మానవుడు ఆనంద స్వరూపుడు. ఆనందం కోసమే నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటాడు. చిత్రంగా ఆ ప్రయత్నంలో దానినే విస్మరించటం, కోల్పోవటం జరుగుతుంది. ఆనందంగా ఉండటం సహజ స్థితి. అప్పుడే పుట్టిన పిల్లలు చూడండి. ఆనందంగా నవ్వుతూ ఉంటారు. ఆకలి వేసినప్పుడో ఇబ్బంది కలిగినప్పుడో మాత్రమే ఏడుస్తారు. అది వాళ్ళు తమ భావాలను ప్రకటించగల ఒకే ఒక భాష.
ఎవరికైనా కష్టం వస్తే బ్రహ్మాండంగా ఓదారుస్తాం – కష్టాలు మనుషులకి కాక మాకులకి వస్తాయా? కలకాలం ఉండవు, మంచి కాలం ముందు ఉంది అని. తనదాకా వస్తే ధైర్యానికి మూలకారణమైన జ్ఞానం నశిస్తుంది. చదివిన చదువంతా నట్టేట్లో కలిసి΄ోతుంది. తెలివి΄ోయాక ఏమి ఉంటుంది? అందువల్ల శోకాన్ని మించిన శత్రువు లేదు అన్నది కౌసల్య. నిజమే కదా!
ఆనందాన్ని క్రమక్రమంగా వయసుతోపాటు కోల్పోతున్నాడు మానవుడు. దానికి కారణం శోకం. అందుకే అర్జునుడు విషాదంలో కూరుకుపోయినప్పుడు శ్రీ కృష్ణుడు ‘‘నీకు శోకించే అధికారం లేదు’’ అని వరుసగా ఎన్నో శ్లోకాలలో నొక్కి వక్కాణించాడు. శోకం మనిషిని మానసికంగా క్రుంగదీస్తుంది. మనోబలం తగ్గటంతో శరీరం కూడా సరిగా సహకరించదు. అది అన్ని రుగ్మతలకి ఆహ్వానం. ‘‘ఈడుపు కాళ్ళు ఏడుపు మొఖం’’ అన్ని పనులకు ఆటంకం కలిగిస్తాయి. ఏడుపుగొట్టు ముఖం దరిదాపుల్లోకి ఏ శుభాలు రావు. ఎందుకంటే ఏడుపు మొహం రాగానే కాళ్ళు ఈడవటం జరుగుతుంది. ఇంక పనులు ఏమవుతాయి? విజయానికి మూలం ఉత్సాహం. శోకం ఉత్సాహాన్ని తరిమికొడుతుంది. ఇంకా ఏం చేస్తుందో తెలుసా?
‘‘శోకో నాశయతే ధైర్యం
శోకో నాశయతే శ్రుతమ్
శోకో నాశయతే సర్వం
నాస్తి శోక సమో రిపుః’’
ఎప్పుడూ జీవితంలో ఎవరినీ పల్లెత్తు మాట అనని కౌసల్య రాముడు వనవాసం చేయటానికే నిశ్చయించుకున్నాడు అని తిరిగి వచ్చిన సుమంత్రుడు చెప్పగానే శోకోపహతచేతస అయి దశరథుడితో నిష్ఠురంగా మాట్లాడుతుంది. దశరథుడు ఆమెను బ్రతిమాలుతుంటే తన తప్పు తెలుసుకుని ఈ మాటలు అంటుంది. తాను ఆ విధంగా కఠినంగా మాట్లాడటానికి శోకమే కారణం అని దానిని మించిన శత్రువు లోకంలో లేదు అంటుంది.
నొప్పి వేరు, బాధ వేరు, శోకం వేరు. నొప్పి భౌతిక మైనది. శరీర సంబంధం. బాధ మనస్సుకి సంబంధించినది. శోకం మనస్సు లోలోపలి ΄÷రలలోకి చొచ్చుకొని ΄ోయి జీవుణ్ణి వేదనకి గురి చేస్తుంది. తనకో తనవారికో కష్టం కలిగింది అనే భావన జోడించబడి ఉంటుంది. ఎప్పుడైతే నేను, నా అన్న భావన కలిగిందో మనస్సు నిర్మలంగా, నిష్పక్ష΄ాతంగా ఆలోచించలేదు. ఎదుటివారి సమస్యలని తేలికగా పరిష్కరించగలవారు తమకి వచ్చిన చిన్న సమస్యని కూడా పరిష్కరించ లేక΄ోవటానికి ఇదే కారణం. అది తమది కాదు ఎవరిదో అని ఆలోచించగానే తాము అందులో ఉండరు గనుక వెంటనే పరిష్కారం లభిస్తుంది. శోకంలో ముందుగా వచ్చేదే ‘నేను’ అన్నది. దానితో ముందుగా ధైర్యం జారిపోతుంది.
అర్జునుడికి వచ్చింది కూడా శోకమే. ధైర్యం కోల్పోవటం వల్ల శరీరం వణకటం, చేతిలో ఉన్న గాండీవం జారిపోవటం వంటివి జరిగాయి. ఆ శోకాన్ని పోగొట్టి ధైర్యాన్ని, దానికి మూలమైన జ్ఞానాన్ని ఇచ్చే ముందు నీకు శోకించే అర్హత, అధికారం లేదు అని గట్టిగా చె΄్పాడు. మరేం చేయాలి అంటే ‘‘సమస్యలు వస్తే క్రుంగి΄ోక వాటితో యుద్ధం చేయాలి.’’ అని ఆదేశించాడు. అది అర్జునుడికి మాత్రమే కాదు. భారతీయులు అందరూ. మనం అన్నివిధాల సమస్యలతోను ΄ోరాడి విజయం సాధించాలి.
– డా. ఎన్. అనంతలక్ష్మి
Comments
Please login to add a commentAdd a comment