
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ఖైరతాబాద్ గణేషుడికి సీఎం రేవంత్‌రెడ్డి తొలిపూజ నిర్వహించనున్నారు. 70 అడుగుల ఎత్తులో సప్తముఖ మహాశక్తి రూపంలో మహాగణపతి దర్శనమిస్తున్నారు.
👉ఖైరతాబాద్ గణేశుడిని సీఎం రేవంత్‌రెడ్డి దర్శించుకున్నారు. సప్తముఖ వినాయకుడి వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రికి.. స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ స్వాగతం పలికారు. అనంతరం రేవంత్‌రెడ్డి.. మహాగణపతికి గజమాల, పండ్లు సమర్పించారు. వినాయకుడి తొలిపూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్.. రాష్ట్రంలోని అన్ని గణేష్ ఉత్సవ కమిటీలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.
తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ.. శనివారం మధ్యాహ్నం ఖైరతాబాద్ గణపతిని దర్శించుకున్నారు. ఈ సందర్బంగా గవర్నర్‌కు గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు సత్కరించారు. అనంతరం, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
👉ఏటా ఒక్కో రూపంలో దర్శనమిచ్చే మహాగణపతి ఈసారి 70 అడుగుల ఎత్తు, 28 అడుగుల వెడల్పుతో నిలబడిన ఆకారంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, మహంకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి రూపాలతో కూడిన సప్త ముఖాలు, ఆపై సప్త తలలతో ఆదిశేషావతారం, రెండువైపులా 14 చేతులతో కుడివైపు చక్రం, పుస్తకం, వీణ, కమలం, గద.. ఎడమవైపు రుద్రాక్ష, ఆసనం, పుస్తకం, వీణ, కమలం, గద ఉంటాయి. మహాగణపతికి కుడివైపున పది అడుగుల ఎత్తులో ప్రత్యేకంగా బాలరాముడి విగ్రహంతో ఈసారి దర్శనమిస్తున్నారు.
👉ఎడమవైపు రాహు కేతువుల విగ్రహాలను 9 అడుగుల ఎత్తులో ఏర్పాటుచేశారు. మహాగణపతి పాదాల చెంత ఆయన వాహనమైన మూషికం ఆకారాలు 3 అడుగులలో దర్శనమిస్తున్నాయి. విగ్రహానికి కుడివైపున 14 అడుగుల ఎత్తులో శ్రీనివాస కళ్యాణం, ఎడమవైపు శివపార్వతుల కళ్యాణం విగ్రహ మూర్తులను ఏర్పాటు చేశారు.