Brahmasri chaganti koteswara rao
-
... అదే మనల్ని పట్టుకున్నది
ఇంద్రియాలను నిగ్రహించడం అంత తేలికకాదు. రావణాసురుడు రాముడి చేతిలో పది తలలు తెగి పడిపోయి ఉన్నాడు యుద్ధభూమిలో. మండోదరిని పల్లకీలో తీసుకొచ్చారు. అక్కడ ఆమె దిగింది. కాస్త దూరంలో రామలక్ష్మణులు నిలబడి ఉన్నారు. అందరూ అనుకున్నారు.. ‘‘నా భర్తను నువ్వే చంపేసావ్ ... దుర్మార్గుడివి..’’ అని రాముణ్ణి తిడుతుందనుకున్నారు. ఎంతయినా భర్త కదా, ఆక్రోశంలో నిందిస్తుందనుకున్నారు. ఆమె నేరుగా నేలపై పడి ఉన్న రావణుడి దగ్గరకు వెళ్లి..‘‘ ఇంద్రియాణి పురా జిత్వా జితం త్రిభువనం త్వయా / స్మరద్భిరవ తద్వైరమింద్రియైరేవ నిర్జితః’’ అన్నది. నీవు ఒకప్పుడు త్రిభువన సామ్రాజ్యాన్ని కోరుకున్నావు. ఆ కోరిక తీరడానికి తపస్సు చేసావు. ఆ సమయంలో ఇంద్రియాలను బలవంతంగా నిగ్రహించావు. కాలికింద తలదించుకుని రాము అవకాశం కోసం ఎదురు చూసినట్లు నీవు కోరుకున్న సామ్రాజ్యం రాగానే నీ ఇంద్రియాలే నిన్ను కాటేసాయి. మహా పతివ్రత సీతమ్మను వేధించావు. రాముని చేతిలో చచ్చిపోయావని అందరూ అనుకుంటున్నారు. నీ భార్యగా నాకు తెలుసు. రాముడి చేతిలో కాదు, నీ ఇంద్రియాల చేతిలోనే నీవు చచ్చిపోయావు’’ అంది. ఈ మాటలను సీతమ్మ కూడా ముందే ఇంచుమించు ఇలాగే చెప్పింది..‘‘నీ కామం నీ భార్యయందుంచుకో. ధర్మానికి కట్టుబడి ఉండు. దోషం లేదు. నీ కామం నీ భార్యను దాటిపోయిందా నీకు మహాపాపం చుట్టుకుంటుంది... వద్దు. ధూర్త విషయాలజోలికి వెళ్ళకు’ అని హెచ్చరించింది కూడా..అందువల్ల ఇంద్రియాలను నిగ్రహించడం అంత తేలికయిన పనేం కాదు. అరిషడ్వర్గాలకు దూరంగా ఉండాలని చెప్పడం చాలా తేలికే. అంటే కామానికీ, కో΄ానికీ... దూరంగా ఉండమంటున్నారు.. సరే.. అసలు కామాన్ని పట్టుకుని ఉంటే కదా... ఈ మాట అనవలసింది. మరి ....మనం పట్టుకోవడం కాదు... అదే మనల్ని పట్టుకుంటున్నది. అది వదలాలి అంటే... మొదట అది మనల్ని పట్టుకుందని గుర్తించాలి. తరువాత మనం ఏం చేస్తే అది పట్టు వదులుతుందో కూడా తెలుసుకోవాలి. ఇది అందరికీ అన్వయం అవుతుందా లేదా.. పక్కనబెట్టి గృహస్థుకు ఏ ధర్మం అన్వయం అవుతుందో అదే అన్వయం చేసుకోవాలి. అందుకే ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడితో మాట్లాడుతూ ...‘‘లోకములన్నియున్ గడియలోన జయించినవాడ వింద్రియా / నీకము జిత్తమున్ గెలువ నేరవు నిన్ను నిబద్ధు జేయు నీ/ భీకర శత్రు లార్వుర బ్రభిన్నుల జేయుము ్ర΄ాణికోటిలో/ నీకు విరోధి లే డొకడు నేర్పున? జూడుము దానవేశ్వరా!’ అంటాడు. నీవు లోకాలన్నీ గెలిచానంటున్నావు కదా... ముందు నీ ఇంద్రియాలను నీవు గెలిచావా? నీ మనసును గెలిచావా? అది చెప్పు.. వాటిని గెలవడం అంత తేలిక కాదు. వాటిని గెలువు. గెలిస్తే... అప్పుడు నీకు శత్రువన్న వాడెవడూ ఎదురుగా కనబడడు. అందరూ మిత్రులే...అంటాడు. కాబట్టి అది అనుష్ఠానం చేత గెలవాలి. అంటే సుఖాన్ని ధర్మంతో కట్టేసి ఉంచాలి. అప్పుడు ధర్మబద్ధమైన అర్థం ప్రభవిస్తుంది. కామం ధర్మబద్ధమైనప్పుడు సంతానం కూడా ధర్మబద్ధంగానే ఉంటుంది. సమాజం నైతికంగా ఒక క్రమ పద్ధతిలో, సుఖసంతోషాలతో, ప్రశాంతంగా పురోగమిస్తుంది. -
Muthuswami Dikshitar: ఒక్కసారయినా అక్కడ పాడాలి
ముత్తుస్వామి దీక్షితార్ వారు గంగే మాం పాహి... అంటూ కీర్తన చేస్తూ... గంగ వైభవాన్ని చాలా అద్భుతంగా కీర్తించారు. నీళ్ళబిందె తలమీద పెట్టుకుని ఆడుతుంటే ఎలా ఉంటుందో శివుడు తన జటాజూటంలో గంగను బంధించి తాండవం చేస్తుంటే ఆ దృశ్యం అలా ఉంటుందంటుంది రావణ కృత స్తోత్రం. భగీరథుడు ప్రార్థన చేస్తే వదిలిపెట్టాడు శివుడు గంగను. శంకరుడి శిరస్సు నుండి పాదాల వరకు తగిలి కిందకు ప్రవహించింది. ఆ గంగను ...ఆ నీళ్ళను తలమీద చల్లుకుంటే.. దేవతాస్థానాలనుంచి పడిపోతున్న వాళ్లుకూడా మళ్ళీ తమ పూర్వ వైభవాన్ని పొందుతారట.. అటువంటి శక్తి ఆ గంగమ్మది. గంగే మాం పాహి గిరీశ శిరస్థితే/గంభీరకాయే గీత వాద్య ప్రియే/అంగజతాత ముదే అసి వరుణా మధ్యే....’’. అంటారు దీక్షితార్ వారు తమ కీర్తనలో. ఆమె ప్రవాహ తీరును గంభీర కాయే.. అన్నారు.. ఆమె శరీరం అలా ఉంటుందట.‘...శేషాహే రనుకారిణీ ...’ అంటారు శంకరులు. ఆది శేషుడు భూమి మీద పాకి వెడుతుంటే ఎలా ఉంటుందో గంగా ప్రవాహం అలా ఉంటుందంటారు ఆయన. శేషుడు ఉత్తర దిక్కున ఉంటాడు. ఆయనను స్మరిస్తే మనకున్న ఆపద లు తొలగుతాయని ఒక నమ్మకం. కాశీలో గంగకున్న విశేష లక్షణం ఏమిటంటే... అప్పటివరకు దక్షిణానికి ప్రవహించిన గంగానది అక్కడ ఉత్తర దిక్కుకు మళ్ళుతుంది. దానిని కాశీగంగ అంటారు. అక్కడ గంభీర శబ్దంతో ప్రవహించే గంగను సంగీత వాద్య ప్రియే ... అని కూడా అన్నారు. ఎందుకలా!!! గంగమ్మకు గీతమన్నా, సంగీతమన్నా ఇష్టమట. గంగ ఒడ్డున కూర్చుని పాట పాడినా, వాద్యం మోగించినా, ఆలాపన చేసినా, నృత్యం చేసినా ఆమె సంతోష పడి పోతుందట. అంటే రాజోపచారాలన్నింటినీ అంత ప్రీతితో స్వీకరించగలిగిన భగవత్ స్వరూపం ఆమెది. అంటే నిజమయిన కళాకారుడు నిజజీవితంలో కోరుకోవలసింది ఏమిటంటే – ఒక్కసారయినా గంగ ఒడ్డున కూర్చుని తన ప్రదర్శన ఇచ్చి ఆమెను సంతోష పరచాలి, అని. కాశీలో ఇప్పటికీ ఒక ఏర్పాటు ఉంది. అక్కడ కొన్ని పడవలు అద్దెకిస్తారు. వాటితోపాటూ సంగీత విద్వాంసులు వస్తారు మనతో. వాద్యగోష్ఠి చేస్తారు. కొంతమంది తబలా, వయోలిన్, వీణ వాయిస్తే మరికొంతమంది పాడతారు. సూర్యోదయానికి ముందు తెల్లవారు ఝామున ... అసి, వరుణ – ఈ రెండింటి మధ్యలో అలా సంగీతం వింటూ పడవమీద వెడుతూ ఉంటే గంగమ్మ ప్రసన్నరాలవుతుందని అక్కడి వారి నమ్మకం. గీత వాద్య ప్రియే... అంగజ తాత ముదే... అసి వరుణా మధ్యే...దీక్షితార్ వారి కీర్తనలో కూడా ఇదే వ్యక్తమవుతుంది. అంగజ తాత ముదే... గంగమ్మ ఎవరు? అంగజుడు అంటే మన్మథుని తండ్రి.. మహావిష్ణువు. గంగమ్మ ఆయనకు సంతోషాన్ని కలిగిస్తుందట. తన స్పర్శను పొంది గంగ పునీతమయింది. తిరిగి గంగ ఆ ప్రభావంతో సర్వ జనుల పాపాలను నశింప చేసి ధర్మరక్షణకు కారణమవుతున్నందువల్ల విష్ణువుకు ప్రీతిపాత్రమవుతున్నది అన్నారు ముత్తుస్వామి దీక్షితార్. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
హృదయాన్ని తాకేది... పాటే..!
శరీరం బలంగా ఉండి మనసు సంస్కారవంతంగా లేనప్పుడు అది లోకానికి ప్రమాదం. రావణుడు బలవంతుడే, కానీ సంస్కారవంతుడుకాదు.. దానితో లోకమంతా క్షోభించి పోయింది. అందువల్ల మనకు బలం అవసరమే. కానీ దానిని ఎలా ఉపయోగిస్తున్నామనే దాని మీద వ్యక్తిగత శాంతి, సమాజ శాంతి ఆధారపడి ఉంటుంది. మంచి కీర్తన విన్నారు. కీర్తనకు ఉన్న లక్షణం– అది సామవేదగానం. త్వరగా మనసుకు హత్తుకుంటుంది. దానితో మనసుని ప్రశాంతంగా ఉండేటట్లు చేస్తుంది. దానిలోని సాహిత్యం ఆలోచనలను మధిస్తుంది. మనసుని పోషిస్తుంది. మనసు ఉద్వేగంతో, అశాంతితో ఉన్నప్పుడు అది రాక్షసత్వానికి కారణం అవుతుంది. మనసు ప్రశాంతంగా ఉండి ఉద్వేగరహితం అయిందనుకోండి అది సత్వగుణానికి కారణమవుతుంది. ఎక్కడ సత్వగుణం ఉంటుందో అక్కడ ఉత్తమ కర్మ ఉంటుంది. ఎక్కడ అశాంతి ఉందో, ఎక్కడ ఉత్ప్రేరకం ఉందో అక్కడ ఆ వ్యక్తి ఎంత ప్రమాదకరమైన పని అయినా చేస్తాడు...అందుకే ‘‘క్రుద్ధం పాపం న కుర్యాత్కాః క్రుద్ధో హన్యాద్గురువునపి/క్రుద్ధః పరుషయా వాచా నరః సాధునాధిక్షిపేత్ ’’ అంటాడు హనుమ రామాయణంలో. క్రోధానికి గురయిన వ్యక్తిఎంతటి దుస్సాహసానికయినా పూనుకుంటాడు. వారించబోయిన పెద్దలను కూడా లెక్కచేయడు. అశాంతి ఎంత పాపాన్నయినా చేయిస్తుంది. ఆ అశాంతిని తొలగించడానికి ప్రధాన సాధనం సంగీతమే. గజాసుర సంహార వృత్తాంతంలో ఒక విచిత్రం కనబడుతుంది. గజాసురుడు కాశీపట్టణంలో విచ్చలవిడిగా ప్రవర్తిస్తుంటాడు. పరమశివుడు త్రిశూలంతో పొడిచి పైకెత్తిపెట్టాడు. త్రిశూలం అతనిలో గుణాత్మక స్థితిని కల్పించింది. గజాసురుడు ప్రాణాంతకస్థితిలో ఉండికూడా సామవేదగానం చేసాడు. ద్వంద్వాలకు అతీతుడయిన శివుడు ఆ అసురుడిలో లోపాలను పక్కనబెట్టి మార్పు వచ్చిందా లేదా అని చూసాడు. నీకేం కావాలని అడిగాడు. నా తోలు వలిచి నువ్వు కట్టుకోవాలని కోరాడు. నీవు నన్ను సంగీతంతో, సామవేద మంత్రాలతో సంతోషపెట్టావు కనుక నిన్ను అనుగ్రహించడానికి గుర్తుగా కృత్తివాసేశ్వరుడుగా ఉంటాను..అని ఆ పేర కాశీలో వెలిసాడు. సంగీతం అంత త్వరగా హృదయాన్ని తాకుతుంది. అదే గంభీరమైన విషయాలను మరో రూపంలో.. పద్యం, శ్లోకం వంటి రూపాల్లో చెబితే ఇంత త్వరగా మనసును ప్రభావితం చేస్తుందని చెప్పలేం. అందుకే వాల్మీకి రామాయణాన్ని లవకుశులకు గానంగా నేర్పాడు... అని ఉంది బాలకాండలో. అది వాద్య తంత్రులకు కట్టుబడుతుంది. మంచి సంగీతం అంటే... త్యాగబుద్ధితో, ఎటువంటి స్వప్రయోజనం ఆశించకుండా లోకానికి అందించిన వారు దానిని పాటగా అందించారు. దానిని ఎలా పాడాలో కూడా వారే నిర్ణయించేసారు. అంటే వారే స్వరపరిచారు. సాహిత్యం కూడా వారే సమకూర్చారు. అది కూడా ప్రణాళికతో కాదు. భగవంతుని గుణాలతో లోలోపల రమించి పోయి, ఆ పరవశంతో గీతంగా వారి నోటినుంచి ప్రవహించింది.. అదీ వాగ్గేయకారుల గొప్పదనం. పాట సంస్కృతికి శాశ్వతత్త్వాన్ని ఇస్తుంది. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
మంగళకరం
భారతీయ సంప్రదాయంలో ఏదయినా ప్రారంభం చేసేటప్పుడు.. మంగళకరమైన వాక్కులతో, శబ్దాలతో ప్రారంభం జరుగుతుంటుంది. ‘మంగళాదీని మంగళమధ్యాని మంగళాంతాని శాస్త్రాణి ప్రథంతే’.. అంటారు. అంటే మంగళకర వాక్కుతో ప్రారంభించాలి, మధ్యలో మంగళకరమైన వాక్కు ఉండాలి. ముగింపును కూడా మంగళకరంగా పూర్తి చేయాలి.. అని శాస్త్ర వాక్కు. అంటే జీవితం ఎప్పుడూ మంగళకరంగా, శోభాయమానంగా ఉండాలి. శాంతికి విఘాతం కలగకుండా చూసుకుంటుండాలి. అంటే ఇతరుల మనశ్శాంతికి కారణమయ్యేటట్లుగా మన ప్రవర్తన ఉండాలి. మంగళకర వాక్కులు, శబ్దాలు ఉన్నచోట పూజనీయత ఉంటుంది. వాతావరణం కూడా పరిశుద్ధమయి, దేవతల అనుగ్రహానికి కారణమవుతుందని విశ్వసిస్తాం. ఘంటానాదంతో పూజ ప్రారంభం చేస్తాం. ఎందుకని.. ఆగమార్థంతు దేవానాం/ గమనార్థంతు రాక్షసాం/ కురుఘంటారవంతత్ర/ దేవాతాహ్వాన లాంఛనం... అంటే రాక్షసులు అక్కడినుంచి వెళ్లిపోవాలన్నా, దేవతలు రావాలన్నా... ఘంట మోగాలి. ఆ శబ్దంలోని పవిత్రత, మంగళప్రదత్వం అటువంటిది. నాదస్వరం, షెహనాయి, మృదంగం, డోలు, శాక్సోఫోన్, మద్దెల, ఘంటలు, గజ్జెలు, ఢమరుకం, శంఖం, కొమ్ము, వేణువు, వీణ, వయోలిన్, హార్మోనియం, క్లారినెట్... ఇవన్నీ మంగళప్రదమైన శబ్దాలు చేసే సంగీత పరికరాలు. బ్యాండ్ కూడా అంతే... దానిలోని శాక్సోఫోన్ కానీ, క్లారినెట్ కానీ, ఇతర పరికరాలు కానీ అవి కూడా గురుముఖతః నేర్చుకుని వాయిస్తారు. వీటిని మోగించే కళాకారులను కూడా సమాజం సమున్నతం గా ఆదరిస్తుంది. పండిట్ రవిశంకర్, ఉస్తాద్ బిస్మిల్లాఖాన్ లను భారతరత్న వరించింది. పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్... వంటి ఎన్నో ప్రతిష్ఠాత్మక పురస్కారాలను ఆయన అందుకున్నారు. ‘నేను సరస్వతీ ఆరాధకుడిని’ అని బిస్మిల్లాఖాన్ ప్రకటించుకున్నారు. ‘యావత్ భారతదేశంలోని ప్రజలందరూ అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు..’ అని ఆయన తరచుగా అంటూండేవారు. ఒకసారి అమెరికాలో కచేరీ సందర్భంగా అభిమానులు ఆయనను అక్కడే ఉండిపొమ్మని కోరగా... కాశీని, విశ్వనాథుడిని, విశాలాక్షిని, గంగమ్మను వదిలి రాలేను అని.. ప్రకటించుకున్న గొప్ప దేశభక్తుడు. సింహాచలం ఆస్థాన విద్వాంసుడు చిట్టబ్బాయిని... సంగీతనాటక అకాడమీ, కళాప్రపూర్ణ వంటి బిరుదులెన్నో వరించాయి. కాకినాడలో సత్యనారాయణ అనే గొప్ప క్లారినెట్ విద్వాంసుడు ఎందరో శిష్యులను తయారు చేసాడు.. వారందరూ కలిసి ఆయనకు గురుదక్షిణగా బంగారు క్లారినెట్ ను బహూకరించారు. ఇటువంటి వాద్య సంగీత విద్వాంసులను కూడా గౌరవించడం, వారి కచ్చేరీలు నిర్వహించి వారిని, వారి కళను, వారి వాయిద్యాలను సమాదరించడం మన కర్తవ్యంగా భావించాలి. మంగళత్వం అనేది కోయిల కూతలో, మామిడాకులో వానచినుకులో, పసుపులో, కుంకుమలో, పువ్వులో.. కూడా దర్శించే సంప్రదాయం మనది. ఇప్పటికీ నృత్యకళను అభ్యసించినవారు అరంగేట్రం చేయడానికి ముందు .. సభలో ఆసీనులైన పెద్దల దగ్గరకు వచ్చి, వారి చేతికి గజ్టెలు అందించి... తిరిగి వారి చేతులనుండి స్వీకరించి కాలికి కట్టుకుని వెళ్ళి ప్రదర్శిస్తుంటారు... అంత గాఢంగా మనం ఈ కళలను అభిమానిస్తాం... ఈ సంప్రదాయాన్ని నవతరం కూడా నిష్ఠతో కొనసాగించాలని కోరుకుందాం. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
నీ ఆకలి, నీ నిద్ర నీదే కదా...మరి..!!!
నీవు ఎదగలేకుండా పోవడానికి కారణం ఎవరు ? నీకు సలహాలిచ్చేవారికోసం, నీకు సహాయపడేవారికోసం చూస్తున్నావా? నీకు బంధువులు లేరా? వాళ్ళు నిన్ను పట్టించుకోవడంలేదా? నీకు స్నేహితులు, శ్రేయోభిలాషులెవరూ లేరా? వారు నీకు మార్గదర్శనం చేయడం లేదా? లేక... నీకు శత్రువులు ఎక్కువగా ఉన్నారా? వాళ్లు నిన్ను ముందుకు పోనీయడం లేదా? అంటే ఎవరో రావాలనీ, వాళ్ళు నిన్ను జాగ్రత్తగా నడిపించాలనీ, నీ ప్రతి కష్టంలో వారు నీకు తోడుగా నిలబడి దిశానిర్దేశం చేయాలని నీవు కోరుకుంటున్నావని అర్థం... దీనికి జగద్గురువయిన కృష్ణ పరమాత్మ ఏమంటున్నాడో చూడండి... ‘‘ఉద్ధరేద్ ఆత్మనాత్మానమ్ నాత్మానమ్ అవసాదయేత్, ఆత్మైవ హై ఆత్మనో బంధుర్ ఆత్మైవ రిపుర్ ఆత్మనః’’ – అంటే నీకు నీవే బంధువువు, నీకు నీవే స్నేహితుడివి, నీకు నీవే శత్రువివి. నీకు ఆకలివేస్తే నీవే తినాలి, నీకు నిద్రవస్తే నీవే నిద్ర పోవాలి, నీకు దాహం వేస్తే నీవే నీళ్లు తాగాలి...అలాగే నీకు కష్టం వచ్చినప్పుడు, నీకు సమస్యలు ఎదురయినప్పుడు ఎవరో వస్తారని, నిన్ను కటాక్షిస్తారని, నిన్ను ఉద్ధరిస్తారని ఎదురు చూస్తూ కూచోవద్దు. బంధువులు, స్నేహితులు, శత్రువులు బయట లేరు... నీలోనే ఉన్నారు. నీవు వారిని గుర్తిస్తే... నీకు ఇక ఏ చింతా ఉండదు. నీ నిద్ర నీవు పోయినట్లుగానే, నీ ఆకలి నీవు తీర్చుకున్నట్లుగానే... నీ కష్టాన్ని కూడా నీవే తీర్చుకుంటావు. భగవంతుడు మనకు కొన్ని అద్భుతమయినవి ఇచ్చాడు. భువనం.. ఈ ప్రపంచాన్ని ఇచ్చాడు. నీ జీవితం వర్ధిల్లడానికి ప్రకృతిని ఇచ్చాడు. నీకు ఆహ్లాదమయినవి చూసి సంతోషించడానికి కళ్ళు ఇచ్చాడు.. నీకు ఇష్టమయినవి వినడానికి చెవులిచ్చాడు. తాకి అనుభూతి చెందడానికి చర్మానికి స్పర్శనిచ్చాడు. వాసనలు చూడడానికి ముక్కు ఇచ్చాడు... ఇలా చాలా ఇచ్చాడు... ఇవన్నీ నీకోసం, నీవు అనుభవించడానికే ఇచ్చాడు... అయితే ఇవన్నీ ధర్మచట్రంలో ఇమిడేటట్టు చూసుకోమన్నాడు... అంతే.. అదే చేసెయ్... ఇవన్నీ వదిలేసి మనసు పక్కచూపులు చూస్తున్నదనీ, ఎటో లాగుతున్నదనీ విచ్చలవిడిగా పోతే ... నీలో ఉన్న శత్రువును... నీవే ఉత్సాహపరిస్తే... నీ పతనానికి నీవే దారి ఏర్పాటు చేసుకుంటున్నట్లు అవుతుంది. పిల్లలను కూర్చోబెట్టుకుని వారికి మంచీ చెడూ ఎలా చెబుతుంటావో... నీ మనసుకు కూడా ప్రతిరోజూ, ప్రతి క్షణం అలా చెబుతూ ఉండు... అప్పడది నీకు ఆత్మబంధువుగా మారుతుంది. నీ శ్రేయస్సు కోరే నీ స్నేహితుడిగా, నీ శ్రేయోభిలాషిగా నీకు మార్గదర్శనం చేస్తుంది. నీ కంటికి కనురెప్ప ఉంది. అది నీ కంటిని ఎలా కాపాడుతుంటుందో నీ మనసును అనుక్షణం నీవు అలా కాపాడుతుండాలి. అదే నిన్ను నీవు ఉద్ధరించుకోవడం– అని పరమాత్మ గీతాబోధ చేసాడు. ఇంతకన్నా చెప్పడానికి ఎవరికయినా ఏముంటుంది. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
Patenting: ప్రకృతికి పేటెంట్ తీసుకోవచ్చా!!!
భగవంతుడు మనకు మాట ఇచ్చాడు, బుద్ది ఇచ్చాడు, ఇంత గొప్ప శరీరాన్ని ఇచ్చాడు... అన్న విశ్వాసం మనకు ఉండాలి. నేను ఏదో సాధించాలన్న ఉద్దేశంతోనే నాకు ఇవి బహూకరించాడు... ఎన్ని ప్రతిబంధకాలు ఎదురయినా సరే... నేను అనుకున్నది సాధించితీరతాను... అన్న పట్టుదల ఉంటే ఎంతటి నిరాశానిస్పృహలు ఎదురయినా సరే... సునాయాసంగా వాటిని దాటి... లక్ష్యాలను సాధించవచ్చు... అనడానికి – ఆత్మహత్య ఆలోచనలను వెనక్కి తీసుకుని, కష్టాలతోనే కడుపు నింపుకుని, ఒకటి కాదు, రెండు నోబెల్ బహుమతులు గెలుచుకున్న ధీర వనిత మేరీ క్యూరీ గొప్ప ఉదాహరణ. మేరీ అసలు పేరు మరియా. 1867 నవంబరు 7న జన్మించారు. పోలండ్ దేశస్థురాలు. తల్లిదండ్రులు టీచర్లు. 11వ ఏట తల్లి మరణించింది. పోలండ్ లోని రాజకీయ అనిశ్చితి వాతావరణంలో తండ్రి ఉద్యోగం పోయింది. అక్కడినుంచి కష్టాలను ఈదుకుంటూ పారిస్ చేరుకుంది. ఆ రోజుల్లో సై¯Œ ్స చదవడానికి స్త్రీలు ముందుకు రాకుండా సంప్రదాయవాదులనుండి అనేక అవరోధాలుండేవి. ఆమెకు సైన్సంటే మక్కువ, పరిశోధనలంటే ప్రాణం. ఇంటిపట్టునే ఉన్నవనరులతోనే ప్రయోగశాల పెట్టుకుంది. ప్రొఫెసర్ హెన్నీ బెకెరెల్ సాయంతో పరిశోధనలు చేసేది. ఇంచుమించు తనలాగే అనేక కష్టాలను ఓర్చుకుంటూ పరిశోధనలు సాగిస్తున్న పీరే క్యూరీతో పరిచయం, సాహచర్యం తరువాత పెళ్ళికి దారితీసాయి. అయినా కష్టాలు తీరకపోగా కలిసి అనుభవించడం అలవాటు చేసుకున్నారు. భయంకరమైన కాన్సర్ వ్యాథి చికిత్సకు తోడ్పడగల కారకాల కోసం పరిశోధనలు ముమ్మరంగా సాగుతుండేవి. రేడియోయాక్టివిటీ సిద్ధాంత అభివృద్ధికి, దాని తాలూకు పరిశోధనలకు ఆమె గురువుకి, భర్తకి, ఆమెకు కలిపి నోబెల్ బహుమతి లభించింది. ఆ తరువాత ఒక చిన్న రోడ్డు ప్రమాదంలో ఆమె భర్త మరణించారు. తరువాత కాలంలో పొలోనియం, రేడియం మూల పదార్థాల అన్వేషణకు ఈసారి రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి ఆమెను వరించింది. ఒక స్త్రీకి రెండుసార్లు, అదీ రెండు వేర్వేరు సబ్జెక్ట్ లలో నోబెల్ రావడం విశేషం, అపూర్వం. ఆమె సాధించిన ఫలితాలకు ఆమె కానీ, ఆమె భర్త కానీ పేటెంట్ తీసుకుని ఉంటే.... వారి వారసులు ఇప్పటి లెక్కల ప్రకారం ప్రపంచంలో అత్యంత సంపన్నులుగా ఉండేవారు. కానీ ఆమె నిజ జీవిత సిద్ధాంతం ఏమిటో తెలుసా... ‘‘అవి (ఖనిజాలు) ప్రకృతి ఇచ్చిన వరం. అది ప్రజలది. వాటి మీద నాకేం హక్కు ఉందని పేటెంట్ తీసుకోవాలి. అందరి మేలుకోసం వాటిని నేను ఉపయోగించగలగడం నాకు జీవితంలో దక్కిన అదృష్టం... అందుకే వాటికోసం తాపత్రయపడలేదు. నిజానికి దంపతులిద్దరికీ అవార్డులు, రివార్డుల మీద ధ్యాస ఉండేది కాదు... నిరంతరం పరిశోధనలే... అవికూడా ఇంటిపట్టున ఏర్పాటు చేసుకున్న అరాకొరా సౌకర్యాలతో... సరైన రక్షణ చర్యలు లేకపోవడంతో ... ధార్మిక ప్రభావానికి ఆమె శరీరం గురయింది... చివరకు ఆమెకు కూడా కాన్సర్ సోకి, మరణానికి దారితీసింది... ఆమె పారిస్(ఫ్రా¯Œ ్స దేశం)లో స్థిరపడినా, మాతృదేశం పట్ల ఆమెకు ఎంత గాఢమైన ప్రేమంటే... తాను కనుగొన్న పదార్థాలలో ఒకదానికి తన దేశం పేరు ధ్వనించేలా పొలోనియం అని పేరుపెట్టింది. చివరకు తన మరణానంతరం ఖననానికి ముందు.. శవపేటిక తెరచి.. జన్మభూమి పోలండ్ నుంచి తెచ్చిన మట్టి చల్లాలని కోరింది. మానవాళి శ్రేయస్సుకు తపించడం తప్ప ఆమె సర్వసుఖాలను, సంపదలను దూరంగా పెట్టింది.. చివరకు కీర్తికాంక్షను కూడా. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
బంగారం లోంచి సువాసనలు..!
కొంతమంది యోగ్యత కలిగినవారు ఉన్నత పదవులలోకి వెళ్ళిన కారణం చేత ఆ పదవి శోభిస్తుంది. వాళ్ళకీ కీర్తి వస్తుంది. పదవి, వ్యక్తి గుణాలు రెండూ సమున్నతంగా ఉంటే... బంగారానికి తావి అబ్బినట్లుంటుంది. ఎలా అంటే... అమెరికా సంయుక్త రాష్ట్రాలకు అధ్యక్షుడిగా చేసిన హెర్బర్ట్ హూవర్ బాగా పేదరికం అనుభవించాడు. తల్లీతండ్రీ లేరు. మేనమామ చదివిస్తున్నాడు. 18వ ఏట స్టాన్ ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ఉండగా..కళాశాల ఫీజు కట్టేంత డబ్బుసమకూరక చిక్కుల్లోపడ్డాడు. దీనినుంచి బయటపడడానికి ... స్నేహితుడితో కలిసి ఒక ఆలోచన చేసాడు. అప్పట్లో పోలండ్‌లో పియానో విద్వాంసుడిగా ఖ్యాతి వహించిన ఈగ్నాసీ యాన్ పద్రెస్కీ కచేరీ పెట్టి వచ్చిన వసూళ్ళలో ఖర్చులు పోగా మిగిలిన డబ్బును ఫీజుల కింద చెల్లించాలనుకున్నారు. ఆయనను సంప్రదించి రెండువేల డాలర్లకు ఒప్పందం చేసుకున్నారు. కానీ వసూళ్లు కేవలం 1600 డాలర్లే వచ్చాయి. పైగా కచేరీ నిర్వహణ ఖర్చులు కూడా చెల్లించాలి. ఏం చేయాలో తోచక నేరుగా పద్రెస్కీనే కలిసి వచ్చిన మొత్తం డబ్బు ఆయన చేతిలో పెట్టి మిగిలిన దానికి చెక్ ఇచ్చారు... మీరు కాలేజీ ఫీజులకోసం ఇది చేస్తున్నామని ముందుగా ఎందుకు చెప్పలేదంటూ పద్రెస్కీ ఆ చెక్ చించేసి డబ్బు తిరిగి వారి చేతులో పెట్టి... మీ ఫీజు, కచేరీ నిర్వహణ ఖర్చులు పోగా మిగిలితే ఇవ్వండి, లేకపోయినా ఫరవాలేదన్నారు. పద్రెస్కీ తదనంతర కాలంలో పోలండ్‌కు ప్రధానమంత్రి అయ్యారు. అది మొదటి ప్రపంచ యుద్ధకాలం. పోలండ్‌లో కరువు పరిస్థితి. తినడానికి కొన్ని లక్షలమందికి అన్నంలేని స్థితి. ప్రధానమంత్రిగా ఆయన అమెరికాలోఉన్న అంతర్జాతీయ ఆహార, సహాయ సంస్థకు ఒక విజ్ఞాపన పంపారు. ఆ సంస్థకు అధ్యక్షుడు హెర్బర్ట్ హోవర్. ఆ ఉత్తరాన్ని పరిశీలించి టన్నులకొద్దీ బట్టలు, ప్రతిరోజూ 2 లక్షలమందికి భోజనానికి సరిపడా సామాగ్రి పంపారు. ఈ ఉపకారానికి వ్యక్తిగతంగా కృతజ్ఞతలు చెప్పుకోవడానికి పద్రెస్కీ అమెరికా వెళ్ళి హోవర్‌ను కలిసాడు. ‘‘మీరు కాదు కృతజ్ఞత లు.. నేను చెప్పాలి’’ అన్నాడు హోవర్. అదేమిటి అని పద్రెస్కీ ఆశ్చర్యపోతుండగా... గతంలో ఫీజుకట్టలేక మీ కచేరీ పెట్టి మిమ్మల్ని ఇద్దరు విద్యార్థులు కలిసారు, గుర్తుందా... అని అడిగాడు హోవర్. ఎప్పుడో జరిగిన వృత్తాంతం. అప్పటికి కొన్ని దశాబ్దాలు గడిచాయి. మీరు తీసుకోకుండా ఇచ్చిన డబ్బుతో కాలేజి ఫీజు చెల్లించి చదువు పూర్తి చేసుకోవడానికి మీరు సహకరించింది నాకే. మీరు చేసిన సాయంతోనే నేను ఈ రోజు ఈ స్థితిలో ఉన్నాను... అన్నాడు. ఆ తరువాత కాలంలో...అంటే అమెరికా అధ్యక్షపదవి స్వీకరించడానికి ముందు కూడా హోవర్ పోలండ్ వెళ్లాడు. మళ్ళీ అక్కడ పేద పిల్లల స్థితిగతులను చూసి చలించిపోయి భారీ ఎత్తున సహాయం పంపే ఏర్పాట్లు చేసాడు... మంచి గుణగణాలు.. వారికే కాదు, వారి పదవులకు కూడా గౌరవం తెచ్చిపెడతాయి. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
గురువాణి: శ్రమకు నమస్కారం
నైతిక విలువలు పతనమయిన జీవితాన్ని గడపడం... అంటే చెప్పేది ఒకటి, చేసేది ఒకటి అవుతుంది. దానికి మూడవది కొనసాగింపుగా మనసు కూడా తోడయితే... దానిని దంభం అంటారు. అంటే మనసులో ఒకటి అనుకుంటాడు. పైకి ఒకటి మాట్లాడతాడు, చేసేది మరొకటి అయి ఉంటుంది. అంటే ఈ మూడూ ఒక సరళరేఖలో ఉండవు. అలా లేకుండా ఉండడమే నైతిక భ్రష్టత్వం. ఏ పని చేయకుండా సంపద కలిగి ఉండడం ప్రమాదం. మనిషి సంపదను ΄పొంది ఉండడంలో తప్పు లేదు. అనువంశికంగా, పిత్రార్జితంగా పెద్దలనుండి వచ్చిన ఆస్తి కలిగి ఉండడం అంతకన్నా దోషం కాదు. కానీ వాళ్ళు ఈ సంపదను సమకూర్చడానికి ఎంత కష్టపడ్డారో, ఎంత చెమట చిందించారో అర్థం అయితే తప్ప ఆ డబ్బు ఖర్చుపెట్టడానికి యోగ్యత ΄పొందలేడు. కారణం.. డబ్బు సంపాదించేటప్పడు మనిషి పడే కష్టం అనుభవాన్ని ఇస్తుంది. అది డబ్బును విచ్చలవిడిగా ఖర్చు పెట్టనీయదు. చెమటకు ఉన్న శ్వాస ఏమిటో అర్థం అవుతుంది. అప్పుడు వ్యసనాలకు వశులు కారు. కష్టపడి సంపాదించుకున్న ద్రవ్యం క్రమశిక్షణను నేర్పుతుంది. నీతి శాస్త్రం ఏమంటుందంటే... మనిషి ఎంత సంపాదించాడనే దానికంటే ఏ మార్గంలో సంపాదించాడన్నది ప్రధానం. ఎంత ఖర్చు పెట్టావు అనేదానికన్నా ఏ ప్రయోజనానికి ఖర్చుపెట్టావన్నది అత్యంత ప్రధానం. ప్రతివారికి ద్రవ్యసముపార్జనలోని కష్టం తెలియాలి... అంటుంది రఘువంశం కావ్యంలో... పట్టాభిషిక్తుడైన ప్రతి రాజు కూడా వంశపారంపర్యంగా రాజ్యం అందినా... జీవితంలో ఒకసారి దండయాత్రకు వెడతాడు. రాజులందర్నీ గెలిచి వస్తాడు. ఎందుకు... అంటే తనకు పూర్వం ఉన్న రాజులు దండయాత్రలు చేయడానికి, రాజుల్ని గెలవడానికి, చక్రవర్తిత్వాన్ని నిలుపుకోవడానికి ఎంత కష్టపడ్డారో, ఎలా కోశాగారాన్ని నింపగలిగారో, ఎలా మంచిపనులు చేసి కీర్తిమంతులు కాగలిగారో తెలియాలంటే వారు కూడా కష్టపడాలి.. అందుకే ఆ దండయాత్రలు. ఒక వ్యక్తి జీవితంలో ఎంతో కష్టపడి సంపాదిస్తే, ఆ ద్రవ్యం ఎంత మంది ఉద్ధరణకో ఉపయోగిస్తాడు తప్ప నిష్కారణంగా దాచుకుందామన్న ఆలోచనను రానీయడు. నీరు, విద్య, ద్రవ్యం నిలబడి ఉండకూడదు. ప్రవహిస్తూ ఉండాలి. అప్పుడే వాటి ప్రయోజనం సిద్ధిస్తుంది. కష్టపడి సంపాదించడంలో గౌరవం ఉంది. అది ఎంతయినా కావచ్చు. అసలు సంపాదించినది ఏదీ లేక΄ోవచ్చు. అందువల్ల నీతిబద్ధంగా శ్రమించడం ప్రతి వ్యక్తికీ ప్రధానం. -
అదొక విచిత్ర బంధం! పట్టు విడుపులు ఉంటేనే..
లోకంలో ఒక బంధనం ఉన్నది. బంధం అంటే కట్టేయడం. ఒక తాడేసి కాళ్లూచేతులూ కట్టేసామనుకోండి. కదలలేం కదా! కాళ్ళువిరిగిపోయిన వాడో, నడవలేనివాడో ఎలా కూర్చుండిపోతారో అలా బంధనం పడిన వాడు కదలలేక ఒక చోటే ఉండిపోతాడు. కానీ లోకంలో మరో ఆశ్చర్యకర బంధనం కూడా ఉన్నది. ఏమిటది? ఆశానామ మనుష్యాణాం /కాచిదాశ్చర్య శృంఖలా/యయాబద్ధా ప్రధావన్తి/ముక్తాస్తిష్ఠ పంగువత్... అన్నది హితవాక్కు. ఆశ అనే బంధం, దానిచేత కట్టబడినవాడు పరుగులు తీస్తుంటాడు. కట్టినప్పుడు కదలికలు ఆగిపోవాలి కానీ, ఈ బంధం పడినప్పుడు పరుగులు తీస్తుంటాడు. కట్టు విప్పినప్పుడు స్వేచ్ఛగా పరుగెత్తాలి. కానీ ఆశాబంధాన్ని విప్పదీస్తే వాడు హాయిగా కూర్చుండిపోతాడు. పరమ ప్రశాంతంగా నిశ్చల చిత్తంతో ఉండిపోతాడు. ఇదొక విచిత్ర బంధం. ఆశకు అంతేమిటి! ఎన్ని ఉన్నా ఇంకా ఏదో కావాలని ఆరాటపడడం. లోకంలో సర్వం స్వంతమయినా, ఎంత గొప్పగా అన్నీ పొందినా... ఇంకా ఏదో కావాలని మరేదో పొందాలన్న కోరిక స్థిరంగా ఉండనీయదు. అందుకే ఆ పరుగులు. అయితే ఆశ లేకుండా ఉండడం సాధ్యం కాదు. మంచిదీ కాదు. ఒక స్థితిలో మనిషికి ఆశ ఉండాలి. నేను బాగా చదువుకోవాలి, ఒకరి దగ్గర చేయి చాచకుండా బతకాలి, ధార్మికంగా బతకాలి, ఎన్నో పుణ్యకార్యాలు చేయాలి... ఈ ఆశలన్నీ మనిషికి ఉండొచ్చు. అయితే ఆశ కలిగినప్పుడు చేయవలసినది. దాని పరిశీలన. దేన్ని పరిశీలించాలి.. అలా ఆశపడిన దానిని సాధించుకోవడానికి మనకున్న సమర్ధతను పరిశీలించకుండా ప్రతిదానికోసం ఆశపడడం, వెంపర్లాడడం, తన సమర్థత సరిపోక నిరాశా నిస్పృహలు పొందుతూ ఉండడం మంచిది కాదు. తన సమర్థతను పరిశీలించుకోవడానికి తనకన్నా యోగ్యుడు మరొకడుండడు. పరిశీలించడం రాకపోతే... మంట దగ్గరకు వెళ్ళి...నెయ్యి ఏదో, నీరేదో తెలుసుకోలేక ఒకదానికి బదులు మరొకటి వేస్తే భగ్గున మండుతుంటుంది. కాబట్టి ఆ విచక్షణ అవసరం. వివేకంతో కూడిన సమర్థత ఎంత ముఖ్యమో ప్రయత్నం కూడా అంతే ముఖ్యం. ఆశ ఉంది, సమర్థత ఉంది.. కానీ ప్రయత్నం లేకపోతే వృథా. తాను ఒక స్థితికి చేరిపోయిన తరువాత తాను ప్రశాంతంగా ఉండాలి. దానిని రాగద్వేషాలు పాడు చేస్తాయి. రాగము అంటే.. కోరిక, అది తీరకపోతే అశాంతి. తీరినా అశాంతే. ఎందుకంటే మళ్ళీమళ్ళీ కావాలని పెట్టే పరుగుల వల్ల. రాగద్వేషాలు లేనివాడిలో కదలికలుండవు, పరుగులుండవు, ఒక వయసులో, ఒక స్థితిలో, వృద్ధాప్యంలో.. అంటే జీవన పరిపూర్ణత్వానికి ఈ రెండోకోణం పరిశీలన అవసరం. ఈ స్థితికి రావాలంటే.. పట్టువిడుపులు తెలియాలి. ఇది తెలిస్తే, అలవాటయితే ఎప్పుడు ఏది పొందాలో అది పొందుతారు. పూవు కావాలనుకుంటే పూవు అవుతారు, పిందె కావాలనుకుంటే పిందెవుతారు. కాయవుతారు, పండవుతారు, బాగా పండిపోయి రంగు మారి చెట్టునుండి వదిలిపెట్టేస్తారు. వారంతటవారుగా విడిపోతారు. కాబట్టి మనందరం ఎప్పుడు పరుగెత్తాలో అప్పుడు పరిగెత్తాలి. దాన్ని విశ్లేషించుకొంటూ, ప్రయత్నించుకొంటూ, సాధించి తృప్తి, భోగం, కీర్తి పొంది ఒకానొక వయసు వచ్చిన తరువాత పరిణతి చేత శాంతిని పొంది ఆశాపాశాలనుండి విముక్తిని పొంది జీవనసాఫల్యాన్ని పొందాలి. -బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
గురువాణి: పంచెకట్టు కట్టి పై కండువాతో నడిచొస్తుంటే...
ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క వస్త్రధారణ ఉంటుంది. దాన్ని చూడగానే అది ఫలానా ప్రాంతపు సంప్రదాయం అని ఠక్కున గుర్తుపట్టేస్తాం. అది ఏ ప్రాంతానిదయినా అభినందించవలసిందే. దానిపై అక్కడి వాళ్ళకు మక్కువ ఎక్కువగా ఉంటుంది. అయితే అదే సమయంలో ఇతరుల ఆచార వ్యవహారాలను కూడా గౌరవించాల్సిన అవసరం ఉంది. తమ ప్రాంతంలోని ఆచార వ్యవహారాలను, అలవాట్లను, కట్టూబొట్టూను... వీటిని జ్ఞాపకం ఉంచుకోవడం, గౌరవించడం, అనుసరించడం... ఇది మాది ...అని చెప్పుకొని పొంగిపోవడం... ఉండవలసిన లక్షణం. తెలుగువాడు ఎలా ఉంటాడు...అన్నదానికి... అల్లూరి వేంకట నరసింహరాజు గారనే ఒక కవి ఏమంటున్నాడంటే....‘‘ పంచెకట్టు కట్టి పైమీది కండువా వేసికొనిన తెలుగువేషమగును, అటుల సుందరము, శృతిపేయమైనట్టి భాషయన్న తెలుగు భాషయగును’’ అని వర్ణించాడు. పంచెకట్టు తెలుగువాడి వస్త్రధారణ. అదికూడా...కుచ్చిళ్ళు వచ్చేటట్లుగా దాని అంచు నిలువుగా నిలబడేటట్లుగా ఎడం పక్కకు పెట్టుకొని ..ఒక్కోసారి ఇంకా అందంగా కనబడడానికి అర్ధవృత్తాకారంలో కట్టుకొని, వెనక ప్రత్యేకించి కుచ్చిళ్ళతో గోచీపోసి కట్టుకుని ..అటువంటి అలంకరణతో నడుస్తుంటే ఆ వస్త్రధారణ అందమే వేరు... ఇంతకంటే అందమైన మరొక వస్త్రధారణ ఉంటుందా..అనే అనుమానం కూడా కలుగుతుంది. ఇక పంచెకట్టుతోపాటూ పైన ఉత్తరీయం.. కండువా. కనీసంలో కనీసం ఒక తువ్వాలు... అది లేనిదే తెలుగువాడు ఒకప్పుడు బయట అడుగుపెట్టేవాడు కాడు. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో, సంప్రదాయ కుటుంబాల్లో, శుభాశుభాల్లో ఈ వేషధారణ తప్పనిసరిగా కనిపిస్తున్నది. నవతరం కూడా ఈ సంప్రదాయాలను గౌరవిస్తున్నది. ఈ రెంటికీ అదనంగా భాష.. తెలుగు ఎంత మధురమైన భాషంటే... దానిని చెవులతో జుర్రుకోవచ్చు.. అనేంత మధురంగా ఉంటుంది. ఈ భాష రానివాడు కూడా దానిని వింటూ మైమరిచిపోతాడు. ఇది ప్రతి తెలుగువారూ తమది అని గొప్పగా చెప్పుకొని పరవశించే సంస్కృతి. వేదం కూడా ప్రత్యేకించి ఈ రకమైన వస్త్రధారణ చాలా గొప్పది.. అంటుంది. స్వాధ్యాయచ... వేదం చదువుకోవాలన్నా, హోమం చేయాలన్నా, దానం చేయాలన్నా, భోజనం చేయాలన్నా, ఆచమనం చేయాలన్నా...ఈ అయిదింటికీ పంచెకట్టే కట్టుకోవాలి. ‘‘విగచ్ఛః అనుత్తరీయశ్చ నగ్నస్య అవస్త్రేయచ’’ అంటుంది. అంటే వెనుక గోచీ పోసి కట్టుకోకపోతే, ఉత్తరీయం వేసుకొని ఉండకపోతే వాడు నగ్నంగా ఉన్నవాడితో సమానం అంటుంది. తెరమీద రకరకాల వేషాలతో నవయవ్వనులుగా కనిపించినా.. బహిరంగంగా సభలకు వచ్చేటప్పడు ఎటువంటి భేషజాలకు పోకుండా నందరమూరి తారకరామారావు, అక్కినేని నాగేశ్వర రావు, ఎస్.వి. రంగారావుగార్లలాంటి వారు, అలాగే ప్రభుత్వంలోని అత్యంత ఉన్నతస్థానాల్లో ఉన్న అధికారులు కూడా కొన్నిరకాల సభలకు, సమావేశాలకు పంచెకట్టుతోనే వచ్చేవారు. వారలా కనిపిస్తుంటే పంచెకట్టులో వెలిగిపోతుండేవారు. వై.ఎస్. రాజశేఖర రెడ్డిగారు అందంగా గోచీపోసి అంచులు ఆకర్షణీయంగా కనబడేట్టుకట్టి.. అలా వేదికలమీద, జనం మధ్యన నడిచిపోతుంటే అందరి దృష్టి వారిమీదే. వీళ్ళు పై ఉత్తరీయాన్ని కూడా తలపాగా లాగా ఎంత వేగంగా తలకు చుట్టినా అది అంత అదనపు ఆకర్షణగా నిలిచేది. అంత గొప్ప కట్టుబొట్టూ ఉన్నచోట పుట్టే అదృష్టం, అంత మధురమైన తెలుగు భాషను నోరారా మాట్లాడుకొనే అవకాశం ఇచ్చిన పరమేశ్వరుడికి కృతజ్ఞత చెప్పుకోకుండా ఎలా ఉండగలం!!! మనదైన సంస్కృతిని కొత్త తరం అందిపుచ్చుకొని మరింత వ్యాప్తిలోకి తీసుకురావాలి. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
శతక నీతి – సుమతి: క్షణంలో పిడికెడు బూడిదగానే మిగిలిపోవచ్చు !!!
శంకర భగవత్పాదులు అంటారు..‘‘మా కురు ధనజన యౌవన గర్వం హరతి నిమేషాత్ కాలస్సర్వం, మాయామయమితి సర్వం హిత్వా బ్రహ్మ పదం త్వాం ప్రవిశ విదిత్వా’’. మా కురుధన... డబ్బు ఉంటుంది, లక్షాధికారులు భిక్షాధికారులయిన రోజులున్నాయి. ఎంతో ఐశ్వర్యవంతులు కటిక దరిద్రాన్ని అనుభవించిన వారున్నారు. జనం నా వెనుక ఇంతమంది ఉన్నారు అన్నవాడి వెనుక ఉండేవారులేక.. జారిపోయిన వారు ఎక్కువమంది ఉన్నారు. యవ్వన సర్వం... ఇంత బలవంతుణ్ణి–యవ్వనంలో ఉన్నానంటాడు. గిర్రున పాతికేళ్ళు తిరిగేసరికి పటుత్వం సడలి, సంధిబంధములు జారిపోయి వృద్ధాప్యం ఆవహిస్తుంటుంది. హరతి నిమేషాత్ కాలస్సర్వం – కాలం చాలా తినేస్తుంది. నాకు తిరుగులేదు అన్న ఆరడుగుల నిండు మనిషి చివరకు రుద్రభూమిలో పిడికెడు బూడిద కింద మారిపోతాడు. ఎందుకీ అతిశయం? వినయంగా ఉండడం నేర్చుకో.. నీలో ఎన్ని మంచి గుణాలున్నా, నిస్సహాయ స్థితిలో ఉండి నీ వల్ల బాధలకు గురయినవారందరూ ఒకనాడు నీ పని పడతారు. అపకీర్తి మూటగట్టుకుని వెళ్లిపోతావు. భారతంలో దుర్యోధనుడి సంగతే చూడండి... ‘ఆ పాండవులెంత, ఆ భీముడెంత, ఆ అర్జునుడెంత... చిటికెలో చంపేస్తా... నాదగ్గర భీష్ముడున్నాడు, కర్ణుడు, ద్రోణుడున్నాడు, నాకింతమంది సోదరులున్నారు. నాకిన్ని అక్షౌహిణుల సైన్యం ఉంది...’ అంటూ విర్రవీగేవాడు. ఆయనకు మంచి మాటలు చెప్పనివారెవరు, అందరూ చెప్పారు. కానీ వినలేదు. వినకపోగా చెప్పేవాళ్ళను అవమానించేలా ప్రవర్తించేవాడు. చివరికి రాయబారం చేయడానికి వచ్చిన కృష్ణుడిని కూడా బంధించబోయాడు. ఒకరోజు మైత్రేయ మహర్షి వచ్చాడు. ‘తప్పు దుర్యోధనా! పాండవులు ధర్మమార్గంలో ఉన్నవాళ్ళు. వాళ్ళతో నీకు గొడవలెందుకు, వాళ్లకివ్వాల్సిన రాజ్యభాగం ఇచ్చేయి.’’ అని నచ్చచెప్పబోయాడు. ప్రతిరోజూ ఎవడో ఒకడు రావడం ధర్మపన్నాలు వల్లించడం అలవాటయిపోయిందంటూ మహర్షి మాట్లాడుతున్నప్పుడు వెటకారంగా తొడల మీద తాళం వేస్తున్నట్లు చెయ్యి తిప్పుతున్నాడు. ఆయనకు ఎక్కడలేని కోపం వచ్చింది. ‘‘నేను వ్యయప్రయాసలకోర్చి నీ మంచి కోరి నీకు నాలుగు మంచిమాటలు చెప్పిపోదామని వస్తే శ్రద్ధతో వినకపోగా ఎగతాళి చేస్తూ, నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నావు. ఏ తొడలను తక్కువగా భావించి వాటిమీద వెకిలిచేష్టలు చేసావో ఆ తొడలే భీమసేనుడి చేతిలో చితికిపోయి యుద్ధభూమిలో పడిపోయెదవుగాక!’’ అని శపించాడు. హడిలిపోయి ధృతరాష్ట్రుడు వెళ్ళి మైత్రేయ మహర్షి కాళ్ళమీద పడ్డాడు, శాపాన్ని ఉపసంహరించుకోమని కోరుతూ. ‘‘పాండవులతో నీ కొడుకు సంధి చేసుకుంటే ఆ శాపం అన్వయం కాదు, చేసుకోకపోతే ... చెప్పిన మాట వినలేదు కాబట్టి జరగాల్సింది జరుగుతుంది’’ అన్నాడు మహర్షి. ఏమయింది... అదే జరిగింది. బలవంతుడ నాకేమని విర్రవీగినందుకు ఫలితం అది...తన బలం, బలగం అనుకొన్నవారిలో ఒక్కొక్కరు వెళ్ళిపోయారు. భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, శల్యుడు, సోదరులు అందరూ వెళ్ళిపోయారు.. ఓ నలుగురు తప్ప. యుద్ధభూమిలో భీముడి గదాఘాతానికి తొడలు విరిగిపోయి, నెత్తురు ఓడుస్తుండగా అప్పుడు ఏడ్చాడు. రుషులు చెబితే వినలేదు, విదురుడు చెప్పినా వినలేదు... చివరకు అందర్నీ చంపేసుకొన్నా...అంటూ తన దుస్థితిని తలుచుకుని విలపించాడు. ఎందుకంత పొగరుబోతుతనం... ధనం కానీ, అధికారం గానీ, ఇతరత్రా నైపుణ్యాలు, పాండిత్యం కానీ నీకు భగవంతుడేదో ఇచ్చి ఉండవచ్చు.. అది కాస్త ఎక్కువే ఇచ్చి ఉండవచ్చు. అవి ఇచ్చినందుకు భగవంతుడిపట్ల వినయ విధేయతలతో కృతజ్ఞుడిగా ఉండడానికి బదులు, నీ బలం చూసుకొని అహంకారంతో వదరి మాట్లాడడం అత్యంత ప్రమాదకరం. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
మాటా... మంటా రెండూ ఒక్కటే !
ఏది చెయ్యాలన్నా ప్రప్రథమం గా కావలసింది నీరే. అది అమృతంతో సమానం. ఆపోమయప్రాణః ..అది వేదం . ప్రాణమంటే నీరే. తనంత తానుగా ఎంతకాలం నీటిని శరీరంలోకి పుచ్చుకోగలుగుతాడో, శరీరంలోని కల్మషమైన నీటిని తనంతతానుగా విడిచిపెట్టేయ గలుగుతాడో అంతకాలం శరీరం ప్రాణాలను నిలబెట్టు కుంటున్నదని గుర్తు. నీరు శరీరంలోకి వెళ్లకపోయినా, వెళ్ళిన నీరు శరీరంలో నిలబడకపోయినా ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని గుర్తు. అంటే ప్రాణం నీటి చేత తయారవుతున్నది... నీరే ప్రాణం. ‘అన్నమయం హి సౌమ్య మనః’. మనస్సు సూక్ష్మ శరీరం. అది తిన్న అన్నం చేత తయారవుతుంది. మనం ఎంత భక్తితో, ఎంత ప్రశాంతంగా, ఎంత నిశ్శబ్దంగా కావాల్సిన ఆహార పదార్థాలను నియమంగా స్వీకరిస్తామో అంత మంచి మనసు ఏర్పడుతుంది. అదే పనిగా మాట్లాడుతూ, ఉద్వేగానికి లోనవుతూ, తాను ఏం తింటున్నాడో తాను తెలుసుకోకుండా ఉద్రేకంతో ఏవేవో మాట్లాడుతూ తిన్నవాడి మనసు కూడా అలాగే తయారవుతుంది. తిన్న అన్నంలో ఆరోవంతు మనసుగా మారుతుందని వేదం చెబుతుంది. కాబట్టి అన్నమే మనసుగా మారుతున్నది. ‘తేజోమయీ వాక్..’ అగ్నిహోత్రం వాక్కుగా మారుతున్నది. ఈ మూడూ శరీరానికి అత్యంత ప్రధానమైనవి. అయితే ఆ వాక్కు ఉండాలన్నా, ఆ మనసు ఉండాలన్నా అసలు ప్రాణం ఉండాలికదా శరీరంలో. ఆ ప్రాణం నిలబడడానికి కారణం నీరు. అటువంటి నీటి పట్ల మనిషి ఎటువంటి శ్రద్ధ చూపాలి. దానిపట్ల ఎంత గౌరవంగా మసులుకోవాలి. భగవంతుడిని చూస్తే ఎలా నమస్కరిస్తామో మొక్క దగ్గరినుంచి సమస్త జీవరాశికి, ముఖ్యంగా మనకు ప్రాణాధారమయిన నీటిపట్ల కూడా అంతే శ్రద్ధాభక్తులతో ఉండాలి. నీరు పరబ్రహ్మమే. అందుకే ఆ పద్యాన్ని ప్రారంభం చేస్తూనే బద్దెన ‘‘నీరే ప్రాణాధారము, నోరే రసభరితమైన నుడువులకెల్లన్...’’ అంటూ నోరే రసభరితమయిన నుడువులకెల్లన్... అంటున్నాడు...అంటే.. రసభరితమైన వాక్కులన్నింటికీ కూడా నోరే కారణభూతమైనది. రసభరితం అంటే.. ఏదయినా మనకు బాగా ఇష్టమయిన ఆహార పదార్థాన్ని తినేటప్పుడు.. గబగబా తినకుండా కొద్దికొద్దిగా తింటూ సంతోషంగా ఆస్వాదిస్తుంటాం. దాని రుచిని అనుభవిస్తున్నాం. అలాగే వాక్కులు కూడా రసభరితంగా ఉండాలి. ఏ ప్రాణికీ ఇవ్వని వాక్కును భగవంతుడు మనిషికి ఇచ్చాడు.‘తేజోమయీ వాక్..’ అంటే వాక్కుకీ, అగ్నిహోత్రానికీ తేడాలేదు. రెండూ ఒకటే. మంట ఎదురుగా ఉన్న వస్తువును కాల్చేస్తుంది. మాట ఎదుటివారి అజ్ఞానాన్ని కాల్చేస్తుంది. ఇది తెలియదు – అన్న వాడిని ఇది తెలుసు – అనేటట్లు చేస్తుంది. చాలా పెద్ద ఆస్తిని పెద్దలు కట్టబెట్టినప్పడు ఒక్క రూపాయి కూడా అదనంగా సంపాదించకుండా దాన్నంతా దుర్వినియోగం చేసేవాడిని సమాజం ఎలా విమర్శిస్తుందో అలాగే భగవంతుడిచ్చిన ఈ వాక్కును పదిమందికి పనికొచ్చే విధంగా లేదా కనీసం తనను తాను ఉద్ధరించుకోవడానికి ఉపయోగించకుండా వృథా కాలక్షేపానికి, తనను తాను పాడుచేసుకోవడానికి పదిమందిని పాడుచేయడానికి ఉపయోగించడం దారుణం. చనిపోవడానికి సిద్ధమైన వాళ్ళను కూడా మంచి మాటలచేత బతికించవచ్చు. అదే మాటల చేత పచ్చగా బతుకుతున్న వారి చావుకు కూడా కారణం కావచ్చు. మాటలకున్న శక్తి అది. అది తెలుసుకుని ఆ మాటలను వెలువరించే నోటిని రసభరితమైన అమృతం చిలికే మాటలకు ఉపయోగించాలి. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
తప్పు నల్లిది... శిక్ష మంచానికి!
మనుష్యుడు తనంతతానుగా తప్పు చేసేవాడు కాకపోయినా, దుర్మార్గులతో స్నేహం చేస్తే పడరాని కష్టాలను పడతాడని చెప్పడానికి...సుమతీ శతకకారుడు బద్దెనగారు బహు సులభమైన ఉపమానాలతో వివరిస్తున్నాడు... ‘‘కొంచెపు నరు సంగతిచే /నంచితముగ గీడు వచ్చు నది యెట్లన్నన్ /గించిత్తు నల్లి కుట్టిన/ మంచమునకు జేటు వచ్చు మహిలో సుమతీ’’ ...‘‘కొంచెపు నరు..’’ అంటే... బుద్ధి పరిణతి చెందనివాడు, అధముడు, దుర్బుద్ధి కలిగినవాడు, ఎప్పుడూ కూడా చెడు ఆలోచనలతో ఉండేవాడు–వాడు బాగుపడడు, ఇతరులను బాగపడనివ్వడు. దుర్జనులతో స్నేహం చేస్తే అంచితముగ కీడువచ్చు..అంటే అంతాఇంతా అని చెప్పలేనంత అపకీర్తి, ప్రమాదం, కష్టం ముంచుకొచ్చేస్తాయి.... ఎలాగంటే... ఇప్పటితరానికి ఎక్కువగా తెలిసే అవకాశం లేదు కానీ వెనకటికి నులక మంచాలు, నవారు మంచాలు, పేము మంచాలంటూ ఉండేవి. కట్టెమంచాలకు నవారు, నులక లేదా పేము అల్లి వాడుకొనేవారు. మంచానికున్న పట్టీలు, కోళ్ళు, నవారు, నులకల మధ్య సందుల్లో కుప్పలు కుప్పలుగా నల్లులు చేరేవి, గుడ్లు పెట్టేవి. వీటికి ఒక లక్షణం ఉంటుంది. మంచంమీద పడుకున్న వ్యక్తి మేలుకుని ఉన్నంతవరకు అవి బయటికి రావు. నిద్రలోకి జారుకోగానే అవి కుడుతుంటే సుఖంగా నిద్రపోవడం సాధ్యం కాదు. వాటి బాధ వదిలించుకోవాలంటే పగలు ఎర్రటి ఎండలో మంచాన్ని నేలకేసి పదేదపదే కొడితే నల్లులు రాలిపడుతుంటాయి. కాళ్లతో వాటిని నలిపి చంపుతారు. అయినా ఇంకా సందుల్లో గుడ్లు ఉంటాయి. వాటిమీద కిరసనాయిలు పోసేవారు.... ఇప్పడు మనం ఆలోచించాల్సింది ఏమిటంటే.... నిద్రపోతున్న మనుషులను కుట్టినది నల్లులయితే మధ్యలో ఆ మంచం చేసిన తప్పేమిటి ? నిజానికి పడుకోవడానికి ఉపయోగపడడం తప్ప మరోపాపం ఎరుగదు. కానీ నల్లులకు ఆశ్రయం ఇచ్చినందుకు ... దెబ్బలు తిన్నది మాత్రం మంచమే. నల్లులు చేరిన తరువాత మంచానికి కష్టాలు ఎలా వచ్చాయో, దుర్మార్గులతో కలిసిన వారి జీవితాలు కూడా ఇలాగే ఉంటాయి. మహాభారతంలో దుర్యోధనడు అంటాడు...‘‘జానామిధర్మంనచమే ప్రవృత్తిః జానామ్యధర్మం నచమే నివృత్తిః...’’ నాకు ధర్మం తెలియదనుకుంటున్నారా...నాకు అన్నీ తెలుసు కానీ దాన్ని పాటించాలనిపించడం లేదు. దాన్ని పట్టుకుంటే జీవితంలో వృద్ధిలోకి వస్తామని కూడా తెలుసు. విజయాలు వరిస్తాయనీ తెలుసు. నాకు అధర్మం ఏదో తెలియదనుకుంటున్నారా.. ఏది చెయ్యకూడదో నాకు తెలుసు. అది చేస్తే భగవంతుడి అనుగ్రహం ఉండదని కూడా తెలుసు. అలా ఉంటే జీవితంలో ఇబ్బందులపాలవుతామనీ తెలుసు...అయినా అధర్మాన్ని విడిచిపెట్టాలనిపించదు. ’’ అంటూ ఇంకా దుర్యోధనుడు ఏమన్నాడో చూడండి...‘‘...కేనాపి దేవేన హృధిస్థితేన యథాప్రవృతోస్మి తథాకరోమి’’...అన్నాడు... అంటే.. ఇందులో నా తప్పేముంది? మీ అందరికీ ఉన్నట్టే నా హృదయంలో కూడా భగవంతుడున్నాడు. ఆయన నన్ను ధర్మాన్ని పట్టుకోనీయడం లేదు. అధర్మాన్ని పట్టుకోనిస్తున్నాడు. నేను పట్టుకుంటున్నా. ఇది నా తప్పెలావుతుంది? ఏదయినా తప్పు ఉంటే లోపల ఉన్న భగవంతుడిది అవుతుంది..’’ అటువంటి వితండవాదనలు చేసే మూర్ఖులను ఎంతమంది రుషులు, సాధుసత్పురుషులు వచ్చినా ఏం మార్చగలరు? జీవితంలో మనకు ఇటువంటి వారు కూడా ఎక్కువగా తారసపడుతుంటారు... వారితో స్నేహం వల్ల మన జీవితాలు కూడా దారి తప్పుతాయి... మన చుట్టూ ఉండేవారిపట్ల ఎంత జాగ్రత్తగా ఉండాలో బద్దెనగారు ఉద్బోధ చేస్తున్నారు. అలా ఉండకపోతే...నల్లులకే కాదు, మంచానికి ఏర్పడిన ప్రమాదం లాగా మనకే కాదు, మన పక్కన ఉన్న ఇతరులు కూడా కష్టాలపాలవుతారని హెచ్చరిస్తున్నారు. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
ఆయన చెప్పాడంటే అదంతే....
‘‘వినదగునెవ్వరు సెప్పిన వినినంతనె వేగపడక వివరింపదగున్ ....’’ అంటున్నారు బద్దెన. మాట వినడం అనేది ఒక కళ. ఎవరు సారవంతమైన మాట చెబుతారో, వాళ్ళ అనుభవంలోంచి ఏ మాట వస్తుందో ... కాబట్టి తప్పకుండా వినాలి. కానీ ‘కనికల్ల నిజము తెలిసిన...’ .. వినడం జాగ్రత్తగా వినాలి. విన్నతరువాత దాని గురించి బాగా ఆలోచించి విషయాన్ని పూర్తిగా తెలుసుకోవాలి. అంతే తప్ప వినగానే అదే నిజమని నమ్మి ఒక నిర్ణయానికి రాకూడదు. అది మనకు ప్రతికూలంగా ఉంటే ఉద్రేకపడిపోయి ప్రతిచర్యకు దిగకూడదు. అది చాలా ప్రమాదకరం. ఎవరు ఏది చెప్పినా, ఏది చూసినా అది నమ్మడం, దానికి ప్రభావితుడై దానికి వశపడిపోవడం అలవాటయితే జీవితంలో వృద్ధిలోకి రాలేరు. వెనకటికి ఒకాయన ముంగిసను పెంచుకున్నాడు. అది కూడా ఆయనకు బాగా అలవాటయి ఇంట్లోనే తిరుగుతూ వారికి అనుకూలంగా ఉండేది. అది ఉన్న చోట విష కీటకాలు వచ్చేవి కావు. ఇంటికి కాపలాగా కూడా ఉంటున్నదని దాన్ని మరింత ప్రేమగా చూసుకుంటుండేవారు. ఒక రోజు పనిమీద బయటికి పోతూ, చంటిపిల్లాడిని ఊయలలో పడుకోబెట్టి బయటికెళ్ళాల్సిన పరిస్థితి. ముంగిస ఉందికదా అనే ధీమాతో వెళ్ళిన వారు రావడం కొద్దిగా ఆలస్యమయింది. తీరా ప్రహరీ గేటు తీసుకుని లోపలికి వస్తుండగా ముంగిస నెత్తుటి నోటితో ఎదురుపడ్డది. యజమాని కీడును శంకించాడు. ఊయలవైపు చూస్తే అంతా రక్తసిక్తంగా కనిపించింది. తన బిడ్డను అది కొరికి చంపిందనుకొని ఒక కర్రతీసుకొని దాన్ని కసితీరా కొట్టాడు. అది చచ్చిపోయింది. కోపం చల్లారాక బిడ్డ పరిస్థితి చూద్దామని ఊయల దగ్గరకు వెళ్ళి చూసి అవాక్కయిపోయాడు. బిడ్డ క్షేమంగా ఉన్నాడు, హాయిగా నిద్రపోతున్నాడు. ఊయల చుట్టు పక్కల పెద్ద తాచుపాము ముక్కలుముక్కలయి పడి ఉంది. అప్పుడు తానెంత మూర్ఖంగా ప్రవర్తించాడో తెలిసొచ్చింది. తన తొందరపాటుకు చింతిస్తూ... తన బిడ్డను కాపాడి, ఇప్పడు తన కోపానికి ఆహుతయిపోయిన ముంగిస ముందు కూర్చుని భోరుమన్నాడు. ఎంత ఏడ్చినా దిద్దుకోలేని తప్పు అది. అంత ప్రేమ, అంత నమ్మకం చూపిన ఆ ప్రాణి మళ్ళీ సజీవం గా తిరిగొస్తుందా ? అందుకే మనం కళ్ళారా చూసిన, చెవులారా విన్న విషయాలలో కూడా తొందరపడి నిర్ణయానికి రాకూడదు. చూసినవాటిలో, విన్నవాటిలో నిజమెంతో పరిశీలించాలి. అయితే దీనికి ఒక మినహాయింపు ఉంది. ‘గురుబుద్ధిర్విశేషతః’’ అంటారు. గురువు గారు చెప్పిన విషయానికి సంబంధించి నీవు మరోమారు ఆలోచించనక్కరలేదు. ఆయన చెబితే అది ఆదేశం. నీవు మరుక్షణం దానిని ఆచరించవచ్చు. కొన్ని కొన్ని విషయాలు తప్ప తండ్రి చెప్పినా అంతే... తల్లి చెప్పినా అంతే. లోకంలో సర్వసాధారణంగా వారు తప్పు మాట చెప్పరు. వారు ఏది చెప్పినా నీ శ్రేయస్సుకోరి మాత్రమే చెబుతారు. వాటిని తిరస్కరించకూడదు. వీరు తప్ప స్నేహితులు, బంధువులు ఎవరు చెప్పినా.... దానిలోని మంచి చెడులను విచారించి దానికి తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకోవాలి. వారిని అనుమానించనక్కర లేదు. వారు చెప్పే విషయాల్లోని నిజానిజాలు వారికి కూడా తెలియకపోవచ్చు. నీవు మాత్రం. వారు చెప్పిన మాటలలో నిజాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. అలా వివేకం, విచక్షణ చూపిన వాడే నిజమైన మనిషి... అనేది బద్దెనగారి సందేశం. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
మైత్రీం భజతా...
‘‘ఉపకారికినుపకారము విపరీతము కాదు సేయ వివరింపంగా అపకారికి నుపకారము నెపమెన్నక సేయువాడు నేర్పరి సుమతీ !’’..అన్న బద్దెనగారి పద్యాన్ని చర్చించుకుంటున్నాం. పిల్లలు, యువతీ యువకులు భవిష్యత్తులో తమ జీవితాన్ని తమకు తాముగా ఎలా సరిదిద్దుకోవచ్చో ఆయన అత్యంత సులభమైన మాటల్లో మనకు తెలియపరుస్తున్నారు. కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన 68వ పీఠాధిపతులు, ప్రాతఃస్మరణీయులు, అపర శంకరావతారులు, నడిచే దేముడని కీర్తింపబడిన మహాపురుషులు శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామివారు 23 అక్టోబరు, 1966 న ఐక్యరాజ్య సమితి వేదికగా ప్రపంచం మొత్తానికీ సంస్కృతంలో ఒక గీతం ద్వారా తన సందేశాన్ని ప్రముఖ సంగీత విద్వాంసురాలు శ్రీమతి ఎం.ఎస్.సుబ్బులక్ష్మి ద్వారా ఇప్పించారు. దాని అర్థం విన్న అతిథులు అందరూ లేచి నిలబడి కరతాళ ధ్వనులతో అభినందించారు. అందులో వాడిన మొదటి మాట – ‘‘మైత్రీం భజతా అఖిలహృజ్జేత్రిమ్..’’. అంటే ప్రపంచ ప్రజలు యుద్ధాలు, స్పర్థలు, కక్షలు కార్పణ్యాలు వదిలి అందరితో స్నేహంగా ఉండాలి..అని. అపకారం చేసినవాడు, తప్పు చేసినవాడు, ... అది దృష్టిలోపెట్టుకుని నీవు ఎవరినీ దూరం చేసుకోకు. అందరికీ మంచి చేసుకుంటూ పోవడమే నీ కర్తవ్యం. అందరూ వద్ధిలోకి రావాలని కోరుకో...అన్న అర్థంలో ఉందా గీతం. సర్వేజనా సుఖినోభవంతు. అంతే తప్ప ఏదో తప్పు చేసాడని వాడిని ఎలా దూరం చేద్దాం, ఎలా పక్కన పెడదాం... అని ఆలోచిస్తూ నీ సమయం, నీ జీవితం వృథా చేసుకోకు. వాడి తప్పు వాడు తెలుసుకోవాలని త్రికరణ శుద్ధిగా కోరుకో. అన్యాపదేశంగా వాడి తప్పు వాడు తెలుసుకునేటట్లు చేయి. వాడు మారాడా అదృష్టవంతుడు. నువ్వు మాత్రం వాడు తప్పు చేసాడని వాడికి అపకారం చేసే ప్రయత్నంలో నువ్వు పాడయి పోవద్దు. పాపాలను కడగడం, తప్పులను క్షమించడమే తప్ప అవతలివాడు మనపట్ల తప్పుగా వ్యవహరించాడు కాబట్టి మనం దానికి ప్రతిగా కక్ష తీర్చుకుని వాడికి బుద్ధి చెబుదాం... వంటి ధోరణి మహోన్నతమైన వ్యక్తుల జీవితాల్లో ఎక్కడా కనిపించదు. అయోథ్యా నగరవాసులు రాముడి గురించి చెబుతూ ...‘‘కథంచిదుపకారేణ కృతేనైకేన తుష్యతి న స్మరత్యపకారాణాం శతమప్యాత్మవత్తయా...’’ అంటారు. ఓ దశరథ మహారాజా! నీ కొడుకెంత గొప్పవాడో తెలుసా! కావాలని ఉపకారం చేసినవాడినే కాదు, అనుకోకుండా ఉపకారం చేసినవాడిని కూడా రాముడు గుర్తుపెట్టుకుని పదేపదే తలుచుకుంటుంటాడు. అంత చిన్నవాటిని కూడా మర్చిపోడు. సముద్రం ఇవతల నిలబడి అవతలి వైపు లక్ష్యాన్ని తన బాణాలతో ఛేదించగల సమర్ధుడే అయినా రాముడు నూరు అపకారాలు చేసిన వాడిని కూడా శిక్షించకుండా, మరో అవకాశం ఇద్దామని, వాడు మారడానికి వీలు కల్పిద్దామంటూ ఓపికపట్టగల సమర్థుడు. ఉపకారం చేసిన వాడినయితే పదేపదే తలచుకుని మురిసిపోతుంటాడు... అదయ్యా రాముడంటే... అటువంటివాడు వాడు మాకు యువరాజుగా కావాలి.’’ అన్నారు ముక్తకంఠంతో.. అందుకే రాముడు మహాత్ముడయ్యాడు. ఇదీ భారతదేశ సాంస్కృతిక వైభవం. దానికి మనం వారసులం. ఉపకారికి ఉపకారం చేయడం సర్వసాధారణంగా లోకరీతిగా భావిస్తూ, అపకారం చేసిన వాడు కూడా తన తప్పు తెలుసుకుని మారడానికి వీలు కల్పించేవిధంగా పగబట్టకుండా, అతనికి మళ్ళీ అపకారం తలబెట్టకుండా అతనికి అవసరమయినప్పుడు ఉపకారం చేయాలని మన పెద్దలు మనకు చెబుతుంటారు. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
వారి మాట సలహా కాదు, శాసనం
గింజ రాతి మీద ఉంటే వర్షం పడ్డా మొలకెత్తదు. అది భూమిలో ఉంటే ఒక్క వానకే మొలకెత్తుతుంది. అలా అసలు మనిషికి ఉండాల్సిన ప్రథమ లక్షణం నేను అవతలి వాళ్ళు చెప్పిన మాట వింటాను, అది సహేతుకంగా ఉంటే, నాకు వృద్ధిని కల్పించేది అయితే తప్పకుండా పాటిస్తాననే గుణం ఉండాలి. కొందరి విషయంలో మాత్రం నీ బుద్ధితో విచారణ ఉండకూడదు. వారు నా మంచికి చెప్పారా, చెప్పలేదా అని నీ జీవితం మొత్తం మీద ఆలోచించాల్సిన అవసరం లేని వాళ్ళు ముగ్గురున్నారు. వారు ఎప్పుడు ఏం చెప్పినా నీ అభ్యున్నతి కోరి చెబుతారు తప్ప నిన్ను పాడుచేయడానికి వారి ప్రాణం పోయినా చెప్పరు. ఎవరా ముగ్గురు? తల్లి, తండ్రి, గురువు. అందుకే వాళ్ళ మాట శాసనమే తప్ప సలహా కాదు. దానిని చెవి ఒగ్గి వినగలగాలి. అలా వినని వాడిని ఉద్ధరించడం ఎవరికీ సాధ్యం కాదు. శ్రీరామాయణంలో రావణాసురుడికి మొదట మారీచుడు చెప్పాడు..‘‘సులభాః పురుషా రాజన్ సతతం ప్రియవాదినః అప్రియస్య తు పథ్యస్య, వక్తా శ్రోతా చ దుర్లభః’’–అని. ఈ లోకంలో ఎవడు ఎలా పోతే మనకేం. ఏవో నాలుగు మాటలు పొగిడేస్తే గొడవ వదిలిపోతుంది. మనకేం కాదు. మనతో స్నేహంగానే ఉంటాడు. అయినా మనం చెబితే మాత్రం వాడు వింటాడా...వద్దు చెప్పొద్దు. వాడు ఎలా పాడయిపోతే మనకెందుకు, పొగిడేస్తే సరి... అని మాట్లాడేవాళ్లు ఈ లోకంలో కోటాను కోట్లమంది ఉంటారు రావణా ! నువ్వు తప్పు చేస్తున్నా సరే, చాలా మంచి మార్గం.. అలాగే ఉండండి... అని చెప్పేవాళ్ళు దొరుకుతారు. నీ అభ్యున్నతిని కోరి మాట కఠినంగా అనిపించినా నీ క్షేమం కోసం మాట్లాడేవాడు దొరకనే దొరకడు. ఒకవేళ దొరికినా వినేవాడు ఉండడు. మారీచుడు అంత చెప్పినా వినలేదు, తోడబుట్టినవాడు కుంభకర్ణుడు చెప్పాడు, విభీషణుడు, సుగ్రీవుడు, తల్లి కైకసి, మంత్రులు చెప్పారు. సీతమ్మ తల్లి చెప్పింది –‘‘మాట విను. నీ వారియందు మనసు పెట్టుకో. ధర్మమయి పోతుంది. పరకాంతలందు మనసు ఉంచకు. పట్టి కుదిపేస్తుంది.’ అని చెప్పింది ... వినలేదు.. చివరకు యుద్ధభూమిలో నిట్టనిలువునా ఏ రథం కూడా లేకుండా నిలబడిపోయిన రావణుడిని చూసి–‘‘పో.. అంతఃపురానికి .. రేపు రా’ అన్నాడు రామచంద్ర మూర్తి. ఆ ఒక్కసారయినా మనసు మార్చుకుని మళ్ళీ తన తప్పు తాను తెలుసుకుని మంచి మాటలు గుర్తు చేసుకుని ఉండి ఉంటే... ఎలా ఉండేదో.. కానీ రావణుడు వినలేదు. ‘‘నా దగ్గరకొచ్చి ‘రామా! నేను నీవాడను’అని పడిపతే రక్షిస్తాను’’ అన్నాడు రాముడు. ‘నేనెన్నటికీ వినను’ అన్నందుకు పర్యవసానం ఏమయిందో తెలుసు కదా!. చివరకు పది తలలు తెగిపడిపోయాయి. కట్టుకున్న భార్య మండోదరి వచ్చి ‘‘ఓరి పిచ్చివాడా ! నిన్ను రామచంద్రమూర్తి సంహరించాడని లోకం అనుకుంటున్నది. కానీ నిన్ను సంహరించినవాడు రామచంద్రమూర్తి కాదు... నీ ఇంద్రియ లౌల్యం. మాట వినని తనమే నిన్ను నిలువునా చంపేసింది’’ అన్నది. నిజంగా మన మంచిని కోరి పరుషంగా ఉన్నా... అంత ధైర్యంగా చెప్పగలిగిన వాడు దొరికితే... వాడి ఆర్తిని అర్థం చేసుకుని వినగలిగినవాడు దొరికితే అది లోకకళ్యాణమే. కృష్ణుడు చెప్పాడు–అర్జునుడు విన్నాడు–భగవద్గీత లోకానికి అందింది. పరీక్షిత్తు అడిగాడు–శుకుడు చెప్పాడు–భాగవతం లోకానికి పనికొచ్చింది. యుద్ధభూమిలో అగస్త్యుడు చెప్పాడు– రాముడు విన్నాడు–ఆదిత్య హృదయం సకల భక్తజనావళిని ఆదుకుంటున్నది. ఇవన్నీ ఎప్పుడు.. అసలు వినేవాడు ఒకడుంటే కదూ..!!! బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
పట్టు దొరకడానికే పద్యం
అబ్దుల్ కలాంగారు విద్యార్థులతో మాట్లాడుతూ –‘‘నువ్వు ఒక కళాకారుడివి కావాలా, శాస్త్రవేత్తవి కావాలా, ఆధ్యాత్మికవేత్తవి కావాలా, ఆదర్శ రైతువి కావాలా... నీ ఇష్టం... నువ్వే నిర్ణయించుకో’–అంటారు. విద్యార్థులు ఒకటి గుర్తు పెట్టుకోవాలి. ఈ దేశ చరిత్రలో మీ పేరుమీద ఒక పేజీ చేరాలంటే.. మీకు జీవితం, కాలం విలువ తెలిసి ఉండాలి. చాలా మంది ఏదో ఒక బలహీనతకు ఆకర్షితులై వశపడిపోతారు. దాన్ని తట్టుకుని నిలబడి నిగ్రహంతో చదువుకోవడం విద్యార్థి దశలోనే ఎక్కువ సాధ్యపడుతుంది. ఆ తరువాత కాలంలో చదువుకుందామన్నా ఆ అవకాశం ఇంత సులభసాధ్యంగా మాత్రం ఉండదు. అన్నివేళలా కనిపెట్టుకుని ఉండే తల్లి, నీ అవసరాలు తీర్చే తండ్రి, ఇంటిపట్టున నీ చదువు సాఫీగా సాగేలా ఎన్నో సర్దుబాట్లు, నీ అభ్యున్నతిని కోరి నీకు నిత్యం అందుబాటులో ఉండే నీ గురువులు...ఇంత అనుకూలమైన స్థితి జీవితంలో మళ్ళీ రాదు. దీన్ని ఎవడు బాగా సద్వినియోగం చేసుకుంటాడో వాడు బాగా వృద్ధిలోకి వస్తాడు. అందుకే వాంఙ్మయాన్ని ఛందోబద్ధం చేసారు. దేనిని ఎక్కువకాలం జ్ఞాపకం ఉంచుకోనవసరం లేదో దానిని వచనంగా చెబుతారు. ఏది జీవితాంతం జ్ఞాపకంలో ఉండాలో దానిని ఛందస్సులో రాస్తారు. మత్తేభం, శార్దూలం, కందం, సీసం... ఇలా రాసిన పద్యాలు ధారణాయోగ్యాలయి ఉంటాయి. అవి చదివితే అలా గుర్తుండిపోతాయి. అందుకూ ఛందస్సున్నది. నీకు జీవితంలో ఒడిదుడుకులు వచ్చినప్పుడు ఆ విద్య నీకు అక్కరకు వస్తుంది... అంతేతప్ప పుస్తకం గూట్లో ఉండి బుర్రలో లేకపోతే సమస్యలను తట్టుకోగలిగిన నైతిక మార్గదర్శనం, శక్తి నీకు ఉండదు. అందుకే అంది వచ్చిన కాలాన్ని వదులుకోకూడదు. దక్షిణ భారత దేశంలో ప్రఖ్యాతి వహించిన అరబిందో ఒకానొకనాడు అండమాన్ కారాగారంలో ఉన్నారు. శరీరాన్ని పూర్తిగా చాపుకుని పడుకోవడానికి కూడా చాలని గది. మంచినీళ్లు కావాలంటే... చువ్వల్లోంచి చేతులు పూర్తిగా చాపితే అందీ అందని చోట ఒక కుండ, ఒక గ్లాస్...పొరబాటున చేతినుంచి గ్లాస్ జారి పడిపోతే..ఇక ఆరోజుకు అంతే..కారాగారాన్ని శుభ్రపరిచే వ్యక్తి రోజుకు ఒకసారి అటువైపు వస్తాడు. కుండతో నీళ్ళు పెట్టి, అన్నం కంచం లోనికి తోసేసి వెళ్ళిపోతాడు. చాలామంది ఆ పరిస్థితులను తట్టుకోలేక మరణించేవారు. అలా పోయినవారి శరీరాల్ని పట్టుకు వెళ్ళి పక్కనే ఉన్న సముద్రంలోకి విసిరేసేవారు.... అరబిందో అన్నీ చూస్తుండేవారు. కానీ ఆయన మాత్రం...కాలం ప్రశాంతంగా లభించిందని, ఆ నరకకూపంలో కూర్చునే భగవద్గీత అంతా చదివి–వ్యాఖ్యానాలు తయారు చేసి... విడుదలయిన తరువాత తన సిద్ధాంతాలతో ప్రపంచవ్యాప్తంగా గౌరవం పొందారు. జవహర్ లాల్ నెహ్రూ గారిని కారాగారంలో ఉంచితే ...కాలాన్ని వృథా చేసుకోకూడదని అద్భుతమైన గ్రంథాలు రాసారు. అప్పటివరకు సామాన్యులుగా ఉన్నవారు, మన కళ్ళెదుటే మహాత్ములుగా మారడాన్ని చూస్తుంటాం. వారు చెప్పేదీ వింటూంటాం. మనసుకు ఎక్కనప్పుడు, ఎక్కించుకోనప్పుడు విని ఏం ప్రయోజనం !!! ఇన్ని గంటలకు లేస్తాను, రేపు ఈ పని చేస్తాను..అనుకుంటావు...కానీ లేవవు, చేయవు. నీవు చేయవలసిన పని గురించి నీకే ప్రణాళిక లేకపోతే రేపు ఏ ఉన్నత ఉద్యోగం పొందగలవు, దేశానికి లేదా నీవు పనిచేసే సంస్థకు ఏ ప్రణాళికలు రచించగలవు ??? మహాత్ముల జీవితాలగురించి ఎంత చదివారని కాదు, ఎంత విన్నారని కాదు, ఎంతగా ప్రేరణ పొందారు, దాన్ని సఫలీకృతం చేసుకోవడానికి కాలాన్ని ఎంతగా సద్వినియోగం చేసుకున్నారన్న దాని మీదే మీ విద్యార్థుల బంగారు భవిత ఆధారపడి ఉంది. -
మనకు కోపమొస్తే... వాటికీ కోపమొస్తుంది
ఈ దేశానికున్న గొప్పతనం...ఇది శాంతికి ఆలవాలం. ప్రత్యేకంగా శాంతి మంత్రం చెప్తాం. అది కేవలం మనం శాంతిగా ఉండడం కోసం కాదు. భూమి, వాయువు, అగ్ని, అంతరిక్షం... అన్నీ ప్రశాంతంగా ఉండాలని ప్రార్థించడం. మనం ప్రశాంతంగా ఉన్నాం...సముద్రం ప్రశాంతంగా లేదు...ఎంత హడలిపోతాం మనం!!! అందుకే సర్వం ప్రశాంతంగా ఉండాలి. ఆ అవకాశం ఎప్పుడొస్తుంది? శాంతి మంత్రం చెబితే రాదు. దాని అర్థం తెలుసుకుని అనుష్ఠిస్తే వస్తుంది. అందరూ శాంతంగా ఉండగలిగిన ప్రజ్ఞ ఎప్పుడొస్తుంది ? మన వైపునుండీ ఆలోచించడంతోపాటూ, ఇతరులవైపునుండీ కూడా ఆలోచించడం చేతనయిననాడు వస్తుంది. శాంతిని కొని తెచ్చుకోవడానికి అది అంగడి సరుకు కాదు. ఆయన అలా ఎందుకన్నాడో, ఎందుకలా ప్రవర్తించాల్సి వచ్చిందో, ఆయన నన్నెందుకు ఇక్కడే ఉండమన్నారో, ఆయన నన్నెందుకు పిలవలేదో, నా కెందుకు ఇవ్వలేదో... ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది.. లేకపోతే ఆయన అలా చేయరు... ఇలా సానుకూలంగా అవతలి వారి వైపునుంచీ ఆలోచించడం అలవాటయిన నాడు ప్రశాంతత అదే వస్తుంది. శాంతంగా ఉన్నవాడు ఉపకారాన్నే ఆలోచిస్తాడు. అవతలివారిని ఎలా సంతోషపెట్టాలా అని ఆలోచించ గలగాలి.సత్వంలోంచి మంచి ఆలోచనలే వస్తాయి. వ్యగ్రత, బాధతో కూడుకున్న ఆలోచనల్లోంచి రాక్షస భావాలు వ్యక్తమవుతాయి. ఇతరులకు అపకారం చేసే లక్షణం వస్తుంది. ఎప్పుడయితే ఇతరులకు అపకారం చేసే ఆలోచనలు, గుణాలు పెరిగిపోతాయో పంచభూతాలలో(గాలి, నీరు, అగ్ని...) కూడా అంతే వ్యగ్రత పెరగడం ప్రారంభమవుతుంది. భాగవతంలో పోతనగారు...‘‘పరహితము చేయునెవ్వడు పరహితుండగును భూతపంచకమునకుం, పరహితమె పరమ ధర్మము, పరహితునకు ఎదురు లేదు పర్వేందుముఖీ!’’ అన్నారు. ఇతరులకు ఉపకారం చేయాలన్న, వారిని బాధపెట్టకూడదన్న, వాళ్ళజోలికి వెళ్ళకూడదన్న భావన, ఇతరులను కష్టపెట్టకూడదన్న ధోరణి, ఆ సంస్కారం లేనప్పుడు ఇతరుల కష్టానికి నేను కారణమవుతాను. అది మంచిది కాదు. ఒకవేళ నా ప్రమేయం లేకుండా అటువంటి కష్టం అవతలివారికి జరిగినప్పుడు వెంటనే పూజా మందిరంలోకి వెళ్ళి ‘‘ఈశ్వరా, నిస్సంకోచంగా పొరబాటు జరిగింది. నా వలన అది జరిగి వారి దుఃఖానికి కారణమయ్యాను. మన్నించు. ఇంకెప్పుడూ ఇటువంటి పొరబాట్లు చేయకుండా నన్ను నిగ్రహించు తండ్రీ’’ అని ప్రార్థన చేయడం నీ సంస్కారం, అవే ఔన్నత్యంగా ఉండి నిన్ను కాపాడతాయి. దేశంలో శాంతి నెలకొనాలని ఉపన్యాసాలు, ప్రబోధాలు, ప్రతిజ్ఞలు చేస్తే శాంతి రాదు. అవతలివారి వైపునుంచి ఆలోచించడం ప్రారంభమయిన క్షణంలో చల్లటి శాంతి పవనాలు వీచడం మొదలుపెడతాయి.. కుటుంబాల్లో నిత్యం చూసే గొడవలకు కారణం.. అవతలివారివైపు నుంచి ఆలోచించాలన్న స్పృహ లోపించడమే. కుటుంబసభ్యుల్లో ఒకరితో ప్రారంభమయిన అశాంతి ఎంతమంది అశాంతికి కారణమవుతుందో ఆలోచించండి. లొంగడంలో కీర్తి ఉంటుంది, శాంతి ఉంటుంది. అందుకే జీవితంలో శాంతికి, అందరి ప్రశాంతతకు ఉండాల్సిన ప్రధాన లక్షణం– సంస్కారం. దానికి హేతువు – వినయం. ఇవి ఉన్నప్పుడు మనకన్నా అధికులపట్ల, సమానుల పట్ల, మనకన్నా కిందివారి పట్ల ఎలా ప్రవర్తించాలో తెలుస్తుంది. అవతలివారి వైపునుంచి ఆలోచించి మనమెలా నడుచుకోవాలో తెలుస్తుంది. అది అర్థమయిన నాడు మనం, వాళ్ళు, సమాజం, దేశం, ప్రపంచం అంతా ప్రశాంతం..అందుకే ఈ దేశంలో ఏం చేసినా ఓం శాంతిః, శాంతిః, శాంతిః అని చెప్పుకుంటాం. -
వినయాన్ని నేర్చుకోవడానికి సిలబస్ ఉంటుందా!
విద్య - విలువలు గురువు తాను తెలుకున్న విషయాలను తన విద్యార్థులకు, తన శిష్యులకు అర్థమయ్యేటట్టు బోధించడానికి ఎంతో కిందకు దిగివచ్చి తేలికైన ఉపమానాలతో వివరిస్తాడు. అవతలివాడికి అర్థం కావాలని, వాడూ తనతో సమాన స్థాయికి ఎదగాలని ఏ విధమైన స్వార్థమూ లేకుండా బోధిస్తాడు. అలా చేయడం త్యాగం. అందుకే గురువు బోధనలను వర్షపుధారలతో పోలుస్తారు. ఈ విత్తనం మొలకెత్తాలి, ఇది మొలకెత్తకూడదన్న వివక్ష వర్షపుధారకు ఉండదు. అది అన్నింటిపైనా సమానంగా కురుస్తుంది. కొన్ని మొలకెత్తుతాయి, కొన్ని మొలకెత్తవు. రాతినేల మీద ఉన్న విత్తనం మొలకెత్తే అవకాశం ఉండదు. మట్టిలో ఉన్న విత్తనానికి తడి తగిలితే చాలు, మొలకెత్త్తేస్తుందంతే. అలాగే శిష్యుడిలో కూడా ఆర్ద్రత అనేది ఉండాలి. తడి తగలాలి. అంటే గురువుగారి నోటి వెంట వచ్చిన మాటలను ప్రయోజనాత్మకంగా మలచుకోగలిగిన శక్తి శిష్యుడిలో ఉండాలి. అది లేనప్పుడు రాతినేల మీది విత్తనంలాగా నిష్ప్రయోజనం అవుతుంది. ఇలా మొలకెత్తడానికీ, మొలకెత్తకపోవడానికీ మధ్యలో వచ్చిన సమస్య ఏమిటి? అని అంటే... వినయం లేకుండుట అని చెప్పాలి. ఎప్పుడు గురువుగారి దగ్గరకు వెళ్లినా, అది పాఠశాల, కళాశాల, వేదాధ్యయనం... ఏదైనా కావచ్చు. ఎక్కడైనా కావచ్చు. మొట్టమొదట జ్ఞాపకం చేసుకోవలసింది...‘గురువు ముందు నేను లఘువును’ అని. అంటే ‘ఆయన కంటే నేను చిన్నవాడిని, ఆయన అన్నీ తెలిసున్నవాడు, సర్వజ్ఞుడు, ఆయన మాట్లాడతాడు, నేను వింటాను’ అన్న స్పృహ. అంతే తప్ప గురువుగారి దగ్గరకు వెళ్లి తాను అవసరానికి మించి మాట్లాడటం గానీ, ఆయన విజ్ఞానం ఏ పాటిదని అర్థం వచ్చేటట్లుగా ఆయనను తేలిక చేస్తూ ప్రవర్తించడం గానీ ఎన్నడూ పనికిరాదు. గురువు ఎంత రాగద్వేషాలు లేకుండా, ఎంత పక్షపాత రహితుడై ఉంటాడంటే విజ్ఞానాన్ని అందించడంలో తరతమ భేదాలు పాటించడు. ద్రోణాచార్యులవారు గురుకులాన్ని నిర్వహిస్తున్న కాలంలో... ద్రోణాచార్యుడిని సంహరించగలిగిన కొడుకు కావాలని ద్రుపదుడు యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞ వాటికలోంచి పుట్టాడు ధృష్టద్యుమ్నుడు. ఆయనకు విలువిద్య నేర్పించవలసి వచ్చింది. గురువుగా తన స్థానానికి ఏ పక్షపాతం లేకుండా చూడడం కోసం తనని చంపడమే లక్ష్యంగా పెట్టుకుని శిష్యుడిగా వచ్చినవాడికి విద్యనంతటినీ ద్రోణాచార్యుడు బోధించాడు. తన సొంత కొడుకైన అశ్వత్థామకు కూడా నేర్పని బ్రహ్మాస్త్ర ప్రయోగాన్ని, ఉపసంహారాన్ని ఆయన అర్జునుడికి నేర్పించాడు. ఒకప్పుడు ప్రపంచం మొత్తంమీద విద్యాభ్యాసానికి ఆలవాలమైన భూమి ఒక్క భారతదేశం మాత్రమే. పతంజలి దగ్గర వ్యాకరణ భాష్యం నేర్చుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా విద్యార్థులు నర్మదా నదిని దాటి దక్షిణదేశానికొచ్చి ఆయన దగ్గర ఉండి ఆరోగ్య సూత్రాలు, బ్రహ్మసూత్రాలు నేర్చుకున్నారని పతంజలి చరిత్ర చదివితే తెలుస్తుంది. అలా చదువుకునేటప్పుడు ఎప్పుడూ కూడా మొట్టమొదటగా గురుశిష్యుల మధ్య ఉండాల్సినది వినీత-వినీయ సంబంధమే. గురువు దగ్గర మొదట వినయం నేర్చుకుంటాడు. వినయం నేర్చుకోవడానికి సిలబస్ అంటూ ఏదీ ఉండదు. పాఠ్యాంశాలుండవు. వినయంగా ఉండాలనుకుంటేనో, అహంకారంతో ఉండకూడదకుంటేనో వినయం రాదు. వినయం రావడానికి ఒకే ఒక్క కారణం ఉంటుంది. ఎన్ని తెలిసి ఉన్నవాడైనా ‘నాకు తెలిసినది ఏపాటి?’ అన్న మనస్తత్త్వం ఉన్నప్పుడు వాడంత వినయశీలి లోకంలో మరొకడుండడు. వాడు నిరంతర విద్యార్థి. నాకు తెలియనిది ఏముంది? అన్నాడనుకోండి. అంతే. ఇక పాత్రత ఉండదు. అహంకారం విస్తృతంగా పైకి లేచిపోతుంది. దాన్ని తొక్కేయడమే వినయానికి పాత్రత. ‘నాకు తెలిసినదేపాటి!’ అని మనస్సాక్షిగా ప్రకటించడం అంత తేలికైన విషయమేమీ కాదు. ‘నేను తప్ప రామాయణం మీద ఇంత బాగా ఎవరు ప్రవచనం చేయగలరు’ అన్నాననుకోండి! మరుక్షణంలో నాలో అహంకారం ప్రబలుతుంది. శ్రీరామాయణంలో ఒక శ్లోకంలోని ఒక పాదంలో ఉన్న ఒక పదానికి వ్యాఖ్యానం చేస్తూ, దర్శనం చేస్తూ తరించిపోయిన మహాపురుషులున్నారు. ‘శ్రీరామ’ అని మూడుసార్లు అనవలసిన అవసరమేముంది. ఒక్కసారి చాలు’ అని సిద్ధాంతీకరించినవారున్నారు. అలాంటి వారి ముందు నాకు తెలిసున్నదేపాటి. 24 వేల శ్లోకాలు నాకేం కంఠగతం కావు. ఎంత పెద్ద భారతం, తెలుగు, సంస్కృతాలలో ఎన్ని భారతాలు, ఎన్ని పద్యాలు, ఎన్ని వ్యాఖ్యానాలు, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, వాటికి భాష్యాలు, నాలుగు వేదాలు... ఇవన్నీ చదువుకోవడానికి నా జీవితకాలం ఎక్కడ సరిపోతుంది! నాకేం తెలుసని అహంకరించను! అన్నీ తెలిసినవాళ్లు మేం ఎంతటివాళ్లం అని నిలబడ్డారు. శంకరభగవత్పాదుల కన్నా జ్ఞాని ఎవరూ లేరు. అన్నీ తెలిసున్నా, ఆయన ‘ఈశ్వరా! నేను పశువును. నీవు పశుపతివి. చాలదా మనకు ఈ సంబంధం’ అన్నారు. అంతటి శంకరులే నాకేం తెలుసని అంటుంటే... ఏదో తెలిసున్న ఒక చిన్న విషయాన్ని పట్టుకుని, ఏదో సిలబస్ చదువుకుని, పేరు పక్కన మూడు నాలుగు అక్షరాలు వచ్చి చేరగానే నాకన్నా గొప్పవాళ్లు లేరనుకోవడం హాస్యాస్పదమౌతుంది. అందుకే ఎప్పుడూ స్మరించ వలసింది... ‘నాకు తెలిసినది ఎంత కనుక!’ - బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
పొగడ్తను మించిన మత్తు పదార్థం లేదు!
విద్య - విలువలు ఆవు ఎక్కడెక్కడో పచ్చిగడ్డి మేస్తుంది. ఎవరూ తాగడానికి పనికిరాని నీళ్లను తాగి అందరికీ పనికివచ్చే పాలను ఇస్తుంది. ఆ పాలను విడిచి పెట్టడానికి దానికి ఒక లక్షణం ఉంటుంది. పొదుగు దగ్గరకు దూడ వెళ్లి, దాని సిరములు నోటితో పట్టుకుని ముట్టెతో నాలుగు గుద్దులు గుద్దితే చాలు ఆవు పాలు విడిచిపెట్టేస్తుంది. ఒకసారి విడిచిపెట్టిన పాలను మళ్లీ వెనక్కి తీసుకోలేదు. అదే ఆవు అది త్వరత్వరగా తిన్న ఆహారాన్ని కడుపులోకి పంపి, తర్వాత తీరిగ్గా దానిని మళ్లీ ఉండలుండలుగా నోట్లోకి తెచ్చుకుని నెమరు వేసుకుని తిరిగి కడుపులోకి పంపగలదు. కానీ అలా పాలధారలను వెనక్కి తీసుకోలేదు. అలా వదిలి పెట్టినప్పుడే జాగ్రత్తగా పట్టుకోవాలి. దూడైనా, పాలు పితికే పశుపోషకుడైనా కచ్చితంగా పాలధారని అలా ఒడిసి పట్టుకోవాల్సిందే. ఏ మాత్రం స్థాన చలనమైనా పాలు నేలపాలైపోతాయి. గురువు కూడా ఇలాగే ఎంతో కష్టపడి జ్ఞానాన్ని సముపార్జిస్తాడు. ఏ విధమైన స్వార్థమూ లేకుండా గురువు జ్ఞానధారను వదలడం మొదలుపెడితే శిష్యుడు అంతే జాగ్రత్తగా చెవులను దొప్పలుగా చేసుకుని ఆ ధారలను ఒడిసి పట్టుకోవాలి. మీరందరూ విద్యార్థులు. మీకు సరస్వతీ కటాక్షం ఉండాలనీ, వాగ్దేవి కటాక్షం ఉండాలని మీ పెద్దలు, మీ గురువులు నిత్యం ప్రార్థిస్తుంటారు. వాగ్దేవి సరస్వతి స్వరూపమే. కానీ వాగ్దేవిలో ఉండే లక్షణం వేరు. వాగ్దేవి అంటే వాక్కుకు అధిష్ఠానమైన దేవి అని. దివ్ అనే ధాతువులోంచి వచ్చిన పదం దేవి. దివ్ అంటే కాంతి. కాంతి ఎక్కడుంటుందో అక్కడ చీకటి ఉండదు. తెలుసుకోవడం అనేది ఒక విశేషం. గతంలో ఎన్నో మంచి విశేషాలుంటాయి. వాటిని తెలుసుకోవడం ఎలా సాధ్యమౌతుందంటే - ప్రవాహం వలన సాధ్యమౌతుందని వేదం చెబుతున్నది. సరస్వతీ సూక్తం ప్రకారం సరస్వతి అంటే ప్రవహించునది. సరస్వతి అలా ప్రవహించకపోతే ఏమవుతుంది! అలా ప్రవహించకుండా ఎవరిలోనైనా ఉండిపోతే వాడు దుర్మార్గుడైపోతాడని శాస్త్ర వాక్కు. ఎవరికైనా ఒక విషయం తెలుసనుకోండి. దానిని ఇతరులకు చెప్పి తీరాలి. అది ప్రవాహం చేతనే సాధ్యమౌతుంది. కానీ అలా అతను చెప్పలేదనుకోండి. ఆయన మూగవాడా ? కాదే ! కానీ చెప్పడు. ఎందుకలా అంటే అది లోభకారకం కావాలి. అంటే ఆయన సంతోషించడానికి ఏదో ఉండాలక్కడ. ’’ఇది నేను ఇతరులకు చెప్తే నాకేం వస్తుంది?’’ అన్న ఆలోచన ఉంటుంది. అలా పుచ్చుకున్న దానిని బట్టి చెప్పడం ఉంటుంది తప్ప, నేను చెప్పడమే ప్రయోజనం అన్నట్లుండదు. అటువంటి వారిలో సరస్వతి-వాగ్దేవిగా మారిందని చెప్పడం సాధ్యం కాదు. అందుకే సరస్వతీ కటాక్షం గొప్పదా? వాగ్దేవి కటాక్షం గొప్పదా? అంటే శాస్త్రం వాగ్దేవి కటాక్షమే గొప్పదని చెప్పింది. వాక్ అన్నదానిని అగ్నిహోత్రంతో పోలుస్తారు. అగ్ని ఏ వస్తువునైనా కాల్చివేస్తుంది. వాక్కు అజ్ఞాన దాహంతో ఉంటుంది. ఎదుటివాడిలో ఉన్న అజ్ఞానాన్ని కాల్చగలిగినదేదో దానికే వాక్కు అని పేరు. ఏదో నోరుంది గదా అని చెప్పి అక్కరలేని మాటలను మాట్లాడేవాటిని వాక్కులని పిలవరు. భగవంతుడు నోరిచ్చాడు కాబట్టి అంతకంటే మరో ప్రయోజనం ఉంటుందని తెలియనివాడు అలా ప్రవర్తిస్తాడు. అవి అవతలివాడిని పాడు చేస్తాయంతే. అందుకే వాక్కులో ఎప్పుడూ రెండు లక్షణాలుంటాయి. వాక్కుని సక్రమంగా వినియోగించకపోతే ఆ వాక్కు మత్తు కల్పిస్తుంది. నేను నిష్కారణంగా మిమ్మల్ని పొగిడాననుకోండి. పొగడ్తను మించిన మత్తు లోకంలో మరొకటి లేదు. ఏదైనా ఒక మత్తు పానీయాన్ని ఎవరైనా స్వీకరిస్తే దాని తాలూకు ప్రభావం వారి శరీరంలో కొద్దిసేపు మాత్రమే ఉంటుంది. కానీ విశేషమైన పొగడ్త జీవితాంతం జ్ఞాపకం ఉండి పాడుచేయడానికి పనికొస్తుంది. అంటే వాక్కులు హితకరం కావాలి. అవతలివాడి అభ్యున్నతికి పనికి వచ్చేవై ఉండాలి తప్ప కేవలం అవతలివాడిని పొగడడానికి మాత్రమే పనికివచ్చేటట్లుగా వాక్కు ఎప్పుడూ ఉండకూడదు. వాక్కులు హితకరం కావాలంటే... సంస్కారముండాలి. మనమిలా మాట్లాడితే అవతలివాడికి హితం కలుగుతుందా లేదా అని ఆలోచించి ఎప్పుడు ఎక్కడ అవతలివాడికి హితం కల్పించాలో అటువంటి మాట మాట్లాడాలంటే వారిలో సంస్కార బలం ఉండాలి. సంస్కార బలమంటే కేవలం చదువుకుని ఉండడం కాదు. అవతలివాడి అభ్యున్నతిని ఆపేక్షించగలిగినవాడై ఉండాలి. ‘‘నా వాక్కుతో అవతలివాడికి ఉపయోగం కలగాలి. వాడికి మంచి జరగాలి’’ అని లోపల ఎవరిలో త్యాగబుద్ధి ఉంటుందో అటువంటివారు మాత్రమే హితకరమైన వాక్కు పలకగలరు. అవతలివాడు హితకరమైన వాక్కు పలికినా ఇవతలివాడికి అది ఎప్పుడు హితమౌతుంది... అంటే వినయం కలిగినవాడైతేనే అది సాధ్యపడుతుంది. ఈరోజుల్లో మనం గురువు, శిష్యుడు, అధ్యాపకుడు, విద్యార్థి, ఉపాధ్యాయుడు... ఇటువంటి మాట వాడుతున్నాం గానీ, ఒకానొకప్పుడు ఈ దేశంలో కులవిద్య ఉన్న రోజుల్లో గురువు-శిష్యుడు అన్న పదబంధం కన్నా ముందు వాడబడిన పదాలు వినీతుడు, వినీయుడు. గురువు చెప్పిన మాటలను సరిగా అర్థం చేసుకున్నవాడు మాత్రమే విద్యార్థి కాగలిగిన అర్హత ఉన్నవాడు. గురువు అంటే బరువు అని అర్థం. దానికి వ్యతిరేక పదం- లఘువు. అంటే చిన్నది అని. అంటే గురువు స్పర్శ, గురువు స్మరణంతో పాటూ ‘‘ఆయన నాకు హితకరుడు, ఆయన మాట నాలోని అజ్ఞానాన్ని దహింప చేస్తుంది. ఆయన మాటలను నేను ఒడిసి పట్టుకోవాలి’’ అన్న పద్ధతిలో శిష్యుడి ఆలోచన సాగాలి. గురువు మాట్లాడడం మొదలుపెట్టిన తరువాత చెవులను దొప్పలుగా చేసుకుని జ్ఞానధారలను లోనికి పుచ్చేసుకోగలగాలి. - బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
ఉన్నది ఉన్నట్లు చెప్పగల ధైర్యం మీకుందా?
విద్య - విలువలు మీలో ఇంజనీరింగ్ విద్యార్థులు కూడా తగిన సంఖ్యలో ఉన్నారు కాబట్టి మేధావి, రాజనీతిజ్ఞుడు, మైసూర్ సంస్థానంలో దివాన్‌గా పనిచేసిన ఒక ప్రముఖ ఇంజనీర్ పేరు మీ అందరికీ కూడా పరిచితమే అని భావిస్తాను. ఆయన సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య. సెప్టెంబర్ 15 ఆయన జన్మదినం కావడంతో ఆయన నుంచి స్ఫూర్తి పొందడానికి ప్రతిఏటా మనదేశంలో ఆ రోజు ‘ఇంజనీర్స్ డే’గా జరుపుకుంటున్నాం. వారిది కర్ణాటకలో స్థిరపడిన తెలుగు కుటుంబం. బ్రిటీష్ ఇండియా ఆయనను నైట్ కమాండర్‌గా సత్కరిస్తే భారత ప్రభుత్వం ఆయనను అత్యున్నత పురస్కారం భారతరత్నతో సత్కరించింది. మోక్షగుండం విశ్వేశ్వరయ్యగారి జీవితం గురించి చదువుతుంటే ఆశ్చర్యపోతాం. ఒకసారి కేంద్ర కేబినెట్ మంత్రి ఆయనను ఫలానా టైమ్‌లో కలవడానికి అపాయింట్మెంట్ తీసుకున్నారు. కానీ ఇచ్చిన టైందాటి పోయినా కలవలేదు. తర్వాత తీరుబడిగా కలవడానికి వచ్చారు. విశ్వేశ్వరయ్యగారు టైం ఇవ్వలేదు. తర్వాత ఫోన్లో ఆయన అదేమిటి నేను కేంద్ర ప్రభుత్వంలో మంత్రిని, కాస్త టైం అటూ ఇటూ అవుతుంటుంది... అని ఏదో చెప్పబోయారు. దానికి విశ్వేశ్వరయ్య గారు..‘‘మీరు ఏదైనా కావచ్చు. నేను టైం ఇచ్చినప్పుడు ఆ టైంకు రావాలి. మీరు తర్వాత వచ్చేటప్పటికి నేను మరొకరితో చర్చిస్తుంటాను. అప్పుడు ఆ చర్చలకు భంగం కలగవచ్చు. క్రమశిక్షణ లేని మీ వంటి వ్యక్తి వచ్చి నాతో మాట్లాడటం కుదరని పని’’ అనడంతో మంత్రిగారు బిత్తరపోయారు. గాంధీగారు గ్రామసీమల అభ్యున్నతికోసం సేద్యపునీటి ప్రాజెక్ట్‌లకు సంబంధించి కొన్ని పథకాలు సిద్ధం చేశారు. వాటిని గురించి తెలుసుకోవడానికి సేద్యపు రంగంలో అప్పటికే బహుముఖ ప్రజ్ఞ ప్రదర్శించిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఆయన వద్దకు వెళ్లారు. అన్నీ కూలంకషంగా విన్న తరువాత ఇవి దేశాభివృద్ధికి పనికి రావని విశ్వేశ్వరయ్య చెప్పారు. దానికి గాంధీగారు మాట్లాడుతూ, ‘‘నేను చాలా గ్రామసీమలు తిరిగాను. అనుభవజ్ఞుడను’’ అని అన్నారు. దానికి మోక్షగుండం అన్నారు కదా, ‘‘నేను మీకన్నా పెద్దవాడిని వయసులో, సబ్జెక్ట్ పరంగా కూడా మీకన్నా నాకు ఎక్కువ తెలుసు. దేశాభివృద్ధికి ఇవి అసలు పనికిరావు’’ అంటూ ఎందుకు పనికిరావో చాలా విస్పష్టంగా చెబుతూ, ‘‘నేను అంగీకరించను. అది అసలు కుదరదు’’ అని ఎక్కడా రాజీపడకుండా తేల్చి చెప్పారు. అది శాస్త్రమైనప్పుడు, పెద్దలు చెప్పిన మాటయినప్పుడు, ఋషి ప్రోక్తమయినప్పుడు, అది పాడు చెయ్యదనుకున్నప్పుడు ఉన్నదాన్ని ఉన్నట్టు చెప్పగల ధైర్యం మీకుండాలి. ఒకప్పుడు కొందరు పిల్లలు రాష్ర్టపతి భవన్‌కు వెళ్లారు. వీరందరూ శారీరక, మానసిక వికలాంగులు. వీరిని మొగల్ సరాయ్ గార్డెన్స్‌లో కూర్చోబెట్టారు. కాసేపటికి అబ్దుల్ కలాం గారొచ్చారు. పిల్లలు... అయినా ఏం మాట్లాడాలో తోచక వారిని ఉత్సాహపరచడానికి ఆయన అంతకుముందెప్పుడో రాసుకున్న ఒక కవిత చదివి వినిపించారు. ‘‘బలవంతుడైన కొడుకును గురించీ తల్లీదండ్రీ ఆలోచించరు. బలహీనుడైన వారిని గూర్చే ఎక్కువగా ఆలోచిస్తారు. అందుకే భగవంతుడు కూడా మిమ్మల్ని గూర్చే ఎక్కువ ఆలోచిస్తాడు. బెంగపెట్టుకోకండి’’ అనేది ఆ కవితకు అర్థం. అయితే అదేదో ఓదార్పు మాటలా, తామేదో కష్టంలో ఉన్నట్లు, ఓదారుస్తున్నట్లు అనిపించింది ఇరాన్ నుంచి వచ్చిన ఒక పిల్లవాడికి. వాడికి మోకాళ్ల వరకు కాళ్లు లేవు. పర్షియన్ భాషలో ఒక చిన్న కాగితం మీద రాసి వాడు దేకుతూ వెళ్లి కలాంగారికి ఆ కాగితం ఇచ్చాడు. ఆయన చదివాడు. ‘‘నాకు మోకాళ్ల వరకు రెండు కాళ్లు లేవు. దానికి నేను ఏమీ బాధపడడం లేదు. కానీ నా జీవితంలో నేను ఎవరి ముందు మోకరిల్లవలసిన అవసరం లేదని గర్వపడుతున్నాను’’ అని ఉంది. అంతే కలాం ఒక్కసారి నిర్ఘాంతపోయాడు. ‘‘ఏం ధైర్యం! ఇంత ధైర్యం ఎలా వచ్చింది’’ అని ఆయన ఆశ్చర్యపోయాడు. అదీ నీకున్న ధైర్యంతో నీవు నిలబడగలగడం అంటే. మీకా ధైర్యం లేకపోతే అర్థం లేదు. ఒక్కటే ఒక్క పరీక్ష. మీరెప్పుడూ జ్ఞాపకం పెట్టుకోండి. మీకు ఎప్పుడు ఏ ఆలోచన మీ మనసులోకొచ్చినా... ఒక పొయ్యిలో కట్టె పెట్టి పొడిస్తే నిప్పురవ్వ రేగినట్లు వెంటనే అనేక ఆలోచనలు లేస్తాయి. ఒక్కో ఆలోచన రాగానే ఒక్కో భావన మనలో నుంచి పైకి లేస్తుంది. ముందుగా మాట్లాడేది పిరికితనం. ‘‘దీనివల్ల నాకు ప్రమాదం రాదు కదా’’ అంటుంది. రెండవది మనలో ఉండే లోభం. ‘‘దీనివల్ల నాకేమైనా కలిసి వస్తుందా?’’ అని అడుగుతుంది. లోపల ఉండే కీర్తికండూతి లేస్తుంది. ‘‘ఈ పనిచేస్తే నాకేమైనా పేరు ప్రతిష్ఠలు వస్తాయా’’ అంటుంది. మీ అంతరాత్మ ఒక్కటే ఎప్పుడూ ఒక్కటే అడుగుతుంది...‘‘ఇది చెయ్యవచ్చా?’’ అని అడుగుతుంది. మీ అంతరాత్మ ప్రబోధాన్ని అనుసరించండి. ‘ఇలా చెయ్యడం సబబేనా’ అని అడిగే అంతరాత్మ ప్రబోధాన్ని అనుమతించడం నేర్చుకోండి. దాని పీక నొక్కవద్దు. అది చెయ్యవచ్చో చెయ్యకూడదో తేల్చుకోవడానికి మీరు ఆదర్శంగా తీసుకున్న వ్యక్తిని ఉదాహరణగా తీసుకోండి. అలా తీసుకుని మీరు చెయ్యవలసినదొక్కటే. మీ రోల్‌మోడల్ తృప్తి కొరకు బతకండి. మీ రోల్‌మోడల్‌గా ఎవరిని తీసుకోవాలో నిర్ణయించుకోండి. రామకృష్ణ పరమహంస, వివేకానందుడు, అబ్దుల్ కలాం, మోక్షగుండం విశ్వేశ్వరయ్య... అలా ఎవరినైనా ఒకరిని ఎంచుకోండి. వారిని గుండెల్లో దాచుకోండి. అనుక్షణం వారిని అనుసరించండి. - బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
చదువు.. సంస్కారం...శీలవైభవం
విద్య - విలువలు తెల్లవారి లేస్తే పేపర్లలో, టీవీ ఛానళ్లలో రక్తపుముద్దలను భయంకరంగా విపులీకరించి చూపడం, పైగా దానిని స్లోమోషన్లో అనేక పర్యాయాలు చూపించడం. ఎక్కడో ఎవడో ఉన్మాదంగా ప్రవర్తిస్తే దాన్నే పదేపదే చూపించడం... అరే. పిల్లలుంటారు, వాళ్ళకూ మనసులనేవి ఉంటాయి, లేతగా ఉంటాయి, వాటిపై ప్రభావం ఉంటుంది, అది గంట ఉండొచ్చు, కొన్ని రోజులుండొచ్చు, కొన్ని జీవితపర్యంతం ఉండొచ్చు, వారేమైపోతారని ఆలోచించగలిగినవాడు లేడు. ఆరోగ్యవంతమైన భయం... దీన్ని గురించి చెప్పేవాడే లేడు. ఈ పరిస్థితుల్లో సంస్కారం అనే మాట మీ జీవితాల్లోకి ఎలా ప్రవేశించగలుగుతుంది. అసలు చేరే అవకాశమే ఉండదు. లేనప్పుడు ఎటువంటి పనైనా సరే, ఎంత చెయ్యగూడని పనైనా సరే, చెయ్యడానికి సిద్ధపడిపోతున్నారు. పైగా దీనికంతటికీ ఏం చెబుతున్నారంటే.. నిర్భయత్వం. ఏ భయం లేకుండా ఉండాలని. అసలు మనిషికి భయమనేది ఉండకూడదని. ఏం చెయ్యడానికైనా తెగింపు ఉండాలని అంటున్నారు. తెంపరితనానికి, తెగింపుకు మారుపేరు ఉల్లంఘనం.. గీతదాటడం. మీరు మంచిమాటలు విడిచిపెట్టి ప్రవర్తించడమే ఉల్లంఘనం. నేను చట్టానికి లోబడి ఉండాలనే భయం ఒక పౌరుడికి ఉండాలి. ఉంటే.. సంస్కారం ఉంటుంది. అవతలివాడికి ప్రయోజనం లేని మాట నేను మాట్లాడకూడదనే భయం వక్తకు ఉండాలి. అప్పుడే అతని మాట సమాజానికి పనికి వస్తుంది. ఐశ్వర్యవంతుడికి నా సంపద నలుగురికీ ఉపయోగపడాలనే తాత్విక చింతన, కర్తవ్య నిష్ఠతో కూడిన సామాజిక భయం ఉండాలి. అప్పుడు వాడి ద్రవ్యానికి ఒక విలువ ఉంటుంది. ఏ భయం లేని చోట ఎవరికి విలువ ఉంటుందో చెప్పండి. నీకు నీవు బరువైపోతావు. సమాజానికి బరువైపోతావు. చదువుకోవడం చాలా గొప్ప విషయం, చాలా గొప్పగా చదువుకుంటున్నారు. కానీ ఆ పక్కన చేరవలసిన సంస్కారం చేరడం లేదు. దానికి కారణం పిల్లలు మాత్రం కాదు, కారణం చదువులో ఉంది. చదువుతో పాటూ దాని పక్కన ఇది చేరాలి. ఇది లేని నాడు, ఎంత చదువుకున్నా అది శోభించదు. అది మీకు ఉపయుక్తం కాదు. అది గుబాళించాలి. అది క్షీర వైభవంగా ప్రకాశించాలి. అంటే నీకు ఎప్పుడూ ఆరోగ్యవంతమైన భయం ఉండాలి. అది లేకపోతే మీరు పాడయిపోతారని చెప్పేవాడు లేకపోవడం సమాజ దురదృష్టం. చంద్రశేఖరేంద్రసరస్వతీ స్వామివారు కంచికామకోఠి పీఠాధిపత్యాన్ని స్వీకరించిన తొలిరోజుల్లో ఒక రోజున ఆయన మధ్యాహ్నం భిక్ష(భోజనం) చేస్తూ ‘ఈ పదార్థం బాగుంది, ఏమిటిద’ని అడిగారట. ‘‘అది తోటకూరపప్పు’’ అని వంటవాడు చెప్పాడు. ‘‘ఓ చాలా బాగుంది’’ అన్నారట. మరునాడు భిక్షలో కూడా అది కనిపించింది. ఆయన బాగుంది’’ అన్నారట. అలా రోజూ కనిపిస్తున్నది. ఐదవరోజున వంటవాడిని పిలిచి రోజూ ఎందుకుచేస్తున్నావని అడిగారు. దానికి వంటమనిషి ‘ఈ మఠానికి మీ శిష్యులు చాలా మంది వస్తారు. వారితో చెప్పాను. మీకిష్టమని వారు ఇక్కడికి వచ్చేటప్పుడు కట్టలుకట్టలతోటకూర ఆకుకూర పట్టుకొస్తున్నారు. అందుకని రోజూ చేస్తున్నా’ అని చెప్పాడు. ఆయన విని ఊరుకున్నారట. మరునాడు భిక్షసమయానికి విస్తరి ముందు కూర్చోకుండా గోశాలలోకి వెళ్లి, అక్కడినుంచి ఆవుపేడ తీసి నాలుకకు రాసుకున్నారట. ఆ పక్కరోజున కూడా ఇలాగే చేస్తుంటే మఠం మేనేజర్ చూసి పరుగు పరుగున వచ్చి ‘‘అయ్యా! మీరేం చేస్తున్నారు’’అని అడిగాడు. దానికి స్వామి వారు...‘‘నేను ప్రపంచానికి మార్గదర్శకం చేయవలసిన పీఠాధిపతిని. సత్యదండం ధరించి, కాషాయం ధరించి వెడుతుంటే సాక్షాత్ శంకరాచార్యులవారు వస్తున్నారు’ అని అంటారు. ఏ ఊరువెళ్ళినా ఈ వార్త వెడుతుంది. శంకరాచార్యులవారికి తోటకూర పప్పు ఇష్టమని కొన్నాళ్ళు తెస్తారు. ఎండాకాలం వస్తుంది. ఎక్కడినుంచో కష్టపడి తెస్తారు. ఆ తరువాత ఈ శంకరాచార్యుల వారికి తోటకూర తేవడానికి ఛస్తున్నాం’ అంటారు. పదిమందికి మంచి గురించి, నిగ్రహం గురించి చెప్పవలసిన వాడిని, భోజనం విషయంలో నాలుక నిగ్రహం చేసుకోలేని నేను ఈ నాలుకతో దేశానికి ఏం మంచిమాట చెప్పగలను. వంటవాడిది కాదు తప్పు, రుచికి లొంగిన నాది. అందుకే రుచికి లొంగడం మానితే తప్ప మంచిమాట చెప్పడం కుదరదని నాలుకను గోమయంతో శుభ్రం చేసుకుంటున్నాను. శుద్ధి తర్వాత మళ్ళీ పదార్థాలు తీసుకుంటాను’’ అని చెప్పి మూడు రోజుల తర్వాత ఆయన ఆహారం తీసుకున్నారు. అదీ శీలవైభవం. అదీ ఆరోగ్యవంతమైన భయం అంటే. - బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
రెండవ విలువ.. విశ్వసనీయత
విద్య - విలువలు సైంటిఫిక్ డెవలపెప్మెంట్ని మీరు ఆపలేరు. టెలివిజన్ ఉంది. ఇప్పుడు వందల ఛానెళ్లు ఉన్నాయి. మిమ్మల్ని ఉదేకపరచేవి, మీ జీవితాన్ని తప్పుతోవ పట్టించేవి ఎన్నో ఉన్నాయి. మీ సెల్ ఫోన్‌కు మిమ్మల్ని తప్పుతోవ పట్టించే మెసేజీలెన్నో వస్తాయి. పుస్తకాలు, మేగజైన్లలో రంగురంగుల బొమ్మలతో చెడువైపు మిమ్మల్ని ఆకర్షించేవెన్నో ఉన్నాయి. ఇవన్నీ మీరు ఆపగలరా? ఇది విమర్శకాదు. మీకు యథార్థం తెలియజెప్పడం. మీ మేనమామగా, పినతండ్రిగా చెప్తున్నా. మీ భద్రత కోరి చెప్తున్నా. వీటి నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి మార్గం ఒక్కటే. స్వీయ నియంత్రణ, సెల్ఫ్ రిస్ట్రెయింట్. టెలివిజన్, సెల్‌ఫోన్, పత్రిక, పుస్తకాలలో మంచి అందించేవీ ఉంటాయి. రామకోటి రాస్తూ హత్యలు చేసేవారు ఉంటారు. రామాయణం రాసి తరించిన వాల్మీకీ ఉన్నాడు. తప్పు రామనామానిదా? అది అర్థం కాని వెర్రితనంలో ఉన్నవాళ్లదా? సెల్ఫ్ రిస్ట్రెయింట్ లేనప్పుడు మీ చేతికి ఏది ఇచ్చినా నాశనమైపోవడమన్నది సహజం. ఇప్పుడు సమాజంలో వచ్చిన ప్రమాదకరమైన పోకడ ఏమిటంటే అందించే వాళ్లకు కూడా సెల్ఫ్ రిస్ట్రెయింట్ లేకపోవడం. ఒకప్పుడు మనం ఇటువంటివి అందించకూడదు, సమాజాన్ని ఇంతలా పాడుచేయకూడదు అన్న బాధ్యత పెద్ద వాళ్లలో ఉండేది. ఇవాళ రోడ్డు మీదికి వెళ్లి చూడండి. భయంకరమైన వాల్ పోస్టర్లు. అవి చూస్తూ ఒక చేత్తో ఫోన్ పట్టుకొని మాట్లాడుతూ ఒక చేత్తో డ్రైవింగ్ చేస్తున్నారు. అట్లా చేయకూడదు. చేస్తే మనల్ని చూసి పిల్లలు ఇదే నేర్చుకుంటారు అన్న జ్ఞానం ఆ పెద్దమనిషికి లేకపోతే ఎట్లా? ఇప్పుడు ఏ ఛానల్ ఏం ప్రసారం చేయాలి? ఏ పత్రిక ఎలా వార్త రిపోర్ట చేయాలి అన్న నియంత్రణ ప్రభుత్వానికి లేదు. ఒకవేళ నియంత్రిస్తే అది స్వేచ్ఛకు భంగకరం. ఎమోషన్ వాళ్ల వ్యాపారానికి ప్రధానాంశం. ఏది తక్కువ సమయంలో ఎక్కువమంది దృష్టిని ఆకర్షించగలదో అది వాళ్లకి గొప్ప అడ్వర్టయిజ్మెంట్. మీ మాటల్లో క్లారిటీ ఆఫ్ థాట్ లేకపోతే ఆ మాటలకు ఏమీ విలువ ఉండదు. మీ జీవితానికి విలువుండదు. మీరు ఏమి మాట్లాడుతున్నా, మీరు ఏది చేస్తున్నా మీరు చేసే పనిలో క్లారిటీ ఉండాలి. యస్ నేనిది ఇందుకు చేస్తున్నా. నేనిది ఇందుకు చదువుకుంటున్నా అని చెప్పగలగాలి. నేనిది చేస్తా అని నమ్మకం ఉండాలి. నేనిది సాధిస్తా అన్న విశ్వాసం ఉండాలి. అందుకని మీ ఎమోషన్ని ఎవరినీ దోపిడీ చేయనీయకండి. మీరు సెల్ఫ్ రిస్ట్రెయింట్ అలవాటు చేసుకుంటే తప్ప చుట్టూ ఉన్న ఇంతమంది శత్రువులతో పోరాడలేరు. ఇప్పుడు ఎమోషన్‌కు లొంగిపోయి తర్వాత పశ్చాత్తాప పడడం వల్ల లాభం లేదు. అందువల్ల ఆ ఎమోషన్ని నియంత్రణలో ఉంచుకోవడం నేర్చుకోండి. అదే నా దృష్టిలో విద్యయొక్క నిజమైన విలువ. కారు చాలా వేగంగా పోగలదు. కాని దానికి బ్రేకుల్లేవంటే మనం ఆ కారు ఎక్కుతామా? కారుకు వేగం ఎంత ముఖ్యమో, ఆగడం అంత ముఖ్యం. లేకపోతే యాక్సిడెంట్ తప్పదు. ఈ బ్రేకే సెల్ఫ్ రిస్ట్రెయింట్. అన్నింటినీ చూసి, అన్నింటినీ తెలుసుకోగలగడం స్పీడ్. మీరు మీ బలహీనతను తెలుకోవడం గొప్పదనం. దాన్ని తెలుసుకొని ఎలా అధిగమించాలో కూడా తెలుకోవాలి. విద్య అన్నదానికి యథార్థమైన విలువ ఇది. అప్పుడు మీ ప్రవర్తన గొప్పదవుతుంది. విద్యకు తక్షణ ఫలితం ప్రవర్తనే. ఎంత చదివాడన్నదానికంటే ఎటువంటి ప్రవర్తనను కలిగి ఉన్నాడన్నది ముఖ్యం. కనీసంలో కనీసం సంతృప్తికరంగా ఉండాలి. మీరు ఎంత డిస్టింక్షన్లో పాసవ్వండి. మీకు గోల్డ్ మెడల్ ఉండనీ, మీ కాలేజీ పిన్సిపాల్ మీకిచ్చే కాండక్ట్ సర్టిఫికెట్లో మోస్ట్ అన్ డిపెండబుల్ అన్ శాటిస్ ఫ్యాక్టరీ. మిస్చువస్ అని రాసి సంతకం పెట్టి ఇచ్చాడు అనుకోండి. ఎంత గొప్ప చదువు చదివినా ఎవ్వరూ ఉద్యోగం ఇవ్వరు. మీ రేప్పొద్దున ఉద్యోగానికి వెళ్లినా మీ ఇమిడియెట్ బాస్ దగ్గర ట్రస్ట్ట్వర్థీనెసేనా అని అడుగుతారు. ఈ ట్రస్ట్వర్థీనెస్ అనేది ఎవరికి వారు తనంత తాను అభివృద్ధి చేసుకోవాలి. ఇక్కడ ఇరవై వేలు వస్తున్నాయి. ఇరవై అయిదు వేలు ఎక్కడ వస్తాయని వెదుక్కుంటూ ఉన్నవాడు బాటసారి లాంటివాడు. అలా ఉండకూడదు. మనిషన్న వాడు ఎంతలో ఉన్నా అంతలో నిలబడాలి. ఆ సంస్థకి కీర్తి తేవాలి. మీ ఈ ట్రస్ట్ వర్థీనెస్ అన్నదాన్ని బాగా డెవలప్ చేసుకోండి జీవితంలో. ఒక్క మాట మీ మాట్లాడితే అందరూ శద్ధగా వినాలి. మీరు ఎక్కడ ఉన్నా అందరూ మీ పేరు చెప్పుకొని సంతోషించాలి. అదీ ట్రస్ట్ వర్థినెస్ అంటే, వాడు నాకొడుకని తండ్రి, మా అబ్బాయేనని తల్లీ, మా ఆయనే అని భార్య, మానాన్నగారని కొడుకు, మా స్టూడెంట్ అని కాలేజీ, మా ఊళ్లో ఉంటారని ఊరు, మా దేశంలో ఉంటారని దేశం సంతోషించాలి. దీనికంతటికి మూలం ఎక్కడుందో తెలుసా? ఎంత పెద్ద రావి చెట్టయినా? చిన్న విత్తనంలో దాని వ్యూహం అంతా ఉన్న్టది. ఇదంతా ట్రస్ట్ వర్థీనెస్ డెవలప్ చేసుకోవడంలో ఉంటుంది. ట్రస్ట్ వర్థీనెస్ ఎక్కడుంటుందో తెలుసా. క్లారిటీ ఇన్ థాట్‌లో ఉంది. ది వాల్యూ ఇన్ ది ఎడ్యుకేషన్ ఈజ్ రిజెల్టెడ్ ఓన్లీ ఇన్ ది క్లారిటీ థాట్. వెయ్యిమందిలో 999 మంది సొల్లు మాట్లాడవచ్చు ఒక్కడుంటాడు. ఒకటే మాట మాట్లాడతాడు. కానీ ఎంత స్పష్టత ఉంటుందో. కంచి పరమాచార్య ఉండేవారు. వారి దగ్గరికి వెళ్లి మీరేదయినా పశ్న వేస్తే వెంటనే జవాబు చెప్పేవారు కాదు. ఓ రెండు మూడు నిమిషాలు కళ్ళు మూసుకుని ఆలోచించి జవాబు చెప్పేవారు. ఆయన ఒకసారి స్కూలు పిల్లలతో ఇరవై నిమిషాలపాటు మాట్లాడిన అనుగ్రహభాషణం 36 భాషల్లోకి తర్జుమా అయ్యింది. ఎందుకు తర్జుమా అయ్యింది... ఒక్కటే కారణం. క్లారిటీ ఇన్ థాట్. ఆలోచనలో స్పష్టత. ఎమోషనల్‌గా మాట్లాడటం అందరూ చేస్తారు. చాలామంది మాటలకు మూల సిద్ధాంతాలే ఉండవు. అందుకనే వాళ్లు మాట్లాడిన మాటలను చివరకు వాళ్లే ఖండించుకుంటారు. ఆలోచనలో స్పష్టతలేనిది ఎంత చదివి ఏం లాభం? మన దరిద్రమేమిటంటే నాయకులు కూడా వాళ్లకిష్టమైన వారినే పాఠ్య పుస్తకంలో వేస్తారు. లాల్ బహదూర్ శాస్త్రిగారి పేరు ఇవాళ చాలామందికి తెలియదు. సర్దార్ పటేల్ జీవిత చరిత్ర చదివిన వాళ్లు ఎంతమంది ఉన్నారీవాళ? రాజారామ్మోహనాయ్, లాలాలజపతి రాయ్, మహాత్మాగాంధీ లాంటి వారి జీవిత చరిత్ర ఇవ్వాళ ఎంతమంది చదివారు. మీ పర్సనాలిటీ డెవలప్మెంట్కు మీ చదువుతున్న చదువు ఒక్కటే కాంట్రిబ్యూట్ చేయదు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి. అన్నింటికన్నా జీవితంలో క్యారెక్టర్ మౌల్డింగ్ చాలా అవసరం. హైపర్ సెన్సిటివ్ అన్నది మనకు అంతర్గత శత్రువన్నది గుర్తించాలి. మన ధోరణి మనదే కానీ, అవతలి వాళ్లు ఏమి ఆలోచిస్తున్నారన్నది ఆలోచించని వాడు ఎంత పెద్ద పొజిషన్‌కి వెళితే అంత ప్రమాదకరం. మనిషి ఎదుగుదలకు హేతువు ఎదుటివాడు ఏమి చెప్నాడన్నది వినడం. ముందు వినాలి. క్లారిటీ ఆఫ్ థాట్ నేర్చుకోవాలి. ఎదుటి వారి గురించి అధ్యయనం చేయడం నేర్చుకోవాలి. అలా నేర్చుకోవడమే వాల్యూ ఆఫ్ ఎడ్యుకేషన్. - బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు