పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే) భారత్‌లో అంతర్భాగమేనని విదేశాంగ మంత్రి జైశంకర్ పేర్కొన్నారు. కొంతమంది బలహీనత వల్లే పీఓకేపై భారత్ నియంత్రణ కోల్పోయిందని ఆరోపించారు. ఒకరు చేసిన పొరపాటే దీనికి కారణమని చెప్పారు. భారత తొలి ప్రధాని జవహార్‌లాల్ నెహ్రూ, కాంగ్రెస్ పార్టీని పరోక్షంగా ఉద్ధేశిస్తూ జైశంకర్ ఈ వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలోని నాసిక్‌లో ‘విశ్వబంధు భారత్’ పేరుతో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి ప్రసంగిస్తూ పీఓకేపై జై శంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను భారత్ విలీనం చేసుకునే విషయమై లక్ష్మణ రేఖ వంటివి ఉన్నాయంటే తాను నమ్మబోనని చెప్పారు.లక్ష్మణ రేఖ వంటిది ఏదీ లేదని పేర్కొన్నారు. భారత్‌లో పీఓకే అంతర్భాగమని తాను భావిస్తున్నట్లు తెలిపారు. కొందరి బలహీనత వల్లే పీఓకే తాత్కాలికంగా మన నుంచి చేజారిందని, దానిపై పట్టు కోల్పోవడానికి వారి పొరపాటే కారణం అని నెహ్రూపై పరోక్షంగా ఆరోపణలు చేశారు. విశ్వ వేదికపై మన స్థానాన్ని బలంగా ఉంచుకోవాలని భావిస్తున్నానని, స్వీయ విశ్వాసాన్ని ఏనాడూ వీడొద్దన్నారు.
చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్, పాక్‌తో బీజింగ సహకారంపై జై శంకర్ విమర్శలు గుప్పించారు. ‘నేను చైనా రాయబారిగా ఉన్నాను, చైనా గత చర్యల గురించి మనందరికీ తెలుసు. ఈ భూమిని పాకిస్తాన్ లేదా చైనా తమదని చెప్పుకోలేదని మేము వారికి పదేపదే చెప్పాము. సార్వభౌమాధికారం ఉన్నవారు ఎవరైనా ఉన్నారంటే, అది భారతదేశం. మీరు ఆక్రమిస్తున్నారు, మీరు అక్కడ నిర్మిస్తున్నారు, కానీ చట్టపరమైన హక్కు మాదే.’నని పేర్కొన్నారు.
చైనా పాకిస్తాన్ మధ్య 1963 సరిహద్దు ఒప్పందాన్ని కూడా జైశంకర్ ఎత్తి చూపారు. అక్కడ పాకిస్తాన్ దాదాపు 5,000 కి.మీ భూభాగాన్ని చైనాకు అప్పగించిందని అన్నారు. ‘1963లో, పాకిస్తాన్- చైనా తమ స్నేహాన్ని ముందుకు తీసుకెళ్లడానికి అంగీకరించాయి. చైనాను దగ్గరగా ఉంచడానికి, పాకిస్తాన్ ఆక్రమిత భూభాగంలో దాదాపు 5,000 కి.మీలను డ్రాగన్‌కు అప్పగించింది. ఈ ప్రాంతం భారతదేశానికి చెందింది’ ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment