అంతర్ముఖుల శక్తి వారి నిశ్శబ్దంలోనే ఉంటుంది. కాని అదే వారి బలహీనత కూడా కావచ్చు. అంతర్ముఖత్వం వల్ల కచ్చితంగా చెప్పాల్సినవి చెప్పకపోవచ్చు. మనసులో ఏముందో ఎదుటివారికి తెలియకపోవడం వల్ల అనుకోని సమస్యలు రావచ్చు. అంతర్ముఖులుగా ఉన్న స్త్రీలు తమ కుటుంబ, ఉద్యోగ, సామాజిక జీవనంలో ఎలా మెలగాలో తెలుసుకుందాం.
కొందరు అన్నింటికీ స్పందిస్తారు. కొందరు మౌనంగా ఉంటారు. కొందరిని చూసి ఇతరులు ‘వాళ్లు మనసులో ఏమీ దాచుకోరు’ అంటారు. మరికొందరిని చూసి ‘వీళ్ల మనసులో ఏముందో తెలుసుకోలేము’ అంటారు. బహిర్ముఖులదే (ఎక్స్‌ట్రావర్ట్స్) ఈ లోకం అని ఎక్కువ మంది విశ్వాసం.
ఎందుకంటే తప్పో ఒప్పో ఏదో ఒకటి మాట్లాడి నలుగురి దృష్టిని ఆకర్షించేవాళ్లే గెలుపు సాధిస్తారని ఎక్కువమంది అభిప్రాయం. అలా కాకుండా కేవలం తమ పని ఏదో తాము చేసుకుంటూ అవసరమైతే తప్ప తమ అభిప్రాయాలను వెల్లడించని అంతర్ముఖులు (ఇంట్రోవర్ట్స్) సాధించే విజయాలు తక్కువ కాదు. ఇవాళ (జనవరి 2) ప్రపంచ అంతర్ముఖుల దినోత్సవం.
మీరు అంతర్ముఖులా?
ఎలా తెలుస్తుంది. ఈ ప్రశ్నలకు ‘అవును’/ ‘కాదు’లలో ఏది చెప్పగలరో చూడండి.
1. మీరు గుంపులో ఉండటానికి ఇష్టపడరా?
2. చాడీలు, పుకార్లు కాకుండా మీకు ఇష్టమైన అంశం గురించే మాట్లాడటానికి ఇష్టపడతారా?
3. మీ చిన్నప్పుడు బంధువులొచ్చినా, ఫంక్షన్ల సమయంలో ఎక్కువగా మీరెక్కడున్నారో తెలియనట్టు మసలేవారా?
4. అప్పుడప్పుడు ఒంటరిగా మీ ఆలోచనల్లో మీరుండాలనిపిస్తుందా?
5. మీకు తక్కువగా, మృదువుగా మాట్లాడే మనిషి అనే పేరుందా?
వీటి జవాబులు ‘అవును’ అయితే మీరు ఇంట్రావర్ట్ కిందే లెక్క. అయితే మానసిక నిపుణుల ప్రకారం ఎవరూ పూర్తిగా అంతర్ముఖత్వంతో, పూర్తిగా బహిర్ముఖత్వంతో ఉండరు. ఇరు స్వభావాలూ అందరిలో ఉంటాయి. అయితే ఒకటి ఎక్కువ పాళ్లల్లో ఉంటుంది. అంతర్ముఖత్వం ఎక్కువ పాళ్లల్లో ఉంటే మీరు అంతర్ముఖుల కిందే లెక్క.
ఇవీ ప్లస్ పాయింట్స్
అంతర్ముఖులు తమ లోపలి నుంచి తాము శక్తిని పొందుతారు. వీరు ఎప్పుడూ తమ మనోభావాలను, ఆలోచనలను గమనించుకుంటూ ఉంటారు. నడిచి వచ్చిన దారిని బేరీజు వేసుకుని సరి చేసుకుంటూ ఉంటారు. ఒక పని మీద లక్ష్యం ఉంటుంది. చాలామటుకు నిరుపయోగమైన పనుల్లో కాలం వృథా చేయరు.
మైనస్ పాయింట్స్
ఏ పనైనా సమర్థంగా చేయగలిగే శక్తి, నైపుణ్యం, ప్రతిభా ఉన్నా అది చేతలతో మాత్రమే చూపుతారు. మాటల వల్ల తెలియచేసి ముందుగా అవకాశం దొరకబుచ్చుకోరు. ఒకరిని పొగడటం, ఒకరితో పొగడ్త వినడం వీరికి దాదాపుగా రాదు. గుంపులను ఇష్టపడరు. వీరి నిశ్శబ్దాన్ని ఎదుటివారు పొగరుగా, నిర్లక్ష్యంగా భావించవచ్చు. నలుగురినీ తమ మాటలతో ఆకర్షించే ఎక్స్‌ట్రావర్ట్స్‌ను చూసి, వీరు అలా ఉండకపోవడం లోపమేమో అని బాధపడవచ్చు.
స్త్రీలు ఇంట్రోవర్ట్స్ అయినప్పుడు
ప్రపంచంలో బహిర్ముఖులు ఎంతమందో అంతర్ముఖులు అంతమంది ఉంటారు. అమ్మాయిలు తమ బాల్యంలో ఇంట్రోవర్ట్‌లుగా ఉంటే వీరికి తక్కువమంది స్నేహితులయ్యే అవకాశం ఉంది. తల్లితో, తోబుట్టువులతో తప్ప ఎక్కువమందితో మాట్లాడకపోవచ్చు. కాలేజీలో ఇలాంటి వారు కాలేజీలో ఉన్నారా లేరా అన్నట్టుగా ఉంటారు. ఉద్యోగాల్లో వీరు చెప్పిన పని చేసుకునిపోయే వారవుతారు.
గృహిణిగా ఎక్కువ మౌనంతో, తక్కువ మాటలతో సంసారాన్ని నిర్వహిస్తారు. అయితే వీటివల్ల ఏ నష్టమూ లేకపోయినా అనేక విషయాలు వీరికి నచ్చనప్పుడు మౌనాన్ని ఆశ్రయిస్తారు. వారు ఎందుకు మౌనాన్ని ఆశ్రయించారో ఎదుటివారికి తెలియక సతమతమయ్యే స్థితి ఉంటుంది. కుటుంబ పరంగా, వృత్తిగతంగా, పిల్లల భవిష్యత్తు విషయంలో కీలకమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు వీరి నిర్ణయం బాగా ఆలస్యమయ్యి లేదా వెంటనే తేలక చిక్కులు రావచ్చు.
ఏం చేయాలి?
సుసాన్ కెయిన్ అనే అమెరికన్ రచయిత్రి ‘క్వైట్: పవర్ ఆఫ్ ఇంట్రావర్ట్’ అనే పుస్తకం రాసింది. అంతర్ముఖుల మౌనంలోనే వారి శక్తి ఉంటుంది. అదే సమయంలో భర్తతో/పిల్లలతో/ ఆఫీసు పరివారంతో కచ్చితమైన అభిప్రాయాలు వెల్లడి చేయాల్సి వచ్చినప్పుడు తప్పక వెల్లడి చేయాలి. ఇంట్లో కాసేపు ఒంటరిగా ఉండాలనిపించినప్పుడు ‘అలక/కోపం’ అనే భావన ఇతరులకు కలగకుండా ‘కాసేపు పుస్తకం చదువుకుంటాను’ అని చెప్పి ఏదో ఒక పుస్తకం పట్టుకుని గదిలో మీ ఆలోచనల్లో మీరు నిమగ్నం కావచ్చు. కుటుంబ సభ్యులు అందరూ కూడినప్పుడు మీరు తక్కువ మాట్లాడినా పూర్తి సమయం వారి సమక్షంలో ఉండేలా చూసుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment