మంచి మాట: ఆధ్యాత్మికత అంటే..? | Spirituality is the experience of what we believe | Sakshi
Sakshi News home page

మంచి మాట: ఆధ్యాత్మికత అంటే..?

Published Mon, Jun 13 2022 12:19 AM | Last Updated on Mon, Jun 13 2022 12:19 AM

Spirituality is the experience of what we believe - Sakshi

‘దేవుణ్ణి మీరు చూశారా..?’ అని ప్రశ్నించాడో యువకుడు ఒక సాధకుణ్ణి. చురుకైన కళ్ళు.. తీక్షణమైన చూపులు. గిరజాల జుట్టు.. దానిలో కొన్ని వంకీలు అతని విశాల ఫాలభాగాన నర్తిస్తుండగా. ‘ఆ“చూసాను’. అన్నాడాయన చిరునవ్వుతో. ‘చూశారా..!?’ అన్నాడా యువకుడు తన అనుమానానికి అపనమ్మకాన్ని జోడిస్తూ. ‘చూశాను. నిన్ను చూస్తున్నంత స్పష్టంగా’ అన్నాడాయన మరింత ప్రశాంతంగా నవ్వుతూ.

ఆ మాటలకు ఆ యువకుడు విభ్రాంతుడే అయ్యాడు. ఆ సాధకుడి గొంతులో ధ్వనించిన విశ్వాసం.. నమ్మకం.. సూటిదనం.. అతణ్ణి ఒక నిమిషంపాటు ఆపాదమస్తకాన్ని కంపింప చేసింది. ఇంతకుముందు తను కలసిన సాధకుకులు.. యోగులు.. గురువులు... అందరూ కూడా దేవుణ్ణి చూడలేదనే చెప్పారు. ఆ దేవదేవుని సాక్షాత్కారానికి తపస్సు చేస్తూనే ఉన్నామన్నారు.

    ఒకవేళ ఒకరిద్దరు చూశామని చెప్పినా ఇంత గట్టిగా.. విశ్వాసంతో చెప్పలేదు. ఇందుకే ఆ వంగ దేశీయుడికి ఆ పరమహంస మీద గురి.. ఏర్పడింది. అందుకే ఆయనను గురువుగా అంగీకరించాడు. ఆ పై ఆ గురుశిష్యులిరువురూ ఎంత విశ్వవిఖ్యాతులయ్యారో లోకవిదితమే.

      దేవుణ్ణి చూశామన్న వారెవరైనా ఆయన భావనను, తత్వాన్ని పూర్తిగా ఆకళింపు చేసుకున్నారని అర్థం. దేవుడి సర్వాంతర్యామిత్వ భావనను గ్రంథాలనుండి గ్రహించటమే కాదు, దాన్ని అనుభూతిలోకి తెచ్చుకోవటం. ఈ సకల చరాచరసృష్టిలో ప్రతి జీవిలో చూడగలగటం. ప్రత్యక్షంగా చూసి అనుభవంగా చేసుకోవటమే కదా!

ఆ పరమహంస.. నిన్ను చూసినంత బాగా చూశాను’ అని చెప్పటంలో అదే అర్థం. ‘ఇందు గలడందు లేడని సందేహం వలదు..’ అన్న పద్య సారాంశ మదే  కదా. తన ఎదురుగా తను ఆరాధిస్తున్న విగ్రహమే దేముడు.. అయన ఉనికి ఇక్కడే.. ఈ నాలుగు గోడల మధ్యే అన్న ఆలోచనా పరిధి.. పరిమితులనుండి నుండి మనిషి బయటకు రానంతకాలం.. రాకూడదనుకున్నంత కాలం ఆ సర్వాంతర్యామిత్వాన్ని బుద్ధికే పరిమితం చేసుకున్నాడు. అంతే కానీ మనస్సులో ఆ భావనను ప్రతిష్టించుకోలేకపోయాడు. నిజమైన ఆధ్యాత్మికమార్గానికిది పెద్ద అవరోధం. భావన.. అనుభూతి.. దృష్టి ఈ మూడింటిని ఆధ్యాత్మికపథంలో పయనించాలనుకున్న వారు తప్పనిసరిగా అలవరచుకోవలసిన లక్షణాలు.

అనేక శాస్త్రాలు.. కావ్యాలు.. వేదాంత గ్రంథాలు చదివిన ఓ పండితుడు గంగానదిలో స్నానమాచరించి తన పాప ప్రక్షాళన చేసుకోవాలన్న తన జీవితేచ్ఛను జీవిత చరమాంకంలో కాని తీర్చుకోలేకపోయాడు. ‘ఈ గంగానదికి పాపాలను పరిహరించే మహత్తు నిజంగా వుందా..? అన్న అనుమానం మదిలో మొలకె త్తింది. తత్ఫలితంగా సద్గతులు కొంచెం ఆలస్యంగా ప్రాప్తించాయి. కారణం..!? భావన, అనుభూతి. అయితే ఈ పండితుడి పలుకుల మీద విశ్వాసముంచి మామూలు నదిలో స్నానం చేసిన సాధారణ వ్యక్తి ఆ పండితుడికన్నా ముందుగా సద్గతులు పొందాడు.

ఆధ్యాత్మిక మార్గంలో పయనించాలనుకునేవారికి ఉండవలసిన ప్రథమ లక్షణం భావన.. అనుభూతి.. విశ్వాసం. మన భౌతికావసరాలు, బాధ్యతలు నెరవేర్చటం కోసం ఏదో ఒక వృత్తినో .. ఉద్యోగాన్నో.. పొంది డబ్బు సంపాదించాలి. భార్యను, పిల్లల్ని, తల్లిదండ్రుల్ని పోషించాలి. ఇది ప్రధాన బాధ్యత. ఇది కాని జీవితం ఇంకేమైనా ఉందా? ఇదే జీవిత పరమార్థమా? మనిషి ఈ చింతన చేయటానికి తన అంతరంగంలోకి చూడగలగాలి.

తన మనస్సును న్యాయాధీశుని చేసుకుని తను చేసే పనుల మంచి చెడులను ప్రశ్నించుకోవాలి. ఆలోచనలను, ప్రవర్తనను సింహావలోకనం చేసుకోవాలి. తను ఎంతవరకు నిజాయితీగా.. న్యాయబద్ధతతో.. ప్రవర్తిస్తున్నాడు? నియమబద్ధమైన జీవితాన్ని గడుపుతున్నాడా..? ఎదుటివారికి చేయగలిగిన మేలు చేస్తున్నానని కీడు చేయటంలేదు కదా..! ఇటువంటి ప్రశ్నలు తానే తన మీద సంధించుకోవాలి. వీటికి సంతృప్తికరమైన సమాధానాలు ఎవరు పొందగలరో వారు నిస్సందేహంగా చక్కని, ఆదర్శవంతమైన జీవితాన్నే గడుపుతున్నట్టే.

ఈ పరిశీలన.. శోధనకే అంతర్ముఖత్వమని పేరు. ఆధ్యాత్మికతకు ఇదొక ముఖ్యమైన లక్షణమే కాదు కాదు, ఖచ్చితంగా ఉండవలసినది. ఇది ఆస్తికులకైనా, నాస్తికులకైనా.. ఆ మాట కొస్తే మనిషన్న వాడికెవడికైనా వర్తిస్తుంది. ఏ మత విశ్వాసానికైనా అన్వయించుకోతగ్గది, అందరికీ అభిలషణీయమైనదీ మార్గం. ఈ అంతరంగ యానం.. లోచూపు ఎవరైతే అలవరచుకుంటారో వారు జీవితాన్ని సరిగా అర్థం చేసుకున్నారని చెప్పవచ్చు. సరైన రీతిలో మలచుకుంటున్నారని అర్థం.

ధనం వల్ల ఇహంలో మనం పొందే భౌతికమైన, ఉన్నతస్థితి కాక.. ఇంకా ఎంతో ఉన్నతమైన స్థితికి చేరినట్టు. కొందరు భౌతికపరమైన విషయాలను పక్కకు పెట్టి బాహ్య ప్రపంచానికి దూరంగా ఉండి అంతర్ముఖులు కాబోతున్నామని ప్రకటనలు చేస్తారు. కానీ ఆ ప్రయత్నం చేయనే చేయరు. మన మనస్సు తీరు.. గతి.. ఆలోచనా పద్ధతి.. మన వ్యక్తిత్వాన్ని ఒక అంచనా వేసుకుని మన జీవితాన్ని, మన ఆలోచనా ప్రవాహన్ని క్రమబద్దీ కరించుకునేందుకు మన మనస్సు చెప్పే సంగతులు తెలుసుకోవాలి. సరిగా లేకుంటే దిద్దుకోవాలి. ఇందుకు అంతర్ముఖత్వం ప్రతి ఒక్కరికీ అవసరం.

మానవ మేధ, శక్తియుక్తులకు పరిధులు, పరిమితులున్నాయని, ఆ మానవాతీత శక్తి భగవంతుడని సర్వశక్తిమంతుడని. సర్వవ్యాపకుడని, అతడివల్లే ఇంతటి సృష్టి జరిగిందని భావించే వారున్నారు. వారు అతడినే కేంద్ర బిందువు చేసుకుని తమ అంతర్ముఖ ప్రయాణపు తొలి.. ఆఖరి అడుగు అతడితోనే ముగిస్తారు. కొందరు ప్రకృతి పరిణామక్రమంలో ఏర్పడ్డదీ సృష్టి అంటూ ఒక మానవాతీత శక్తి వుందని అంటారు. కానీ దాన్ని భగవంతుడుగా భావన చేయరు. వీరిరువురూ కూడ అంతర్ముఖత్వానికి పెద్దపీట వేస్తారు. మనిషి మహాత్ముడు కాకపోయినా మనిషి గా నిలబడటానికి ఇది అవసరమని ఇద్దరూ ఏకీభవిస్తారు. జీవితం అర్థవంతమైనదవ్వాలంటే ఇది అత్యంత అవసరమైనదని ఇద్దరూ అంగీకరిస్తారు.

ఈ ఆధ్యాత్మిక చింతన లేదా అంతర్ముఖత్వం ఒక సత్యాన్వేషణ. ఒక సత్యశోధన. మనలోని చైతన్యాన్ని తెలుసుకోవటం. జీవితాన్ని అర్థం చేసుకుని, దాని పట్ల ఉన్న భయాందోళనలు తొలగి నిర్భయులమై స్వేచ్ఛానందాలను పొందాలంటే ప్రతి ఒక్కరూ అంతర్ముఖులు కావాలి.

ఆధ్యాత్మిక చింతనంటే కేవలం భక్తి ఒక్కటే కాదు. దానికి భావన..అనుభూతి.. విశ్వాసం.. వీటిని చేర్చాలి. ఆధ్యాత్మికత అంటే పెదవులతో దేవుడి నామాన్ని పలకటమే కాదు. భగవంతుడి రూపాన్ని అన్నిచోట్లా.. అందరిలోనూ చూడగలగటం. మన ఆణువణువునా ఆ భావనను పొందుపరచుకోవటం. అపుడే మనం ఆయన సర్వాంతర్యామిత్వాన్ని  విశ్వసించినట్టు! ఆధ్యాత్మికత అంటే మనం నమ్మిన దాన్ని అనుభూతిలోకి తెచ్చుకోవటం. ఈ దశకు చేరు కోవటమంటే నిజంగా ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేస్తున్నట్టే. ఆధ్యాత్మికత తొలి మెట్టు ఇదే కావాలి.

భగవంతుని తత్వాన్ని మనసులో నిలుపుకుని తోటివారితో ఎవరైతే చక్కగా సంభాషిస్తారో... అభాగ్యుల.. అనాథల మీద కరుణ, ప్రేమ చూపిస్తారో.. కష్టాలలో ఉన్నవారిని ఆదుకుంటున్నారన్న విషయాలకు ఎవరు ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారో వారు నిజమైన ఆధ్యాత్మికపరులు.

– బొడ్డపాటి చంద్రశేఖర్, ఆంగ్లోపన్యాసకులు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement