వెకిలిచేష్టలు చేసావో ఆ తొడలే భీమసేనుడి చేతిలో చితికిపోయి యుద్ధభూమిలో పడిపోయెదవుగాక!’’ అని శపించాడు.

హడిలిపోయి ధృతరాష్ట్రుడు వెళ్ళి మైత్రేయ మహర్షి కాళ్ళమీద పడ్డాడు, శాపాన్ని ఉపసంహరించుకోమని కోరుతూ. ‘‘పాండవులతో నీ కొడుకు సంధి చేసుకుంటే ఆ శాపం అన్వయం కాదు, చేసుకోకపోతే ... చెప్పిన మాట వినలేదు కాబట్టి జరగాల్సింది జరుగుతుంది’’ అన్నాడు మహర్షి. ఏమయింది... అదే జరిగింది.

బలవంతుడ నాకేమని విర్రవీగినందుకు ఫలితం అది...తన బలం, బలగం అనుకొన్నవారిలో ఒక్కొక్కరు వెళ్ళిపోయారు. భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, శల్యుడు, సోదరులు అందరూ వెళ్ళిపోయారు.. ఓ నలుగురు తప్ప. యుద్ధభూమిలో భీముడి గదాఘాతానికి తొడలు విరిగిపోయి, నెత్తురు ఓడుస్తుండగా అప్పుడు ఏడ్చాడు. రుషులు చెబితే వినలేదు, విదురుడు చెప్పినా వినలేదు... చివరకు అందర్నీ చంపేసుకొన్నా...అంటూ తన దుస్థితిని తలుచుకుని విలపించాడు.
ఎందుకంత పొగరుబోతుతనం... ధనం కానీ, అధికారం గానీ, ఇతరత్రా నైపుణ్యాలు, పాండిత్యం కానీ నీకు భగవంతుడేదో ఇచ్చి ఉండవచ్చు.. అది కాస్త ఎక్కువే ఇచ్చి ఉండవచ్చు. అవి ఇచ్చినందుకు భగవంతుడిపట్ల వినయ విధేయతలతో కృతజ్ఞుడిగా ఉండడానికి బదులు, నీ బలం చూసుకొని అహంకారంతో వదరి మాట్లాడడం అత్యంత ప్రమాదకరం.
బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement