మేరీ క్యూరీ
భగవంతుడు మనకు మాట ఇచ్చాడు, బుద్ది ఇచ్చాడు, ఇంత గొప్ప శరీరాన్ని ఇచ్చాడు... అన్న విశ్వాసం మనకు ఉండాలి. నేను ఏదో సాధించాలన్న ఉద్దేశంతోనే నాకు ఇవి బహూకరించాడు... ఎన్ని ప్రతిబంధకాలు ఎదురయినా సరే... నేను అనుకున్నది సాధించితీరతాను... అన్న పట్టుదల ఉంటే ఎంతటి నిరాశానిస్పృహలు ఎదురయినా సరే... సునాయాసంగా వాటిని దాటి... లక్ష్యాలను సాధించవచ్చు... అనడానికి – ఆత్మహత్య ఆలోచనలను వెనక్కి తీసుకుని, కష్టాలతోనే కడుపు నింపుకుని, ఒకటి కాదు, రెండు నోబెల్ బహుమతులు గెలుచుకున్న ధీర వనిత మేరీ క్యూరీ గొప్ప ఉదాహరణ.
మేరీ అసలు పేరు మరియా. 1867 నవంబరు 7న జన్మించారు. పోలండ్ దేశస్థురాలు. తల్లిదండ్రులు టీచర్లు. 11వ ఏట తల్లి మరణించింది. పోలండ్ లోని రాజకీయ అనిశ్చితి వాతావరణంలో తండ్రి ఉద్యోగం పోయింది. అక్కడినుంచి కష్టాలను ఈదుకుంటూ పారిస్ చేరుకుంది. ఆ రోజుల్లో సై¯Œ ్స చదవడానికి స్త్రీలు ముందుకు రాకుండా సంప్రదాయవాదులనుండి అనేక అవరోధాలుండేవి. ఆమెకు సైన్సంటే మక్కువ, పరిశోధనలంటే ప్రాణం. ఇంటిపట్టునే ఉన్నవనరులతోనే ప్రయోగశాల పెట్టుకుంది. ప్రొఫెసర్ హెన్నీ బెకెరెల్ సాయంతో పరిశోధనలు చేసేది. ఇంచుమించు తనలాగే అనేక కష్టాలను ఓర్చుకుంటూ పరిశోధనలు సాగిస్తున్న పీరే క్యూరీతో పరిచయం, సాహచర్యం తరువాత పెళ్ళికి దారితీసాయి. అయినా కష్టాలు తీరకపోగా కలిసి అనుభవించడం అలవాటు చేసుకున్నారు.
భయంకరమైన కాన్సర్ వ్యాథి చికిత్సకు తోడ్పడగల కారకాల కోసం పరిశోధనలు ముమ్మరంగా సాగుతుండేవి. రేడియోయాక్టివిటీ సిద్ధాంత అభివృద్ధికి, దాని తాలూకు పరిశోధనలకు ఆమె గురువుకి, భర్తకి, ఆమెకు కలిపి నోబెల్ బహుమతి లభించింది. ఆ తరువాత ఒక చిన్న రోడ్డు ప్రమాదంలో ఆమె భర్త మరణించారు. తరువాత కాలంలో పొలోనియం, రేడియం మూల పదార్థాల అన్వేషణకు ఈసారి రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి ఆమెను వరించింది. ఒక స్త్రీకి రెండుసార్లు, అదీ రెండు వేర్వేరు సబ్జెక్ట్ లలో నోబెల్ రావడం విశేషం, అపూర్వం.
ఆమె సాధించిన ఫలితాలకు ఆమె కానీ, ఆమె భర్త కానీ పేటెంట్ తీసుకుని ఉంటే.... వారి వారసులు ఇప్పటి లెక్కల ప్రకారం ప్రపంచంలో అత్యంత సంపన్నులుగా ఉండేవారు. కానీ ఆమె నిజ జీవిత సిద్ధాంతం ఏమిటో తెలుసా... ‘‘అవి (ఖనిజాలు) ప్రకృతి ఇచ్చిన వరం. అది ప్రజలది. వాటి మీద నాకేం హక్కు ఉందని పేటెంట్ తీసుకోవాలి. అందరి మేలుకోసం వాటిని నేను ఉపయోగించగలగడం నాకు జీవితంలో దక్కిన అదృష్టం... అందుకే వాటికోసం తాపత్రయపడలేదు.
నిజానికి దంపతులిద్దరికీ అవార్డులు, రివార్డుల మీద ధ్యాస ఉండేది కాదు... నిరంతరం పరిశోధనలే... అవికూడా ఇంటిపట్టున ఏర్పాటు చేసుకున్న అరాకొరా సౌకర్యాలతో... సరైన రక్షణ చర్యలు లేకపోవడంతో ... ధార్మిక ప్రభావానికి ఆమె శరీరం గురయింది... చివరకు ఆమెకు కూడా కాన్సర్ సోకి, మరణానికి దారితీసింది... ఆమె పారిస్(ఫ్రా¯Œ ్స దేశం)లో స్థిరపడినా, మాతృదేశం పట్ల ఆమెకు ఎంత గాఢమైన ప్రేమంటే... తాను కనుగొన్న పదార్థాలలో ఒకదానికి తన దేశం పేరు ధ్వనించేలా పొలోనియం అని పేరుపెట్టింది. చివరకు తన మరణానంతరం ఖననానికి ముందు.. శవపేటిక తెరచి.. జన్మభూమి పోలండ్ నుంచి తెచ్చిన మట్టి చల్లాలని కోరింది. మానవాళి శ్రేయస్సుకు తపించడం తప్ప ఆమె సర్వసుఖాలను, సంపదలను దూరంగా పెట్టింది.. చివరకు కీర్తికాంక్షను కూడా.
బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు
Comments
Please login to add a commentAdd a comment