గుర్తించాలే కానీ దేవుడు అనేక రూపాల్లో ఉంటాడు. వాటిలో కనిపించనివే కాదు, కనిపించేవీ ఉంటాయి. ఎక్కడో ఉన్నాడనుకునే దేవుడు... మన చేతికందే దూరంలో ఒక మొక్కలోనూ, కొమ్మలోనూ, ఆ కొమ్మకు పూసిన పువ్వులోనూ కూడా ఉన్నాడని గ్రహించడమే లౌకిక, పారలౌకిక సమన్వయంతో కూడిన ఆధ్యాత్మిక ప్రస్థానంలో తొలి ఎరుక. దైవం మానుషరూపేణ అంటారు. అలాగే, దైవం ప్రకృతి రూపేణ కూడా!
రామకృష్ణ పరమహంస ఓసారి ఆకాశంలో రెక్కలు విప్పుకుంటూ ఎగిరే పక్షిని చూసి సమాధిలోకి వెళ్లిపోయారట. చెట్టును, పిట్టను, పువ్వును, పసిపాప నవ్వును, పారే ఏటినీ, ఎగిరే తేటినీ చూసి తన్మయులైతే చాలు; ఆ రోజుకి మీ పూజ అయిపోయిందని ఒక మహనీయుడు సెలవిస్తాడు. షడ్రసోపేతంగా వండిన తన వంటకాలను తృప్తిగా ఆరగిస్తే ఇల్లాలు ఎంత ఆనందిస్తుందో, తన వ్యక్తరూపమైన ప్రకృతిని చూసి పరవశిస్తే దేవుడు అంతే ఆనందిస్తాడని ఆయన అంటాడు.
నది ఒడ్డున నిలబడి దాని పుట్టుకను, గమనాన్ని, పోను పోను అది చెందే వైశాల్యాన్ని, అది ప్రవహించిన పొడవునా దానితో అల్లుకున్న మన జీవనబంధాన్ని స్మరించుకున్నా అది పుణ్య స్నానంతో సమానమేనని ఒక కథకుడు రాస్తాడు. కృష్ణశాస్త్రి గారు పల్లవించినట్టు అడుగడుగునా, అందరిలోనే కాదు; ప్రకృతిలో అన్నింటిలోనూ గుడి ఉంది.
అనాది నుంచీ నేటివరకూ మనిషి ఊహలో, భావనలో మనిషీ, దేవుడూ, ప్రకృతీ పడుగూ పేకల్లా అల్లుకునే వ్యక్తమయ్యారు. ఋగ్వేద కవి చూపులో ప్రకృతి పట్ల వలపు, మెరుపు ఎంతో ముగ్ధంగా, సరళంగా, సహజసుందరంగా జాలువారుతాయి. ‘‘వెలుగులు విరజిమ్మే ఓ ఆకాశపుత్రీ, సకల సంపదలకూ నెలవైన ఉషాదేవీ! వస్తూ వస్తూ మాకు ధనరూపంలోని ఉషస్సును వెంట బెట్టుకుని రా’’ అని ఒక ఋక్కు అంటుంది.
ఋగ్వేద కవి చింతనలో అగ్ని ధూమధ్వజుడు; సూర్యకాంతితో తళతళా మెరుస్తూ ధ్వనిచేసే సముద్రపు అలల్లా వ్యాపిస్తాడు. ‘‘తమసానదీ జలాలు మంచివాడి మనసులా స్వచ్ఛంగా ఉన్నా’’యని వాల్మీకి వర్ణిస్తాడు. సుగ్రీవుడితో అగ్ని సాక్షిగా స్నేహం చేసిన రాముడు, ‘‘వర్షాకాలంలో మంచి పొలంలో వేసిన పంట ఫలించినట్టు నీకార్యాన్ని సఫలం చేస్తా’’నంటాడు. ఆ మాటలకు సుగ్రీవుడు, ‘‘నదీవేగంలా హఠాత్తుగా ఉరవడించిన కన్నీటివేగాన్ని ధైర్యంతో నిలవరించుకున్నా’’డని రామాయణ కవి అంటాడు.
ఏ కాలంలోనూ మనిషీ, ఋషీ, కవీ ప్రకృతి పొత్తిళ్లలో పసివాడిగానే ఉన్నాడు తప్ప ప్రకృతికి దూరం కాలేదు. ఇతిహాస కావ్య ప్రబంధాలలో ప్రకృతి వర్ణనలు తప్పనిసరి భాగాలు. శారద రాత్రుల్లో ఉజ్వల తారకలు, కొత్త కలువ గంధాన్ని మోసుకొచ్చే సమీరాలూ, కర్పూరపు పొడిలా చంద్రుడు వెదజల్లే వెన్నెల వెలుగులూ, చెంగలువ కేదారాలూ, మావులూ క్రోవులూ పెనవేసుకున్న అడవులూ, పక్షులు బారులు కట్టి ఇంటిముఖం పట్టే సూర్యాస్తమయ దృశ్యాలూ, తలను రెక్కల్లో పొదవుకుని పంటకాలువల దగ్గర నిద్రించే బాతువుల సన్నివేశాలూ... ఇలా కవి ఊహల రస్తాకెక్కని ప్రకృతి విశేషం ఏదీ ఉండదు.
పత్రం పుష్పం ఫలం తోయం రూపంలో ప్రకృతి భాగం కాని పూజా ఉండదు. వినాయకుని పూజలో ఉపయోగించే మాచీ,బృహతి, బిల్వం, ధత్తూరం, బదరి, తులసి, మామిడి, కరవీరం, దేవదారు, మరువకం లాంటి ఇరవయ్యొక్క పత్రాల పేర్లే చెవులకు హాయిగొలిపి ఆకుపచ్చని చలవపందిరి వేసి మనసును సేదదీర్చుతాయి. అమ్మవారి స్తుతుల నిండా పూవులూ, వనాలూ పరచుకుంటాయి. చంపకాలు, సౌగంధికాలు, అశోకాలు, పున్నాగాలతో అమ్మ ప్రకాశించిపోతుంది. కదంబ పూలగుత్తిని చెవికి అలంకరించుకుంటుంది. చాంపేయ, పాటలీ కుసుమాలు తనకు మరింత ప్రియమైనవి. శిరసున చంద్రకళను ధరిస్తుంది.
ప్రకృతి వెంటే పర్యావరణమూ గుర్తురావలసిందే. పర్యావరణ స్పృహ ఇప్పుడే మేలుకొంద నుకుంటాం కానీ, ప్రకృతిలో భాగంగా మనిషి పుడుతూనే పెంచుకున్న స్పృహ అది. రావణ సంహారం తర్వాత రాముడు అయోధ్యకు వెడుతూ, వానరులు ఎక్కడుంటే అక్కడ చెట్లు సమృద్ధిగా ఉండాలనీ; అవి అన్ని కాలాల్లోనూ విరగ కాయాలనీ; నదుల్లో నీరు నిత్యం ప్రవహిస్తూ ఉండాలనీ ఇంద్రుని వరం కోరాడు.
పాండవులు ద్వైతవనంలో ఉన్నప్పుడు ఆ అడవిలోని చిన్న జంతువులు ధర్మరాజుకు కలలో కనిపించి, ‘‘మీరు రోజూ మమ్మల్ని వేటాడి చంపడంవల్ల మా సంఖ్య తగ్గిపోయింది, బీజప్రాయంగా మిగిలాం, మేము పూర్తిగా నశించేలోగా దయచేసి మరో చోటికి వెళ్లం’’డని ప్రార్థించాయి. విశ్వనాథవారు తన ‘వేయిపడగలు’ నవలలో పర్యావరణానికి ప్రతీకగా పసరిక అనే పాత్రనే సృష్టించారు. ఆధునిక వేషభాషల వ్యామోహంలో పడీ, జీవ వైవిధ్యాన్ని దెబ్బతీసే వ్యవసాయ పద్ధతుల వల్ల పర్యావరణ విధ్వంసం ఏ స్థాయిన జరుగుతోందో ఆ పాత్ర ద్వారా గంట కొట్టి చెప్పారు.
పూర్వకాలపు రాజులు అడవిని, అటవీ జనాన్ని, సంపదను పర్యావరణ భద్రతకు తోడ్పడే స్వతంత్ర అస్తిత్వాలుగా చూశారు తప్ప, తమ రాజ్యంలో భాగం అనుకోలేదు. ఇప్పుడా వివేచన అంతరించి అడవులు రాజ్యానికి పొడిగింపుగా మారి బహుముఖ ధ్వంసరచనకు లక్ష్యాలయ్యాయి. ప్రకృతికి పండుగకు ఉన్న ముడి తెగిపోయి ప్రతి పండుగా పర్యావరణంపై పిడికిటిపోటుగా మారడం చూస్తున్నాం. ప్రకృతిని మనం రక్షిస్తే ప్రకృతి మనల్ని రక్షిస్తుందన్న సంగతిని గుర్తు చేసుకోడానికి నేటి వినాయకచవితి కన్నా గొప్ప సందర్భం ఏముంటుంది!
ప్రకృత్యైనమః
Published Mon, Sep 18 2023 12:21 AM | Last Updated on Mon, Sep 18 2023 4:42 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment